Showing posts with label వ్యవసాయం. Show all posts
Showing posts with label వ్యవసాయం. Show all posts

Monday, January 14, 2008

రైతుల ఆత్మహత్యలు-7

మనం భవిష్యత్తులోకి సునిశితంగా చూడగలిగితే ఒక విషయం బోధపడుతుంది.మనకిష్టం ఉన్నా లేకపోయినా వ్యవసాయం మనకు తెలిసిన రైతుల చేతుల్లో మాత్రం ఉండబోవడంలేదు.అలాగే వ్యవసాయరంగం మనకు తెలిసిన విధంగా కూడా ఉండబోవడంలేదు.వృద్ధి చెందుతున్న ఆధునిక జీవసాంకేతికతా(biotechnology)పద్ధతులు వ్యవసాయాన్ని గ్రామీణుల చేతుల్లోంచి లాగేసుకుని పట్టణాలవారి చేతుల్లోకి బదలాయించబోతున్నాయి.ఇకముందు రైతులకు సరఫరా అయ్యే విద్యుత్తు కేవలం చేను తడుపుకోవడానికి కాక ఇంకా ఎన్నో ఆధునిక పద్ధతుల్లో పంటలు పండించడానికి వాడబడుతుంది.భవిష్యత్తులో పల్లెల్లోనే కాక పట్టణాల్లోను నగరాల్లోను కూడా పంటలు పండుతాయి.పెట్టుబడి అంటే కేవలం ఎరువులూ విత్తనాలూ పురుగుమందులూ కాక ఇంకా ఎన్నో కొత్త విషయాలు రంగప్రవేశం చెయ్యబోతున్నాయి.ఆర్థిక స్తోమతా, ఆధునిక పరిజ్ఞానమూ లేని చిన్న సన్నకారు రైతులకు భవిష్యత్తులో స్థానం ఉండదు.ఈ సత్యాన్ని ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత మంచిది.ఇప్పుడున్న సాగుపద్ధతులు బాగానే ఉన్నాయి కదా, చౌకగా ! జీవసాంకేతికత పేరుతో ఖరీదైన పద్ధతులెందుకు ? అంటే-ఏమీ చెప్పలేం, కాలప్రవాహం అలాంటిది అనడం తప్ప ! పదిహేను పైసల పోస్టుకార్డు వాడ్డం మానేసి మనుషులు ఫోనెందుకు చేస్తున్నారు ? అలాంటిదే ఇది కూడా ! మనుషుల ఆదాయస్థాయి హెచ్చే కొద్దీ సాంకేతికత(technology)పెరిగే కొద్దీ జీవనప్రమాణాలు ఇంకా ఇంకా ఖరీదే అవుతాయి తప్ప నేలబారు కావు.భవిష్యత్తులో వ్యవసాయం ఇంకా ఖరీదైన కార్యకలాపం కాబోతోంది గనుక దాని ఆధునికీకరణ వ్యయానికయ్యే పెట్టుబడి సంగతి ప్రభుత్వం మర్చిపోకూడదు.ఉదాహరణకు-కొన్ని రకాల పంటల్ని మంచిధర పలికేదాకా లేదా ఎగుమతి అవకాశాలు చిక్కేదాకా దాకా శీతల గిడ్డంగుల(cold_storages)లో భద్రపఱచడానికి మన రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు బహుకొద్ది.గుంటూరు నగరంలో ప్రైవేటు వ్యాపారులు రు.100 కోట్లు ఖర్చుచేసి అలాంటి శీతల గిడ్డంగులు 60 దాకా నిర్మించారు.అనేక ఇతరప్రాంతాల్లో అసలు అవంటే ఏమిటో ఎవరూ చూసి ఎఱుగరు.సన్నకారు రైతుల్ని ఇదివరకటి మాదిరే వ్యవసాయంలో కుదురుగా నిలపాలంటే ఇలాంటి సౌకర్యాల మీద దృష్టి పెట్టాలి.ఈ సౌకర్యాల్ని ఉచితంగా కాక గుంటూరు వ్యాపారుల్లాగానే కొంత ఫీజుకు అందించాలి.

రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి కావాలన్నప్పుడు కొంతమంది తేనెటీగల పెంపకమో, పట్టుపురుగుల పెంపకమో, పాల వ్యాపారమో అనుకుంటారు. ఇది అసలు సమస్యని గ్రహించలేకపోవడమే అవుతుంది.ఈ అన్ని కార్యకలాపాల్లోను విపణింపు(marketing)ఒక ప్రధాన సమస్య.పంటని అమ్ముకోవడంలో ఉన్న అన్ని రిస్కులూ వీటిల్లోనూ ఉన్నాయి.చూస్తూ చూస్తూ ఇలాంటివి నేనెవరికీ సూచించలేను.ఈ యుగం (service_sector)సేవారంగానిదని గ్రహించాలి.తక్కువైనప్పటికీ నికరమైన నింపాది సంపాదన(steady_income) ఈ కాలంలో సేవారంగం ద్వారానే సాధ్యం.ఈ యుగంలో బతకాలంటే ఉత్పాదనశక్తి ఎంత అవసరమో, ఏదో ఒక సేవని సమాజానికి అందించగల ప్రతిభ ఏకకాలంలో ఉండడం కూడా అంతే ముఖ్యం.సేవల నందించగల నైపుణ్యాలు మన రైతుల్లో కొఱవడ్డాయి.ముందు వాటిని వారిలో అభివృద్ధి చేస్తే వ్యవసాయరంగమో సేవారంగమో - ఏది అనుకూలమైతే దానిలో వారు స్థిరపడతారు.రెండో రంగం అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది.

మన సన్నకారు రైతుల బాధలకు ప్రపంచబ్యాంకునో డబ్ల్యు.టి.వొ.నో నిందించడం వల్ల ప్రస్తుతానికి ప్రయోజనం లేదు.ఏం చేసినా డబ్ల్యు.టి.వొ.నుంచి మనం బయటపడే పరిస్థితి లేదు.పెద్ద పెద్ద బ.జా.సా.లు(బహుళజాతీయ సార్థవాహాలు - MNCs)మన పొలాల మీద కన్నేశాయని ఏడ్చే బదులు భూసంస్కరణలు ఎత్తేసి మనవాళ్ళే కొంతమంది సత్తా కలిగిన భారీ జమీందార్లుగా అవతరించడానికి అవకాశమివ్వాలి.కొన్ని బ.జా.సా.లు(MNC)లు ఉండడం కూడా అవసరమే.మొత్తం మనవాళ్ళే ఉంటే మన రైతులకు సరిగా జీతాలివ్వరు.వివిధ భూస్వాముల మధ్య వ్యవసాయం బాగా తెలిసిన రైతుల కోసం పోటీ ఉంటే మన రైతులకు మంచి జీతాలందే అవకాశం ఉంది.

