"ఆతనికై చెమర్చినవి అందరి నేత్రసరోజ యుగ్మముల్..."
తే.గీ.వచ్చులెమ్మిట్టి వర్షముల్ l వంద లిఁకను,
వచ్చునా పూర్వకాలిక l వైభవంబు ?
మౌన మహితమౌ శోక స l ముద్రమిచ్చి
చనియె నొక్క తేజస్సు ది l శాంతరములు.
PJR ! శ్రీ పబ్బతిరెడ్డి జనార్దనరెడ్డిగారు ! కాని లక్షలాది మందికి"జెన్నన్న"అంటేనే తెలుస్తుంది.తెలుగు రాజధానిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా 25సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎన్నికవుతూ వచ్చి నిరంతర ప్రజాసేవలో తనువూ మనసూ పూర్తిగా అలిసిపోయి హృదయకోశరుగ్మత ఒత్తిడిచేయగా ఈ నెల 28న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.ఆయన వయసు 59సంవత్సరాలు.ఆయనకు భార్యా కుమార్తెలూ ఒక కుమారుడూ ఉన్నారు.స్వతహాగా చిన్నప్పటినుండి దైవభక్తుడైన పి.జె.ఆర్ జూబిలీహిల్సు పెద్దమ్మవారి దేవాలయనిర్మాణంలో ప్రముఖపాత్ర వహించి దానికి మహారాజపోషకుడుగా మారారు.ఆయన స్వర్గస్థులైన సందర్భంగా ఆ రోజు ఆ దేవాలయాన్ని మూసి ఉంచారు.సొంత మనిషిగా భావించే ఆయనకు అంత్యక్రియలు జరిగే దాకా భోజనం చెయ్యడానికి పేదప్రజలకు మనస్కరించలేదు.చాయ్ నీళ్ళతోనే కాలక్షేపం చేశారు.కొందరు అయ్యప్ప దీక్షల నుంచి సైతం విరమించారు.ఆయన దివంగతికి సంతాపసూచకంగా ఆంధ్ర రాష్ట్రప్రభుత్వం నిన్నా మొన్నా కూడా సెలవు ప్రకటించింది.ఒక రాష్ట్రముఖ్యమంత్రికి జరిగేవిధంగా ఆయనకీరోజున అంత్యక్రియలు జరిగాయి.అదొక్కటే ఆయన అభిమానులకు మిగిలిన సాంత్వన.
ఆయన ఎవరికీ రాజకీయ వారసుడు కాడు.పాతబస్తీలో విద్యాభ్యాసం చేసి ఐ.టి.ఐ.కోర్సు పూర్తిచేసి చిన్నవయసులోనే ఎఱ్ఱగడ్డ (హైదరాబాదు)మీటర్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజరుగా చేరిన పి.జె.ఆర్‌కి జీవితంలో ఏదో సాధించాలనే కోరికలేమీ ఉండేవి కావు.కాని ఆయన ధైర్యమూ చొఱవా మాటనేర్పూ ఆయనే తమ నాయకుడని మిగతా కార్మికులంతా భావించడానికి దారితీశాయి.కాకతాళీయంగా ఆ ఫ్యాక్టరీకి వచ్చిన మాజీముఖ్యమంత్రి టి.అంజయ్య పి.జె.ఆర్.లోని నాయకత్వ లక్షణాల్ని గ్రహించి రాజకీయాల్లోకి రమ్మని కోరడమూ దరిమిలా పి.జె.ఆర్ తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగాను రాష్ట్ర కార్మిక శాఖామంత్రిగాను సేవలందించడమూ అందరికీ విదితమే.అప్పటి నుంచి ఓటమి ఎఱుగని పి.జె.ఆర్ 1999లో ఒక్కసారి తప్ప ఎప్పుడూ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగానే లబ్ధప్రతిష్ఠుడయ్యారు.చంద్రబాబునాయుడుగారి తొలి హయాంలో పి.జె.ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడుగా కేబినెట్ హోదా అనుభవించారు.తనని ఇంతవాణ్ణి చేసిన పార్టీ పట్ల ఒక మానవత్వం గల మనిషిగా ఆయన ఎప్పుడూ నెనరుతోనే వ్యవహరించారు.కాని పార్టీయే ఆయన్ని అర్థం చేసుకోలేదు.ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద శాసనసభా నియోజకవర్గం.అందులో పోటీ చేసి గెలవగలననే ధైర్యం పి.జె.ఆర్.కి తప్ప ఇంకెవరికీ లేదు.త్వరలో రద్దు కాబోతున్న ఖైరతాబాద్ నియోజకవర్గం ఆయనతోనే వెళ్ళిపోతోంది.
