Showing posts with label సాంఘికం. Show all posts
Showing posts with label సాంఘికం. Show all posts

Thursday, January 24, 2008

అద్దెకొక అమ్మకడుపు

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆణంద్ పట్టణం చాలా కాలం నుంచి పాల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచింది.అది ఇప్పుడు మఱొక విషయంలో దేశానికి ఆదిగురువయింది.అదేమిటంటే-ఒక ధరకు నిస్సంతు దంపతులకు పిల్లల్ని కనివ్వడం.ప్రస్తుతం ఆణంద్ ఒక్కటే కాదు.చాలా గుజరాతీ పట్టణాల్లో అద్దెకడుపుల(surrogate_pregnancy)వ్యాపారం మూడుపువ్వులూ ఆఱుకాయలుగా వర్ధిల్లుతోందని ప్రసారసాధనాలు ఘోషిస్తున్నాయి.ఇలా కడుపులు అద్దెకు కావాలని కోరే దంపతుల్లో ఎక్కువమంది ప్రవాసభారతీయులు.కొంతమంది అచ్చమైన విదేశీయులు కూడా ఉన్నారు.స్థానిక లేడీ డాక్టర్ల దగ్గర అర్హులైన అద్దె-అమ్మల జాబితా ఉంటుంది.సాధారణంగా కనీసం ఒక్క స్వంత బిడ్డనైనా కని ఉన్న స్త్రీలని అద్దెకు తీసుకోవడానికి లేడీ డాక్టర్లు ఇష్టపడతారు.బిడ్డని కనిచ్చినందుకు నిస్సంతు దంపతులు ఐదాఱు లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్నారు.అందులో సగం లేడీ డాక్టరుకూ సగం అద్దె-అమ్మ(surrogate_mother)కూ వెళుతుంది.అమెరికాలో చేయించుకునే ఫలదీకరణ(fertilization)ప్రయోగాల కంటే ఇది చాలా తక్కువ ఖర్చు కావడంతో వారు వెనుదియ్యడంలేదు.

ఇది తప్పా ? ఒప్పా ? అనే ప్రశ్నకు అక్కడ తావులేదు.పుట్టే బిడ్డ తమకు చెందదని తమకు బాగా తెలుసనీ అందుచేత సెంటిమెంట్లేమీ ఫీలవ్వడంలేదని అద్దె-అమ్మలు చెబుతున్నారు.నిజానికి సెంటిమెంటు ఫీలవుతున్నది బిడ్డని తీసుకెళుతున్న నిస్సంతులే."ఆమె మాకు చేసిన మహోపకారంతో పోలిస్తే మేము ఆమెకిచ్చిన మూడు లక్షలు ఒక లెక్కలోవి కా"దంటున్నారు వారు.

అక్కడ డాక్టర్ నయనా పటేల్ అనే ఒక వైద్యురాలి సంరక్షణలో ఎప్పుడూ ఒక 40 మంది అద్దె-అమ్మలు ఉంటారు."ఉభయులకూ ఇది తరుణోపాయమైనప్పుడు తప్పేముంది ?"అంటారు డాll_నయనా పటేల్.ఆమె మార్గదర్శనంలో ఇలాంటివి విజయవంతం కావడంతో చాలామంది అద్దె-అమ్మలుగా మారడం కోసం ముందుకొస్తున్నారు.ఒకే కుటుంబంలో తల్లీ కూతురూ కోడలూ ఒకేసారి అద్దెగర్భాలతో ఉండడం కూడా అక్కడ మామూలైపోయింది.అయితే ఇలాంటి గర్భాలు ఇండియాలో చట్టబద్ధమే గనుక అడ్డంకులేమీ లేవు.

