Showing posts with label పంచుకోలు (sharing). Show all posts
Showing posts with label పంచుకోలు (sharing). Show all posts

Saturday, May 03, 2008

టి.వి.-సినిమా సమీక్షల బ్లాగులు మొదలుపెట్టండి !

చాలాకాలం క్రితం తెలుగు దూరదర్శన్ కుంటలో (అప్పట్లో అది నడిచిన స్థాయికి ఛానల్ అనే పదం వాడ్డం ఇష్టం లేదు) నెలకోసారి "జాబులూ, జవాబులూ" అని ఒక కార్యక్రమం వచ్చేది. ఆ నెలలో కుంటలో ప్రవహించిన కార్యక్రమాల మీద వీక్షకుల అభిప్రాయాలకూ, సందేహాలకూ, ఆకాంక్షలకూ స్టేషన్ డైరెక్టర్ గారు సమాధానాలిచ్చేవారు. అవేమీ సంతుష్టికరంగా ఉండేవి కావు గాని ఇప్పటి ప్రైవేటు ఛానళ్ళకంటే చాలా నయం.

ఇప్పుడున్న తెలుగుఛానళ్ళవాళ్ళెవరికీ తాము ప్రసారం చేస్తున్నకార్యక్రమాల బాగోగుల గుఱించి -మన - అనగా వీక్షకుల అభిప్రాయాలు అవసరం లేదు. అందుకే ఇప్పుడు మాటవరసకైనా జాబులూ లేవు, జవాబులూ లేవు, బుఱ్ఱ ఖరాబులే తప్ప ! వాళ్ళు తమ యిష్టమొచ్చినవి ప్రసారం చేస్తూంటారు. చచ్చినట్లు చూడ్డమే ఇప్పుడు మన పని. నాకర్థంకాని విషయం ఇంకొకటేమిటంటే మనం పెద్దగా విరగబడి చూడకపోయినా "మా యొక్క ఫలానా ధారావాహిక అదుర్స్ బెదుర్స్" అంటూ వాళ్ళకు వాళ్ళే నంది, పంది వగైరా అవార్డులు ఎలా ఇచ్చేసుకుంటున్నారా ? అని ! దీనిక్కారణం - టీవీ కార్యక్రమాల మీదా, సినిమాల మీదా ప్రజాభిప్రాయ నివేదన జరగాల్సినంతగా జరక్కపోవడం. ఇంతకాలమూ ఇలా ఉందంటే సరే ! కాని బ్లాగుల్లాంటి ప్రజామాధ్యమం విస్తరిస్తున్న దశలో కూడా మనం నచ్చని కార్యక్రమాల మీదా సినిమాల మీదా గొంతెత్తకపోవడం మంచిది కాదు. కాబట్టి ఆ ప్రస్తావనల మీద రాసే బ్లాగులు విఱివిగా పుట్టాలి.

ఇదివరకేమో గాని ఇప్పుడు మాత్రం వీడియో బ్లాగింగు చెయ్యడానికి అన్నీ మంచి శకునములే. ముఖ్యంగా బ్లాగర్ డాట్ కామ్ లో గత కొద్దినెలలనుంచి నేరుగా దృశ్యకాల (videos) ని టపా చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టడం బ్లాగేతిహాసంలోనే ఒక చరిత్రాత్మక మలుపు. Youtube నుంచి జావా సంజ్ఞావళి (Java code) ని బ్లాగులో పొందుపఱచుకోవడం, మన బ్లాగు ముందు ససేమిరా అని మొఱాయించడం, మనమేమో దాని కాళ్ళూ గడ్డం పట్టుకుని నీచంగా బ్రతిమాలడం - ఈ పాతముచ్చటలకింక స్వస్తి. ఇదొక్కటే సరిపోదు. ఒక సినిమా గుఱించి మనం మన బ్లాగులో సమీక్ష రాయగలగాలంటే, రాసినా మన అభిప్రాయానికి పాఠకులు విలువివ్వాలంటే సదరు సినిమాలోని సన్నివేశాల్ని టూకీగా వారికి ప్రదర్శించి చూపాలి. లేదా కనీసం కొన్ని స్టిల్స్ అయినా టపా చెయ్యాలి. అదెలా చెయ్యాలో ఇక్కడ చర్చిస్తున్నాం.