పైకొచ్చాక ప్రజల్ని ఠంచనుగా మర్చిపోయే నాయకులే నూటికి 99.99శాతం మంది ఉన్న మన రాజకీయ వినీలాకాశపు కారుచీకట్లో శ్రీ పి.జె.ఆర్ ఒక ప్రకాశమానమైన ధ్రువతార.అర్ధరాత్రి ఫోన్ చేసి"అన్నా"అంటే"ఇప్పుడే వస్తున్నా తమ్మీ"అంటూ ఆగమేఘాల మీద రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోయే పి.జె.ఆర్.లో ఒక ఎమ్మెల్యేని కాదు, దేవుణ్ణి చూసుకున్నారు సామాన్యప్రజలు.ఆయన మీటర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం నుంచి విరమించుకుని పూర్తికాలాన్ని రాజకీయాలకే వెచ్చించడం మొదలుపెట్టినా కార్మిక నాయకుడుగా మాత్రం జీవితాంతం కొనసాగారు.హైదరాబాదు చుట్టుపక్కల చాలా భారీ పరిశ్రమల కార్మిక సంఘాలకు ఆయనే అధ్యక్షుడు.ఆయన ఉంటేనే తమకు విజయం చేకూరుతుందని కార్మికుల ప్రగాఢ విశ్వాసం.కార్మికులు పారిశ్రామిక ప్రమాదాల్లో దెబ్బతిన్నా, ఏకంగా ప్రాణాలే కోల్పోయినా వారికి పి.జె.ఆర్ ఇప్పించిన నష్టపరిహారాలు లక్షల్లో ఉండేవి.అలా ఎవరూ ఇప్పించలేరు.
ఆయనకు అభిమానులే తప్ప రౌడీలూ గూండాలూ లేరు.ఆయనకు నేరచరిత్ర లేదు.శత్రువులు అంతకంటే లేరు.అయితే ఆయన యొక్క రక్షణ కోసం రౌడీయిజం చెయ్యడానికి చెఱసాలకు పోవడానికీ ఆయన కోసం ఏకంగా చచ్చిపోవడానికీ వాళ్ళు ఎంతమాత్రం వెనుకాడరు.ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఆయన వెలిగించిన దీపాలు దేదీప్యమానాలు కావు, జాజ్వల్యమానాలు.ఆ విలువేంటో ఆయనకు తెలుసు.వాళ్ళకు తెలుసు.
హిరణ్యకశిపుడి వద్ద ప్రహ్లాదుడున్నట్లుగా కొంపలు పీకే అలవాటున్న ఒకానొక పార్టీలో ఉంటూనే వేలాదిమందికి ఇళ్ళ స్థలాలిప్పించాడు.ఆ స్థలాల్ని తన పార్టీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకోబోతే ప్రాణాలకు తెగించి మరీ అడ్డుకున్నాడు.మంగళసూత్రాలు తెంచడం మాత్రమే తెలిసిన నాయకులకు భిన్నంగా వందలాదిమందికి మంగళసూత్రాలు అందించి ఎన్నో కాపురాల్ని తన స్వహస్తాలతో ఆశీర్వదించాడు.ప్రజా ఆస్తులు బడాబాబుల చేతుల్లో ఆక్రమణకు గురవుతున్న ప్రతి చోటా ప్రత్యక్షమై కబ్జాదారులకు సింహస్వప్నంగా మారాడు.
ఆయనకు తెలుగు ఉర్దూ భాషలే తెలుసు.ఇంగ్లీషు భాషలో పాండిత్యం లేదు.ప్రజల గుండెచప్పుడు వినడానికి సమస్యలకు సమకాలీన పరిష్కారాలు వెదకడానికీ ఆయన వరకు అదో అడ్డంకి కాలేదు.నగర నాగరీకుడైనప్పటికీ తన స్వచ్ఛమైన తెలంగాణా పలుకుబడితో పేదప్రజలతో మమేకమయ్యారు.అలాగని ఆయనలో నిజంగా ఎలాంటి ప్రాంతీయభావాలూ లేవు.ఆయన నియోజకవర్గమే ఒక మినీ ఇండియా.అందువల్ల తోటి తెలంగాణా నాయకులంతా జై తెలంగాణా అంటూంటే ఆయన కింకర్తవ్యతా సందిగ్ధానికి లోనయ్యారు.