Sunday, December 30, 2007

మన శాసనపాఠాల్ని జాగ్రత్తగా చదివితే వాటిల్లో ఎక్కడో ఒక మూల తప్పనిసరిగా ఇలాంటి గద్య (paragraph)ఒకటి దర్శనమిస్తుంది.

"Notwithstanding anything contained in the afore-mentioned clauses..." (పైన పేర్కొన్న అధికరణములలో చెప్పబడినదేమైనప్పటికిన్ని...)"

ఇవి తప్పులు చేసేవాళ్ళ సౌలభ్యార్థం ఉద్దేశపూర్వకంగా చొప్పించిన సేఫ్టీవాల్వులేమోనని మనం అనుమానించడానికి అవకాశం లేదు.ఎందుకంటే ఖచ్చితంగా అవి అవే ! మన చట్టాలన్నీ(రాజ్యాంగంతో సహా)ఇలాంటి రహస్యమార్గాలతోను కొన్ని వర్గాల కోసం ఉద్దేశించిన ప్రత్యేక Emergency_Exit_లతోను నిండిపోయాయి.ఈ మినహాయింపులు మన ఉమ్మడి న్యాయబుద్ధి(collective_sense_of_justice)నీ సమానత్వసూత్రాన్నీ పరిహాస భాజనంగా మార్చాయి.నిజానికి ఈ దేశంలో సమైక్యమూ సమానత్వమూ న్యాయమూ అనేవి ఎవరికీ అవసరం లేదు.తన కులమూ అందులో భాగంగా తానూ బావుంటే చాలు.అదే సమైక్యం.తన కులానికి కొన్ని చట్టబద్ధమైన ప్రత్యేకింపులు(reservations)ఉంటే చాలు.అదే సమానత్వం.అదే న్యాయం.ఈ సంకుచితత్వానికి సామాజిక న్యాయం అని పేరు కూడా పెట్టారు.న్యాయమంటూ ఉంటే అది ఇలా మనిషికో రకంగా కులానికో రకంగా ఉండదు.కుటుంబన్యాయం సామాజిక న్యాయం రాజకీయన్యాయం మతన్యాయం అంటూ ఇన్ని రకాల న్యాయాలు లేవు.ఒకవేళ ఉంటే అది న్యాయమే కాదు.కాని ఈ విషయం ఈరోజు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు.ప్రపంచచరిత్రలో ఇప్పటి దాకా జరిగిందేమిటంటే-ఒకరి కోసం ఉద్దేశించిన సౌలభ్యాల్ని ఇంకొకరు వాడుకోవడం."చీమలు పెట్టిన పుట్టలు పాముల కిఱవైన యట్లు".మన మీటకాలు(keyboards)నిజానికి గ్రుడ్డివారికోసం ఉద్దేశించినవి.కాని వాటిని వాడేవాళ్ళంతా కళ్ళున్నవాళ్ళే.అలాగే సంసారబాధితుల కోసమూ విధుర వితంతువుల కోసమూ ఏర్పఱచిన విడాకుల్నీ మాఱుమనువు వెసులుబాటునీ చాలావరకూ ఆ బాధలేమీ లేనివాళ్ళే ఎడాపెడా వాడేసుకోవడాన్ని మనం గమనిస్తున్నాం.

అలాగే వ్యవసాయరంగంలో బడుగుల కోసం ఉద్దేశించిన ఆదాయంపన్ను మినహాయింపుని కూడా పిడుగుల్లాంటివాళ్ళే వాడుకోవడం జరిగింది.అలా వాడుకోబడుతుందని ఆ మినహాయింపు ఇచ్చినవాళ్ళకు తెలియదా ? అంటే ఎందుకు తెలియదు ? భేషుగ్గా తెలుసు.స్వప్రయోజనాల రీత్యా చాలా దూరదృష్టితో చేసిన పని ఇది.ఇందులో ఉన్న కరటక నీతి ఇది-

1. మనం(మినహాయింపు ఇచ్చిన పెద్దమనుషులు)సమీప భవిష్యత్తులో ఆర్థిక అద్భుతాలేమీ సాధించబోవడంలేదు.కాని ఈ లోగా మనకు వోట్లూ సీట్లూ కావాలి.

2. ఆ వోట్లూ సీట్లూ మనకే శాశ్వతంగా దాఖలైపోవాలి.ఎట్టి పరిస్థితుల్లోను రెండోవాడికి అవకాశం ఉండకూడదు.అంటే మనకొక శాశ్వత వోట్‌బ్యాంక్ ఏర్పడాలి.అందరికీ మేలు చేస్తామంటే అది ఏర్పడదు.కమ్యూనిస్టులు ఏదైతే చేస్తామంటున్నారో అది మనమే చేసేసి అధికారంలో స్థిరంగా పాతుకుపోవాలి.

3. మెజారిటీ అంటే అధిక జనాభా.మన జనాభాలో ఎక్కువమంది రైతులు.మనమూ రైతులమే.కాబట్టి వారికి పనికొచ్చేదేమైనా చేస్తే చాలు.మిగతా దేశమంతా ఏ దిబ్బలో కొట్టుకుపోయినా ఫర్వాలేదు.

4. రైతు సమస్యల మీద గతంలో బ్రిటీషువారి మీద ఉద్యమించి అప్పటి ప్రొవిన్షియల్ ప్రభుత్వాల్లో స్థానం సంపాదించాం.ఆ సమస్యల్లో ముఖ్యమైనది పంటల మీద అధిక పన్ను.కాబట్టి ఇప్పుడు కూడా అదే మంత్రం పఠిద్దాం.