ఇందుకు ముఖ్యంగా అవసరమైనది మన దగ్గర ఉన్న సి.డి./డి.వి.డి. ని మనకిష్టమైన విదంగా దృశ్యాలు దృశ్యాలుగా విడగొట్టుకుని భద్రపరచుకోగల వెసులుబాటు. దీనికోసం ప్రత్యేకవిధమైన సాఫ్టువేరు కావాలి. అదృష్టవశాత్తు Aone Software అనే సంస్థవారు అలాంటి సాఫ్టువేరుని చాలా చౌకగా కేవలం 25 అమెరికన్ డాలర్లకే అందిస్తున్నారు. దాని పేరు Ultra Video Splitter (ఇకముందు UVS అందాం). దాన్ని పరీక్షించగోరేవారు http://www.aone-soft.com/splitter.htm అనే లంకెలో దిగుమతి చేసుకోవచ్చు. దిగుమతి చేసుకున్నాక UVS తాలూకు ప్రతీకం (icon) ఒకటి మీ డెస్క్ టాప్ మీద కూర్చుంటుంది.

ఏవన్ వారి UVS సాఫ్టువేరుని ఉపయోగించే పద్ధతి :-

౧. మీరు దృశ్యాలుగా విడగొట్టదల్చుకున్న సినిమా తాలూకు సి.డి.ని మీ కంప్యూటర్ యొక్క సి.డి./డి.వి.డి. డ్రైవ్ లో చొప్పించండి.
౨. UVS icon మీద జమిలినొక్కండి. అప్పుడు Please Register Your Copy అని ఒక పెట్టె ప్రత్యక్షమౌతుంది. UVS ని కొనుక్కున్నవారి కంప్యూటర్లలో ఆ పెట్టె కనిపించదు. ఆ పెట్టెలో క్రింది భాగాన Try అని ఉన్న బొత్తాముపై నొక్కండి. UVS User Interface ప్రత్యక్షమౌతుంది. దాని ముందో వెనకో పైన చూపిన విధంగా మళ్ళీ ఇంకో విండో ప్రత్యక్షమౌతుంది. అందులో ఉన్న ఫైళ్ళ జాబితా కనిపిస్తుంది. వాటిల్లో MPEG అని ఉన్న ఫైలుని select చెయ్యండి.
౩. అప్పుడు పైన చూపిన విధంగా మళ్ళీ ఇంకో విండో ప్రత్యక్షమౌతుంది. అందులో ఉన్నదృశ్యాల జాబితా కనపిస్తుంది. వాటిల్లో ఎక్కువ మెగాబైట్లున్న దృశ్యాన్ని UVS లో ప్రదర్శనకు ఎంచుకోండి (click చెయ్యండి). అదే అసలు సినిమా.
౪. పైన కనిపిస్తున్న JPEG బొమ్మ UVS User Interface. ఇందులోని వివిధ భాగాల గుఱించి తెలుసుకుంటే దీన్ని ఇతోధికంగా ఉపయోగించుకోగలం. కొనుక్కున్న సాఫ్టువేరులో ఇంతకంటే ఎక్కువ సదుపాయాలుంటాయి.

(అ) పై బొమ్మలో కుడివైపున Help, Exit అనే icons కింద 1. Source File 2. Output Folder అని రెండు కాలమ్ లు ఉన్నాయి. వాటిని మీరు నింపనక్కఱలేదు. మీరు Open icon మీద నొక్కి ఎంచుకున్న ఫైళ్ళ యొక్క లొకేషనే దానంతటది Source File లోకి వచ్చేస్తుంది.

(ఆ) పై బొమ్మలో కింద ఎడంచేతివైపున తెల్లగా మీకొక Story bar కనిపిస్తుంది. సినిమా ఆడడం మొదలు కాగానే అదంతా నీలిరంగు బార్ గా మారిపోతుంది. ఆ బార్ కింద మీకు ఆఱు ప్రతీకాలు కనిపిస్తాయి. అవి-
1. Play 2. Pause 3. Stop = తెలిసినవే.

4. Mark Start Point = మీరు కత్తిరించదల్చుకున్న దృశ్యం దగ్గరికి సినిమా కథ వచ్చీ రాగానే మీరీ బొత్తాము మీద నొక్కెయ్యాలి (ఒక్కసారి మాత్రమే).

5. Mark End-point = మీరు కత్తిరించదల్చుకున్న దృశ్యం అయిపోవస్తూనే మీరీ బొత్తాము మీద నొక్కెయ్యాలి (ఒక్కసారి మాత్రమే).

6. Clear Mark = మీకు మీ దృశ్య ఎంపిక నచ్చక మళ్ళీ మొదటినుంచి మొదలుపెట్టదల్చుకుంటే దీనిమీద నొక్కాలి.

(ఇ) బొమ్మలో అన్నింటికంటే అట్టడుగున మీకొక Progress bar కనిపిస్తుంది. సి.డి. లోనుంచి విడగొట్టడానికి మనమెంచుకున్న దృశ్య ప్పని ఎంతవఱకు అయిందో అది ఆకుపచ్చ నిలువు చాఱలతో తెలియజేస్తుంది.