ఆయనకు జీవితంలోని చేదు నిజాలే తప్ప కమ్యూనిజాలూ కేపిటలిజాలూ తెలియవు.పేదప్రజల కోసం ఆయన చేసిన దాంట్లో పదో వంతు కూడా ఏ కమ్యూనిస్టుపార్టీ చేసి ఉండదు.పశ్చిమ మండలంలో లక్షలాది మంది నివసించే కాలనీల్లో ఈనాడు ప్రజలు అనుభవిస్తున్న పౌరసౌకర్యాలు ఆయన కృషికి ఫలితమే.పేదల్ని వాడుకుని మర్చిపోవడం ఆయనకు తెలియని విద్య.ఎన్నికలున్నా లేకపోయినా ప్రతిపేదవాడికీ దగ్గరుండి మఱీ రేషన్‌కార్డు వగైరా ఇప్పించకుండా ఇంటికి వెళ్ళేవాడు కాడు.జనార్దనరెడ్డి పాన్‌షాపులకూ క్షౌరశాలలకూ కూడా రిబ్బన్ కటింగు చేస్తాడని సొంతపార్టీవాళ్ళే ఎగతాళి చేసినా ఆయన పట్టించుకునేవాడు కాడు.గుడిసెవాసులు శుభలేఖ ఇచ్చినా తీఱిక చేసుకుని వచ్చేవాడు.ఆయన్ని జనం గుర్తుపెట్టుకోవడం గొప్ప విషయం కాదు.ఆయనకు జనమంతా గుర్తుండేవారు.తాను ఏర్పఱచిన కాలనీల్లో ప్రతి మనిషినీ ఆయన సొంత అన్నయ్యలాగా పేరుపేరునా పిలిచేవాడు.ఆ నవ్వులో కృత్రిమత్వం లేదు.ఆ స్నేహంలో కల్మషం లేదు.ఆ సేవలో స్వార్థం లేదు."అన్నా ! జెన్నన్నా !"అంటూ ఆయన పార్థివశరీరం వెంటపడి ఏడుస్తూ పరుగులు తీసిన వేలాదిమంది స్త్రీలూ నిఱుపేదలూ ఆయన వ్యక్తిత్వానికి ఒక పార్శ్వం మాత్రమే.ఆయన కాలధర్మానికి ఆయన గుఱించి అంతబాగా తెలియనివాళ్ళు కూడా బాధపడ్డారంటే-ఒక పవిత్ర మానవాత్మ తేజస్సు వ్యాపించగల పరిధికి ఎల్లలు లేవేమో ననిపిస్తుంది.
తెలంగాణాకు చెందిన PJRకి ఆంధ్రకోస్తాలో కూడా లక్షలాదిమంది అభిమానులుండడం విశేషం.పశ్చిమ గోదావరి జిల్లావాసుల సమస్యల గుఱించి ఆయన అక్కడ రెండుమూడుసార్లు పర్యటించడం కూడా జరిగింది.
అట్టి గుణగంధమాదనం l బంతరించి
భావభూమి మిగిలె స్మృతి l పరిమళంబు.
చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి (టోపీ లేని బట్టతల వ్యక్తి)డాll వై.ఎస్.రాజశేఖరరెడ్డికి నమస్కారం చేస్తున్న శ్రీ పి.జనార్దనరెడ్డి
కానీ ఆయన పార్టీకి అధిష్ఠానానికీ కొఱకరాని కొయ్యగా తయారయ్యాడు.సొంత పార్టీలోనే అంటరానివాడుగా ముద్రపడ్డాడు.తనవల్ల పైకొచ్చిన నాయకుల చేతిలోనే వెలివెయ్యబడ్డాడు.తరతరాల కాంగ్రెస్ సంప్రదాయాలకు విరుద్ధంగా అశేషప్రజానీకంలో తనకంటూ సొంతబలం ఉండడమే ఆయనకు శాపంగా పరిణమించింది.ఎంత ప్రజాసేవ చేసినా అదంతా పార్టీకి ప్రభుత్వానికీ నచ్చకపోవడంతో అన్ని పదవులకూ దూరమయ్యాడు.సాక్షాత్తూ తన పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉండి తనమీద ఇన్‌కమ్‌టాక్సు దాడులు జరిపిస్తూంటే ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోయాడు.చివరి దశలో బాలయోగి స్టేడియమ్‌లో ఒక సాధారణ కాన్‌స్టేబుల్ కూడా తనని కుర్చిలోనుంచి లేవమని గద్దించే పరిస్థితి వస్తే లేచి కాసేపు అక్కడే నిలబడి ఇంక అక్కడ ఉండలేక మౌనంగా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.
ఒక మహనీయుడి అంతిమక్షణాల జ్ఞాపకాలతో కొత్తసంవత్సరాన్ని ప్రారంభించాల్సి రావడం నిజంగా విషాదభరితమే.కాని ఆయన జీవితం మనకు స్ఫూర్తిదాయకమైనప్పుడు అదే మిక్కిలి వరణీయం.ఆ మహా మహితాత్ముడికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి.