Showing posts with label లేచిపోదాం...రా. Show all posts
Showing posts with label లేచిపోదాం...రా. Show all posts

Thursday, September 27, 2007

"లేచిపోదాం...రా !" శీర్షిక కింద మనం కొన్ని వాస్తవ జీవిత మచ్చుతునకల్ని అధ్యయనం (case-study)చేస్తున్నాం. వీటి ద్వారా మనం ఒక సమకాలీన సాంఘిక సమస్యని వివిధ కోణాల్లోంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ సంఘటనలు లేవనెత్తే ప్రశ్నల గురించి గంభీరంగా ఆలోచించడాన్ని ఇంకెంతమాత్రమూ వాయిదా వెయ్యలేము. ఈ పరంపరలో రావాల్సిన టపాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి సాహిత్యపరమైన రసాస్వాదనకు ఉద్దేశించినవి కావు.

లేచిపోదాం...రా-3

"రాజమండ్రికి రానుపోను రెండు విమానం టిక్కెట్లు కావాలండీ"అని చెప్పాను, ఆ బల్ల ముందున్న కుర్చీలో కూర్చోబోతూ.ఆ గుమాస్తా నేనడిగిన టిక్కెట్లని పుస్తకించడం మొదలు పెట్టాడు.ఆ గదిలో కలనయంత్ర మీటకాల (computer keyboards) టిక్కుటిక్కులు మినహాయిస్తే మొత్తం మీద నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.

ఇంతలో పంజాబీ దుస్తుల్లో ఉన్న ఒక యువతీ లలామ ఆ గదిలోకొచ్చి నా పక్కకుర్చీలో కూర్చుని"గోవాకి రెండు విమానం టిక్కెట్లు కావా"లని చెప్పింది."స్పైస్‌జెట్ తీసుకుంటారా మేడమ్ !ప్రస్తుతం బాగా తక్కువ ఖర్చులో అదే నడుస్తోంది"అన్నాడు గుమాస్తా."సరే"నన్నదామె.అతను పని ప్రారంభించాడు.

ఆమె వయసు 22-23 కు మించకపోవచ్చు.పడిపోయేంత అందగత్తేమీ కాదు.కాని ఫర్వాలేదు.ముఖ్యంగా శరీరచ్ఛాయ అతిసాధారణం.మనిషి సన్నగా ఉంది.ఇంగ్లీషు కూడా ధారాళంగా మాట్లాడ్డాన్ని బట్టి విమానం టిక్కెట్లు పుస్తకించడాన్ని బట్టి చూస్తే పుష్కలమైన సొంత ఆదాయ వనర్లున్నాయనిపించింది.ఆమె మాట్లాడుతున్న తెలుగుని బట్టి చూస్తే కరీమ్‌నగరో నిజామాబాదో అయివుండొచ్చని ఊహించాను.

ఈలోగా ఆమె తన కర్ణపిశాచి(సెల్లు)ని బయటికి తీసి ఎక్కడికో మాట్లాడసాగింది.అబ్బే ! చాటుమాటేమీ లేదు.నా పక్కన కూర్చుని బాహాటంగానే మాట్లాడుతోంది.స్పష్టంగా వినపడుతున్నా కూడా అలా కనపడ్డం ఇష్టం లేక నేను ఎటొ మొహం పెట్టాను.అయినా ఒక చెవి ఇటే ఉంది.

"హలో అమ్మా ! నేను."

(నువ్వా ? బావున్నావా ?)

"ఆఁ ! బాగనే ఉన్నా.రేపు నేనూ సురేషు విమానంలో గోవా వెళతాం.మాకక్కడ ఎల్లుండి పెళ్ళి.నువ్వు తప్పకుండా రావాలి."

