Showing posts with label మా నాన్నగారి స్మృతులు. Show all posts
Showing posts with label మా నాన్నగారి స్మృతులు. Show all posts

Wednesday, August 22, 2007

ఒక డాక్టర్‌గారి కథ-4

డాక్టర్‌గారి చిన్నన్నయ్య, శాస్త్రి L.C.E. చదవడం పూర్తయ్యాక రాష్ట్రప్రభుత్వంలో సివిల్ ఇంజినీరుగా చేరి కొన్ని చరిత్రాత్మక కట్టడాల నిర్మాణంలో ప్రముఖపాత్ర పోషించాడు.ఉదాహరణకి నాగార్జునసాగర్ మీద రోడ్డువేత పనులు ఆయనే పర్యవేక్షించాడు.ఈ క్రమంలో ఆయన టి.సుబ్బరామిరెడ్డికి బాగా దగ్గరయ్యాడు.అందుకని హైదరాబాదులో మహేశ్వరి-పరమేశ్వరి జంటథియేటర్ల నిర్మాణం పనుల్ని శాస్త్రికే అప్పగించాడట సుబ్బరామిరెడ్డి.ప్రస్తుతం ఆ థియేటర్లు మూతపడ్డాయనుకోండి.

ఇవి కాక శాస్త్రి ప్రైవేటు కాంట్రాక్టుల్లోను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను ప్రవేశించి కోట్లు సంపాదించాడు.సికింద్రాబాదు సిఖ్ విలేజ్ దగ్గర తన పేరుమీద ఒక కాలనీ కూడా కట్టించాడు.అదో పెద్ద విశేషమేమీ కాదు.అసలు విషయం-ఆయన ఎంతమంది స్త్రీలని ఉద్ధరించాడన్నదే.ఆయన ఒంటిమీద ఎన్నో పులిపిరికాయలు పెరిగి వేళ్ళాడుతూండేవట."వాడికి ఒంటినిండా లింగాలే"అని వ్యాఖ్యానించారు వెంకటేశ్వర్లుగారు.శాస్త్రికి దశాబ్దాలు గడిచినా సంతానం కలగలేదు.సాంప్రదాయిక పద్ధతులకు స్వస్తి చెప్పి ఆయన విశాల హృదయంతో సృజనాత్మకంగా బయట ఎన్నో ప్రయోగాలు చెయ్యగా చెయ్యగా ఒక మాల స్త్రీ ద్వారా ఒక కూతురు పుట్టింది.ఆమెకీ ఆమె పిల్లకీ సగం ఆస్తి రాసివ్వడమే కాక ఆ పిల్లని పెళ్ళి పీటల మీద కూర్చుని మరీ కన్యాదానం కూడా చేశాడు.ధనవంతుడే బలవంతుడు, బలవంతుడే భగవంతుడు, కనుక నోరెత్తలేక నోరుమూసుకున్నారు బంధువులు.

1991 లో శాస్త్రి కంటే ముందు ఆయన భార్యే చనిపోయింది.తరువాత ఆర్నెల్లకి శాస్త్రి కూడా శాస్త్రోక్తంగా పోయాడు.అప్పుడు సికింద్రాబాదులో ఆయన బంగళా మీదికి బంధువులూ మిత్రులూ ఎగబడ్డారు, పరామర్శించడానిక్కాదు, ఏది కనబడితే అది దొరకబుచ్చుకోవడానికి.ఫర్నిచరూ, దిండ్లూ, బొమ్మలూ, పెన్నులూ, టేప్‌రికార్డరు, టీవీ, ఇల్లు అలుక్కునే మురికి గుడ్డ, చీపురు అనే తేడా లేకుండా దొరికినవాళ్ళు దొరికినట్టుగా గంటవ్యవధిలో ఊడ్చిపారేసి లూటీచేశారు.అందులో కొంత కసి కూడా ఉంది.తమపిల్లలెవరినీ శాస్త్రి దత్తు తీసుకోలేదనే అక్కసు ! తరువాత ఆయనగారి అక్రమ కూతురు వాళ్ళందరి ఇళ్ళకీ తన బలగంతో వెళ్ళి ఎంత వీలైతే అంత తిరిగి స్వాధీనం చేసుకుంది.

అపుత్రకుడుగా చనిపోయిన శాస్త్రి వీలునామా ఏమీ రాయలేదు.అందుచేత మిగిలిన ఆస్తి యావత్తూ చట్టప్రకారంగా ఆయన అన్నయ్య అయిన శర్మ (రేపల్లె) కి స్వాధీనం చేశారు.శర్మ కూడా ఆ తరువాత కొన్నేళ్ళకి పోయాడు.

Tuesday, August 21, 2007

ఒక డాక్టర్‌గారి కథ-3

శివ శివా !! : డాక్టర్ గారికి ఇద్దరు అన్నయ్యలు.( పూర్తి పేర్లెందుకులెండి !) వాళ్ళలో పెద్దాయన శర్మ. చిన్నాయన శాస్త్రి.ఆ రోజుల్లో L.C.E అనే ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సు ఒకటి ఉండేది.అది ఇప్పటి పాలిటెక్నిక్కుతో సమానం.వాళ్ళిద్దరూ మద్రాసు వెళ్ళి అక్కడ గిండీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆ కోర్సు చదివారు.అప్పట్లో దక్షిణ భారత దేశానికంతా కలిపి గిండీ ఒక్కటే ఇంజినీరింగ్ కళాశాల.దాన్నే ఇప్పుడు అణ్ణా యూనివర్సిటీ అంటున్నారు.