5. పన్ను తగ్గిద్దామా ? వద్దు.అలా చేస్తే మనకంటే ఇంకా తగ్గిస్తామనేవాళ్ళు మనకు పోటీవస్తారు.అసలు ఏకమొత్తంగా పన్నే ఎత్తేద్దాం.అప్పుడు రైతాంగంలో మన ప్రభంజనానికి తిరుగుండదు.

6. పనిలో పనిగా మనకూ పన్నుండదు.మన నల్లడబ్బంతా రాజమార్గంలో తెల్లబఱచుకోవడానికి ఇది లెస్సగా ఉపకరిస్తుంది.తద్ద్వారా మనకు ఎన్నికల్లో తోడ్పడే జమీందార్లూ భూస్వాములూ కూడా మనకే శాశ్వతంగా జై కొడతారు.

ఈ రకంగా వ్యవసాయం మీద పన్ను లేకపోవడం అనే ఆర్థిక రుగ్మత స్వాతంత్ర్యానంతరం వచ్చిపడ్డదే తప్ప భారతదేశ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలుగా వ్యవసాయం మీద పన్ను ఉంటూనే వచ్చింది.రాజులు బలి-షడ్‌భాగమనే పేరుతో పంటలో ఆరో వంతుని రైతుల నుంచి వసూలు చేసేవారు.బ్రిటీషువారి పాలనలో ఆ పన్ను శాతం అమానుషమైన స్థాయి(40-60_శాతం)కి పెరిగిపోవడాన్ని కాంగ్రెస్‌పార్టీ స్వాతంత్ర్య పోరాటకాలంలోను, ఆ తరువాతా కూడా పైన చెప్పిన విధంగా తన కనుకూలంగా మలచుకుంది.

కాని వ్యవసాయం మీద ఎంతోకొంత పన్నువెయ్యకుండా మనం గ్రామాల్ని అభివృద్ధి చెయ్యలేము.కాబట్టి గ్రామీణ యువకులు ఉగ్రవాదులు కాకుండా నిరోధించనూ లేము.రైతులక్కూడా ఏ సహాయమూ చెయ్యలేము.ప్రీమియమ్ చెల్లించకుండా బీమా ప్రయోజనాన్ని అందించగలమా ? ఇప్పుడు రైతుల పేరు చెబితేనే బ్యాంకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి-వసూలు కాని వేలాదికోట్ల అప్పులు గుర్తొచ్చి.దానికి తోడు శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తూండడంతో శేఖర్‌దాదా రైతుల అప్పులు మాఫీచెయ్యాలంటూ పాతపల్లవి ఎత్తుకున్నాడు.ఎంతకాలమిలా అప్పులు మాఫీ చేస్తారు ? ఎంతకాల మిలా రైతుల్ని దేశానికి గుదిబండలుగా మారుస్తారు ? ఎంతకాలమిలా రైతుల్ని దేశపు ఆర్థిక వనర్ల పాలిట దోపిడీదార్లుగా రూపొందిస్తారు ?

వ్యావసాయిక ఆదాయం మీద పన్ను సరికొత్త ప్రతిపాదన కాదు.గతంలో బలరామ్ జాఖడ్ అనే లోక్‌సభ స్పీకరు ఈ విషయమై పదే పదే ప్రస్తావించి స్పందన లేకపోవడంతో ఊరుకున్నాడు.మన నాయకుల స్వార్థమూ రైతుల అజ్ఞానమూ పట్టణ ప్రజల ఉదాసీనత్వమూ ఆర్థికవేత్తల మూర్ఖత్వమూ ఎఱ్ఱజెండాల ప్రచారమూ-వెరసి ఈ సంక్షోభానికి కారణం.

ఈ రోజు ఇలాంటి ప్రతిపాదనలు చేసేవాళ్ళు రైతుల పాలిట శత్రువులుగా చూడబడతారు.కాని పట్టణ ప్రజల శాతం పెరిగే కొద్దీ భూమి విలువ అధికమయ్యే కొద్దీ ప్రభుత్వానికి రాజస్వపు(revenue)అవసరాలు హెచ్చేకొద్దీ దీని అవసరాన్ని తప్పకుండా అందరూ అర్థం చేసుకుంటారు.అది 20ఏళ్ళకు కావచ్చు.40ఏళ్ళకూ కావచ్చు.అయితే వినాయకుడి బొడ్డులో తేలుందనీ అది కుట్టడం మూలానే మనకు నొప్పిగా ఉందనే నగ్నసత్యాన్ని ఎవరో ఒకరు బయటపడి వెల్లడించక తప్పదు.

Saturday, December 29, 2007

రైతుల ఆత్మహత్యలు-5

ఒక కార్పొరేట్ గుంపుని తీసుకుంటే అందులో అనేక ఉపసంస్థలుంటాయి.వాటిల్లో ప్రధానసంస్థని Flagship_Company అంటారు.మిగతావాటిని subsidiaries లేదా sister_concerns అంటారు.సిస్టర్ కన్సర్నుల స్థాపనాది వ్యయాల్ని మొదట్లో ఫ్లాగ్‌షిప్ కంపెనీయే భరిస్తుంది.సిస్టర్ కన్సర్నులు వ్యాపారపరంగా పూర్తిస్థాయి వ్యవహారదశ(operational_stage)లోకి వచ్చాక మాతృసంస్థ(flagship_company)వాటిమీద ఒక్క పైసా కూడా వెచ్చించదు.అలా ఎన్ని ఉపసంస్థలున్నా సరే ! అన్నీ స్వయంసమృద్ధంగా వ్యవహరించాల్సిందే తప్ప ఒక ఉపసంస్థకు చెందిన లాభాల మార్జిన్‌ని ఇంకో ఉపసంస్థలో మదుపుచెయ్యడానికి వీల్లేదు.చేస్తే దాన్ని ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తారు.ఒకవేళ ఒక ఉపసంస్థ ప్రతి ఆర్థిక సంవత్సరమూ నష్టాలు చూపిస్తూంటే దాన్ని వదిలించుకుంటారే తప్ప దానిమీద పైసా కూడా అదనంగా పెట్టరు.