(ఈ) కొన్నిసార్లు నేరుగా UVS User Interface పైన ఎడంచేతివైపున గల Open అనే icon మీద నొక్కితే సి.డి./డి.వి.డి లోని ఫైళ్ళ వివరాలు గల విండో ప్రత్యక్షమౌతుంది. అక్కడ అన్నింటికంటే ఎక్కువ మెగాబైట్లు గల ఫైలుని select చేసుకుని Open అనాలి. అప్పుడు UVS Interface లో సినిమా ఆడడం మొదలౌతుంది.
౫. Mark End-point బొత్తాము మీద నొక్కాక Pause లేదా Stop బొత్తాము నొక్కాలి. అప్పుడు Story bar మీకు పై బొమ్మలో ఉన్న విధంగా కనిపిస్తుంది. బార్ లోని నీలిభాగం మీరు కత్తిరించిన దృశ్య పరిమాణానికి ప్రతిబింబం.
౬. అప్పుడు UVS User Interface పైభాగంలో ఉన్న ఈ Split బొత్తాము మీద నొక్కండి. UVS మీరు ఎంచుకున్న దృశ్యభాగాన్ని మెయిన్ సి.డి./డి.వి.డి నుంచి విడగొట్టడం మొదలుపెడుతుంది. ఆ పని తాలూకు ప్రగతి Interface కి అట్టడుగున ఉన్న progress bar లో ఈ క్రింది తెఱపట్టు (screen capture) మాదిరి సూచించబడుతుంది.
విడగొట్టడం పూర్తయ్యాక ఈ క్రింది సందేశపేటి (message box) వస్తుంది.
౭. విడగొట్టాక చెయ్యాల్సినది - విడగొట్టుకున్న దృశ్యానికొక ఫైలు పేరు కేటాయించి మన కంప్యూటర్ లో భద్రపఱచడం. అందుకోసం UVS interface లోని Output Folder కాలమ్ చివర్న గల icon మీద నొక్కాలి. అప్పుడు Choose Folder అంటూ ఒక విండో మీ కంప్యూటర్ లోని చిట్టాల్ని ఈ క్రిందివిధంగా ప్రదర్శిస్తుంది. ఇది వీడియోఫైలే అయినప్పటికీ అన్ని ఫైళ్ళలానే దీన్ని కూడా My Documents చిట్టాలో భద్రపఱచడం వల్ల ఎలాంటి నష్టమూ వాటిల్లదు. అలా select చేసి OK అనండి. భద్రపఱచడానికి మీరెంచుకున్న చిట్టా లొకేషను UVS యొక్క Output Folder లోకి వచ్చేస్తుంది.
౮. భద్రపఱిచాక సదరు వీడియోఫైలు యొక్క Thumbnail మీద కుడినొక్కు (right-click) నొక్కితే ఈ క్రింది పెట్టెలో మాదిరి దాని భోగట్టా యావత్తూ ప్రదర్శితమౌతుంది. ముఖ్యంగా అది ఎన్ని MB లు వచ్చిందో గమనించండి. ఆ Thumbnail మీదే జమిలి-నొక్కితే (ఉన్నవాళ్ళు) Windows Media Player లో మునుజూపు (Preview) చూసుకోవచ్చు :
౯. ఇప్పుడు మనం విడగొట్టిన సినిమా సన్నివేశాన్ని బ్లాగులోకి టపాచెయ్యడానికంతా సిద్ధమైనట్లే. చెయ్యాల్సిందల్లా మన బ్లాగు Compose Box లోకి వెళ్ళడం. అక్కడ Box పైన, చివర్నుంచి మూడో ప్రతీకమే (icon) వీడియో ఎగుమతుల కొఱకు ఉద్దేశించినట్టిది. (ఈ క్రింది బొమ్మ చూడండి). దాని మీద నొక్కండి.
౧౦. అప్పుడు ఈ క్రిందివిధంగా ఒక సంవాదపేటి వస్తుంది. ఇందులో Browse అనే బొత్తాము మీద నొక్కితే మీ కంప్యూటర్ లోని ఫైళ్ళు ప్రదర్శితమౌతాయి. వాటిల్లోంచి మీ అభిమాన సినీ-క్లిప్పింగుని ఎంచుకుని Video Title అనే వివరాన్ని నింపండి. దాని క్రింద I agree...etc. అని ఉన్నచోట నొక్కి UPLOAD VIDEO అనండి. మీ క్లిప్పింగు మీ బ్లాగులోకి ఎగుమతి కావడం మొదలవుతుంది. మీ వీడియో యొక్క పరిమాణాన్ని బట్టి ఆ ఎగుమతి ఎంత సమయమైనా తీసుకోవచ్చు కనుక వేచి చూడండి. తొందఱపడి వెబ్ పుట తిప్పెయ్యొద్దు. అంతగా అవసరమనుకుంటే ఇంకో విహారిణి (BROWSER) తెఱవండి. ఎగుమతయ్యాక కూడా మీ బ్లాగు Processing.... అంటూ తాత్సారం చేస్తుంది. భరించాలి. మీరు బ్లాగులో పెట్టదల్చుకున్న అన్నిదృశ్యాల ఎగుమతీ పూర్తయ్యాక వాటి మధ్యలో మీ పాఠ్యాన్ని (text) టైపు చెయ్యాలి.
౧౧. సాధారణంగా 5 నిమిషాల కంటే ఎక్కువ నిడివి గల దృశ్యాల జోలికి పోవద్దు. మీ జాలసంధానానికి ఎంత వేగం ఉన్నప్పటికీ బ్లాగర్ లోకి ఎగుమతి కావడానికి చాలాసేపు పట్టుతుంది. అదీగాక ఒకేసారి 100MB కంటే హెచ్చు పరిమాణం ఉన్నవీడియోలని బ్లాగర్ డాట్ కామ్ అనుమతించదు.