తరువాత పెద్దాయన శర్మకి స్వగ్రామమైన రేపల్లె రైల్వేలోనే ఉద్యోగం వచ్చింది.అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాడు.ఆయన డాక్టర్ గారికి రక్తసంబంధ రీత్యానే కాక ఇతరవిషయాల్లో కూడా అన్నయ్యే.అయితే ఒక తేడా ఉంది.డాక్టర్ గారికీ సంప్రదాయానికీ ఆమడ దూరం.శర్మగారు మాత్రం ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి విభూతి పిండికట్లు దట్టించి పెట్టి నిష్ఠగా పూజలో కూర్చుని "ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ"అంటూ పెద్దపెద్దగా ఇల్లెగిరిపోయేలా ఓ గంటసేపు హంగామా చేసి ఆఫీసుకెళ్ళిపోయేవాడు.సాయంకాలం ఆఫీసునుంచి తిరిగొచ్చాక మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి పట్టు పైజమా పట్టు లాల్చీ ధరించి ఒళ్ళంతా అత్తరు కొట్టుకుని మేడమీది గదిలోకెళ్ళిపోయేవాడు.ఎవరెవరో వచ్చేవారు.తెలతెలవారుతూండగా వెళ్ళిపోయేవారు.ఒక విశేషం ఉంది.పాపం ! శర్మగారిది చాలా విశాలహృదయం.కుల మత వర్గ విచక్షణ లేదు.

శర్మగారి మొదటి భార్య ఒక పిల్లని కని చనిపోయింది.రెండో పెళ్ళి చేసుకుంటే రెండో ఆమె ద్వారా అయిదుగురు కొడుకులూ ఒక కూతురూ పుట్టారట.వాళ్ళెవ్వరూ ఇప్పుడు ఇండియాలో లేరు.

శర్మగారు 1994-94 మధ్యకాలంలో ఎప్పుడో రేపల్లెలోనే కాలం చేశారని తెలియవస్తోంది.నిశ్చయంగా తెలీదు.

Monday, August 20, 2007

ఓ డాక్టరుగారి కథ-2

డాక్టర్ గారి పెద్ద కొడుకు పేరు మోహన్.అందరూ మోనాయ్ అని పిలిచేవారు.మోనాయ్ పుట్టినప్పుడు ఆరోగ్యంగానే పుట్టాడు.10-12ఏళ్ళ వయసొచ్చేదాకా కూడా అసాధారణత్వాలేమీ గోచరించలేదు.కానీ చదువులో బాగా వెనకబడి ఉండేవాడు.పదేళ్ళొచ్చినా అతనికి తెలుగుభాషలో ఒక్క అక్షరమైనా చదవడం గానీ రాయడం గానీ రాదు.సంభాషణ మాత్రం అందరిలాగానే బాగా చేసేవాడు.ఎంతకాలం పోయినా ఒకటో తరగతిలోనే ఉంచాల్సిరావడం పెద్దలకే అవమానకరంగా తోచి చదువే మానిపించేశారు, "వాడి తలరాత ఎలా ఉంటే అలా జరగనీ !"అనుకుని.ఇంట్లో ఉన్నప్పుడు మోనాయ్ ఒక పెన్సిల్‌తో గోడల మీద ఎక్కడ పడితే అక్కడ "లులులులులులులులు"అని అంతులేకుండా రాస్తూండేవాడు.గుడికి తీసుకెళితే గుడిద్వారం దగ్గర నిలబడ్డానిక్కూడా భయపడిపోయేవాడు.దేవుడి పేరు చెబితే మీదపడి చెయ్యి దొరకబుచ్చుకుని కొఱికేసేవాడు.వాడి ప్రవర్తనలో అసాధారణత్వాలున్నాయని 13-14ఏళ్ళ వయసులో మొదటిసారిగా పెద్దల దృష్టికి వచ్చింది.ఉన్నట్లుండి నలుగురిలో బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడేవాడు.పెద్ద పెద్ద బెల్లం గడ్డలు కొరుక్కుతినేవాడు.పెద్దగా అరుస్తూనో తనలో తాను మాట్లాడుకుంటూనో బయటికి వెళ్ళిపోయేవాడు.ఒకసారి అలా వెళ్ళినవాడు నెలరోజులైనా రాలేదు.మనుషుల్ని పెట్టి మరీ వెతికించారు.ఎలాగో దొరికాడు.వెంకటేశ్వర్లుగారు వాణ్ణి ఎంతోమంది మానసిక వైద్యులకు చూపించారు.ఏమీ లాభం లేకపోయింది.వాడు బయటికి వెళ్ళకుండా కుక్కని కట్టేసినట్లు గొలుసులతో కట్టేశారు.అది కూడా ఎక్కువకాలం ఫలితమివ్వలేదు.పిచ్చిబలంతో గొలుసుల్ని కూడా తెంచుకుని పారిపోయాడొకసారి.వెంకటేశ్వర్లుగారు మళ్ళీ వాణ్ణి ఎలాగో వెతికించి పట్టుకుని "వెధవా ! ఇంక బయటికి వెళ్ళవు గదా !"అని చావగొట్టారు."బుద్ధిగా ఉంటా"నని మాట యిచ్చినవాడు మళ్ళీ కొన్ని నెల్ల తరువాత పారిపోయాడు.ఇలా కొంతకాలం జరిగాక వెంకటేశ్వర్లుగారు విసిగిపోయి వాడి సంగతి పట్టించుకోవడం మానేశారు.వాడు అలా వెళ్ళిపోతూండడం ఇల్లు గుర్తొస్తే ఇంటికి రావడం-ఇలా అనేక సంవత్సరాలు జరిగింది.అతన్ని వెంకటేశ్వర్లుగారు చిట్టచివరిసారిగా చూసినది 1976లో.అప్పుడు వెళ్ళిపోయినవాడు ఇక మళ్ళీ వెంకటేశ్వర్లుగారి దగ్గరికి రాలేదు.అతని తల్లి మాత్రం"అన్నయ్యా !మన మోనాయ్ ఏమైపోయాడో వెతికించు అన్నయ్యా !"అని పరిపరి విధాల బతిమాలేది.వెంకటేశ్వర్లుగారు మాట్లాడేవారు కారు.కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఆమె అంజనాలు ప్రశ్నలూ నాడీజాతకాలంటూ ఎంతోమంది చుట్టూ తిరిగేది.మోనాయ్ రానేలేదు.