(మీ నాన్నగారొస్తే నేనూ వస్తా)

"నాన్న సంగతి నాకు తెల్వదు.నాన్న కన్నా అమ్మే ముఖ్యం.కని పెంచేది అమ్మే కాని నాన్న కాదు.అందుకని నాన్న రాకపోతే పోనీ.నువ్వు మాత్రం రావాల్సిందే."

(నేనలా రాను)

"ఇదే నీకు చిట్ట చివరి అవకాశం.ఇప్పుడు రాకపోతే నువ్వు నా తల్లివే కావు.నీకు నాకూ ఏ సంబంధమూ లేదు.నువ్వెవరో నేనెవరో.నువ్వింకెప్పుడూ నా యింటి గడప తొక్కడానికి వీల్లేదు.నేనూ నీ యింటి గడప తొక్కను.బాగా ఆలోచించుకో."

(నువ్వేమైనా అనుకో మీ నాన్న లేకుండా నేను రాను)

"నీ కర్మ.నేను నీకు మళ్ళీ ఫోన్ చెయ్యను."

Tuesday, September 25, 2007

లేచిపోదాం...రా-2


"వాళ్ళిద్దరినీ విడదీయాలి. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అసహ్యమేసిపోవాలి.ఒకరి పొడే ఒకరికి గిట్టకుండా పోవాలి."

"వాళ్ళ ఖర్మకి వాళ్ళ నొదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి మేడమ్ ! వాళ్ళని పూర్తిగా మర్చిపొండి ! అదే వాళ్ళకు తగిన శిక్ష. "

"అలా కుదరదు. ఎంత ఖర్చయినా సరే, ఇస్తాను. మీ వల్ల కాదంటే చెప్పండి !"

"మా వల్ల కాదనీ కాదు, మీరివ్వలేరనీ కాదు మేడమ్ ! మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకర్థం కావట్లేదు. మీరాలోచిస్తున్నది చాలా తప్పు.భార్యాభర్తల్ని విడదీయడం....అలాంటివాటికి శిక్షలున్నాయి. మామూలు మనుషులకి అర్థమయ్యే విషయాలు కావు మేడమ్ ఇవి."

పై సంభాషణకు పూర్వరంగం : ఆమె ఒక బి.సి. కులానికి చెందిన భాగ్యవంతురాలైన స్త్రీ. ఆమెకి ఒకే ఒక గారాల కూతురుంది. పిల్లని తల్లిదండ్రులు చాలా ముద్దుగా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు. ఎంత జాగ్రత్తగా అంటే-రోజూ వాళ్ళ నాన్నగారే ఆమెని ఇంజనీరింగ్ కళాశాల దగ్గర కార్లో దిగబెట్టి మళ్ళీ సాయంకాలం కూడా కార్లో ఎక్కించుకుని ఇంటికి తెచ్చేవారు. అయితే పిల్లకి కళాశాలలో ఒక అగ్రకుల విద్యార్థితో పరిచయమైంది. అతను ఆమె కన్నా పై తరగతి చదువుతున్నాడు. చూడ్డానికి చాలా వికారంగా ఉంటాడు. పెద్దగా ఉన్నవాళ్ళు కూడా కాదు. మరి పిల్ల అతనిలో ఏం చూసి పడిపోయిందో తెలియదు. గ్రంథం చాలా సంవత్సరాల పాటు నడిచింది. కాని ఇంట్లో ఇసుమంతైనా అనుమానం రాలేదు. అమ్మాయి అంత చాకచక్యంగా నిర్వహించుకుంటూ వచ్చింది. బీటెక్ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు చివరి పరీక్ష అయిపోతుంది గదాని వేళకు కళాశాలకు కారు తీసుకెళ్ళిన వాళ్ళ నాన్నగారికి అక్కడ అమ్మాయి కనిపించలేదు గాని సెల్లు మోగింది.

"నాన్నా ! నేను కాచిగూడా నుంచి మాట్లాడుతున్నాను."

