Showing posts with label నా అనుకోలు (assumption). Show all posts
Showing posts with label నా అనుకోలు (assumption). Show all posts

Friday, November 16, 2007

క్రీ.శ. 2014 తరువాత ప్రత్యేక రాష్ట్రవాదాలు శాశ్వతంగా కనుమరుగవుతాయి.

Saturday, October 06, 2007

రహస్యమంత్రం (Unlearn...Unlearn...Unlearn...)

చాలా కాలం క్రితం ఒక పిచ్చిపిల్ల ఉండేది.ఆమె తన మొగుడే ప్రపంచంలో అందరికన్నా చాలా గొప్పవాడని నమ్ముతూండేది. ఆమెనొక దుర్మార్గుడు ఎత్తుకెళ్ళాడు. వాడు నిజానికి అప్పటి ప్రపంచం దృష్టిలో ఆమె మొగుడికన్నా అన్ని విధాలా గొప్పవాడు.ఆ విషయం ఆమెకి తెలియజెప్పాలని మనుషుల్ని కూడా ఏర్పాటుచేశాడు.వాళ్ళు అతని గొప్పతనం గురించి చెబుతూ ఆమె బుఱ్ఱ తినేశారు.కాని ఆ పిచ్చిపిల్ల తన మొగుడే అందరి కన్నా గొప్పవాడని బల్ల గుద్ది వాదించింది.తరువాత జరిగిన యుద్ధంలో సమకూడిన విజయం వల్ల ఆమె మొగుడు నిజంగానే గొప్పవాడయ్యాడు.అందరూ అతన్ని దేవుడని కొలవడం మొదలుపెట్టారు.ఆమే గనక మనసు మార్చుకుని ఉంటే అతన్నెవరూ దేవుడుగా కొల్చేవారు కారు.

చాలా సంవత్సరాల క్రితం గుజరాతులో ఒక పిచ్చి పిల్లాడు ఉండేవాడు.వాడు శ్రవణకుమారుడి కథ సత్యహరిశ్చంద్రుడి కథ నాటకాలుగా చూసి తానూ అలాగే అవ్వాలని తహతహలాడాడు. ఆ కథలన్నీ నిజమని నమ్మాడు.ఆ ఆదర్శాలు నిజమని నమ్మాడు. ఇప్పుడు ఆ పిల్లాడి పుట్టినరోజు వందలాది దేశాలకు పండుగగా మారింది.అతని శత్రువులు అతనికి పాదాభివందనం చేస్తున్నారు.అతని పేరిట దేశాధినేతలే ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు.అతను ఏ మతాలూ స్థాపించలేదు.ఏ మతాన్నీ సంస్కరించలేదు.ఉన్న మతాన్ని చేతనయినంత ఆచరించి చూపించాడంతే ! అతని తరఫున మాట్లాడ్డానికీ అతని గురించి ప్రచారం చెయ్యడానికీ ఎవరూ లేరు.అయినా అతను ఈరోజు అందరికీ తెలుసు.

పిచ్చితనం గెలిచింది.అమాయకత్వం గెలిచింది. ప్రేమ గెలిచింది.అభిమానం గెలిచింది.

స్వార్థం ఓడిపోయింది. అతితెలివి ఓడిపోయింది. ద్వేషం ఓడిపోయింది.

ప్రపంచంలో అన్ని గొప్పతనాల వెనుకా ఉండేది అమాయకత్వమే. తెలివితేటలు కాదు. ఇది దేవుడి శాసనం . ఇది జీవిత వాస్తవం.

Tuesday, September 18, 2007

ఈ కుళ్ళు మనందరి సృష్టి

చెంత సెల్లు -సొంత యిల్లు
వింత కారు - కొంత క్యాషు

ఇవే మన ఆధునిక చతుర్విధ పురుషార్థాలు.నిలబడి నీళ్ళు తాగడమనే తత్వశాస్త్రాన్ని నమ్మడం ఎప్పుడో మానేశాం.పరుగెత్తి పాలు తాగడమే ఈనాటి తాజా పోకడ.అదేమంటే-"ఇండియాలో నూటికి 60 శాతం మంది యువకులే కాబట్టి ఈ మాత్రం దూకుడు అనివార్య"మని సెలవిస్తున్నారు.బానేవుంది.కాని ఎంతగా యువకులైతే అంతగా ఆశపోతుతనం కూడా ఉంటుంది.అదీగాక ఇదే యువజనాభా 30-35 ఏళ్ళ తరువాత ముసలి జనాభా అవుతుంది.అప్పుడు"మన అన్ని దుర్దశలకీ కారణం మనలో 60 శాతం మంది ఏ పనీ చెయ్యలేని ముసలివాళ్ళుండడం"అని కొత్త పల్లవి ఎత్తుకుంటారు.కలియుగంలో ధర్మమనే ఎద్దు సత్యమనే ఒంటికాలి మీద నడుస్తుందని పుస్తకాల్లో రాశారు.నాకయితే ఆ వొంటికాలు కూడా ఎక్కడా కనిపించడంలేదు.అన్నిచోట్లా మాటయిచ్చి తప్పడమే కనిపిస్తోంది.అలా తప్పలేనివాడు వెధవన్నర వెధవలా చూడబడ్డం కూడా కనిపిస్తోంది."తాడేపల్లిగారూ ! అద్దెకి ఇల్లు తీసుకుంటున్నాం, కొంచెం వాస్తు చూసిపెట్టండి"అని అడిగితే "సరే"నని వెళ్ళాను.మేము వెళ్ళేసరికే ఆ యిల్లు ఇంకొకరికి అద్దెకిచ్చేశారని తెలిసింది.అవతలి వ్యక్తి రెండువేలు అదనంగా ఇస్తానన్నాడట.నా మిత్రుడిచ్చిన సంచకరాన్ని (advance) తిరిగిచ్చేశాడు సదరు యజమాని.పొద్దున మాట్లాడుకుని ఖాయం చేసుకున్న యిల్లు సాయంకాలానికల్లా ఇంకొకరికి దఖలు పడిందంటే ఏమనాలి ?

సొంత ఫ్లాట్‌ల దగ్గరా ఇదే తంతు.గడిచిన ఆర్థిక సంవత్సరంలో కట్టుబడిదార్లు (builders) చాలామందికి ఇలాగే సంచకరాలు (advances) తిరిగిచ్చేశారు.అదేమంటే "ఈ మధ్యలో ధరలు పెరిగాయి కాబట్టి పెరిగిన తేడా కట్టండి, లేకపోతే మీ అడ్వాన్సు మీరు తీసుకుని వెళ్ళిపోండి"అని తెగేసి చెప్పారు.మరి సంచకరం చెల్లించినప్పుడు రాసుకున్న ఒప్పందానికి ఏమీ విలువ లేదా ? మనిషి మాట్లాడే మాటలకే కాక రాసే రాతలక్కూడా విలువ లేని రోజులొస్తే ఇహ బతికేదెలా ? "బ్రహ్మ సత్యమ్ - జగత్ మిథ్యా" అని చిన్నప్పటినుంచి చదువుతూనే ఉన్నాను.అప్పుడేమీ నమ్మకం కలిగింది కాదు.ఇప్పుడే కొంచెం కొంచెంగా నమ్మకం కలుగుతోంది.

"ధర్మం నాలుగు పాదాలా నడిచిన రోజుల్లో" జనం లంచం తీసుకుని పనిచేసి పెట్టేవారు.ఈ పిదపకాలంలో లంచమిచ్చినా పని జరగడంలేదు.వ్యక్తిగత జీవితాల్లో మనమెప్పుడూ రుచిచూడని నీతులూ నిజాయితీలూ ఎవడో పాటిస్తున్నాడంటే - లేదా ఎవడో ఎప్పుడో ఒకనాడు పాటించాడంటే నమ్మడం కూడా కష్టమౌతుంది."నేను మంచిగా ఉన్నా నన్ను ఎవడూ నమ్మకపోతే ఈ నీతి నిజాయితీ నాకెందు"కని మంచివాడు కూడా చెడ్డవాడుగా మారిపోతాడు.

కాకినాడలో ఒక పేరుమోసిన విద్యాసంస్థ ప్రశ్నపత్రాల్ని తమ విద్యార్థులకి లోపాయికారీగా వెల్లడించడంలాంటి వెధవ పనులు చేసి పట్టుబడింది.ఇంక ఆ సంస్థ పనైపోయిందనుకున్నారు, దూరంనుంచి గమనించేవాళ్ళందరూ ! కాని అనూహ్యంగా అదే సంవత్సరం ఆ సంస్థ అడ్మిషన్లు మూణ్ణాలుగు రెట్లు పెరిగాయి."అలాంటి చోట మీ అబ్బాయిని/అమ్మాయిని చేరుస్తున్నారెందుకు?"అని తల్లిదండ్రుల్ని అడిగితే "వాళ్ళే నయం బాబూ ! పేపర్ల లీకో ఏదో ఒకటి చేసి పాస్ చేయిస్తారు"అని సమాధానం చెప్పారు.వెధవపన్లు చెయ్యగలిగినవాడి చుట్టూ చేరుతున్నారు జనం,"మహాప్రభో ! నువ్వే ది"క్కంటూ ! ఇహ మనం మన నాయకుల్ని ఏ మొహం పెట్టుకుని విమర్శించగలం ? వాళ్ళు మనలోంచే వచ్చారు.కాకపోతే మనకంటే రెండాకులు ఎక్కువ చదివారంతే !