Sunday, December 30, 2007

"ఆతనికై చెమర్చినవి
అందరి నేత్రసరోజ యుగ్మముల్..."

తే.గీ.వచ్చులెమ్మిట్టి వర్షముల్ l వంద లిఁకను,
వచ్చునా పూర్వకాలిక l వైభవంబు ?
మౌన మహితమౌ శోక స l ముద్రమిచ్చి
చనియె నొక్క తేజస్సు ది l శాంతరములు.

PJR ! శ్రీ పబ్బతిరెడ్డి జనార్దనరెడ్డిగారు ! కాని లక్షలాది మందికి"జెన్నన్న"అంటేనే తెలుస్తుంది.తెలుగు రాజధానిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా 25సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎన్నికవుతూ వచ్చి నిరంతర ప్రజాసేవలో తనువూ మనసూ పూర్తిగా అలిసిపోయి హృదయకోశరుగ్మత ఒత్తిడిచేయగా ఈ నెల 28న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.ఆయన వయసు 59సంవత్సరాలు.ఆయనకు భార్యా కుమార్తెలూ ఒక కుమారుడూ ఉన్నారు.స్వతహాగా చిన్నప్పటినుండి దైవభక్తుడైన పి.జె.ఆర్ జూబిలీహిల్సు పెద్దమ్మవారి దేవాలయనిర్మాణంలో ప్రముఖపాత్ర వహించి దానికి మహారాజపోషకుడుగా మారారు.ఆయన స్వర్గస్థులైన సందర్భంగా ఆ రోజు ఆ దేవాలయాన్ని మూసి ఉంచారు.సొంత మనిషిగా భావించే ఆయనకు అంత్యక్రియలు జరిగే దాకా భోజనం చెయ్యడానికి పేదప్రజలకు మనస్కరించలేదు.చాయ్ నీళ్ళతోనే కాలక్షేపం చేశారు.కొందరు అయ్యప్ప దీక్షల నుంచి సైతం విరమించారు.ఆయన దివంగతికి సంతాపసూచకంగా ఆంధ్ర రాష్ట్రప్రభుత్వం నిన్నా మొన్నా కూడా సెలవు ప్రకటించింది.ఒక రాష్ట్రముఖ్యమంత్రికి జరిగేవిధంగా ఆయనకీరోజున అంత్యక్రియలు జరిగాయి.అదొక్కటే ఆయన అభిమానులకు మిగిలిన సాంత్వన.

