Showing posts with label తెలుగు సినిమా. Show all posts
Showing posts with label తెలుగు సినిమా. Show all posts

Saturday, November 10, 2007

"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-7

ఎవరూ తమని తామే సంస్కరించుకోరు, బాగా గడుస్తున్నంతకాలం.సినిమావాళ్ళు ఇందుకు మినహాయింపు కారు.వాళ్ళని ఊరపందుల్లా మేపిన పాపం మనది.వాళ్ళ వెఱ్ఱిమొఱ్ఱి వేషాలకీ పులకించిపోయిన తప్పు మనది.వాళ్ళ అనాగరికతకు పారవశ్యం చెందిన నేరం మనది.వాళ్ళు రోజురోజుకీ దిగజారిపోతూంటే పూర్వంలాగానే ఎగబడి టిక్కెట్లు కొనుక్కుని వాళ్ళు మన మొహం మీద చీదిపారేసిన ప్రతిచెత్తనీ పొలోమని విజయవంతం చేసిన చరిత్ర మనది.మనం యౌవనపు కొసవెఱ్ఱిని అధిగమించి ముప్ఫయ్యో నలభయ్యో ఏళ్ళొచ్చాక కళ్ళు తెఱిచి చూస్తాం.అయినా మనం చెయ్యగలదేమీ ఉండదు.మన వేలంవెఱ్ఱినే మన తరువాతి తరం అవలంబిస్తూంటే "ఏదో పాపం ! కుఱ్ఱాళ్ళు గదా !"అనుకుని క్షమించేస్తాం.అలా ఈ దిగజారుడు అప్రతిహతంగా కొనసాగుతూంటుంది.

మనం ప్రేక్షకులుగా ఉండడానికి నిశ్చయించుకున్నాం.చివరికి మౌనప్రేక్షకులుగా మిగిలిపోయాం.నిజంగా మన చేతుల్లో ఏమీ లేదా ?

మనం చెయ్యగలది చాలానే ఉంది.కాని అలా చెయ్యడానికి ముందు మనం కళ్ళు తెఱుచుకుని గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

1. సినిమా, కళే గాని వ్యాపారం కాదు. కొందరు దాన్ని వ్యాపారంగా మార్చారు.మఱికొందరు ఇంకొంచెం ముందుకు పోయి దానిలో తమ భావి రాజకీయజీవితం, రియల్ ఎస్టేట్ లాంటి కళావిరుద్ధ లక్ష్యాలకు బీజాల్ని దర్శిస్తున్నారు.వెరసి సినిమా అనేది జాతి మీద పన్నిన కుట్రలా తయారయింది.మనం దీని కళాప్రతిపత్తిని తిరిగి మునుపటిలాగానే పునరుద్ధరించగలమని దృఢంగా నమ్మడం.

2. ఏ కళయినా ఒక విధమైన స్వచ్ఛంద ప్రజాసేవ మాత్రమే.అది ఆదాయాన్ని సమకూర్చిపెట్టడం యాదృచ్ఛికం.నిజమైన కళాభిమాని కళాసృష్టి చేసేటప్పుడు దాన్నుంచి ఆదాయాన్ని ఆశించకూడదు.బ్లాగుల నుంచి మనం ఏమి ఆదాయాన్ని ఆశిస్తున్నాం ?

3. మనక్కావాల్సిన వినోదాన్ని సినిమా పెద్దలు అందించలేకపోతున్నప్పుడు మన వినోదాన్ని తయారు చేసుకునే హక్కూ శక్తీ మనకు ఉన్నాయని నమ్మడం.ఇందుకోసం ప్రేక్షకుడే సినిమాని నిర్మించాలి.అది అతని కోసమూ అతనిలాంటివాళ్ళ కోసమూ.అంతేగాని రాష్ట్రమంతటా 250 ప్రింట్లతో విడుదల చేసి అమ్ముకుని లాభాలు గడించడానిక్కాదు.
4. ఈరోజు ఎన్నో విషయాలు వికేంద్రీకరణకు లోనవుతున్నాయి.బొంబాయి ఇంకెంతమాత్రమూ భారతదేశానికి ఏకైక ఆర్థిక రాజధాని కాదు.అలాగే హైదరాబాదొక్కటే తెలుగు చిత్రపరిశ్రమకు కేంద్రం కావాల్సిన అవసరం కూడా లేదు.జిల్లాల్లో కూడా కవులున్నారు.రచయితలున్నారు.నటులున్నారు.నాట్యనిష్ణాతులున్నారు.గాయకులున్నారు. సంగీత విద్వాంసులున్నారు.నిజానికి వాళ్ళు హైదరాబాదువాళ్ళ కంటే ఎక్కువ ప్రతిభావంతులని నా నమ్మకం.వాళ్ళంతా మనకప్పుడప్పుడు ప్రైవేటు టీవీ ఛానళ్ళలో టూకీగా దర్శనమిచ్చి కనుమఱుగవుతూంటారు.వాళ్ళని సెబాస్ అని మెచ్చుకునేవాళ్ళెవరూ వాళ్ళకు అవకాశమివ్వరు.తెలుగు సినిమాని ప్రజలే తమ చేతుల్లోకి తీసుకుని "ప్రజాసినిమా"ని నిర్మించుకున్ననాడు మన జాతికంతా కలిపి ఏకైక ఈ మెగాస్టార్లూ ఏకైక దర్శకరత్నలూ లాంటి కరువుకాటకాల నుంచి విముక్తి పొందుతాం.