"నాన్నా ! ఇప్పుడు మోనాయ్ ఎక్కడుండి ఉంటాడు ?" అని 1991 లో వెంకటేశ్వర్లుగారిని అడిగితే,"ఇంకెక్కడుంటాడ్రా ? ఎప్పుడో (చచ్చి)పోయుంటాడు."అన్నారాయన.ఇప్పుడు వెనక్కి తిరిగి లోతుగా చూస్తే మోనాయ్ పిచ్చివాడు కాదనిపిస్తుంది.కాని అతను మూల్యం చెల్లించక తప్పలేదు.

ఆ తండ్రీకొడుకుల ఋణానుబంధం అలా తీఱిపోయింది.

Sunday, August 19, 2007

ఒక డాక్టరుగారి కథ-1

గుంటూరుజిల్లా రేపల్లెలో సుబ్బారావుగారనే డాక్టరుగారుండేవారు.ఆయన వెంకటేశ్వర్లుగారికి దగ్గరి బంధువు.నిజానికాయన ఎమ్.బి.బి.ఎస్.డాక్టర్ కాదు.ఆరోజుల్లో L.I.M అనే వైద్యపట్టా ఒకటుండేది.అది చదవడం కోసం మద్రాసు వెళ్ళేవారు.ఆయన కూడా అలా మద్రాసు వెళ్ళి L.I.M. లో చేరాడు.ఇది నెహ్రూ భారతదేశపు అధికార పగ్గాలు చేపట్టిన కొంతకాలానికి జరిగింది.

దేశంలో - ముఖ్యంగా పల్లెపట్లలో ఆధునిక వైద్య సౌకర్యాల కొఱత ఉందనే దృష్టితో నెహ్రూ ప్రభుత్వం అప్పట్లో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది.అదేంటంటే-వైద్యవిద్యలో శిక్షణ పొందుతున్న సీనియర్ విద్యార్థులందరికీ శిక్షణ పూర్తి కాకముందే తక్షణం వైద్యపట్టాలిచ్చేసి పల్లెపట్లకు వైద్యులుగా పంపడం.అనుకున్నారో లేదో వెనువెంటనే అమలు చేసేశారు.అప్పట్లో రేపల్లె మునిసిపాలిటీ కాదు.పల్లెప్రాంతం కిందనే లెక్క.కాబట్టి తాను స్వగ్రామంలో ప్రాక్టీసు పెడతానని చెప్పి సుబ్బారావుగారు కూడా తన వైద్యపట్టాని ముందే పుచ్చుకుని తిరిగొచ్చేశారు.

ఆయన మంచి తెలివైనవాడు.వైద్యాన్ని పూర్తికాలం పాటు అభ్యసించకపోయినా (పాతకాలం భాషలో చెప్పాలంటే)"గొప్ప హస్తవాసి"గల డాక్టరు.చెయ్యి పట్టుకున్నాడంటే రోగాలు చప్పున కుదురుతాయని అనతికాలంలోనే పేరొచ్చింది.ఆ పేరుమీదనే విపరీతంగా సంపాదించాడు.ఎంతగా అంటే ఆయన 1969లో చనిపోయాక రెండు-మూడేళ్ళకు ఆయనకు రేపల్లెలో ఉన్న ఇంటిని భార్యాబిడ్డలు అమ్ముకుంటే అప్పట్లో లక్షా ఇరవైవేల ధర పలికిందట.

అయితే ఆయన పగటిపూట రోగుల చేతులు పట్టుకున్నట్లే రాత్రిపూట కూడా ఇంకొన్ని చేతులు పట్టుకుంటూండేవాడు.రోగాల్లేకపోయినా ఆయన దగ్గరికి వైద్యం మిషతో కొంతమంది మహిళామణులు వచ్చేవారు.వాళ్ళ మాయరోగాన్ని తనకు చేతనైన పద్ధతిలో నయం చేసి పంపేవాడు.సుబ్బారావుగారికి ఈ అలవాటు డాక్టరయ్యాక వచ్చింది కాదనీ వైద్యం చదివేటప్పుడే తోటి విద్యార్థినుల్ని సైతం ఒక చూపు చూశాడనీ బంధువులు చెవులు కొరుక్కునేవారు.అసలు అంతకుముందే తొమ్మిదో తరగతో పదో తరగతో చదివేటప్పుడు ఎవరో టీచరు ఆయనకు థియరీ మఱియు ప్రాక్టికల్సులో సుదీర్ఘకాలం పాటు శిక్షణ ఇచ్చిందని కూడా వదంతులుండేవి.

ఈ లోపం ఉన్నప్పటికీ సుబ్బారావుగారు తనయందు ఆసక్తి లేని ఆడవాళ్ళ జోలికి వెళ్ళేవాడు కాడు.దూరం నుంచే నమస్కారం పెట్టేసేవాడు.చాలా సహాయగుణం గల వ్యక్తిగా పేరు మోశాడు.ఒక డాక్టరుగా ఎంత హుందాగా నడుచుకోవాలో అంత హుందాగాను ఉండేవాడు.ఒక దశలో ఆయనకు స్త్రీల మీద మోజు పోయింది.దాని బదులు మత్తు పదార్థాలు అలవాటయ్యాయి.1965 తరువాత ఆ అలవాటు శ్రుతి మించింది.పెథిడ్రిన్ అనే మత్తుపదార్థాన్ని డాక్టరుగా తనకున్న పలుకుబడితో తెప్పించుకుని అనునిత్యం అది ఇంజెక్షన్ చేసుకోవడం మొదలుపెట్టాడు.ప్రాక్టీసు బాగా దెబ్బ తినిపోయింది.1969 నాటికి 40 ఏళ్ళ వయసుకే ఆయనకు అవసానదశ సమీపించింది.అప్పటికాయనకు ముగ్గురు పిల్లలు.

ఆరోజుల్లో తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారనే మహాత్ముడు గుంటూరుజిల్లా చందోలులో నివసిస్తూండేవారు.ఆయన మహాతపశ్శాలి.ఆయనలో బాలాత్రిపురసుందరి నివసిస్తోందని జనం చెప్పుకునేవారు.భూత భవిష్యద్ వర్తమానాలు తెలిసిన త్రికాలవేత్త కావడాన హిందువుల్లోను ముస్లిముల్లోను"చందోలు దేవుడు"గా ప్రసిద్ధికెక్కారు.ఆయన తాకితే చాలు తమ రోగాలు నయమౌతాయని గాఢంగా నమ్మేవారు.

ఆయన ప్రసిద్ధిని గురించిన విన్న వెంకటేశ్వర్లుగారు కడపటి ఆశగా శాస్త్రిగారిచేత సుబ్బారావుగారికి ఆశీర్వాదమిప్పిస్తే బతుకుతాడేమోనని అక్కడికి ఆయన్ని మోసుకెళ్ళారు.కాని శాస్త్రిగారు సుబ్బారావుగారిని తాకడానికి ఇష్టపడలేదు.ఆశీర్వదించనూ లేదు."ఒక నెలరోజుల పాటు భాగవతం చెప్పించుకుని విను నాయనా !"అని ఇంక మాట్లాడకుండా లోపలికి వెళ్ళారు.

నెలరోజుల తరువాత సుబ్బారావుగారు చనిపోయారు.

Sunday, August 05, 2007

ఆనాటి వెండితెఱ వెలుగులు-1


వెంకటేశ్వర్లుగారు మద్రాసులో LL.B.చదువుతున్నప్పుడు తఱచుగా ఒక హోటలుకి ఉదయాన్నే కాఫీ తాగడం కోసం వెళ్లేవారు.ఆనాటి సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు రమణారెడ్డి కూడా అక్కడికే వచ్చేవారు.ఒకసారి వెంకటేశ్వర్లుగారి తమ్ముడు తాడేపల్లి సత్యనారాయణ(వెంకటేశ్వర్లుగారి కంటే 12ఏళ్ళు చిన్న)అన్నయ్యని చూడాలని మద్రాసొచ్చాడు.మర్నాడు ఉదయాన్నే తమ్ముణ్ణి తీసుకుని హోటలుకి వెళ్ళారు వెంకటేశ్వర్లుగారు.ఇద్దరూ ఒక బల్ల దగ్గర కూర్చుని కాఫీ తాగుతూండగా యథాప్రకారం రమణారెడ్డిగారు కూడా వచ్చారు.ఈసారి కాకతాళీయంగా ఆయన వీళ్ళు కూర్చున్న బల్ల దగ్గరికే వచ్చి కూర్చుని కాఫీ తెమ్మని పురమాయించారు."ఎవరన్నయ్యా ఈయన ? అచ్చు రమణారెడ్డిలా ఉన్నాడు ?"అని గుసగుసలాడాడు అన్నయ్యతో తాడేపల్లి సత్యనారాయణ."నీ బొంద.రమణారెడ్డిలా కాదురా !ఆయనే సాక్షాత్తూ రమణారెడ్డి."అని చెప్పారు వెంకటేశ్వర్లుగారు.అప్పటికే చాలా సినిమాల్లో హాస్యనటుడుగా రమణారెడ్డిగారిని చూసీ చూసీ తాడేపల్లి సత్యనారాయణ నవ్వాపుకోలేకపోయాడు-ఇప్పుడు రమణారెడ్డిగారిని ప్రత్యక్షంగా చూసేసరికి.పకపకా నవ్వుతూనే ఉన్నాడు."ఛ ! ఊరుకోరా ! ఆయనేమన్నా అనుకుంటాడు."అని వెంకటేశ్వర్లుగారు పదేపదే మందలిస్తున్నా సత్యనారాయణకి నవ్వాగలేదు.దాంతో కాఫీ తాగడం అర్ధాంతరంగానే కానిచ్చి తమ్ముణ్ణి బలవంతంగా బయటికి తీసుకెళ్ళారు వెంకటేశ్వర్లుగారు.

Friday, August 03, 2007

మద్రాసు పిలిచింది

కర్నూలు నుండి తిరిగొచ్చేసిన కొంతకాలానికి వెంకటేశ్వర్లుగారికి మద్రాస్ పచ్చయప్ప కళాశాలలో LL.B.తరగతిలో ప్రవేశం లభించింది.అది మద్రాస్ విశ్వవిద్యాలయానికి ఉన్న సొంత కేంపస్సుల్లో ఒకటి.అసలు మద్రాస్ విశ్వవిద్యాలయానికి మన విశ్వవిద్యాలయాల్లాగా ఒక కేంపస్సంటూ ఏమీ లేదు.హాస్టళ్ళు ఈనాటికీ లేవు.విద్యార్థులు తమ కళాశాలకి దగ్గరగా ఉన్న ప్రైవేటు ఇళ్ళలో గదులు అద్దెకి తీసుకుని వెళ్ళొస్తూండడమే.దానికి చెందిన వివిధ కళాశాలలు మద్రాస్ నగరమంతటా అక్కడక్కడా చెల్లాచెదురుగా ఉన్నాయి.మద్రాసు బీచి దగ్గర విక్టోరియన్ శైలిలో కట్టబడిన ఒక పాత కట్టడంలో దాని పరిపాలనా భవనమూ గ్రంథాలయమూ నెలకొని ఉన్నాయి.