కాని ఇది ప్రకృతిసహజమైన, సమాజ సమ్మతమైన (వివాహిత) గర్భధారణకు ప్రత్యామ్నాయంగా పరిణమిస్తే ఎదురుకాగల పరిణామాల గుఱించి సమాజశాస్త్రవేత్తలు భీతిల్లుతున్నారు.పెళ్ళయినా కాకపోయినా తల్లి అవాలో లేదో నిర్ణయించుకునే హక్కు ఆడదానికి ఉండాలని వాదించే ఫెమినిస్టులు ఇంకా ఆ సిద్ధాంతాన్ని శాసనరూపంలోకి తేలేకపోయారు.ఒకవేళ తెస్తే అద్దె-అమ్మలు మరీ ఎక్కువైపోతారని ఒక అంచనా.ఇప్పుడు నిస్సంతుల కోసమే ఉపయోగపడుతున్న అద్దె గర్భాలకు, భవిష్యత్తులో ఇతర జనసామాన్యంలో కూడా మరింత గిరాకీ ఏర్పడుతుందని అద్దెకడుపు-వ్యాపారస్తుల ఆశాభావం.ఇది పూర్తిగా అసంభవం కాదు.ప్రస్తుతం మన దేశంలో విడాకుల శాతం 24 కు చేరుకుంది.బహుశా ఇప్పటి హోమ్‌లోన్సు లాగానే అప్పుడు గర్భాల్ని అద్దెకు తీసుకోవడానికీ surrogacy_loans ఇచ్చే బ్యాంకులు తయారవుతాయి.పెళ్ళితో హక్కులూ వగైరా తలనొప్పులుంటాయి కనుక అవేవీ లేకుండానే ఒక వారసుణ్ణి సృష్టించుకోవడానికి ఘోటక బ్రహ్మచారులు మొగ్గుచూపవచ్చు.

ఇంకా ఎన్నో జరగవచ్చు.ఇప్పుడే అవన్నీ ఊహించడం కష్టం.

Saturday, January 19, 2008

శ్రీలు పొంగే జీవగడ్డయి, పాలు పారే భాగ్యసీమై....

కారణాలేవైనా కావచ్చు.గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఒక ధనికరాష్ట్రంగా మారింది.పేదవాళ్ళు మధ్యతరగతిగా, మధ్యతరగతివాళ్ళు ధనికులుగా, ధనికులు కుబేరులుగా అవతరించారు.జిల్లాలవారీగా వ్యత్యాసాలుండొచ్చు.కాని మొత్తం మీద రాష్ట్రం ఇదివరకటిలా లేదు.గుమాస్తాలు ఉపాధ్యాయులతో సహా ప్రతికుటుంబానికీ ఒక సొంతయిల్లు సొంతకారులాంటివి మామూలైపోయాయి.ఈ ఆర్థిక ఉల్బణం(economic_boom)తెలుగు నగరాల్లో స్పష్టంగా కనిపిస్తూండగా మిగతా ప్రాంతాలు కూడా క్రమంగా ఆ బాటలోనే నడుస్తున్నాయి.ఈ బుడగని ఇలాగే పేలిపోకుండా ఎంతకాలం పాటు నిభాయించగలమో తెలియదు.

దీపం కింది చీకటిలాగా ఇక్కడ ఈ నడమంత్రపు సిరితో పాటే సమాంతరంగా కటిక పేదఱికం కూడా ఉంది.నిర్లక్ష్యానికి గురైన పేదఱికం.ఈ సరికొత్త విపణివ్యవస్థ(market_economy)కి దీటైన నైపుణ్యాలు లేకపోవడంవల్ల మిగిలిపోయిన పేదఱికం.దానికీ సంపదకీ మధ్య అంతరం భారీగా ఉంది.అది ఇంకా పేదలుగానే మిగిలిపోయినవారిలో తీవ్రమైన ఆవేదనకీ హతాశకీ అసూయకీ దారితీస్తోంది.తమ కళ్ళముందే తమ సాటి(వృత్తిపని)వాళ్ళు ప్రతిదానికీ రు.500 నోట్లు బయటికి తీసే స్థాయికి ఎదిగిపోవడం తాము మటుకు ఇంకా ఱెక్కాడితే గాని డొక్కాడని, ఱెక్కాడినా నికరంగా రు.100 కూడా గిట్టుబాటు కానటువంటి అనిశ్చితిలో కొట్టుమిట్టాడాల్సి రావడం వారికి ఎంతమాత్రం మింగుడుపడ్డంలేదు.