5. ఒకప్పుడు ధనికవర్గాలకే పరిమితమనుకున్నవెన్నో ఈనాడు మధ్యతరగతిక్కూడా అందుబాటులోకివచ్చినప్పుడు సినిమా నిర్మాణం ఎందుకు రాదు ? ఒక నలభయ్యేళ్ళ క్రితం బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకునే కెమేరా కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాదు.ఈరోజు క్యాంకార్డర్లూ వీడియో కెమేరాలూ మధ్యతరగతికి అందుబాటులోకి వచ్చాయి.సినిమా తీసిన తరువాత ధ్వనినీ దృశ్యాన్నీ కూడా అద్భుతమైన నాణ్యతతో ఎడిట్ చేసుకోవడానికి Pinnacle వంటి ఉచిత మృదుసామాన్లు (సాఫ్ట్‌వేర్లు) అందుబాటులో ఉన్నాయి. గ్రాఫిక్స్ సహకారమందించడానికి యానిమేషన్ నిపుణులు విరివిగా లభిస్తున్నారు.మఱింక అడ్డేమిటి ?

6. ఒకప్పుడు దసరాకీ వినాయక చవితికీ కాలనీలో ఉన్న ఔత్సాహిక కళాకారులంతా కలిసి స్టేజి మీద నాటకాలాడినట్లే ఇప్పుడు మన సొంత సినిమాలో నటించి దాన్ని కాలనీలో ప్రదర్శించే అవకాశముంది.మనమా పని ఎందుకు చెయ్యడంలేదు ? ఈ సినిమావాళ్ళ నిరంకుశత్వం నుంచి బయటపడాలనే కోరిక మనలో ఎందుకు కలగడంలేదు ? మనకు లభిస్తున్నదంతా నెంబర్ వన్ సరుకని మనం భ్రమించడం చేతనా ? లేక మనలో ఆత్మవిశ్వాసం కొఱవడిందా ?

7. మనం ఊరూరా వందలాది చిత్ర పోషక సంఘాలు (Film Patrons' Clubs) గా ఏర్పడాలి.మనమందరమూ వాటిల్లో సభ్యులుగా చేరి వార్షిక సభ్యత్వ రుసుము చెల్లించాలి.ఒకరు తీసిన సినిమా మఱొకరు తమ ఊళ్ళో తమ సంఘపు కార్యాలయంలోనే ప్రదర్శించేలా నోటిమాట ఒప్పందం చేసుకోవాలి.ఇందులో అంతా స్వచ్ఛందతే తప్ప ఇసుమంతైనా వ్యాపారాలూ సంతకాలూ లాభనష్టాలూ ఉండకూడదు.అప్పుడు మాస్ పేరుతో మన నోటిముందు "నాణ్యమైన వినోదపు కూడు" తీసేసిన డబ్బున్న అలగా మనుషులకు బుద్ధి చెప్పినట్లవుతుంది.

ఏదేమైనా మన సినిమా కళ యొక్క మౌలికతనీ నిరాడంబరతనీ అమాయకత్వాన్ని అందాల్నీ స్వచ్ఛతనీ స్వచ్ఛందతనీ ఔత్సాహికతనీ పునరుద్ధరించి దాన్ని వ్యాపారమని ప్రచారం చేసేవాళ్ళ నోళ్ళు మూయించాలి. ముందో వెనకో ఇది జరుగుతుంది. (ఈ వ్యాసపరంపర సమాప్తం)

Friday, November 09, 2007

"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-6

ఈరోజు తెలుగు సినిమా తియ్యడమంటే కోట్లలో వ్యవహారం.మీ దగ్గర అధమం నాలుగైదు కోట్లయినా నల్లడబ్బు లేకపోతే దిగకూడదు.ఆ మాత్రమైనా మీ దగ్గర లేకపోతే కొదవపడ్డప్పుడు సర్దుబాటు చెయ్యడానికి ఫైనాన్షియర్లు కూడా ముందుకు రారు.ఇంత డబ్బెందుకయ్యా ? అంటే చెప్పడానికి చాలా ఉంది.దర్శకుడుగారి పారితోషికం, హీరోగారి పారితోషికం, ఆయనకు సమస్కంధుడైన విలన్‌ని పెడితే ఆయనకిచ్చేది, బొంబాయి భామల్ని తెస్తే వాళ్ళకిచ్చేది వెరసి 60-70శాతం పెట్టుబడి, పారితోషికాలకే పోతుంది.ఎక్కువ ప్రింట్లు తీసి ఎక్కువ కేంద్రాల్లో విడుదల చెయ్యకపోతే బయ్యర్లకు "మినిమమ్ గ్యారంటీ" ఉండదని భయం.కాబట్టి, ఇంగ్లీషులో చెప్పాలంటే Stakes are very very high.ఎక్కడా "సరే ! పోనీలే !"అని ఛాన్సు తీసుకోవడానికి లేదు.ఆ రకంగా సినిమా తన మౌలికమైన కళాస్వభావాన్ని సంపూర్ణంగా కోల్పోయింది.