మఱి దేశమూ ప్రభుత్వాలూ పై సూత్రానికి మినహాయింపులా ? వీటికి ఏ విధమైన ఆర్థిక క్రమశిక్షణా అవసరం లేదా ? ఒక రంగంలో వచ్చిన లాభాల్ని ఇంకో రంగంలో ఎల్లకాలమూ అలా ఖర్చుచేస్తూనే పోతారా ? అలా ఏ రంగంలో నైతే ఖర్చు చేస్తున్నారో ఆ రంగంలోనివారికి ఏదో ఒక్కసారైనా లాభాలు చూపించే బాధ్యత లేదా ? అలా నిరంతరాయంగా ఖర్చునే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ లాభమూ చూపించని రంగాలకు పెట్టుబడి సరఫరా చేస్తున్న ఇతర రంగాలూ వాటి అభివృద్ధి శాశ్వతంగా కుంటుపడుతూనే ఉండాలా ?

దీన్నే ఇంకొంత స్పష్టతరమైన శైలిలో పెడితే-స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి వ్యవసాయరంగం మీద ప్రభుత్వానికి ఖర్చే తప్ప ఏ విధమైన ఆదాయమూ లేదు-దాని మీద 65శాతం మంది బతుకుతున్నప్పటికీ ! వ్యావసాయిక లాభాల మీదనే కాదు వాటి అమ్మకం మీద గాని భూముల అమ్మకం మీద గాని ఎలాంటి పన్నూ (Capital Gains Tax)లేదు.అంటే జనాభాలో 65శాతం మంది ఆదాయం పన్ను కట్టకుండా బతుకుతున్నారన్నమాట.మఱి ఇందరు చట్టబద్ధమైన ఎగవేతర్లని పెట్టుకుని ప్రభుత్వం ఎలా నడుస్తోంది ? అంటే ఈ 65శాతం మంది కోసం తక్కిన 35 శాతం మందినీ పీల్చి పిప్పి చేస్తోంది.అందరి సంగతీ చూడ్డం ప్రభుత్వానికి విధాయకం కనుక అది సరిపెట్టుకోవచ్చు.కాని ఆ 65 శాతం మందిని భరించడం ఈ 35 శాతం మందికి ఏ విధంగా విధాయకం ? ఏమిటా జన్మజన్మల ఋణం ? ఎందుకు భరించాలి ? ఇందువల్ల ఈ 35 శాతం మందిమీదా భారీగా ఆదాయం పన్నుకోతల శాతాలూ అమ్మకం పన్నుకోతల శాతాలూ పడి ఎంత నష్టపోతున్నారో, వ్యవసాయం మీద పన్నురూపేణా ఆదాయం లేక యావత్తు దేశమే ఎలా నష్టపోతోందో, ప్రభుత్వాలు ప్రతి అభివృద్ధి పనికీ ఎలా ఘోరంగా అప్పుల పాలైపోతున్నాయో ఎవరైనా గమనించారా ? వ్యవసాయం మీద ఆదాయం లేకపోబట్టి ప్రభుత్వాలు ప్రజలకు తాగుడు మప్పి సంపాదించుకోవలసి వస్తోంది.అత్యంత పెద్ద ఉత్పాదక రంగమైన వ్యవసాయం మీద పన్ను విధిస్తే తాగుడు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ రాజస్వం(revenue)అందుబాట్లోకి వస్తుంది.అప్పుడు మన ప్రభుత్వాలు తాగుడు మీద వచ్చే పాపిష్ఠి డబ్బుకు స్వస్తి చెప్పగల స్తోమత కలిగి ఉంటాయి.