ఆయన ఎవరికీ రాజకీయ వారసుడు కాడు.పాతబస్తీలో విద్యాభ్యాసం చేసి ఐ.టి.ఐ.కోర్సు పూర్తిచేసి చిన్నవయసులోనే ఎఱ్ఱగడ్డ (హైదరాబాదు)మీటర్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజరుగా చేరిన పి.జె.ఆర్‌కి జీవితంలో ఏదో సాధించాలనే కోరికలేమీ ఉండేవి కావు.కాని ఆయన ధైర్యమూ చొఱవా మాటనేర్పూ ఆయనే తమ నాయకుడని మిగతా కార్మికులంతా భావించడానికి దారితీశాయి.కాకతాళీయంగా ఆ ఫ్యాక్టరీకి వచ్చిన మాజీముఖ్యమంత్రి టి.అంజయ్య పి.జె.ఆర్.లోని నాయకత్వ లక్షణాల్ని గ్రహించి రాజకీయాల్లోకి రమ్మని కోరడమూ దరిమిలా పి.జె.ఆర్ తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగాను రాష్ట్ర కార్మిక శాఖామంత్రిగాను సేవలందించడమూ అందరికీ విదితమే.అప్పటి నుంచి ఓటమి ఎఱుగని పి.జె.ఆర్ 1999లో ఒక్కసారి తప్ప ఎప్పుడూ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగానే లబ్ధప్రతిష్ఠుడయ్యారు.చంద్రబాబునాయుడుగారి తొలి హయాంలో పి.జె.ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడుగా కేబినెట్ హోదా అనుభవించారు.తనని ఇంతవాణ్ణి చేసిన పార్టీ పట్ల ఒక మానవత్వం గల మనిషిగా ఆయన ఎప్పుడూ నెనరుతోనే వ్యవహరించారు.కాని పార్టీయే ఆయన్ని అర్థం చేసుకోలేదు.ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద శాసనసభా నియోజకవర్గం.అందులో పోటీ చేసి గెలవగలననే ధైర్యం పి.జె.ఆర్.కి తప్ప ఇంకెవరికీ లేదు.త్వరలో రద్దు కాబోతున్న ఖైరతాబాద్ నియోజకవర్గం ఆయనతోనే వెళ్ళిపోతోంది.

పైకొచ్చాక ప్రజల్ని ఠంచనుగా మర్చిపోయే నాయకులే నూటికి 99.99శాతం మంది ఉన్న మన రాజకీయ వినీలాకాశపు కారుచీకట్లో శ్రీ పి.జె.ఆర్ ఒక ప్రకాశమానమైన ధ్రువతార.అర్ధరాత్రి ఫోన్ చేసి"అన్నా"అంటే"ఇప్పుడే వస్తున్నా తమ్మీ"అంటూ ఆగమేఘాల మీద రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోయే పి.జె.ఆర్.లో ఒక ఎమ్మెల్యేని కాదు, దేవుణ్ణి చూసుకున్నారు సామాన్యప్రజలు.ఆయన మీటర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం నుంచి విరమించుకుని పూర్తికాలాన్ని రాజకీయాలకే వెచ్చించడం మొదలుపెట్టినా కార్మిక నాయకుడుగా మాత్రం జీవితాంతం కొనసాగారు.హైదరాబాదు చుట్టుపక్కల చాలా భారీ పరిశ్రమల కార్మిక సంఘాలకు ఆయనే అధ్యక్షుడు.ఆయన ఉంటేనే తమకు విజయం చేకూరుతుందని కార్మికుల ప్రగాఢ విశ్వాసం.కార్మికులు పారిశ్రామిక ప్రమాదాల్లో దెబ్బతిన్నా, ఏకంగా ప్రాణాలే కోల్పోయినా వారికి పి.జె.ఆర్ ఇప్పించిన నష్టపరిహారాలు లక్షల్లో ఉండేవి.అలా ఎవరూ ఇప్పించలేరు.

ఆయనకు అభిమానులే తప్ప రౌడీలూ గూండాలూ లేరు.ఆయనకు నేరచరిత్ర లేదు.శత్రువులు అంతకంటే లేరు.అయితే ఆయన యొక్క రక్షణ కోసం రౌడీయిజం చెయ్యడానికి చెఱసాలకు పోవడానికీ ఆయన కోసం ఏకంగా చచ్చిపోవడానికీ వాళ్ళు ఎంతమాత్రం వెనుకాడరు.ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఆయన వెలిగించిన దీపాలు దేదీప్యమానాలు కావు, జాజ్వల్యమానాలు.ఆ విలువేంటో ఆయనకు తెలుసు.వాళ్ళకు తెలుసు.