మఱోపక్క తెలుగు సినిమా వ్యాపారంలో ప్రజాస్వామికతత్త్వం కొఱవడింది.ఇప్పటికే పాదుకుపోయినవాళ్ళ కొడుకులు తిష్ఠవేసి కొత్తవాళ్ళు రాకుండా చూసుకుంటున్నారనేది మనకందరికీ తెలుసు.దానికి తోడు సినిమాల పంపిణీ వ్యవహారాలు ఒక డజను మందికి పరిమితమైపోయాయి.వాళ్ళని చూస్తే అందరికీ భయమే.వాళ్ళు పంపిణీ వ్యాపారమే కాక ఇంకా చాలా వ్యాపారాలు కూడా ఏకకాలంలో చేస్తున్నారు.సినిమా షూటింగు మొదలుకాకముందే ఎవరు ఏ పాత్ర ధరించాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు.ఎందుకంటే ఎవరు పంపిణీ చెయ్యాలో ముందే నిర్ణయమైపోయి ఉంటుంది కనుక.ఆ పంపిణీ చేసేవాడికి నష్టం రాకూడదు కనుక.ఈ మర్యాదలు పాటించని నిర్మాతలూ దర్శకులూ తరువాత బాధపడాల్సి వస్తుంది.అందుకని సినిమా షూటింగు మొదలయ్యే రోజే పంపిణీదార్లని పిలిచి స్విచ్చాన్ చేయిస్తూండడం కూడా కద్దు.ఇదంతా ఒక పెద్ద సంక్లిష్టమైన నెట్‌వర్కుగా, మహాబలీయమైన మాఫియాగా ఎదిగిపోయింది.స్వయంగా లోకకంటకులూ నిరంకుశులూ పచ్చి స్వార్థపరులూ ఐన సినిమావాళ్ళు వీడియో పైరసీ అంటూ ఏడుస్తూంటారు.నిర్మాత నష్టపోతే తెలుగు సినిమానే ఉండదని ఉద్ఘోషిస్తూంటారు.ఏ కారణం చేతనో మనవాళ్ళకు సినిమావాళ్ళంటే యమజాలి.అందుకని మన బుద్ధిలేని మధ్యతరగతి పాత్రికేయులు కూడా వాళ్ళతో గొంతు కలిపి ఈ విషయాల మీద ఆఱున్నొక్కరాగం ఆలపిస్తూ ఉంటారు.

సినిమావాళ్ళ మీద జాలిపడ్డానికేముంది ? వాళ్ళకు "MAA"(Movie Artistes' Association) అని దిష్టితీసిన ఎండు మిఱపకాయలా ధ్వనించే ఒక దిక్కుమాలిన సంఘం ఉంది.సదరు పేరుని ఒకసారి గమనించండి.అందులో ఏ విధమైన సెంటిమెంటూ లేదు.Movie artistes అంటే ఎవరు ? ఏ భాషవాళ్ళు ? ఏ దేశానికి చెందినవాళ్ళు ? ఏ రాష్ట్రానికి చెందినవాళ్ళు ? ఎవరి ప్రయోజనాలు కాపాడ్డానికి ఇలాంటి పేరు పెట్టుకున్నారు ? అవన్నీ మనం అడక్కూడదు.అమాయకంగా వాళ్ళని చూసి నిలువునా పులకించిపోవాలంతే ! ఆకాశరామన్నలాంటి ఈ పేరు ఏ ఇతరభాషల సినిమా సంఘాలకీ లేకపోవడం గమనార్హం. సదరు సంఘం వల్ల ఈ భూప్రపంచంలో ఎవరికీ ఇసుమంత ప్రయోజనం లేదు, దాని పేరు లాగానే ! అయితే శేఖర్‌దాదా అధికారంలోకొచ్చిన కొత్తల్లో వీళ్ళంతా వెళ్ళి ఆయన్ని కలుసుకుని "మా MAA కి సొంత కార్యాలయం కట్టుకునే నిమిత్తం జూబిలీ కొండల్లో గాని బంజారా గుట్టల్లో గాని ఒకటి-రెండెకరాల స్థలం ఇప్పించవలసిం"దని వేడుకున్నారు."అందరికీ స్థలాలిచ్చే మురళీమోహన్ (పాత నటుడు) ఉండగా ప్రభుత్వాన్ని అడుగుతున్నారే"మని చుఱక అంటించాడు శేఖర్‌దాదా.మొత్తం మీద స్థలం ఇవ్వలేదు.

అడిగినవాళ్ళు సామాన్యులు కారు.కొమ్ములు తిరిగిన మఱియు తిరుగుతున్న, కోట్లకు పడగలెత్తిన మహానటులూ దర్శకులూ పంపిణీదారులు.ఏంటో పాపం ! వీళ్ళందరూ కలిసి చందాలేసుకుంటే MAA కి ఎకరం స్థలం రాదా ? కాని ప్రతివాడికీ ప్రభుత్వం (అంటే ప్రజలు) నెత్తిమీద చెయ్యి పెట్టి బ్రతుకుదామనే సదాశయమే మఱి !

ఇలాంటివాళ్ళున్న తెలుగు సినిమారంగంలో వ్యాపారవిలువలు వెనకబట్టి కళావిలువలు పెరుగుతాయని ఏ మొహం పెట్టుకుని ఆశించగలం ?