"చెప్పమ్మా ! నేనింతసేపూ నీ కోసం మీ కాలేజి గేటు దగ్గరే ఎదురుచూస్తున్నాను."

"ఇంక నువ్వు వెయిట్ చెయ్యనక్కర్లేదు నాన్నా ! ఇంటికెళ్ళిపో !"

"అదేంటమ్మా ! నువ్వు తరవాతొస్తావా ? కారు పంపించనా ? కాచిగూడాలో ఎక్కడున్నావమ్మా ? మీ ఫ్రెండువాళ్ళింట్లోనా ?"

"నాన్నా ! నేను...మరి.. రాను. నాకు...నాకీ రోజు పెళ్ళయిపోయింది..."

"అదేంటమ్మా ? పెళ్ళేంటి ? ఎవరి పెళ్ళి ?"

"నా పెళ్ళే నాన్నా ! మీకెవరికీ చెప్పలేదు."

"జోకులేస్తున్నావా తల్లీ ? ముసలాడితో జోకులేంటమ్మా ?"

"జోక్ కాదు నాన్నా ! నిజమే చెబుతున్నాను. పరీక్షలైపోగానే నేనూ,_____పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. చేసుకున్నాం."

తండ్రి ఏమీ మాట్లాడలేక చాలాసేపు కారు పక్కనే నీరసంగా కూలబడిపోయాడు. తరువాత శక్తి కూడదీసుకుని లేచి వెళ్ళి భార్యతో చెప్పాడు. ఆవిడ ఆడ హైడ్రోజన్ బాంబులా రగిలిపోయింది. పేలిపోయింది. ఆయన సర్ది చెప్పాడు."ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్ళిచేసుకుని అత్తవారింటికి వెళ్ళాల్సిందే.అది మన ఖర్మ కొద్దీ ఇలా సంభవించింది.పోనీ ! వాళ్ళిద్దరినీ పిలిచి రిసెప్షన్ అయినా ఏర్పాటు చేద్దాం"అన్నాడు. ఆవిడ ఒప్పుకోలేదు. "ఛీ ! కూటికి గతిలేని వెధవసంతని తీసుకొచ్చి బంధువులుగా పరిచయం చేసి పరువు తీసుకోమంటారా ? ఠాఠ్ ! చస్తే వల్ల కాదు. అసలా ముండ చచ్చిందనుకుంటాను.అది నాకూతురే కాదు.అదో అలగా ముండ పాడు ముండ పాకీముండ !"అంటూ కూతుర్ని వైవిధ్యభరితంగా తిట్టింది.ఆయనే ఎలాగో కష్టపడి భార్యని ఒప్పించి రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. వరుడు బంధువులెవరికీ నచ్చలేదు. ఎంతగా నచ్చలేదంటే-"వీడేమిటి, నీకు అల్లుడేమిటి ?"అని ఆవిడ మొహం మీదనే అన్నారు కొందరు. మాటలు ఆవిడలో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడదీయాలనీ తాళి తెంపి తన కూతురికి మళ్ళీ పెళ్ళి చెయ్యాలనీ ఆవిడ దృఢంగా నిశ్చయించుకుంది.

Sunday, September 23, 2007

లేచిపోదాం...రా-1


1990-91 ప్రాంతం. దక్షిణ గుంటూరు (Guntur South) నగరంలో ఒక సవిలాసమైన పేట. ఆహ్లాదకరమైన ఆహ్లాదకరమైన చల్లని సాయంకాల వేళ.నేనూ మా మిత్రుడు పేరూరి సత్యనారాయణా మేడ మీద తలో కుర్చీలో కూర్చుని పిచ్చాపాటీ మాట్ల్లాడుకుంటున్నాం."ఓ కధ చెప్తా వింటావా బ్రదర్ ?"అన్నాడు సత్యం."సరే ! చెప్పు"అన్నాను.సత్యం మొదలుపెట్టాడు :