సరే ! బడుగురైతులు ఆదాయంపన్ను చెల్లించలేరు.ప్రస్తుతం ఆదాయంపన్ను చట్టంలో ఎంతోమందికి ఇచ్చినట్లే వారికీ మినహాయింపు ఇవ్వొచ్చు.మఱి అందరూ బడుగురైతులేనా ? ఏకమొత్తంగా వ్యవసాయదారులందరూ పన్నుమినహాయింపుకి అర్హులేనా ? అందులోనూ శాశ్వతంగా ? మోతుబరి రైతుల్నీ కామందుల్నీ భూస్వాముల్నీ సైతం ఆదాయంపన్ను నుంచి ఎందుకు మినహాయించారు ? ఎవరి బాగు కోసం ఈ పనిచేశారు ? అడిగితే రౌరవాది నరకాలకేమీ వెళ్ళం గదా ! మన రైతుల్లో 80 శాతం మందికి పైగా బడుగులే ఉంటే వ్యవసాయం మీద పన్ను విధించడం ద్వారా ఆశించినంత ఆదాయం సమకూడుతుందా ? అనే సందేహం వ్యక్తం చేస్తారు కొందరు. ఇక్కడే విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక అయోమయాన్ని విడమర్చాల్సి ఉంది. 80 శాతం మంది బడుగు రైతులంటే దానర్థం-80 శాతం సాగుభూమి బడుగు రైతుల చేతుల్లోనే ఉందని కాదు. ఈ 80 శాతం మంది చేతుల్లో ఉన్నది 30 శాతం భూమే. మిగతా 70 శాతం భూమీ పెద్దపెద్ద భూస్వాముల చేతుల్లోనే ఉంది. మనం వ్యవసాయం మీద పన్ను విధించబోయేది ఈ 70 శాతం జమీందార్ల భూముల మీదనే. అందుచేత ఇప్పటి నాణెక విలువల్ని (currency value)అనుసరించి ఎకరానికి రు.500 వార్షిక పన్ను విధించినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీస్థాయిలో ఉంటుంది. ఆ సందర్భంగా 30 శాతం బడుగుభూమినుంచి మాత్రమే మనకు రాజస్వం (revenue) రాదు. ఇలా వ్యవసాయరంగం నుంచి ప్రభుత్వానికి క్రమబద్ధమైన నికర వార్షికదాయం ఉండే పక్షంలో మనం దానితో ఒక రాష్ట్ర రైతు సహాయనిధి ఏర్పఱుస్తాం. కేంద్రసహాయం కోసం గోతికింద నక్కల్లాగా ఎదురుచూసే పని ఉండదు. వఱదలొచ్చి లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమైనా మనం వెనువెంటనే పూర్తి పెట్టుబడి ఖర్చుల్ని నష్టపరిహారంగా ఇచ్చి రైతుల్ని ఆదుకోగలుగుతాం. తద్ద్వారా వారు తరువాతి పంట కోసం అప్పుచేసే అవసరం లేకుండా చూడగలుగుతాం. "పన్ను అని పేరుపెట్టే బదులు పంటల బీమా అనొచ్చు గదా !"అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం ఇండియాలో అమలులో ఉన్న బీమాచట్టాల ప్రకారం ఫలానా దానికి బీమా తీసుకోండని ఎవరూ ఎవరినీ ఒత్తిడి చెయ్యకూడదు. మోటారు వాహనాల చట్టంలో మాత్రం ఇలాంటి నిర్బంధబీమా వెసులుబాటు కల్పించబడింది. ఒత్తిడి చెయ్యకపోతే రైతులందరినీ ప్రభుత్వ రక్షణచ్ఛత్త్రం క్రిందికి తేలేము. పన్ను అంటే అందరూ కడతారు. బీమా అంటే కొందరే కడతారు. ఆ కొందరి నిధులూ కలిపితే అందరినీ అన్నివేళలా ఆదుకోవడానికి సరిపోవు. ఒక ఇబ్బంది లేకపోలేదు. ఒక శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంకో శాఖకు తరలించే దురలవాటు మన ప్రభుత్వంలో పెచ్చుమీరిపోయింది. ప్రస్తుతం అన్ని శాఖల కన్నా ఎక్కువగా ఇందుకు బలవుతున్నది దేవాదాయ-ధర్మాదాయశాఖ. అది రేపు వ్యవసాయశాఖ కాకుండా మనం ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యవసాయం మీద ప్రభుత్వానికి ఆదాయం లేదంటే దాని అర్థం గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదాయం లేదని ! ఏ ఆదాయాన్నీ జాతికి సమకూర్చని గ్రామీణ ప్రాంతాల మీద ప్రభుత్వం ఎందుకు ఖర్చుపెడుతుంది ? అలా ఖర్చుపెట్టమని ఏ మొహం పెట్టుకుని అడుగుతాం ? వ్యవసాయం వల్ల జాతికి ఆహారమూ కొన్ని పారిశ్రామిక ముడిసరుకులూ లభిస్తున్నాయి కాబట్టి ఖర్చుపెట్టాలంటారా ? ఖచ్చితంగా అది కాకపోయినా ప్రతి ఇతరరంగం నుంచి జాతికి అదే విధమైన లాభాలు ఉన్నాయి.కాని ఆ రంగాలన్నీ పన్నుచెల్లిస్తున్నాయి.వ్యవసాయం మాత్రం ఎందుకు చెల్లించకూడదు ? వ్యవసాయం మీద పన్ను రాబట్టగలిగితే గ్రామీణ ప్రాంతాల స్థితిగతుల్ని మెఱుగుపర్చడానికి మనకు ఇతోధికమైన అవకాశం లభిస్తుంది కదా ! అదే సమయంలో పట్టణప్రాంతాల వారి మీద అవాస్తవికమైన, హింసాత్మకమైన పన్నుశాతాల భారం తగ్గుతుంది కదా !

దీని గుఱించి మఱికొంత రేపటి టపాలో...

Friday, December 28, 2007

రైతుల ఆత్మహత్యలు-4


ఏ పని చెయ్యాలన్నా ముందు లావుగా డబ్బు కావాలి.కనీసం 20 వేల తెలుగు గ్రామాల్లోనైనా మౌలిక సదుపాయాలూ తద్ద్వారా సన్నకారు రైతుకుటుంబాలకు క్రమబద్ధ ఉపాధీ(regular_employment)కల్పించడమంటే తమాషా కాదు.ఇండియాలో మౌలిక సదుపాయాల్ని చెక్కపలకలతో కల్పించడం సాధ్యం కాదు.ఇటుకా ఇసుకా సిమెంటూ తప్పనిసరి.ప్రస్తుతం ఇటుక ఒక్కింటికీ 4రూ.50 పైసలుంది.సిమెంటు బస్తా రూ.200 దాటిపోయింది.

ఎవరికి వాళ్ళు చేసుకోండని చెప్పడానికి ఈ విధానం ఇదివరకు ఎక్కడా ప్రయోగించి చూడబడ్డ నిరూపిత అభివృద్ధి నమూనా కాదు."అవేర్"మొదలైన స్వచ్ఛంద సంస్థలు కొన్ని మారుమూల గ్రామాల్ని దత్తు తీసుకుని వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన మాట నిజమే.కాని వాళ్ళు ఆ పని ఈ దృష్టితో చెయ్యలేదు.కనుక వారేర్పఱచిన సదుపాయాల్లో వాళ్ళవాళ్ళే పనిచేస్తున్నారు.కనుక ఈ పనికి ముందు ప్రభుత్వమే ప్రయోగాత్మకంగా పూనుకోవాలి.

ఇందులో మూడు అంశాలున్నాయి.ఒకటి-మౌలిక సదుపాయాలు ఏర్పఱచడం(establishment).రెండు-వాటిని నిర్వహించడం, వాటిల్లో పనిచేసేవారికి వేతనాలివ్వగలగడం(running/maintenance).మూడు-వాటిని విస్తరించడం(expansion).

అలాగే అన్ని గ్రామాలకూ ఒకేసారి సేవలు ప్రారంభించడం కుదరదు.గ్రామీణ మౌలిక సదుపాయాల పైలట్ ప్రాజెక్టు కింద మూడు ప్రాంతాల్లోను కొన్నికొన్నింటిని క్లస్టర్స్ గా తీసుకుని ఈ పథకాన్ని అమలుజరపాలి.వాటిల్లో వచ్చిన ఫలితాల్ని మూణ్ణాలుగేళ్ళ పాటు గమనించి విశ్లేషించాక ఇతర గ్రామాలక్కూడా ఈ పథకాన్ని వర్తింపజెయ్యొచ్చు.

ఒకవేళ ఈ పథకం రైతుల ఆత్మహత్యల్ని అరికట్టడంలో సఫలమైతే ఆ విధంగా వర్తించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుందా ?_ఏ అవసరం కలిగినా పంచపాండవులకు శ్రీకృష్ణపరమాత్మే గుర్తొచ్చినట్లు మన ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు తఱచుగా గుర్తొస్తుంది.దీనిక్కూడా ప్రపంచబ్యాంకే శరణ్యమా ?_లేక తద్‌భిన్నంగా మనకు సొంత ప్రత్యామ్నాయ వనరులేమైనా అందుబాట్లో ఉన్నాయా ?