వెంకటేశ్వర్లుగారు మద్రాసు వెళ్ళిన కొత్తల్లో తాను కూడా ఒక గది తీసుకుని ఉన్నారు.ఆ జీవితం ఆయనకు బొత్తిగా నచ్చలేదు.ఇలా కాదనుకుని తన ఆప్త బంధువులైన ధారావారితో తన ఇబ్బంది చెప్పుకున్నారు."ఛీ ! గదుల్లో ఎందుకురా వెంకులూ, ఉండడం ? మద్రాస్‌లో మన కంపెనీ గెస్ట్ హౌస్ ఉందిగా !"అన్నారు ధారావారు.ధారావారికి ఒంగోలు కేంద్రకార్యాలయంగా పనిచేస్తున్న "ధారా అండ్ కంపెనీ"అనే పొగాకు గ్రేడింగ్ మరియు ఎగుమతుల సంస్థ ఉంది.దానికి ఒంగోలులో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది.దేశమంతా మార్కెటింగ్/పరిపాలన నిమిత్తం కట్టిన గెస్ట్ హౌసులున్నాయి.ఆ రోజుల్లో ఆ కంపెనీకి వెంకటేశ్వర్లుగారు మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం కూడా చేశారు. అయితే ఆ మొత్తం ఈనాటికీ వెనక్కి రాకపోవడం వేరే విషయం.ఆ విధంగా అలాంటి ఒక గెస్ట్ హౌసుకి మకాం మార్చారు వెంకటేశ్వర్లుగారు.

గుంటూరులో లాగా ఈసారి ఆయన వెంట తల్లిగాని తమ్ముడు గాని ఎవరూ లేరు.ఆయనొక్కడే ఉన్నాడు మద్రాసులో.ఈ పరిస్థితి ఆయనకి మంచి ఉత్సాహాన్నిచ్చింది.తీఱిక సమయాల్లో స్నేహితులతో కలిసి మద్రాసంతా షికార్లు కొట్టేవారు.ముఖ్యంగా బీచి, బర్మా బజార్లతో పాటు సినిమా తారలు విశేషంగా నివసించే టి.నగర్, కోడంబాకం, పానగల్ పార్కు, పాండీబజారు పరిసరాల్లో బాగా విహరించేవారు.ఒక్కొక్క సినిమాతార గురించి స్నేహితులు వివరిస్తూంటే ఆ మఱ్ఱిపూడి కుఱ్ఱవాడు ఆశ్చర్యపోయి వినేవాడు.

అప్పట్లో మద్రాసులో తమిళం పెద్దగా వినపడేది కాదు.అంతా తెలుగుమయం.ఎటు చూసినా తెలుగువాళ్ళే ఉండేవారు.ఆ విధంగా ఆనాటి మద్రాసుని ఈనాటి హైదరాబాదుతో పోల్చవచ్చు.ఆ కారణం చేత మద్రాసులో ఐదేళ్ళున్నా వెంకటేశ్వర్లుగారికి తమిళం పట్టుపడలేదు.ఆయనే కాదు, తెలుగువాళ్ళందరి పరిస్థితీ అలాగే ఉండేది. కాకతాళీయమే కావచ్చు-వెంకటేశ్వర్లుగారే కాదు ఆయన సంతానమంతా తమిళనాడులో విద్య నభ్యసించారు-ఆయన కుమార్తె మినహా.

Thursday, August 02, 2007

మూణ్ణెల్ల ముచ్చట


ఆంధ్రరాష్ట్రం వచ్చిన కొత్తల్లో వెంకటేశ్వర్లుగారి మిత్రుడైన సుబ్బారావుగారికి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వోద్యోగం వచ్చింది.ఆయన వెంటనే రాష్ట్ర రాజధాని (కర్నూలు)కి వెళ్ళి ఉద్యోగంలో చేరిపోయారు.అక్కడ ఇంకా చాలా ఉద్యోగ ఖాళీలున్నాయి."మంచివాళ్ళని చూడవయ్యా"అని ఆయన పనిచేసే విభాగపు అధిపతి సుబ్బారావుగారితో చెప్పాడు."సరే"నని సుబ్బారావుగారు గుంటూరొచ్చి "ఒరేయ్ ! వెంకులూ ! మా సెక్షన్‌లో ఓ వేకెన్సీ ఉంది.వస్తావా ?"అని అడిగారు.భూస్వామి కావడంచేత ఒకరి కింద ఉద్యోగం చెయ్యడమంటే వెంకటేశ్వర్లుగారికి సుతరామూ మనస్కరించింది కాదు.మొదట్లో తటపటాయించినా"గుంటూరులో ఊరికే కూర్చుంటే కాలక్షేపం కావడంలే"దనుకుని మిత్రులతో కలిసి వెరైటీగా కర్నూలులో గడిపినట్లుంటుందనే యువక ఆలోచనలతో "సరే"నన్నారు.అలా కలిగింది వెంకటేశ్వర్లుగారి తొలి ఉద్యోగానుభవం 1953లో, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంలో !

అప్పట్లో కర్నూలు ఇంత మహానగరం కాదు.సౌకర్యాలు పూజ్యం.కేంద్రప్రభుత్వాన్ని మెడలొంచి సాధించుకున్న ఆంధ్రరాష్ట్ర పరిస్థితి లేచిపోయి పెళ్ళిచేసుకున్నవాళ్ళ కాపరంలాగా ఉండేదన్నారు వెంకటేశ్వర్లుగారు. అందుచేత రాష్ట్ర సచివాలయం ఓ ఆరుబయటి మైదానంలో 4000 (అక్షరాలా నాలుగువేల) గుడారాల (tents)లో నడుస్తూండేది.కర్నూలులో ఒక పాత ప్రభుత్వ భవనాన్ని రాష్ట్ర శాసనసభగా వాడేవారు.జిల్లా కలక్టరు కార్యాలయ సముదాయాన్ని రాజ్‌భవన్‌గా వాడేవారు.ఉద్యోగుల్లో పై శ్రేణివాళ్ళు కర్నూలులో ఉన్న కొన్ని మంచి ఇళ్ళని అద్దెకి తీసుకున్నారు.మిగతావాళ్ళందరికీ గుడారాలే శరణ్యం.తెలుగువాళ్ళకో రాష్ట్రమైతే ఏర్పడింది గాని సగం పరిపాలన మాత్రం మద్రాసు నుంచే జరుగుతూండేది.అప్పట్లో మద్రాసుకూ కర్నూలుకూ మధ్య సూటి రైలుమార్గం లేదు.పనిపడ్డప్పుడు మద్రాసు ఉద్యోగులు అవసరమైన ఫైళ్ళు పట్టుకుని గుంతకల్లు దాకా రైల్లో వచ్చి అక్కణ్ణుంచి జీపుల్లోను కార్లలోను కర్నూలు గుడారాలకు చేరుకునేవారు.