హిరణ్యకశిపుడి వద్ద ప్రహ్లాదుడున్నట్లుగా కొంపలు పీకే అలవాటున్న ఒకానొక పార్టీలో ఉంటూనే వేలాదిమందికి ఇళ్ళ స్థలాలిప్పించాడు.ఆ స్థలాల్ని తన పార్టీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకోబోతే ప్రాణాలకు తెగించి మరీ అడ్డుకున్నాడు.మంగళసూత్రాలు తెంచడం మాత్రమే తెలిసిన నాయకులకు భిన్నంగా వందలాదిమందికి మంగళసూత్రాలు అందించి ఎన్నో కాపురాల్ని తన స్వహస్తాలతో ఆశీర్వదించాడు.ప్రజా ఆస్తులు బడాబాబుల చేతుల్లో ఆక్రమణకు గురవుతున్న ప్రతి చోటా ప్రత్యక్షమై కబ్జాదారులకు సింహస్వప్నంగా మారాడు.

ఆయనకు తెలుగు ఉర్దూ భాషలే తెలుసు.ఇంగ్లీషు భాషలో పాండిత్యం లేదు.ప్రజల గుండెచప్పుడు వినడానికి సమస్యలకు సమకాలీన పరిష్కారాలు వెదకడానికీ ఆయన వరకు అదో అడ్డంకి కాలేదు.నగర నాగరీకుడైనప్పటికీ తన స్వచ్ఛమైన తెలంగాణా పలుకుబడితో పేదప్రజలతో మమేకమయ్యారు.అలాగని ఆయనలో నిజంగా ఎలాంటి ప్రాంతీయభావాలూ లేవు.ఆయన నియోజకవర్గమే ఒక మినీ ఇండియా.అందువల్ల తోటి తెలంగాణా నాయకులంతా జై తెలంగాణా అంటూంటే ఆయన కింకర్తవ్యతా సందిగ్ధానికి లోనయ్యారు.

ఆయనకు జీవితంలోని చేదు నిజాలే తప్ప కమ్యూనిజాలూ కేపిటలిజాలూ తెలియవు.పేదప్రజల కోసం ఆయన చేసిన దాంట్లో పదో వంతు కూడా ఏ కమ్యూనిస్టుపార్టీ చేసి ఉండదు.పశ్చిమ మండలంలో లక్షలాది మంది నివసించే కాలనీల్లో ఈనాడు ప్రజలు అనుభవిస్తున్న పౌరసౌకర్యాలు ఆయన కృషికి ఫలితమే.పేదల్ని వాడుకుని మర్చిపోవడం ఆయనకు తెలియని విద్య.ఎన్నికలున్నా లేకపోయినా ప్రతిపేదవాడికీ దగ్గరుండి మఱీ రేషన్‌కార్డు వగైరా ఇప్పించకుండా ఇంటికి వెళ్ళేవాడు కాడు.జనార్దనరెడ్డి పాన్‌షాపులకూ క్షౌరశాలలకూ కూడా రిబ్బన్ కటింగు చేస్తాడని సొంతపార్టీవాళ్ళే ఎగతాళి చేసినా ఆయన పట్టించుకునేవాడు కాడు.గుడిసెవాసులు శుభలేఖ ఇచ్చినా తీఱిక చేసుకుని వచ్చేవాడు.ఆయన్ని జనం గుర్తుపెట్టుకోవడం గొప్ప విషయం కాదు.ఆయనకు జనమంతా గుర్తుండేవారు.తాను ఏర్పఱచిన కాలనీల్లో ప్రతి మనిషినీ ఆయన సొంత అన్నయ్యలాగా పేరుపేరునా పిలిచేవాడు.ఆ నవ్వులో కృత్రిమత్వం లేదు.ఆ స్నేహంలో కల్మషం లేదు.ఆ సేవలో స్వార్థం లేదు."అన్నా ! జెన్నన్నా !"అంటూ ఆయన పార్థివశరీరం వెంటపడి ఏడుస్తూ పరుగులు తీసిన వేలాదిమంది స్త్రీలూ నిఱుపేదలూ ఆయన వ్యక్తిత్వానికి ఒక పార్శ్వం మాత్రమే.ఆయన కాలధర్మానికి ఆయన గుఱించి అంతబాగా తెలియనివాళ్ళు కూడా బాధపడ్డారంటే-ఒక పవిత్ర మానవాత్మ తేజస్సు వ్యాపించగల పరిధికి ఎల్లలు లేవేమో ననిపిస్తుంది.

తెలంగాణాకు చెందిన PJRకి ఆంధ్రకోస్తాలో కూడా లక్షలాదిమంది అభిమానులుండడం విశేషం.పశ్చిమ గోదావరి జిల్లావాసుల సమస్యల గుఱించి ఆయన అక్కడ రెండుమూడుసార్లు పర్యటించడం కూడా జరిగింది.