దీనికి సరైన సూటి సమాధానం-ఏ అదనపు వనర్లూ మన ప్రభుత్వం దగ్గర లేవు.

ఎందుకు లేవు ?.....రేపటి టపాలో....

Thursday, December 20, 2007

రైతుల ఆత్మహత్యలు-3


ప్రతి కుగ్రామంలోను మౌలిక సదుపాయాల్ని కల్పించడం సాధ్యపడదు.కుగ్రామమంటే నేననేది-ఒక వెయ్యి(1,000)మంది కంటే తక్కువ జనాభా గలది.ఎందుకంటే మౌలిక సదుపాయాల్ని వినియోగించుకుని వాటిని నిరంతరాయంగా నడిపించగల ఒక సుస్థిరమైన వాడుకరుల ప్రాతిపదిక(niche user-base)ఒక మోస్తరు పరిమాణం గల జనావాసాల్లో లభ్యమౌతుంది.

మౌలిక సదుపాయాల సేవల్ని వాడుకరులకు ఉచితంగా అందించాలని మనం ప్రతిపాదించబోవడంలేదు.అలాగని వాటిని ఫక్తు వ్యాపార సరళిలోనే నడిపించాలని కూడా మన తాత్పర్యం కాదు.మనం అనుకుంటున్న గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రధాన లక్ష్యం కేవలం గ్రామీణ వినియోగదారుల సేవ మాత్రమే కాక-గ్రామీణుల స్తోమతకు తగ్గవిధంగా సేవలందించేదిగా రైతు కుటుంబాలకు తక్కువ విద్యార్హతలతో టూకీ శిక్షణతో ఏడాది పొడవునా ప్రత్యామ్నాయ ఆదాయవనరుగా ఉపయోగపడేదిగా వ్యవసాయ నష్టాల మూలంగా ఏర్పడ్డ జరుగుబాటు లోపాన్ని పూరించేదిగా వారిని ఆత్మహత్యల విషవలయంలో నుంచి బయటపడేసేదిగా వారు వలసకూలీలుగా మారకుండా స్థానికమైన పరిసరాల్లోనే వారికి వ్యవస్థీకృతమైన మార్గాన్నిచూపేదిగా ఉండడం.

మన రాష్ట్రంలో ఉన్న 30,000 ల చిల్లర గ్రామాల్లో వెయ్యి పై చిలుకు జనాభా ఉన్నవే అధికం.కనుక చాలా చోట్ల మౌలిక సదుపాయాల కల్పనా నిర్వహణా సాధ్యపడతాయి.అయితే ఇందులో ఇంకో విషయం ఇమిడి ఉంది.దశాబ్దాల తరబడి ఎఱ్ఱజెండాల ప్రచారం వల్ల-ఏం చేసినా అంతా ప్రభుత్వమే చెయ్యాలనీ మనం చేసేదేమీ లేదనీ ప్రభుత్వమంటే అందరికీ అన్నీ ఉచితంగా ఇచ్చేసే ఇచ్చితీఱాల్సిన ధర్మసత్రమనీ అక్షయపాత్ర అనీ మన గ్రామీణుల్లో ఒక పొఱపాటు అభిప్రాయం నాటుకుపోయింది.ఊళ్ళోవాళ్ళంతా ఇంటిమీద పడితే ఎంత అమీరైనా క్షణంలో గరీబవుతాడు.అతని మీదపడి దోచినవాళ్ళు అతనిలా అమీర్లు కాలేరు గాని ఆ అమీరు మాత్రం తన మీదపడ్డ గరీబుల్లో తానూ ఒకడవుతాడు.హైదరాబాదులో ప్రభుత్వమనే మనిషెవడూ లేడు.ప్రభుత్వం దగ్గర డబ్బులు కాచే చెట్టు కూడా ఏమీ లేదు.మన దగ్గర వసూలు చేసిందే మన కోసం ఖర్చుపెట్టాలి.ప్రభుత్వం అలా వసూలుచెయ్యాలంటే మనం ప్రభుత్వానికి ఇవ్వాలి.ముందు ఇచ్చాక మనకు ప్రభుత్వాన్ని నిర్మొహమాటంగా నిలదీసే హక్కు వస్తుంది.ఇది ఈ బ్లాగు చదివే నవీన విద్యావంతులకు బాగానే అర్థమౌతుంది.కాని మన గ్రామీణులకు మాత్రం అంత సులభంగా బోధపడదు.వాళ్ళకు నిజంగా బోధపడితే వోట్లెయ్యడానికి డబ్బు తీసుకోరు.

మౌలిక సదుపాయాల సేవల్ని ఇలా ఒక వెలకు వినియోగించుకోవాలనే ఆలోచనకు మన గ్రామీణుల్ని ముందుగా మానసికంగా సన్నద్ధం చేశాక మన పని సులభతరమౌతుంది.గ్రామీణుల దగ్గర వసూలు చేసే వాడుక-రుసుముల(user-charges)తో మౌలిక సదుపాయాల్ని నడిపించడమూ వాటిల్లో పనిచేసే రైతుకుటుంబాల సభ్యులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమూ ఆచరణాత్మకంగా సాధ్యపడుతుంది.మన వ్యవసాయం పుష్కలమైన నీటిపాఱుదల సౌకర్యం గల బహుకొద్ది జిల్లాలలో మినహా రైతులకు ఏడాది పొడవునా పని కల్పించడంలో విఫలమౌతోంది.కనుక ఈ చర్య అత్యావశ్యకం.ఇది వలసల్ని నిరోధిస్తుంది.జరుగుబాటు లేక మనిషి తనను తాను అసహ్యించుకుని ఆత్మహత్య అనే అమానవీయ చర్యకు పాల్పడకుండా ఆశారేఖల్ని అతనిలో వెలిగిస్తుంది.ప్రతి సన్నకారు రైతుకుటుంబం నుంచి కనీసం ఒక్కరికి ఉపాధి ఏర్పడేలా మనం నిబంధనల్ని రూపొందించుకోవాలి.