ఇప్పటి తెలంగాణా నాయకుల మాటల్లో చెప్పాలంటే-అప్పటికి ఇంకా రాయలసీమవారికీ కోస్తావారికీ పూర్తిగా "మనసులు కలవలేదు."కలవడానికి కలిసున్నదెప్పుడు గనక ? ఎవరి ప్రాంతంలో వారు జీవించేవారంతే ! మొదటిసారిగా కర్నూలు వెళ్ళిన వెంకటేశ్వర్లుగారిలాంటి కోస్తా మనుషులకి రాయలసీమ ప్రజల ఆహారం, వేషభాషలూ అలవాట్లూ తమాషాగా అనిపించేవి."నాయనా ! వచ్చినాను"అని వాళ్ళు మాట్లాడుతూంటే ఏదో పదహారో శతాబ్దంలోకి వెళ్ళిన అనుభూతి కలిగి నవ్వుకునేవారు.అయితే ఇలాంటివాటి మీద తమ భావాలు పైకి చెప్పడం మీద అప్పటి ప్రభుత్వోద్యోగుల్లో అప్రకటిత నిషేధం ఉండేది.వెంకటేశ్వర్లుగారు పనిచేసిన శాఖాధిపతి ఒక నెల్లూరు రెడ్డి.ఆయన కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకులందరికీ తన ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు.సుబ్బారావుగారితో పాటు వెంకటేశ్వర్లుగారు కూడా వెళ్ళారు.విందు చివర్లో ఆయన ఒక చిన్న ఉపన్యాసంలాంటిది ఇచ్చాడట."అష్టకష్టాలు పడి తెలుగువాళ్ళమంతా కలిసి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నాం.దీన్ని ఇలా నిలబెట్టుకోవడం మన బాధ్యత.మనం ఓర్పు వహిస్తే తెలంగాణా కూడా మనతో కలుస్తుంది.ఎన్ని భేదాలున్నా తలవంచుకుపోండి.అప్పుడే మనం తలెత్తుకు తిరగ్గలుగుతాం."అన్నాడట ఆ పెద్దాయన.

పెద్దాయనతో వెంకటేశ్వర్లుగారు ఏకీభవించారు.కాని పాపం ! కర్నూలు జీవితంతోనే పూర్తిగా ఏకీభవించలేకపోయారు.పగలల్లా గుడారాల్లో ఉక్కపోత.చీకటిపడుతూనే దోమల బెడద.తెల్లవారుతూనే చెంబుపట్టుకుని ఆరుబయటి ప్రదేశాలు వెతుక్కోవడం.తిండి సరిపడక అనారోగ్యం.రెండుసార్లు జ్వరం.ఇక తనవల్ల కాదనుకున్నారు."ఇంకొంతకాలమాగరా వెంకులూ ! తరవాత మనం హైదరాబాదు వెళతాం."అని సుబ్బారావుగారు హెచ్చరిస్తూనే ఉన్నారు."నావల్ల కాదులేరా !"అని చెప్పి వెంకటేశ్వర్లుగారు తిరిగి గుంటూరొచ్చేశారు.ఆయన కర్నూలులో పనిచేసింది ముచ్చటగా మూణ్ణెల్లే.ఆయన మిత్రుడు సుబ్బారావుగారు మాత్రం ఉద్యోగావసరం ఉన్నవాడు కనుక అలా కర్నూలులోనే కొనసాగారు.ఆయన చెప్పినట్లే తెలంగాణా ఆంధ్రా ఏకమై విశాలాంధ్ర ఉద్భవించింది.గుమాస్తాగా చేరిన సుబ్బారావుగారు హైదరాబాదు వెళ్ళి సీనియారిటీ మీద IAS కేడర్ కూడా సాధించి పదవీ విరమణ చేసేనాటికల్లా రాష్ట్రానికే అదనపు కార్యదర్శి హోదా కూడా సంపాదించారు.కర్నూలులో విడిపోయిన తరువాత వెంకటేశ్వర్లుగారూ సుబ్బారావుగారూ పదేళ్ళకొకసారైనా కలుసుకుని ఉండరు.కాని సుబ్బారావుగారు 1990-91 ప్రాంతంలో చనిపోయారని పేపర్లలో చదివి వెంకటేశ్వర్లుగారు తన జీవితంలో మొదటిసారిగా కన్నీళ్ళు పెట్టుకున్నారు.

Wednesday, February 14, 2007

ఆంధ్రరాష్ట్రం కథా కమామిషు-4

వెంకటేశ్వర్లుగారు నెహ్రూ ఇందిరాగాంధీల విధానాల్ని విమర్శించేవారు.కాని ఒక పాతకాలపు మనిషిగా ఆయన కాంగ్రెస్ అభిమాని కూడా కావడాన ఆ విమర్శల్లో తీవ్రత ఉండేది కాదు.కాంగ్రెస్ భాషారాష్ట్రాల విషయంలో స్వాతంత్ర్యం వచ్చాక చేసిన వాగ్దానభంగం గురించి "అది మాట తప్పడం కా"దన్నారు.అప్పుడే వలసపాలనలోంచి బయటపడ్డ ఇండియా ప్రభుత్వం జాతికొక రాష్ట్రమిచ్చేటంత గొప్ప ఆర్థికస్థితిలో లేదన్నారు.పరిస్థితులు సంతృప్తికరంగా చక్కబడేదాకా కొంతకాలంపాటు బ్రిటీషువారు ఏర్పరచిన ప్రెసిడెన్సీల్నే యథాతథంగా కొనసాగించాలనుకున్నారట.అదీగాక దేశవిభజన సమయంలో 10లక్షలమంది ప్రాణాల్ని బలిగొన్న మతిహీనమైన హింసాకాడ మారణహోమం చూసి నాయకులే బెంబేలెత్తిపోయారు.ఆ పరిస్థితుల్లో ఏ విధమైన పునర్విభజనైనా ప్రమాదకరంగా తోచింది వారికి.