అట్టి గుణగంధమాదనం l బంతరించి
భావభూమి మిగిలె స్మృతి l పరిమళంబు.

చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి (టోపీ లేని బట్టతల వ్యక్తి)డాll వై.ఎస్.రాజశేఖరరెడ్డికి నమస్కారం చేస్తున్న శ్రీ పి.జనార్దనరెడ్డి

కానీ ఆయన పార్టీకి అధిష్ఠానానికీ కొఱకరాని కొయ్యగా తయారయ్యాడు.సొంత పార్టీలోనే అంటరానివాడుగా ముద్రపడ్డాడు.తనవల్ల పైకొచ్చిన నాయకుల చేతిలోనే వెలివెయ్యబడ్డాడు.తరతరాల కాంగ్రెస్ సంప్రదాయాలకు విరుద్ధంగా అశేషప్రజానీకంలో తనకంటూ సొంతబలం ఉండడమే ఆయనకు శాపంగా పరిణమించింది.ఎంత ప్రజాసేవ చేసినా అదంతా పార్టీకి ప్రభుత్వానికీ నచ్చకపోవడంతో అన్ని పదవులకూ దూరమయ్యాడు.సాక్షాత్తూ తన పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉండి తనమీద ఇన్‌కమ్‌టాక్సు దాడులు జరిపిస్తూంటే ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోయాడు.చివరి దశలో బాలయోగి స్టేడియమ్‌లో ఒక సాధారణ కాన్‌స్టేబుల్ కూడా తనని కుర్చిలోనుంచి లేవమని గద్దించే పరిస్థితి వస్తే లేచి కాసేపు అక్కడే నిలబడి ఇంక అక్కడ ఉండలేక మౌనంగా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.

ఒక మహనీయుడి అంతిమక్షణాల జ్ఞాపకాలతో కొత్తసంవత్సరాన్ని ప్రారంభించాల్సి రావడం నిజంగా విషాదభరితమే.కాని ఆయన జీవితం మనకు స్ఫూర్తిదాయకమైనప్పుడు అదే మిక్కిలి వరణీయం.ఆ మహా మహితాత్ముడికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి.

Sunday, November 25, 2007

మీ చంద్రుడెలా ఉన్నాడు ?

జనం జలంలో పడి చనిపోతున్న ప్రమాదాలు వాహన ప్రమాదాలతో సాటి వస్తాయి.అయితే అందరూ నీళ్ళలో పడి చనిపోరు.చంపడానికి కొందరు ప్రత్యేక వ్యక్తుల్ని నీళ్ళు ఎంచుకుంటాయి.జాతకంలో చంద్రుడు బాగాలేనివాళ్ళే ఆ ప్రత్యేకవ్యక్తులు.మనం అలాంటి ప్రత్యేకవ్యక్తులం కామని రూఢి చేసుకుంటేనే నీళ్ళ జోలికి పోవాలి.

చంద్రుడి వల్లనే ఎందుకు ? అంటే - చంద్రుడు జీవకారకుడూ, ఓషధీనాథుడూను.జీవకారకుడు కావడం చేత నీటిక్కూడా ఆయన అధిపతి.ఆయన వల్లనే పూర్ణిమా అమావాస్యల్లో సముద్రానికి ఆటుపోట్లు వస్తాయి.ఆ సమయంలో మనుషుల రక్తం కూడా ప్రకోపించి మనస్థితిలో మార్పులొస్తాయి.

చంద్రుడు బాగాలేకపోవడం అంటే ఏమిటి ? అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో చంద్రుడు లగ్నం నుంచి పన్నెండో ఇంట్లో ఉండడం, వృశ్చికరాశిలో ఉండడం, ఆయన ఉన్న రాశికి రెండు పక్కలా ఉన్న రాశుల్లో పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహు, కేతువులు కూర్చోవడం, లేదా చంద్రుడు తానున్న రాశిలో 26 డిగ్రీలు దాటేసి గాని, 8 డిగ్రీల లోపల గాని ఉండడం.వీటిల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా సరే, ఆ వ్యక్తి జలాశయాల జోలికి పోకుండా ఉండడం మంచిదని తెలుసుకోవాలి.