మౌలిక సదుపాయాల కల్పన ఉన్నపళాన వెంటనే మన రైతుజీవితాల రూపురేఖల్ని మార్చిపారెయ్యదు.వాటి మధుర ఫలాలు గ్రామీణులకు అందడానికి కొంత పొదుగుడు కాలం (gestation_period)తీసుకుంటాయి.ఏర్పఱచాలే గానీ ఒకటి-రెండేళ్ళలోనే చాలావరకు మన గ్రామీణచిత్రంలో గణనీయమైన మార్పు కనిపిస్తుందని నా విశ్వాసం.

మన గ్రామాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు ?

1. ప్రాథమిక పాఠశాల - 8 మందికి ఉపాధి
2. ఉన్నతపాఠశాల - 10 మందికి ఉపాధి
3. బ్యాంకు - 5గురికి ఉపాధి
4. ఆసుపత్రి - 6గురికి ఉపాధి
5.గ్రంథాలయ-పఠనమందిర-ఉపన్యాస భవన - అంతర్జాల కేంద్ర - దూరదర్శన - సముదాయం (దీన్నే కల్యాణమండపంగా చేసి అప్పుడప్పుడు అద్దెకివ్వొచ్చు) - 8 మందికి ఉపాధి
6. అన్ని రకాల వాహనాలకూ మరమ్మత్తుల సముదాయం - 10 మందికి ఉపాధి (వీళ్ళలో ఒకరు వాహన విడిభాగాల విక్రేత)
7. పంచాయితీ సర్కిల్ ఆఫీసు - 4గురికి ఉపాధి (పన్నుల వసూలు, భూమి సర్వేలు, ప్రజాపనులు, ప్రజాసంబంధాలు మొ.)
8. గ్రామీణ రక్షక దళం (స్థానిక పోలీసు వ్యవస్థ-Civil Patrolling Outpost)- 10 మందికి ఉపాధి (పగటి కర్తవ్యకారులు 5గురు ; రాత్రికి 5గురు)
9. బట్వాడా ప్రతినిధి - ఒకరికి ఉపాధి (ఇతడు/ఈమె రోజుకొకసారి సమీప తపాలా కార్యాలయానికి వెళ్ళొస్తారు.ఇతడు/ఈమె అందజేసిన ప్రతి ఉత్తరానికీ, పార్సెల్‌కీ స్థానికప్రజలు అర్ధరూపాయి నించి రూపాయి దాకా చెల్లించాలి)

ఇవి కొన్ని మాత్రమే.ఇంకా ఎన్నో ఉన్నాయి.వీటి నిర్వహణలో సగం ఖర్చు జిల్లా యంత్రాంగం భరించాలి.మిగతా సగం స్థానిక ప్రజల నుంచి రుసుముల రూపేణ వసూలు చెయ్యాలి.నిర్వహణ సంగతి తరువాత ! అసలు మొదటి అడుగు పడేదెలా ?

వచ్చే టపాలో...

Saturday, December 15, 2007

రైతుల ఆత్మహత్యలు-2

జనాభా యొక్క పరిమాణమూ జీవన విధానమూ పోకడలూ (trends)చాలా తఱచుగా మారిపోయే సమాజాల్లో గిరాకీ-సరఫరా(Demand and Supply)లాంటి విపణి సూత్రాలు(market_principles)బాగా ప్రాధాన్యం వహిస్తాయి.పూర్వసమాజాలు ఇలాంటివి కావు గనుక వాటిల్లో గిరాకీ స్థిరం.సరఫరా కూడా స్థిరమే.గిరాకీని బట్టి మనుషులు తమ నైపుణ్యాల్ని మార్చుకుంటారు,తీర్చిదిద్దుకుంటారు.మనలాంటి అస్థిరమైన ఆర్థికవ్యవస్థల్లో బ్రతకాలంటే ఒక మనిషికి ఒకటి కంటే ఎక్కువ నైపుణ్యాలు అవసరం.ఒకే కుటుంబంలో ఇద్దరు సంపాదించడం కంటే ఒకే మనిషికి రెండుమూడు నైపుణ్యాలుండడం ఎక్కువ ప్రయోజనకరం.ఒక ఉపాధ్యాయుడికీ వ్యాపారికీ మృదుసామాన్ల నిపుణుడికీ ఇది ఎంత వర్తిస్తుందో రైతులకూ అంతే వర్తిస్తుంది.

మన అసలు సమస్య ఇక్కడే ఉంది.అది-మన రైతులకు సాగు తప్ప వేఱే నైపుణ్యాలేమీ లేకపోవడం.అసలు ఏ నైపుణ్యాలూ లేనివాళ్ళూ అవి సంపాదించుకునే అవకాశం కూడా లేనివాళ్ళూ మాత్రమే సాగులో చొఱబడుతున్నారని ఇంతకుముందే అనుకున్నాం.అయితే నైపుణ్యాలు వికసించడానికి అవసరమైన వాతావరణం లేకుండా వాటిని సంపాదించాలనే ఇచ్ఛ కూడా కలగదు.ఆ నైపుణ్యాలకొక తక్షణ ప్రయోజనమూ, వినియోగ్యతా తాము నివసించే పరిసరాల్లో ఉండాలి.అణుశక్తి కేంద్రాలు లేని దేశంలో ఆ శాస్త్రం చదివిన మేధావికి వలసపోవడం తప్ప గత్యంతరం ఉండదు.ఇది మఱీ పెద్ద ఉదాహరణ అనుకోండి.ప్రస్తుతం ప్రయోజనమూ, వినియోగ్యతా అనేవి మన దేశంలో పట్టణప్రాంతాల్లో మాత్రమే లభ్యమౌతున్నాయి.అందుచేత సాగు చెయ్యలేక పట్నాలకు వలసవచ్చి ఏదో ఒక ఇతరనైపుణ్యాన్ని అలవర్చుకున్న గ్రామీణులు రెండు పూటలా అన్నం తినగలుగుతున్నారు.తిరిగి పల్లెకు పోవడానికి ఇష్టపడట్లేదు కూడా.