ఇండియా పరిస్థితి పరమ దయనీయంగా ఉండేది.చైనాతో ఇండియాకి ఉన్న వేలాది కిలోమీటర్ల సరిహద్దు పొడవునా ఒక్క నరమానవుడు కూడా కాపలా ఉండేవాడు కాడంటే ఈనాటివారికి దిగ్భ్రాంతి కలుగుతుంది.వేరే కారణమేమీ లేదు.సరిహద్దుల కాపలా కొఱకు లక్షలాదిమందిని నియమించుకునే శక్తి అప్పట్లో ఇండియాకి లేదంతే.చైనా టిబెట్‌ని ఆక్రమించుకున్న తరువాత కూడా ఆ దేశ తత్త్వాన్ని ఇక్కడివారు గ్రహించలేకపోయారు.ముఖ్యంగా నెహ్రూ ! చైనా చాటుమాటుగా లోపాయికారీగా ఇండియా భూభాగాన్ని కాజేసిన తరువాత ఎంతో కాలానికి గాని ఆ విషయం ఇండియాకి తెలియలేదు.తెలిసేసరికి నెహ్రూకి నోట మాట రాలేదు.చైనాతో ఢీకొనడమంటే పాకిస్తాన్‌తో పరాచికాల్లాంటిది కాదు.సైన్యం సరిపోక మలబార్ పోలీసుల్ని పంపారు.వేలాదిమంది మలబార్ పోలీసులు యుద్ధం మొదలుకాకముందే పిట్టల్లా నేలకూలారు.ముసలి బ్రాహ్మడు భయంతో గజగజ వొణికిపోయాడు.కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యం మళ్ళీ విదేశీయుల చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో ! ఇంత మిత్రద్రోహమా ? బానిసదేశాల్లో కూడా ఇంత సామ్రాజ్యకాంక్షా ? అని ఆలోచిస్తూంటే ఆయనకి మతిపోయినంత పనైంది.తనకేమో చావు సమీపిస్తోంది.తన తరువాత ఇండియా సంగతి చూసేదెవరు ? ఈ అలోచనలతో సతమతమై ఆయన తనమీద తాను కంట్రోల్ కోల్పోయాడు.పులిమీద పుట్రలా ఒరిస్సా పర్యటనలో ఉండగా పక్షవాతం వచ్చింది.కోలుకున్నట్లే కోలుకుని ఆ తరువాత కొన్ని రోజులకి నెహ్రూ అస్తమించాడు.

అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయి దెబ్బతిన్న నెహ్రూలా కాదల్చుకోలేదు ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన ఆయన కూతురు ఇందిరాగాంధి.ఇందిరాగాంధి నిరంకుశత్వం వెనుక ఆవిడ మిలిటరీ ధోరణి వెనుక నెహ్రూ తిన్న దెబ్బలున్నాయి.నెహ్రూ వైఫల్యాలున్నాయి.ఆయన పొందిన చేదు అనుభవాలు ఆవిడని జీవితాంతం వెంటాడాయి.అందుకే ఇండియాని కూడా చైనాతో సమానంగా ఒక ప్రబల సైనిక శక్తిగా మార్చాలని ఆవిడ నిశ్చయించుకుంది.తత్ఫలితమే 1974లో పొఖారన్‌లోఇండియా జరిపిన మొదటి అణుబాంబు పరీక్ష.ఆవిడ ఇండియా కాల్బలాన్ని సైతం 12 లక్షలకి పెంచింది.నెహ్రూ చనిపోయిన 10ఏళ్ళలోనే ఇండియా ప్రపంచంలో నాలుగో మహా సైనిక శక్తిగా అవతరించడానికి కారణమిదే.

Tuesday, February 06, 2007

ఆంధ్ర రాష్ట్రం కథా కమామిషు

వెంకటేశ్వర్లుగారు పుట్టకముందునాటి సంగతి.గుంటూరులో గురునాథం గారనే బడిపంతులు ఒకాయన ఉండేవాడు.ఆయన ఇంటి పేరేంటో ఏ బడిలో పనిచేసేవారో అలాంటి వివరాలు వెంకటేశ్వర్లుగారికి కూడా తెలీదు.అప్పట్లో గురునాథం గారు ఒకసారి ఏదో పని మీద నైజాం (తెలంగాణాని అలా పిలిచేవారు) వెళ్ళాడు.అక్కడ తెలుగువారికి గాని తెలుగుభాషకి గాని ప్రాధాన్యం సంగతి అలా ఉంచి బొత్తిగా విలువే లేకపోవడం గమనించి చాలా మానసిక వ్యథకి లోనయ్యాడు.తెలుగు గడ్డపైనే తెలుగుకు అవమానాలు జరుగుతున్న దుర్భర పరిస్థితి నుంచి బయటపడాలంటే తెలుగువారంతా ఏకమై ఒకే రాజ్యంగా ఏర్పడాలని ఆయనకి బలంగా అనిపించిందట.ఆయన గుంటూరుకు తిరిగి వచ్చాక కూడా ఆ విషయమే అహోరాత్రాలూ ఆలోచించేవాడు.

ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా వందేమాతర ఉద్యమం జరుగుతూండేది.బ్రిటీషు ప్రభుత్వం అఖండ బెంగాల్ ప్రావిన్సుని తూర్పు పశ్చిమ బెంగాల్ ప్రావిన్సులుగా విడగొట్టాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బెంగాలీలంతా ఏకమై భూమ్యాకాశాలు బద్దలయ్యేలా ఆందోళన చేసేవారు.విడగొడతామంటే బెంగాలీలు గొడవ చేస్తూండిరి.తెలుగువారి విషయానికొస్తే అందరూ విడిపోయే ఉన్నారు.ఇక్కడ దాని గురించి బాధపడేవాడు కూడా లేకుండా పోయాడు.ఈ అంశం గురునాథం గారిని చాలా బాధించింది.