జాతకం లేకపోతే ఏం చెయ్యాలి ? చంద్రుడు బాగాలేనివాళ్ళ లక్షణాలు వాళ్ళ జీవనశైలిని బట్టి తెలుస్తూనే ఉంటాయి.వాళ్ళకు వ్యాపారం గిట్టదు.ఉద్యోగమే చేస్తామంటారు.కాని ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు.తల్లితో పడదు.పైకి ఏమీ అనకపోయినా తల్లి మాటలూ చేష్టలూ నచ్చవు.లేదా ఆమెకే వాళ్ళంటే గిట్టదు.లేదా అతను కడుపులో ఉండగా గర్భవిచ్ఛిత్తి చేసుకోవాలని అతని తల్లి తీవ్రంగా ఆలోచించి ఉంటుంది.వాళ్ళకు ముక్కు సమస్యలూ జలుబు సమస్యలూ ఎలర్జీలూ వదలకుండా పీడిస్తూ ఉంటాయి.పాల వాసనే నచ్చదు.తలస్నానం చేసినప్పుడు ఊపిరాడనట్లుగా అనుభూతిల్లుతారు.క్షణానికో చిత్తంగా చంచలంగా ఉంటారు.దేని మీదా దృఢమైన అభిప్రాయాలు ఉండవు.ఉన్నా చాలా త్వరగా మారిపోతాయి.ఎలాంటి మానసిక ఒత్తిడికీ తట్టుకోలేరు.

జలగండం సాధారణంగా మాతృద్రోహం వల్లా మాతృశాపం వల్లా ఏర్పడే తీవ్రాతితీవ్రమైన జాతక లక్షణం.ఇవన్నీ పూర్వజన్మకర్మఫలమే కనుక ఇప్పుడు సత్కర్మ చేసుకుంటే దాని దుష్ఫలితాల్ని అదుపులో పెట్టవచ్చు.జగన్మాత అయిన దుర్గాదేవిని ఆరాధిస్తే ఆవిడ మాతృశాపాల్ని అడ్డుకుంటుంది.లేకపోతే తల్లిలా ప్రాణం పొయ్యాల్సిన నీరే మనిషి ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తుంది.

Thursday, September 27, 2007

కాలమ్ము మారిందోయ్ ! దేశమ్ము మారిందోయ్ !

మన హైదరాబాదు - మరో ముఖం
ఇది వసీమ్ అక్రమ్ అనే పాకిస్తానీ తీసిన దృశ్యకం (video)

Thursday, September 13, 2007

Wednesday, September 12, 2007

Saturday, September 01, 2007

Thus spake the Lord....(always through humans)

ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ: - మా యింటి దగ్గర ఒకామె ఈ శ్రావణ శుక్రవారానికి వైభవలక్ష్మీవ్రతం చేసుకుంది.చాలామంది ఇరుగుపొరుగు ఇల్లాళ్ళని ఆహ్వానించి వాళ్ళకు భోజనాలూ వాయనాలూ ఇచ్చింది.వారిలో ఒకామె పసుపూ కుంకుమ మాత్రం తీసుకుని ఱవికెల గుడ్డ నాకొద్దని పక్కన పడేసింది.వ్రతం చేసుకుంటున్నావిడ మొహంలో హఠాత్తుగా ఉగ్రత్వం ప్రవేశించింది.చూపుల్లో తీక్ష్ణత్వం చోటుచేసుకుంది.గొంతు కూడా మారిపోయింది."ఏమనుకుంటున్నావ్ ? ఇక్కడికొచ్చాక ఏమిస్తే అది తీసుకోవాల్సిందే !"అని గర్జించింది.అవతలి ఇల్లాలు భయంతో వణికిపోయి నమస్కారం చేసి క్షమాపణ చెప్పుకుని ఆ ఱవికెల గుడ్డ కళ్ళకద్దుకుని తీసుకుంది.ఆ తరువాత వ్రతం చేసుకుంటున్నావిడ ఇహలోకంలోకి వచ్చాక "ఇందాక మీరు అలా అన్నా"రని చుట్టుపక్కలవాళ్ళు చెబితే ఆశ్చర్యపోయి తనకేమీ గుర్తులేదంది.

Tuesday, September 12, 2006

ఆత డనేక యుద్ధముల ఆరియు తేరిన వృద్ధమూర్తి....
సైనిక దుస్తుల్లో ఉన్న ఈ కుర్రవాడిలో సైనిక కాఠిన్యం మాత్రం కానరావట్లేదు. కదూ ? ఇంతకీ ఈయన ఎవరో తెలుసా ?

Posted by Picasa
జాతిపిత మోహన్‌దాస్‌కరంచంద్‌గాంధి
(అప్పటికింకా మహాత్ముడు కాలేదు)
1899 లో బోయర్ యుద్ధం (దక్షిణాఫ్రికా)లో పోరాడి బ్రిటీషు సామ్రాజ్యానికి సహకారమందించిన నాటి ఫోటో ఇది.