Saturday, November 03, 2007

"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-5

తెలుగువాళ్ళకు సినిమాపిచ్చి జాస్తి అని ఒక అభిప్రాయం ప్రచురంగా ఉంది.తిండి మానుకుని మఱీ సినిమాకెళతారంటారు.ఇది పూర్తి నిజం కాదు.నిరుడు తెలుగు సినిమాలన్నింటి వార్షిక వ్యయపు టంచనా రు.250 కోట్లకు మించలేదు.వాటిని చూడ్డానికి తెలుగుజనం రు.400 కోట్లకంటే ఎక్కువ పెట్టి ఉండరు.సినిమాల మీద కంటే కేబుల్ సంధానాల మీద ఎక్కువ పెడుతున్నారనిపిస్తోంది.అది రాష్ట్రవ్యాప్తంగా రు.700 కోట్ల కంటే ఎక్కువే ఉండొచ్చునని నా అనుమానం.మఱోపక్క తాగుడు మీద తెలుగువాళ్ళు గత ఆర్థిక సంవత్సరంలో పదివేల కోట్ల దాకా ఖర్చు చేశారని ఒక అంచనా.ఇందులో ప్రభుత్వ సారా మీద ఖర్చయినదే 8,000 కోట్లు దాటిపోయింది.ఒకవేళ టెలివిజన్లు లేకపోయిన పక్షంలో తెలుగువాళ్ళు వెండితెఱ వినోదం నిమిత్తం రు.1200 కోట్ల దాకా పెట్టి ఉండేవారేమో ! ఒకవేళ ఒక జాతిలో సినిమాపిచ్చి నిజంగా ఉంటే, ఆ పిచ్చికి కారణభూతమైన కళాఖండాలేవో వారి భాషలో అంతకుముందు వచ్చి ఉండాలి.

ఈ జమాఖర్చుల పద్దు దేనికంటే - ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, బదులుగా మనకేమిస్తున్నారీ నిర్మాతలూ దర్శకులూ నటులూ ? అని ప్రశ్నించుకోవడానికి.సినిమాని నేను ప్రాథమికంగా ఒక కళగానే భావిస్తాను.వ్యాపారమని కొందరు అంటారు.అది స్వతహాగా వ్యాపారం కాదు.వ్యాపారంగా మార్చబడింది, విద్యలాగా వైద్యంలాగా వివాహంలాగా ! మొదట్లో సినిమాలు తీసినవాళ్ళు కళాదృష్టితోనే తీశారు.సాంస్కృతిక దృష్టితో తీశారు.తెలిసిన కథల్ని తెఱమీద చూసుకుని మనసారా ఆనందించాలనే తపనతో తీశారు.అందుకే మనకు మొదట్లో దేశవ్యాప్తంగా వచ్చిన సినిమాలన్నీ పౌరాణికాలే.వాటిల్లో నటించినవాళ్ళు కూడా ఆ దృష్టితోనే నటించారు.వారు దాన్నొక ధనసంపాదనా వ్యాసంగం (career)గా భావించలేదు.తొలి తెలుగు సినీ హీరో శ్రీ రామానుజాచార్యులు ఆ తరువాత వచ్చిన సినిమాల్లో నటించడానికి ఇష్టపడలేదు.సినిమా ప్రక్రియ 1960 ప్రాంతాల్లో తన కళాప్రకృతిని కోల్పోవడం మొదలుపెట్టింది.మన కాలానికొచ్చేసరికి "అది అసలు కళే కాదు, వ్యాపారం"అని సినిమావాళ్ళే బాహాటంగా అనేసే పరిస్థితి వచ్చింది.మనమూ తలూపుతున్నాం, ఏమనాలో అర్థం కాక !

ఇది వ్యాపారమైతే, అన్ని వ్యాపారాల్లో లాగే దీంట్లో కూడా ఒక ఉత్పత్తి, దాని అమ్మకందారు, కొనుగోలుదారు, ధరకు తగ్గ నాణ్యత, మన్నిక వగైరా అన్నీ చూసుకోవాలి కదా ! ఉత్పత్తిలో కొత్తదనమేదైనా ఉండాలి కదా ! మఱి ఏముంది ?

1. గతంతో పోలిస్తే ఇప్పటి తెలుగు సినిమాలు వాసిలోనే కాదు, రాశిలో కూడా తగ్గిపోయాయి.ఆ రోజుల్లో తెలుగు సినిమా అంటే కనీసం రెండున్నర గంటల నుంచి 3 గంటల దాకా నిడివి కలిగి ఉండేది.ఇప్పుడు ఏ సినిమా కూడా రెండు గంటలకు మించి ఉండడంలేదు.కారణాలు మనకు అనవసరం.మన వినోదంలో భారీగా కోతపడిన మాట నిజం.మనం పెట్టే డబ్బుకు న్యాయం జరగడంలేదు.

2. పాత సినిమాల్లో ప్రతి సందర్భానికీ ఒక వైవిధ్యభరితమైన పాట ఉండేది.ఆనాటి కవులు ఏ ప్రస్తావన మీదైనా పాట రాయడానికి సిద్ధంగా ఉండేవారు.

"పద, పదవె వయ్యారి గాలిపటమా !"
"బొమ్మాలమ్మ బొమ్మలూ....భలే బొమ్మలూ"(సువర్ణసుందరి)
"తెలుసుకొనవె యువతీ ! అలా నడుచుకొనవె యువతీ"

ఈ జాబితాకు అంతులేదు.ఈ రోజు సినిమావాళ్ళు మనకిస్తున్నదేమిటి ? విదేశాల్లో తీసిన బృంద బీభత్సాలు తప్ప ? ఏ ఇతర సందర్భానికీ పాట ఉండదు.అక్కఱలేదని వాళ్ళకు వాళ్ళే నిర్ణయించేసుకున్నారు.