"పూర్వకాలంలో ముగ్గురు మాంత్రికులుండేవాళ్ళు.వాళ్ళందరికీ తమ తమ భార్యల మీద పుట్టెడు అనుమానం.అందుచేత వాళ్ళని చిన్నచిన్న బొమ్మలుగా మార్చేసి సంచీల్లో పెట్టుకుని తిరుగుతూండేవాళ్ళు.అవసరమైనప్పుడు మాత్రం మళ్ళీ నిజస్వరూపంలోకి తెచ్చేవాళ్ళు.ఇలా కొంతకాలం గడిచాక ఆ ముగ్గురూ తీర్థయాత్రలు చెయ్యాలని బయల్దేరారు.దారిలో ఒక కొలను కనిపిస్తే స్నానం చెయ్యాలనిపించింది.సామాన్లు గట్టున పెట్టి కొలనులోకి దిగితే ఎవరైనా వాటిని ఎత్తుకుపోవచ్చు.అందుకని సంచీల్లోంచి భార్యల బొమ్మల్ని బయటికి తీసి వాళ్ళని యథాస్వరూపాల్లోకి తెచ్చి"సామాన్లు చూస్తూండండి"అని చెప్పి కొలనులోకి దిగారు.వాళ్ళు అలా కొలనులోకి దిగీ దిగగానే ఈ ముగ్గురు ఆడవాళ్ళూ తమ బట్టల్లోంచి తలా ఒక మగబొమ్మ బయటికి తీసి అక్కడికక్కడే కార్యక్రమం మొదలు పెట్టారు.మధ్యలో ఎందుకో తలతిప్పి వెనక్కి చూసిన మంత్రగాళ్ళకి దిగ్భ్రాంతితో నోట మాట రాలేదు."

అంతటితో కథాపి"హహ్హహ్హా"అని నవ్వాడు సత్యం.నేనూ నవ్వాను.16-17 ఏళ్ళ తరువాత దృశ్యం మారిస్తే-
అంతటితో కథాపి"హహ్హహ్హా"అని నవ్వాడు సత్యం.నేనూ నవ్వాను.16-17 ఏళ్ళ తరువాత దృశ్యం మారిస్తే-
2007.బృహత్ హైదరాబాదు నగర పశ్చిమ మండలంలో ఒక జనసమ్మర్ద ప్రాంతం.ఈదురు గాలులు వీస్తున్న ఒక ఈరెండ పొద్దు.ఎదురుగా కుర్చీలో ఒక ఉన్నత మధ్యతరగతి స్త్రీ."మీతో ఒక విషయం చెప్పాలి.ఏమీ అనుకోరు కదా !"

"సరే ! చెప్పండి మేడమ్ !"

"మా స్నేహితురాలికి పెళ్ళయి ఇద్దరు పిల్లలు.బడికెళుతున్నారు.భర్తది మంచి ఉద్యోగం.ఆమెకి ఎక్కడో ఒక అబ్బాయి-తన కన్నా వయసులో చాలా చిన్నవాడు-పరిచయమయ్యాడట.ఆ పరిచయం స్నేహంగా మారి చాలా దూరం వెళ్ళింది.నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుంటే-ఆఫ్టరాల్ ఓ పసుపుతాడే కదా అని మూసేసి ఉన్న గుళ్ళో మూడో కంట పడకుండా రహస్యంగా తాళి కట్టించుకుందంట.దేవుడి గుళ్ళో అయితే ఏం చేసినా ఏమీ కాదని ఎప్పుడో ఎవరో చెప్పారట.ఇప్పుడేమైనా సమస్యలొస్తాయేమోనని భయపడుతోంది.ముఖ్యంగా భర్తకి తెలిస్తే....అని"

"ఆఁ...!"అని ఆ కథలో మంత్రగాళ్ళలా దిగ్భ్రాంతి చెంది నోరు తెఱవడం ఇప్పుడు నా వంతు.