__బై యిలఁ బూఁచె నా కొఱకుఁ l బాయక వెంకటపద్మజాఖ్యమై ;
__ఈ యమితోత్సుకత్వ కమనీlయతరంబగు సంకురాత్రి నా
__నాయిక సిద్ధభూమి వలlనన్ దిగివచ్చె స్వశాపశాంతికై.-------------------------------------1
ఉll తల్లికిఁ దండ్రికిన్ దగిన l ధన్యతనూజ వనుంగు బంగరుం
__జెల్లివి యన్నలిద్దరికిఁ l జెల్మి యొనర్చినవారి పాలి జా
__బిల్లివి, యెల్ల యొజ్జలకుఁ l బ్రీతిని గూర్చిన ఛాత్రి వింక నా
__యుల్లము దోఁచికొన్న వర l యోషిత వేటికి వేయి పల్కఁగన్.-------------------------------2
కll అందరికి నేర్పఁజాలు న
__మందంబగు ప్రజ్ఞ నీది l మఱియొక్కరిచే
__నెందును జెప్పించికొనవు,
__సుందరములు నీదు శాంతి l సౌమ్యతలు ప్రియా !-------------------------------------------3
ఉll నీకు సిపారసుల్ వలదు,l నీ సుగుణంబు లగణ్యముల్, మదీ
__యాకలనీయ దుర్గుణము l లట్లు ; ననున్ సయిఁపంగ నీకునున్
__గాకిఁక నేరికిన్ వశము ? l కాదిలి నేస్తమ ! నేను గాక యిం
__కే కరుణాత్ముఁడైనను ద్వlదీయ గుణోత్తరత న్నెఱింగెడున్.----------------------------------4
ఉll వాహినిలోనఁ గొట్టుకొని l వచ్చిన కట్టెల భంగి నిప్పుడీ
__దేహములోన నిర్వురము l దైవవశంబునఁ గూడినాము, క
__ర్మేహ ప్రకార మింకెవర l మెచ్చటి కేఁగెదమో సఖీ ! తదీ
__యోహకుఁ బండుటాఁకు వలె l నుల్లము భీతిని సంచలించెడున్.----------------------------5
సీll రద్దు కాదీ ముద్దు, l సుద్దనుకొనవద్దు,
_______శుద్ధ సూనృతవాక్కు l సుబ్బసూరి
__బహువర్ష సేవా విlపాక సమార్జితం
_______బిది నీకుఁ బతిదేవు l హృదయకోశ
__నిర్గతావక్ర నిlరర్గళాశీర్వాద
_______సురలోక సుమతరు l సురభి సుమ్మి !
__యిది శక్తి యిది వజ్ర l మిది సుదర్శన చక్ర
_______మఖిల లోకముల సlమ్మాన్యమిదియె.
తే.గీll ఆస్తిపాస్తుల కంటె నlనర్ఘమిదియె
__ముందటి కలుము లిద్దాని l ముందు డిందు
__తిరుగు లేకపోవలె నీకుఁ l ద్రిభువనముల
__రాజమర్యాద లెల్లెడ l లభ్యమగుత.------------------------------------------------------------6
ఉll వాసిగ నీకు వస్తు ధన l వాహనముల్ కనకాన్నవస్త్రముల్
__రాసులుగా లభింపవలె l వ్రాయవలెన్ విధి దీర్ఘమాయువున్
__దోసము లేని స్వస్థతయుఁ l దోరపుఁ గీర్తియు నంచు వత్సలా
__శాసన మాచరింతు ఘన l శాశ్వత మంగళ వాక్పరంపరన్. --------------------------------7
(నా భార్య పుట్టినరోజు సందర్భముగా)