3. ఒక భాషలోని సినిమాలు తఱచుగా చూస్తూ ఉంటే ఆ భాష పట్టుబడే అవకాశం ఉంటుంది.కాని ఇప్పటి తెలుగు సినిమాలతో ఆ అవకాశమే లేదు.దీనికి 3 కారణాలు.1. ఏ ఇతర భాషా పరిశ్రమా ఇవ్వనన్ని అవకాశాలు తెలుగేతరులకు కల్పిస్తోంది తెలుగు పరిశ్రమ.వాళ్ళు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేరు.చెప్పిన డబ్బింగుకు పెదవులు కదుపుతారంతే ! ఆ కదపడం కూడా వైనంగా ఉండదు.కనుక పలికే పదాలు వేఱు.కదిలే పెదాలు వేఱు. 2.కారణం తెలియదు కాని - ఇప్పటి తెలుగు సినిమాలన్నీ గోదావరి జిల్లాల మాండలికంతో నింపివేయబడ్డాయి.నేను కాకినాడలో అయిదేళ్ళున్నాను.అక్కడ మాట్లాడేది మలయాళంలా శరవేగవంతమైన మాండలికం.గుంటూరుతో సహా ఏ ఇతర జిల్లాల వాళ్ళకైనా అది చప్పున అర్థం కావడం కష్టం.గోదావరి ప్రాంతీయులు కానటువంటి నటులతో కూడా ఆ మాండలికంలోనే మాట్లాడిస్తున్నారు.ఫలితంగా సినిమాలో ఒక డైలాగు గాని చెణుకు గాని సందర్భాన్ని గాని మనసారా ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడింది.ముందు అసలు ఏం మాట్లాడుతున్నారో వినిపిస్తే గదా ! ఒకరు డైలాగు చెబుతూండగానే ఇంకొకరు ఎత్తుకుంటారు.మళ్ళీ దానికి తోడు బిగ్గరగా వెనక నుంచి నేపథ్య సంగీతం ఒకటి. 3.ఏ మాండలికమైనా గానీ, అందులో ఇంగ్లీషే ప్రాజ్యం, తెలుగు మాత్రం పూజ్యం.పాత తెలుగు సినిమాలు చూసేటప్పుడు మనకు ఈ ఇబ్బందులేవీ ఎదురుకావు.

4. ఇంత గొప్ప దర్శకులు ఏదో పొడిచేస్తారనుకుంటే ఎత్తుకొచ్చిన కథలతో, ఈ రాష్ట్రప్రజల జీవనశైలిలో బొత్తిగా ఇమడని విడ్డూరపు టాచారాలు చూపిస్తూ "నేటివిటీకి దగ్గరగా తీశా"మని బుకాయిస్తూంటే ఏమనాలి ?

5. పాత సినిమాల్లో కథావైవిధ్యానికి కారణం - వాళ్ళు ఎంచుకున్న పాత్రల ఆర్థిక నేపథ్యం (economic background).ఆ పాత్రలు మధ్యతరగతిలో నుంచి ఎంచుకోబడ్డాయి.ఎందుకంటే అప్పటి దర్శకులూ నటులూ కూడా అందులోనుంచి వచ్చినవాళ్ళే.అందుకని అంతులేని వెరైటీ చూపించగలిగారు.మన కాలపు దర్శకులూ నటులూ మధ్యతరగతి హృదయస్పందనలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినవాళ్ళు.వీళ్ళ లోకమే వేఱు.అందుకని వీళ్ళు సృష్టించే పాత్రలన్నీ వీళ్ళ తరగతికే చెందినవై ఉంటున్నాయి.(ఈటీవీలో సుమన్ సృష్టించే పాత్రలు కూడా రామోజీరావు కుటుంబంతో ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్లే ఉంటాయి) ఆ నిర్మాతల యొక్క దర్శకుల యొక్క నటుల యొక్క వలయంలో నిజజీవితంలో జరుగుతున్న వ్యాపారాలే, సినిమాలో హీరో/హీరోయిన్ పాత్ర కూడా చేస్తూంటుంది.లేదా అలాంటి వ్యాపారం చేసే సంస్థలో హీరో ఉద్యోగం చేస్తూంటాడు.

ఇలా చెప్పాలంటే చాలా ఉంది.కాని ఇంత నమ్ముకున్నందుకు ఇంత గౌరవిస్తున్నందుకు మన నోట్లో ఈ సినిమావాళ్ళు కొట్టాల్సిన మట్టి ఇదా ? దీనికి పరిష్కారం....వచ్చే టపాలో ...

Friday, November 02, 2007

"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-4

(కోడి రామకృష్ణో ఇ.వి.వి.నో సరిగా గుర్తులేదు) "హీరో అంటే ఏమిటి ? దర్శకుడు సృష్టించిన భ్రమ"అన్నారొక ప్రముఖ దర్శకుడు.ఆ భ్రమని వాస్తవంగా తీసుకుని ఆ హీరోల మీద పిచ్చి అభిమానం పెంచుకునేవాళ్ళ పట్ల నాకు కొన్నేళ్ళ క్రితం చిన్నచూపుండేది.కాని ఇప్పుడా అభిప్రాయాన్ని మార్చుకున్నాను."ఉత్తరాది విలన్లూ, బొంబాయి భామలూ రాజ్యమేల్తున్న తెలుగు చిత్రసీమలో ఈనాటికీ మన తెలుగువాడే మన మెగాస్టార్"అనే సత్యం స్ఫురించాక.ఈ దర్జా ఇండియాలో అన్ని రాష్ట్రాలవాళ్ళకీ లేదని గుర్తించడం అవసరం.ముఖ్యంగా ఉత్తరాదిన హిందీ హీరోలే అన్ని రాష్ట్రాలకూ హీరోలు.వాళ్ళ హీరోయిన్‌లే అన్ని రాష్ట్రాలకూ హీరోయిన్‌లు.వాళ్ళ విలన్‌లే అన్ని భాషల వాళ్ళకూ విలన్‌లు.హిందీ సినిమాలు తప్ప వినోదానికి ఉత్తరాదిన మఱో అర్థమే లేదు.మనకింకా ఆ ఖర్మ పట్టలేదు.ఆ విషయంలో మనం ఈనాటికీ సర్వస్వతంత్రులం.