ఆ రోజుల్లో ఆయన Guntur Literary Association అనే సాంస్కృతిక సంస్థకి కార్యదర్శి (Secretary)గా ఉండేవాడు."మన అఖండ తెలుగు రాజ్యం"అనే పేరుతోఆయన ఒక పెద్ద మ్యాపు గీశాడు.అందులో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఉన్నాయి.ఆ మ్యాపు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మ్యాపు కన్నా పెద్దదట.ఒక రకంగా అదే నిజమైన ఆంధ్రా మ్యాప్ అనడం సమంజసమేమో !ఆ మ్యాపుని ఆయన అసోషియేషన్ కార్యాలయంలో వేలాడదీసినప్పుడు జనం చూసి ఆనందించారు తప్ప వారిలో పెద్దగా చలనం లేదు.

ఆయన"తెలుగువారందరికీ కలిపి ఒక రాజ్యం ఉండాలి"అని అసోషియేషన్‌లో మొదటిసారిగా మాట్లాడినప్పుడు ఆయనకేదో పిచ్చెక్కిందనుకున్నారు మిగతా సభ్యులు.పాపం ! వారి తప్పేమీ లేదు.ఆనాటి తెలుగువారు నానా రకాల పరాయి జాతుల కబంధ హస్తాల్లో ఆ రకంగా చిక్కుకుపోయి ఉన్నారు.ఆ స్థితిలోంచి బయటపడే ఆలోచన చెయ్యడం వారికి కలలో కూడా సాధ్యం అయ్యేది కాదు.ఉన్నట్లుండి గురునాథం గారు అలా మాట్లాడ్డం గుంటూరులో పెద్ద చర్చనీయాంశమైందట.ఇది 1906నాటి ముచ్చట.

తత్వం తలకెక్కడం వల్ల కావచ్చు లేదా గురునాథం గారి అనుయాయులూ శిష్యులూ తరువాతి కాలంలో సాహిత్య రాజకీయ ప్రాబల్యాన్ని సంపాదించుకోవడం వల్ల కావచ్చు.మొత్తం మీద 1914నాటికి ఆంధ్ర రాష్ట్ర నినాదం ప్రతి తెలుగువాడి గుండెకి చేరిపోయింది.అది చివరికి నిజాం సింహాసనాన్ని సైతం కూకటి వేళ్ళతో పెళ్ళగించింది.

Sunday, February 04, 2007

శవాల శర్మ కథ

గుంటూరులో చలపాయిగారి ఇంటికి అల్లంత దూరంలోనే ఉండేది శవాల శర్మగారి ఇల్లు.శవాల శర్మ అనే పేరు వింటూనే ఆశ్చర్యపోయాను.బ్రాహ్మల్లో శవాలు మోసేవారెవరుంటారా ? అని !శవాల శర్మగారికి ఆ పేరు రావడానికి కారణం శవాలు మొయ్యడం కాదట.ఆయనగారి అసలు పౌరుష నామం "సిపాయి శర్మ".ఎందుకంటే ఆయనకి చదువు గట్టిగా పట్టుబడలేదు.రెండో ప్రపంచ యుద్ధానికని బ్రిటీషు ప్రభుత్వం అదనంగా బలగాల్ని మోహరించాలనుకున్నప్పుడు చాలా మంది ఆంధ్రులు సైన్యంలో చేరారు.వారిలో శర్మగారొకడు.శర్మగారు ఈజిప్టు వెళ్ళి సాధారణ సిపాయి హోదాలో యుద్ధంలో పోరాడాడు.అలనాటి కురు పాండవ యుద్ధంలో లాగానే ఈజిప్టు యుద్ధంలో కూడా సైనికులు రాత్రిపూట పోరాటం నుంచి విరమించి విశ్రాంతి తీసుకునేవారు.తిరిగి తెల్లవారుతూనే పోరాటం మొదలు.అలాంటి సందర్భంలో ఇరుపక్షాలకూ చెందిన మిగతా సైనికులంతా గాఢ నిద్రా పరిష్వంగంలో సేదదీరే సమయంలో శవాల శర్మగారూ ఆయనగారి పాకిస్తానీ మిత్రుడైన జబ్బార్ ఇద్దరూ మేల్కుని ఉండి యుద్ధరంగంలో చచ్చిపడి ఉన్న సైనికుల ఒంటిమీది ఉంగరాలు గొలుసులూ కంకణాలూ పర్సులూ కాజేసేవారు.అలా కాజేసిన సొత్తు ఎలా భద్రపరిచి ఇండియాకి తెచ్చారో తెలీదు.మొత్తం మీద రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ చరిత్ర ఒక మలుపు తిరిగింది.సిపాయి శర్మగారి జాతకం కూడా ఓ మలుపు తిరిగింది.ఆయన ప్రతిష్ఠాత్మకమైన బ్రాడీపేట ప్రాంతంలో వెయ్యి గజాల ఇల్లు కట్టించి అక్కడే స్థిరపడ్డాడు.ఈ సంఘటన తరువాత ఆయన పౌరుష నామధేయం శవాల శర్మగా మారి పోయింది.ఆయన మిత్రుడికి కూడా పాకిస్తాన్‌వారు "శవాల జబ్బార్" అని పేరుపెట్టారో లేదో మనకి తెలీదు.

Saturday, February 03, 2007

చలపాయిగారి కథ-2

చలపాయిగారు కొంచెం పొట్టిగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండేవారు.మనిషి చామన చాయ.70ఏళ్ళ వయసులో కూడా మంచి భోజనపుష్టి ఉండేది.వినికిడి ఏ మాత్రమూ మందగించలేదు.కంటిచూపు మసకబారల