తత్ఫలితంగా గతకొద్దికాలంనుంచి ఇక్కడ పిల్లల అపహరణలూ ఇళ్ళల్లోనే హత్యలూ పెరిగిపోతూ రావడాన్ని గమనిస్తున్నాను.ఈ ఆర్థికనేరాలకు పాల్పడ్డవాళ్ళెవరికి అంతకుముందు నేరచరిత్ర లేదు.పైపెచ్చు నేరస్థులు హతులకు ఏదోవిధంగా మిక్కిలి సన్నిహితులు కూడా.వాళ్ళెవరూ నేరాల్లో కరుడుగట్టిన వృత్తినిపుణులు కారు.వాళ్ళంతా ఎక్కువ సందర్భాల్లో జీవితానుభవం అంతగా లేని యువజనం.వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉండడం ఆందోళనకరం.నిరుడు తెలుగుదేశంపార్టీకి చెందిన ఒక మాజీ మహిళా శాసనసభ్యురాల్ని పనిమనిషే డబ్బు కోసం కిరాతకంగా చంపేసింది.ఒక వ్యక్తి దగ్గర ఏదో ఒక సందర్భంలో ఒక కట్ట నోట్లు కంటపడ్డం, దాని ఆధారంగా అతని దగ్గర కట్టలు కట్టలుగా డబ్బు ఉందనే అపోహతో దాన్ని దోచుకుందామనీ దానితో తమ జీవితమే మారిపోతుందనే దురాశతో చేసినవి సదరు నేరాలు.ఈ మధ్య చాలామంది పిల్లలూ పెద్దవాళ్ళూ కూడా ఈ హత్యలకు బలైపోయారు.

తమ దగ్గర డబ్బు, ఆస్తి ఉన్నాయని గాని, తాము ఫలానా సంస్థలో ఫలానా హోదాలో ఉంటున్నామని గాని పొక్కితే భద్రత లేని రోజులివి.పనివాళ్ళముందు డబ్బు బయటికి తియ్యడం ప్రాణాంతకమని ఋజువైన కాలమిది.తామో తమవాళ్ళో ప్రవాస భారతీయులని చెప్పుకోవడం కూడా ముప్పే.తమ కంటే ముందు తమ పిల్లలకే ప్రమాదం.

చట్టపరమైన చర్యలతో ఈ సమస్య సమసిపోతుందా ? ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశమా ? సామాజిక భద్రత లేని సమాజంలో శాంతిభద్రతల నిర్వహణ కృత్రిమమే అవుతుందా ?

ఆలోచించాల్సి ఉంది.

Saturday, November 24, 2007

నేను చూసిన డెబ్భయిలు

చాలా మంది తమ పసితనమూ బాల్యమూ తమకు గుర్తులేవనడం విని నేనాశ్చర్యపోతాను-ఇదెలా సాధ్యమా ? అని ! క్రీ.శ.1972 నుంచి జరిగినవన్నీ నాకు బాగా గుర్తున్నాయి.1970-71 కూడా లీలగా గుర్తుంది.అయితే అవి నా వ్యక్తిగత జ్ఞాపకాలకు సంబంధించినవి.నేను నా 7వ ఏటినుంచే తెలుగు దినపత్రికలు చదవడం మొదలుపెట్టాను.మా నాన్నగారికి దినపత్రికల వ్యసనం ఉండేది కనుక అది నాకూ అబ్బింది.

ఎందుకు చెబుతున్నానంటే - అప్పటికీ ఇప్పటికీ దేశంలో వచ్చిన మార్పు గుఱించి.అప్పుడు కూడా దినపత్రికలు బాగానే ఉండేవి-ఇప్పటిలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ! (అయినా ఆ రోజుల్లో ముద్రితమైన కొన్ని పత్రికలూ పుస్తకాలూ ఈనాటి కంప్యూటరీకృత ముద్రణకు దీటుగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు) హార్డువేరూ లేదు, సాఫ్టువేరూ లేదు-ఫుట్‌వేరు తప్ప ! టీవీలు కూడా లేవు.ఎక్కడో మెట్రోపాలిటన్ నగరాల్లో ధనికుల యిళ్ళలో టీవీలు ఉంటాయని వినేవాళ్ళం.కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు 1908లో స్థాపించిన ఆంధ్రపత్రికకు 1970లలో కూడా విపరీతమైన ప్రాచుర్యం ఉండేది.1990ప్రాంతంలో ఆంధ్రపత్రిక శాశ్వతంగా మూతపడింది.పున:ప్రారంభించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.చివరికి బషీర్‌బాగులో ఉన్న దాని కేంద్రకార్యాలయాన్ని 1993ప్రాంతంలో ననుకుంటా-లోకాయుక్త న్యాయస్థానంగా మార్చారు.అది కాక ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, విశాలాంధ్ర, ప్రజాశక్తి కూడా వచ్చేవి.ఆరోజుల్లో మూడు నాలుగు ఎడిషన్లు ఉండడమే గొప్ప.ఈనాడు అప్పుడప్పుడే మొదలయింది.కాని అది ఎవరికీ నచ్చేది కాదు-చాలాసార్లు ఇతర పత్రికలలో అప్పటికే ప్రచురితమైన చద్దివార్తలు వేస్తాడని పేరుండేది.ఉదయం దినపత్రికని 1985లో దాసరి నారాయణరావు స్థాపించడం, దాన్ని కీ.శే.మాగంటి సుబ్బరామిరెడ్డి కొనడం, ఆ తరువాత ఆయన ఎవరి చేతుల్లోనో కాల్పులకు గురై చనిపోవడం, అలా ఆ పత్రిక శాశ్వతంగా మూతపడ్డం - ఇదంతా మనకు తెలిసిన కథే.

ఇప్పటిలా అప్పట్లో అవినీతి కుంభకోణాలు పతాక శీర్షికల కెక్కేవి కావు.అవినీతి లేదని కాదు.సాక్షాత్తూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటే అవినీతికేం కొదవ ? కాని ఇప్పటిలా భూమ్యాకాశాల్ని మింగిపారేద్దామనేంత స్థాయిలో మాత్రం ఉండేది కాదని చెప్పగలను.జనంలో ఇంకా దేశాభిమానం తాజాగానే ఉండేది.స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న యోధులూ స్వాతంత్ర్యం గుఱించి పాటలూ పద్యాలూ కట్టిన కవులూ కోకొల్లలుగా అప్పటికింకా బ్రతికే ఉన్నారు.వాళ్ళల్లో కొంతమంది గుంటూరులో మాయింట్లో అద్దెకున్న ఆంధ్రాబ్యాంకు కొచ్చేవారు-పెన్షన్ డబ్బులు తీసుకోవడం కోసం.

అదో ఆదర్శాల యుగం.దేశం పేదగా బీదగా బక్కచిక్కి ఉండేది.నిరుద్యోగం ఎల్లెడలా తాండవించేది.అన్నింటికీ కంట్రోళ్ళూ పర్మిట్లూను.అప్పట్లో సమసమాజం గుఱించి మాట్లాడనివాడు పరమపాపాత్ముడుగా జమ.ఎల్లెడలా ప్రభుత్వ ఏకపాత్రాభినయమే.ప్రైవేటు పాత్ర అత్యంత పరిమితం.సమసమాజం హోరులో ఎవరికీ అందులో తప్పు కనిపించేది కాదు.సామాన్యజనంలో అమెరికా అంటే ద్వేషం.రష్యా అంటే పిచ్చి మోజు.పేదవాళ్ళమైతేనే, మనదొక మహాదేశం, మనదొక గొప్ప ప్రాచీన సంస్కృతి అనే గర్వం మాత్రం జనంలో ఉండేది.మనుషుల్లో"కులగుల"ఇప్పటంత ఉన్నట్లు జ్ఞాపకం రావడంలేదు.అది ఎక్కువ భాగం 1983తరువాత బయలుదేరింది.టెఱ్ఱరిజం అంటే ఏమిటో ఎఱగం.కాని హైదరాబాదు పాతబస్తీలో గొడవలుగా ఉందని మాత్రం అప్పుడప్పుడు వార్తలొచ్చేవి.మాకు తెలిసిన అతిగొప్ప హింసాకాండ అదే.

మనుషులు చిన్నచిన్న కోరికలతో చిన్నచిన్న ఆనందాలతో సరిపెట్టుకున్న రోజులవి.చక్కగా చదువుకోవడం ఎక్కడైనా ఒక చిన్న పర్మినెంటు ఉద్యోగం సంపాదించుకోవడం-ఇంతవరకే పరిమితం.ఆడపిల్లలయితే ఇంటరుతో లేదా ఆలస్యమైతే డిగ్రీతో చదువాపెయ్యడం, పెళ్ళిచేసుకోవడం-ఇలా ఉండేవి.ఉన్న పళాన కోటీశ్వరుడు కావడం, కార్లలో విహరించడం ఇలాంటివి సినిమాల్లో చూపించేవారు.జనం అవి చూసి హాయిగా నవ్వుకుని మర్చిపోయేవారు.కలలు బొత్తిగా లేవని కాదు.కాని అవి వాస్తవాలతో విడాకులు తీసుకున్నటువంటివి మాత్రం కావు.ఆ రోజుల్లో ఆడపిల్లలు యద్దనపూడి మాదిరెడ్డి నవలలు చదువుతూ వాటిల్లోని హీరోల గుఱించి ఊహల్లో తేలిపోయేవారు.అప్పట్లో అమ్మాయిల అభిమాన లక్ష్యం-టైపూ షార్ట్ హ్యాండు నేర్చుకుని ఎక్కడైనా స్టెనోగా చేరడం.అందుకని ఏ పట్టణంలో చూసినా పొద్దునే లంగా ఓణీ ధరించి తలొంచుకుని టైపింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు వెళుతున్న అమ్మాయిలు రోడ్ల మీద విరివిగా కనిపిస్తూండేవారు.కాని ఆడవాళ్ళ సంపాదన కుటుంబాలకు ప్రధానమైన ఆదాయవనరు కాదు.

అవినీతి కుంభకోణాలు భారీయెత్తున బయటపడ్డం 1980ల నుంచి మొదలయింది.మొదట్లో జనం బాధపడ్డారు.కష్టపడి స్వాతంత్ర్యం సంపాదించింది ఇందుకేనా ?అని వాపోయారు.క్రమంగా అవినీతివార్తావాహిని రోజువారీగా వెల్లువెత్తడంతో నెమ్మదిగా అలవాటుపడ్డారు.బాధ స్థానంలో"ఇదంతా మామూలే"అనే నిర్లిప్త ధోరణి చోటుచేసుకుంది.

ఇప్పుడు ఉన్నదల్లా-అలా అవినీతి చేసే అవకాశం తమకు దక్కకుండా పోయిందనే బాధ."నేను కాకపోయినా మావాడెవడైనా అవినీతి చేసి పైకొస్తే చాలు."ఇదే ఈనాటి దేశభక్తి.

Thursday, November 22, 2007

సరైన పెంపకమే సరైన పెద్దఱికం

కొన్నిరోజుల క్రితం ఉత్తర భారతదేశం నుంచి అందిన వార్త.ఆలస్యంగా వచ్చినందుకు ఒక పిల్లవాణ్ణి బడి చుట్టూ ఏడుసార్లు పరిగెత్తమన్నారట.ఆ పిల్లవాడు పరిగెత్తుతూ ఇక పరిగెత్తలేక చనిపోయాడట.ఇది మొదటి సంఘటన కాదు.ఇదే చివరిదీ కాబోవడంలేదు.
మన దేశంలో మగపిల్లల కోసం వెంపర్లాట చాలా ఎక్కువ.కాని మగపిల్లలు పుట్టాక వాళ్ళని పెద్దలు మన్నించే విధానం మాత్రం దారుణాతిదారుణంగా ఉంటోంది.ప్రతి చిన్న విషయానికీ వాళ్ళని వీరబాదుడు బాదెయ్యడంలో మనవాళ్ళకు ఏ విధమైన తప్పూ కనిపించడంలేదు. ఈ బాదుడు కార్యక్రమం ముందు తల్లితో మొదలై బళ్ళో ఉపాధ్యాయుల దాకా వెళుతోంది.సదరు తల్లుల్లో ఎక్కువమంది నిరంకుశులైన Control-freaks.వాళ్ళు మొదట్లో అలా ఉండరు.కాని మగపిల్లలు పుట్టాక అలా అవుతారు.మగపిల్లలు ఆడపిల్లల్లాంటివాళ్ళు కాకపోవడం వాళ్ళకొక పెద్ద సమస్యలా కనిపిస్తుంది.అయినా వాళ్ళతో వ్యవహరించడానికొక పద్ధతుందని వాళ్ళకు తెలియదు. పిల్లలే కాదు, ఎవరిలోనైనా మనం హేతువాదాంశని అందుకోగలిగితే రక్తపోట్లు తద్వారా గుండెపోట్లూ తెచ్చుకునే అవసరం రాదు

మగపిల్లల్ని పెంచడానికి ఎక్కువ సహనం కావాలి.ఎక్కువ అవగాహనాశక్తి కావాలి.ఎక్కువ వాక్చాతుర్యం కావాలి.ఎక్కువ ముక్కుసూటిదనం కావాలి.ఇవి ఎంతగా ఉంటే అంతగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు.గౌరవిస్తారు.సమస్యగా కనిపించినవాళ్ళే మనకు పరిష్కారంగా మారతారు.మగపిల్లలు మనకు తలొగ్గుతున్నట్లు ఉంటూనే మన బలహీనతల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు.కాని పెద్దల్లో అంతకుముందునుంచి లేని లక్షణాలు మగపిల్లలు పుట్టాక హఠాత్తుగా వచ్చిపడవు కదా ! ఫలితమే, వాళ్ళని చావగొట్టి చెవులు మూసి అదుపులోకి తెచ్చుకుందామనే ధోరణి.మొదట్లో సత్‌ఫలితాలిస్తున్నట్లు కనిపించే ఈ పద్ధతి కొన్ని కోట్లసార్లు విఫలమై ఉంటుందని చెప్పొచ్చు.ఎందుకంటే మగపిల్లలు పెఱిగి పెద్దయి మగవాళ్ళుగా జీవపరిణామం చెందాక వాళ్ళు ఆడవాళ్ళని మన్నించే విధానంలో ఈ వైఫల్యం నగ్నంగా బయటపడుతూంటుంది.

నా అంచనాలో నూటికి 90 మంది మగపిల్లలు ప్రేమకు మొహం వాచినవాళ్ళు.ఘోరమైన నిర్లక్ష్యానికి గురిచెయ్యబడ్డవాళ్ళు.వాళ్ళ వల్ల సమాజానికి ఇంకా జరగాల్సినంత నష్టం జరక్కపోవడం కేవలం భగవత్‌కృప.మనిషి కొన్ని విషయాల్లో కంప్యూటర్‌లాంటివాడే.ఏ మృదుసామాను ఎక్కిస్తే దాన్నే ప్రదర్శిస్తాడు.తాను పొందిన అనుభవాల్నే అతడు ఇతరులక్కూడా కలిగిస్తాడు.బాల్యం నుంచి ప్రేమరాహిత్యంతో పెఱిగిన మగపిల్లలు పెద్దయ్యాక ఇతరులకు ప్రేమ నెలా పంచగలరు ?

భోరున ఏడవడమే సున్నితత్వానికి చిహ్నంగా భావించే మన తల్లులూ, మన గురువులూ, మన పెద్దలూ ఏడవడం చేతకాని మగపిల్లల బాధని ఏ విధంగా అర్థం చేసుకోగలరు ? కష్టాల్ని కన్నీళ్ళ భాషలో తప్ప మఱోరకంగా అర్థం చేసుకోలేకపోవడం సున్నితత్వమౌతుందా ?