ఒక మనిషిని దేవుడిలా/దేవతలా భావించి ఆరాధించడానిక్కూడా చాలా లోతైన పరిశుద్ధ హృదయం సంస్కారబలం కావాలనేది నేను కనుగొన్న రెండో విషయం.జీవితానికొక ఆదర్శం కావాలి.ఒక ఊహ కావాలి.ఉత్‌ప్రేక్ష కావాలి.దాన్ని మనిషి భగవద్గీత ద్వారా పొందినా సరే ! బాలకృష్ణ ద్వారా పొందినా సరే ! చిరంజీవి ద్వారా పొందినా సరే ! నేను కాదనను.హీరోల్ని పిచ్చిగా అభిమానించడం వెనుక ఉన్న సానుకూల భావనల్ని నేను సంతోషంగా స్వాగతిస్తాను.ఆ హీరోల వ్యక్తిగత జీవితం గుఱించి లోపాల గుఱించి మాట్లాడి వాళ్ళ అభిమానుల హృదయాల్ని గాయపఱిచి వాళ్ళ చుట్టూ అభిమానులేర్పఱచుకున్న పవిత్ర భావనల తేజోపుంజాన్ని కకావికలు చెయ్యడానికి నేనిష్టపడను.సినీ అభిమానాల వెనుక కళాభిమానం ఉంది.సౌందర్యం పట్ల ప్రశంసాభావం ఉంది.మంచి చేసేవారి ధీరోదత్తత పట్ల ఆరాధన ఉంది.శక్తిసామర్థ్యాల పట్ల కవితాత్మకమైన ఊహ ఉంది.ఈ రూపంలో ప్రేక్షకుడు తన అభిమాన హీరోలో తన ఆత్మను దర్శించుకుంటే అది నాకు సంతోషకరం.

కాని ఇప్పుడు సినీహీరోల్ని అభిమానిస్తున్న విధానం అత్యంత హేయమైనది.చాలా సందర్భాల్లో సదరు హీరో తమ కులస్థుడు కావడం అనే ఏకైక కారణం వల్ల అభిమానించే కేటగరీని మనమిప్పుడు చూస్తున్నాం.వీళ్ళు సినీ అభిమానులు కారు, కులాభిమానులు మాత్రమే."చిరంజీవి రాజకీయాల్లోకి రావా"లని కోరుతున్నవారు ప్రధానంగా కాపుకులస్థులు కావడం గమనార్హం.చిరంజీవి రాజకీయ ప్రవేశం యొక్క మంచిచెడ్డలేంటో నాకు తెలియదు.దాని గుఱించి నేను రాయలేను.కాని ఈ ప్రతిపాదన వెనక ఉన్న అతితెలివి ఒకటే - ఒకప్పుడు చిరంజీవిలాంటి జనాకర్షణ ఉన్న ఎన్టీయార్ ఆ జనాకర్షణని ఉపయోగించుకుని రాష్ట్రాధినేత అయి కమ్మకులానికి "గుర్తింపు" తెచ్చారనీ, కనుక చిరంజీవి కూడా ఆ బాటలోనే పయనించి కాపు కులానికి "గుర్తింపు" తేవాలని !

హతవిధీ ! ఎన్టీయార్ యావత్తు తెలుగుజాతికే గుర్తింపు తెచ్చారని మనం అనుకుంటూంటే కమ్మకులానికీ నిమ్మకూరికీ గుర్తింపు తేవడమేమిటి బాబూ ! అని వాపోయి ప్రయోజనం లేదు.వాళ్ళ అంతర్గత భావన అలాగే ఉంది.చిరంజీవి సినిమారంగంలో నిలదొక్కుకోవడానికి అష్టకష్టాలు పడుతూ ఉన్న రోజుల్లో ఏమయ్యారబ్బా ఈ కులాభిమానులు ? ఒక్క పైసా ఇచ్చి ఆదుకున్నారా ? ఈ రోజు ఆయన పైకి రాగానే "ఆయన మావాడు"అంటున్నారు ? మొదట్నుంచీ ఈ సమాజ ధోరణి ఇలాగే ఉంది.మీరు నిరుద్యోగిగా రోడ్ల వెంట తిరుగుతున్నప్పుడు రమ్మని పిలిచి ఎవడూ బువ్వపెట్టడు.మీరు సొంతంగా కష్టపడి పైకొస్తే చందాలిమ్మనీ పన్నులు కట్టమనీ వెంటపడుతుంది ఈ సమాజం."సామాజిక బాధ్యత"అంటూ గుడ్లెఱ్ఱజేస్తుంది.ఆ రోజు మీరు ఆకలితో బాధపడ్డప్పుడు ఏమైంది ఇతరులు మీ పట్ల చూపాల్సిన సామాజిక బాధ్యత ? మీరు ఇల్లూ వాకిలీ లేక అఘోరిస్తున్నప్పుడు గుడిసె వేసుకోవడానిక్కూడా మీకెవరూ స్థలం చూపించరు.మీరు కష్టపడి ఇల్లు కట్టుకుంటే పన్నులూ, (ఉత్తుత్తి) రిజిస్ట్రేషన్‌లూ వెంటనే రంగప్రవేశం చేస్తాయి.