ఇందుకు భిన్నంగా మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర నైపుణ్యాల అభివృద్ధికి ఏం చెయ్యాలో మనం ఆలోచించాలి.ఇక్కడ వ్యవసాయం అంటే కేవలం దుక్కిదున్నడం కాకుండా తత్సంబంధితమైన ఇతర కార్యకలాపాలు(allied_activites)కూడా వస్తాయి.ఈ పని చెయ్యకుండా ఎన్ని పావలా వడ్డీలైనా ఋణాల మాఫీలైనా ఉచితవిద్యుత్తులైనా అలాంటి ఏ ఇతర ధర్మసత్రపు చర్యలైనా సరే గ్రామీణుల్ని ఉద్ధరించవు.వాస్తవం చెప్పాలంటే పైన పేర్కొన్న ధర్మసత్రం చర్యలన్నీ అసలు సమస్యల మూలాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడని రాజకీయ జీవుల సృష్టే తప్ప-రైతులెప్పుడూ తమకు అవి కావాలని అడగలేదు.రైతులేమీ భిక్షగాళ్ళు కారు.వాళ్ళకు ఆత్మాభిమానమూ ఆభిజాత్యమూ ఉన్నాయి.వాళ్ళు ఏదీ ఊరికే వచ్చిపడాలని కోరుకోరు.వాళ్ళు ఆశిస్తున్నదల్లా కొంచెం అవగాహన, కాస్త మార్గదర్శనం.అంతే ! అయితే వాళ్ళకు ఆ రెండూ తప్ప మిగతావన్నీ పుష్కలంగా అందుతున్నాయి.

నాగరికత యొక్క ప్రాథమిక దశల్లో ఆహారం డబ్బుని సృష్టిస్తుంది.కాని నాగరికత పరాకాష్ఠకు చేరుకున్న దశలో డబ్బే ఆహారాన్ని సృష్టిస్తుంది.ఆ డబ్బు ఇప్పుడు నైపుణ్యాల సక్రమ వినియోగం ద్వారా సృష్టించబడుతోంది.నైపుణ్యాలకు తమ పరిసరాల్లో తక్షణ ప్రయోజనం ఏర్పడాలంటే ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు(infrastructure)ఏర్పడాలి.సదరు మౌలిక సదుపాయాల్ని నడిపించడానికి ఆ నైపుణ్యాలు ఉపయోగపెట్టబడతాయి.తద్ద్వారా నిరుద్యోగం తగ్గుతుంది.ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక చిన్న క్లినిక్ ఉంటే-అక్కడొక మందుల కొట్టు అవసరమౌతుంది.ఆ క్లినికి కి ఒక నర్సు, ఒక కాంపౌండరు, ఒక పారిశుద్ధ్య కార్మికుడు/కార్మికురాలూ అవసరమౌతారు.ఒక గుడి ఉన్నా బడి ఉన్నా మఱొక గ్రంథాలయ-పఠనమందిరం ఉన్నా ఇలాగే వాటిల్లో ఒక్కొక్కదాన్నీ ఆశ్రయించుకుని డజనో అరడజనో ఉద్యోగాలేర్పడతాయి.కాని మన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నవి బహుకొద్ది.మన దేశపు అభివృద్ధికి ఉన్న ఉన్న ప్రధానమైన చీకటికోణం ఇదే.మన దేశంలో నగరాలకే మౌలిక సదుపాయాలు లేవు.ఈ దేశంలో ప్రభుత్వ కార్యాలయాలు సైతం కిరాయికి తీసుకున్న వివిక్త(private)భవనాల్లోనే నడుస్తాయి.ఉదాహరణకు-హైదరాబాదులో ప్రతి చదరపు కిలోమీటరుకు ఎన్ని గ్రంథాలయాలున్నాయి ? ఎన్ని పార్కింగు లాట్లున్నాయి ? ఎన్ని పార్కులు ఉన్నాయి ? ఎన్ని ఆటస్థలాలున్నాయి ? పిల్లలు రోడ్ల మీద క్రికెట్టాడే పరిస్థితి ఎందుకొచ్చింది ? లెక్కవేసి ఆలోచించండి. ఇక పల్లెల కోసం ఏమాశిస్తాం ? మన దేశంలో ఇప్పుడందరూ మౌలిక సదుపాయాల సంగతి విస్మరించి చాలా పెద్ద యెత్తులెత్తుతున్నారు.చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.వాస్తవానికి భారీ చేపట్ల(projects)లో ఒక ఉద్యోగావకాశాన్ని కల్పించడానికి కోటి నుంచి పదికోట్ల దాకా ఎంతైనా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.అంత చేసినా బహుకొద్దిమంది సుశిక్షితులైన మేధావులకు మాత్రమే వాటిల్లో ఉపాధి లభిస్తుంది.మౌలిక సదుపాయాల రంగంలో అంత పెట్టుబడి అవసరం లేదు.ప్రతిలక్ష-రెండులక్షల రూపాయల పెట్టుబడికొకరు చొప్పున ఉపాధి కల్పించవచ్చు.మౌలిక సదుపాయాల్ని నిర్వహించడానికి పెద్దగా విద్యార్హతలు గానీ శిక్షణ గానీ అవసరం లేదు కూడా.

నైపుణ్యాలు ఎక్కువ సందర్భాల్లో అక్షరాస్యతని ఆశ్రయించుకుని ఉంటాయి.ఒకప్పుడు అన్నం ఉన్నవాడు విజ్ఞానాన్ని కూడా సంపాదించేవాడు.ఇప్పుడు విజ్ఞానమే మనిషికి అన్నం పెడుతోంది.అక్షరాస్యత పుష్కలంగా ఉన్న దేశాల్లో దాన్ని వినియోగించుకుని వేలాది కోట్ల డాలర్ల భారీస్థాయిలో వ్యాపారాలు కూడా నడుపుతారు.అక్కడ అమ్మేదీ కొనేదీ అంతా సమాచారమే.మఱి మన పల్లెల్లో అక్షరాస్యతే కఱువు.సర్వశిక్షా అభియాన్ నిధుల్ని తినేసే ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో రైతుల కంటే ముందు అక్షరాస్యతే ఆత్మహత్య చేసుకుంటోంది.ఇక మన రైతులకు ఏ విధంగా ఇతర నైపుణ్యాల్ని అలవఱుస్తాం ? ఎలా వాళ్ళని ఈ ఆత్మహత్యల విషవలయంలోంచి ఇవతల పడేస్తాం ?