లోక్‌సత్తాలాంటి పార్టీ అధికారంలోకొస్తే ఇవన్నీ చక్కబడతాయని భావిస్తున్నారు కొందరు.అసలు మొదట్లో అన్నీ లోక్‌సత్తాలే, కాంగ్రెస్‌తో సహా ! కాలక్రమంలో అక్రమ సంపాదనావకాశాల రుచి మరిగిన తరువాత నీతులూ ఆదర్శాలూ విషప్రాయంగా గోచరిస్తాయి.మార్పు వ్యవస్థల్లో కాదు, నాయకుల్లో కాదు-ముందు మనలో రావాలి.ముందు మన వ్యక్తిగత సంస్కారాలూ స్వభావాలూ మారాలి.

కలియుగాంతం వస్తేనో క్రీస్తు రెండోసారి వస్తేనో అంతా చక్కబడుతుందని భావించే ఆధ్యాత్మికవాదులున్నారు.అంతా నాశనమైపోయాక ఇక చెడిపోవడానికంటూ ఏమీ ఉండదు కాబట్టి ఆ మాటా కొంతవరకు నిజమే ! నాకు మొదట్నుంచి ఇంకో అనుమానమేంటంటే-కృతయుగాలూ కలియుగాలూ వగైరా భారత ఉపఖండానికి తప్ప మఱింకే ప్రాంతానికీ వర్తించవని ! నిజానికి చాలా దేశాల్లో సత్యయుగమే నడుస్తోంది (మనతో పోలిస్తే).కాబట్టి ఆ ప్రాతిపదిక మీద జననష్టాలు జరగవనుకుంటా. కాని మనం మారితేనే యుగం మారుతుంది.

Sunday, September 09, 2007


రాజకీయాల్లోకి నారాయణ ?


నెల్లూరు నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపక అధినేత డాక్టర్ శ్రీ పి.నారాయణ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికల్లా రాజకీయ రంగప్రవేశం చెయ్యడానికి సన్నద్ధమవుతున్నట్లు ఇంకా ధ్రువీకరించబడని అనాధికారిక భోగట్టా తెలియజేస్తోంది.ఇటీవలి దాకా శ్రీ చైతన్య (హైదరాబాద్)ని విజయపథంలో నడిపించి తరువాత శ్రీ వైష్ణవీ కళాశాలల్ని స్థాపించిన శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావుగారికి తన సంస్థల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించబోతున్నారని కూడా తెలుస్తోంది.అయితే అలాంటి గాలివార్తల మీద ఇక్కడెందుకు రాయడం ? అంటే, అలాంటిది ఒకందుకు శుభపరిణామమేనని చెప్పడానికే.

ప్రస్తుతం కాంగ్రెస్ ద్వారా అధికారంలోకొచ్చిన అనాగరికుల/అప్రాచ్యుల స్థానే విద్యాధికులూ మేధావులూ వివిధ రంగాల సాధక బాధకాల గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్నవారూ స్వయంగా మహాసంస్థల్ని నడిపేవారూ పగ్గాలు చేపట్టితే బావుంటుంది.అధికారంలోకొచ్చాక సంపాదించుకునేవారు మనకొద్దు.బాగా సంపాదించుకుని అధికారాన్ని ఆశించేవారిని నేను అభిమతిస్తాను.

డాక్టర్ శ్రీ పి.నారాయణకు ప్రజల్లో మంచి మూర్తిమత్త్వం (image) ఉంది.జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చిన మహామనీషి, స్వయంగా అధ్యాపకుడూను.తన అదృష్టాన్ని రూపాయల్లోనే వెతుక్కున్నవాడాయన.ముఖ్యంగా అధ్యాపకుల్ని పాఠాలు చెప్పే యంత్రాలుగా కాక మనుషులుగా చూడ్డం చేతనైనవాడాయన.ఆయన గనక విద్యారంగంలో లేకపోతే ఈ రాష్ట్రంలో ఇతర కార్పొరేట్ సంస్థలు అధ్యాపకుల్ని ఏ విధంగా దోచుకు తినేసేవో ఊహకు అందదు.ఆయనతో పోటీపడ్డం కోసం అవి కూడా ప్రస్తుతం అధ్యాపకుల పట్ల మానవత్వాన్ని నటిస్తున్నాయి.అలాంటి వ్యక్తిని విద్యామంత్రిలాంటి ఒక ప్రముఖ పదవిలో చూడాలని ఎంతోమంది కోరుకుంటున్నారు.

శ్రీ నారాయణ ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది.ఏమైనా సింహపురికి మకుటం లేని మహారాజుల్లా వెలుగొందుతున్న "ఆనం" కుటుంబం ఇకముందు పోటీని ఎదుర్కోక తప్పదా ?

అంతా ఆ గొలగమూడి వెంకయ్యస్వామివారి దయ.