కులాభిమానులు జూనియర్ ఎన్టీయార్‌ని కూడా ఇలాగే గబ్బుకొట్టించారు."ఆంధ్రావాలా"సినిమా విడుదలకు ముందు గుంటూరులో"చౌదరి యూత్"అని బ్యానర్లు రాసుకుని మఱీ మోటర్‌సైకిళ్ళ మీద"జూనియర్ ఎన్టీయార్ జిందాబాద్"అంటూ ఊరేగారు.జనం గమనించారు."ఇదేదో కమ్మగోలలా ఉందే ! "అనుకున్నారు.తమ నిర్ణయం తాము తీసుకున్నారు.ఫలితం - ఆంధ్రావాలా బొక్కబోర్లా !

జాత్‌పాత్ తోడక్ మండల్ వారికి వ్రాసిన లేఖలో డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒక ప్రశ్న వేశారు :"ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతన్ని హిందువు కులప్రసక్తి లేకుండా గౌరవించగలడా ?"అని ! నేనా పుస్తకాన్ని 22 ఏళ్ళ క్రితం చదివినప్పుడు"ఎందుకు గౌరవించలేడు?"అనుకున్నాను.కాని ఇప్పుడు అభిమానసంఘాలమని చెప్పుకుంటున్న ఈ కులసంఘాల్ని చూస్తూంటే....?

Wednesday, October 31, 2007

"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-3

శ్రీ NTR రాజకీయరంగప్రవేశం లాగానే 7వ దశకం చివర్లో శ్రీ చిరంజీవి సినిమారంగప్రవేశం ఆంధ్రదేశానికి ఒక చారిత్రిక అవసరం.కాంగ్రెస్ పార్టీ యొక్క ముక్కిపోయిన ముప్పై అయిదేళ్ళ డ్రెయినేజి రాజకీయాల నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించడానికి NTR రావాల్సి వచ్చినట్లే తెలుగు సినిమారంగానికి కొత్త రక్తం నింపడానికి చిరంజీవిలాంటివాడొకడు అప్పుడు అవసరమయ్యాడు.పాత సినిమాల సంసారపక్షపు హీరోయిజం నుంచి విడివడి వీధికెక్కగల మొనగాడి పాత్రలలో జీవించేవాడొకడు కావాల్సి వచ్చాడు.శ్రీ చిరంజీవి ఆ అవసరాన్ని సరిగ్గా సకాలంలో నెఱవేర్చారు.మొదట్లో పాత్రల కోసం ఆయన ఎంపిక చేసుకోబడగా తరువాత ఆయన కోసం పాత్రలు పుట్టుకొచ్చాయి.ఇది ఒక అనివార్య ప్రక్రియ.శ్రీ చిరంజీవి పరిశ్రమలో అడుగిడకముందు నూటికి 99 శాతం తెలుగు సినిమాల్లో పాత్రల మంచీ చెడూ - బ్లాక్ అండ్ వైట్ లాగా పూర్తి విభేదకత్వం(contrast)తో చూపించబడేవి.హీరో శ్రీరామచంద్రుడిలా సకల సద్గుణాభిరాముడు.అతనిలో ఈషత్తయినా కళంకం ఉండడానికి వీల్లేదు.చిరంజీవి వచ్చాక ఈ సున్నం తెలుపు హీరో పాత్రలు కనుమఱుగయ్యాయి.హీరో స్వభావంలో కొంచెం బూడిదరంగు(grey)కూడా ఉండడంలో తప్పులేదనే అభిప్రాయానికొచ్చారు జనం.ఈ మానసిక విప్లవాన్ని తేవడం చిరంజీవిలాంటివాడు పరిశ్రమలో ఉండడం వల్లనే సాధ్యమయింది.కాని ఇక్కడ ఒక కఠోర సత్యాన్ని ఒప్పుకోక తప్పదు.NTR రాజకీయాల్లోకి వెళ్ళకుండా సినిమారంగంలోనే కొనసాగి ఉంటే చిరంజీవిని మెగాస్టార్ అని పిలవడానికి ఎవరూ సాహసించేవారు కారు.ఆయన వెళ్ళడం, ఈయన మెగాస్టార్ కావడం - రెండూ దాదాపుగా ఒకేసారి జరిగాయి.ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీయారే సూపర్‌మెగాస్టార్.అమితాబ్‌కి 30 ఏళ్ళ వయసులో ఉన్న జనసమ్మోహనం ఎన్టీయార్‌కి 55 ఏళ్ళ వయసులో ఉండేది.ఉదాహరణకి- మీరు తెలుగులో NTR నటించిన "యుగంధర్" చూస్తే దాని హిందీమూలమైన "డాన్"(అమితాబ్) చూడాలనిపించదు.అంత బాగా నటించేవాడాయన.

అయితే కళ ఒక సౌందర్యరూపం.భగవంతుడు సృష్టిస్తే సౌందర్యమంటాం.మనిషి సృష్టిస్తే కళ అంటాం.అంతే తేడా.మన మనసుని ఎంత ఆకట్టుకున్నా సరే ! ఒక మనిషిని మనం మంచుముక్కలా గడ్డకట్టించి (freeze చేసి) దాచిపెట్టుకుని చూసుకుంటూ సంతోషించలేం.ఆ మనిషి కదలాలి.మారాలి.ఎదగాలి.అప్పుడే ఆ అందానికి సార్థకత.అలాగే చిరంజీవి ఒక సినిమాలో ఒక రఫ్ అండ్ టఫ్ పాత్ర బాగా చేశాడని చెప్పి ఎప్పుడూ అవే చెయ్యమనడం ఆయన్నే కాక ఆయన తమ్ముణ్ణీ కొడుకునీ మేనల్లుణ్ణీ కూడా అవే చెయ్యమనడం - ఆ పాత్రల సిలువకు వాళ్ళని జీవితాంతం వేళ్ళాడదీసి చూసి ఆనందించడం - దీన్ని ఏమనాలి ?

ఆయన"ఇమేజి"(మూర్తిమత్త్వం) అటువంటిది అంటారు.నటుడంటే నటించేవాడు కాడా ? ఎటువంటి పాత్రయినా చేసి ఒప్పించడం నటుడి బాధ్యత కాదా ? "నేనింతే"అని బిగుసుకుపోవడం డైనమిజమా ? మన వ్యక్తిత్వం మన పూర్వజన్మసంస్కారం మీదా మనం పుట్టిపెఱిగిన వాతావరణం మీదా మన చదివిన చదువుల మీదా మనం కలిసి తిరిగిన మనుషుల మీదా ఆధారపడి - ఇలా రకరకాల ప్రభావాలకు లోనై అనుక్షణం మారిపోతూనే ఉంది.మన యొక్క వాస్తవ జీవితపు మూర్తిమత్త్వమే ఈ విధంగా అబద్ధం కాగా, ఇక సినిమాలలో ధరించిన పాత్రల ద్వారా సంక్రమించే మూర్తిమత్త్వాలు మార్పు కతీతమౌతాయా ?

మహానటుడు పద్మశ్రీ NTR ఇలాంటి సినిమాటిక్ మూర్తిమత్త్వాల కతీతంగా జీవించారు.ఆయన హీరోగా మహోన్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా "తీర్పు"అనే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఒక ముసలి జడ్జి పాత్ర ధరించారు.ఆ సినిమా అంతా కలిపి ఆయన కనిపించేది 15-20 నిమిషాలకంటే ఉండదు.ఆ పాత్ర ధరిస్తే తన పరువు పోతుందనుకున్నారా ఆయన ? తన ఇమేజికి దెబ్బ అనుకున్నారా ? పరిశ్రమలో తన ప్రాముఖ్యం తగ్గిపోతుందని భయపడ్డారా ? ఏమీ లేదు.ఒక కళగా నటన పట్ల ఆయనకున్న గౌరవం అంకితభావం తపన అలాంటివి.ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న కృష్ణ మురళీమోహన్ శోభన్‌బాబు కూడా సినిమా మూర్తిమత్త్వాల్ని నిర్‌ద్వంద్వంగా తిరస్కరించారు.ఆ తరువాతివాళ్ళు మాత్రం ఇమేజిల వెంటపడి 90 శాతం పాత్రలకు పనికిరానివాళ్ళుగా స్థిరపడుతున్నారు.పైగా ఇప్పుడు తెలుగు సినిమారంగంలో క్యారెక్టర్ యాక్టర్ అంటే ఎగతాళి అయ్యే పరిస్థితి ఉంది - పాపం ! హీరోగా పనికిరాక క్యారెక్టర్ యాక్టర్ అయ్యాడన్నట్లు !

ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి ?

నిన్నమొన్న సినిమాల్లో చేరి ఒకటి-రెండు కథలకు పిచ్చకొట్టుడు హీరోగా చేసిన బుడ్డోడికి కూడా డేరింగ్ డాషింగ్ హీరో ఇమేజి కావాలి."నాకంటూ నా అభిమానుల్లో ఒక ఇమేజి ఉంది"అని చెప్పుకోవడం ఒక ఫ్యాషనైపోయింది, అదొక అవలక్షణం అని గ్రహించకుండా ! వాళ్ళు నిజంగా అంత గొప్ప అభిమానులే అయితే తమ అభిమాన హీరో ఏ వేషం వేసినా దాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించాలి.అలా కాకుండా, వాళ్ళకు ఇదివరకటి సినిమాలో నచ్చినదే నేను మళ్ళీ మళ్ళీ చేస్తానని హీరో పట్టుపట్టడం దర్శక నిర్మాతలు తదనుగుణంగా కథ రాయమని రచయితలకు పురమాయించడం కథలో లేకపోయినా వాళ్ళ ఇమేజికి అనుగుణంగా పిచ్చకొట్టుడు డైలాగులు చొప్పించడం-ఇలాంటి నానారకాల బీభత్సపు పనుల మూలంగా తెలుగు సినిమా కళ సర్వనాశనమై పోయింది.

ఇదంతా చిరంజీవితోను ఆయన సినిమాలతోను ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన విజయాల్ని కాపీకొట్టదల్చుకున్నవాళ్ళతోను విజృంభించిన పోకడ అని మనం గ్రహించగలిగితే ఇందులోంచి బయటపడగలుగుతాం.అప్పుడు చిరంజీవి అవసరమైనట్లే, ఇప్పుడు ఆయన సినిమాలు దశాబ్దాల పాటు ఆంధ్రదేశానికి చేసిన దారుణమైన కళాసాంస్కృతిక డ్యామేజి నుంచి రక్షించడానికి మఱొకరు కావాలి.ఒకరు కాకపోతే వందమంది.ఈ మార్పుని చిరంజీవి నుంచి ఆశించలేం.ప్రస్తుత పోకడ ఇలాగే ఏ మార్పూ లేకుండా కొనసాగడంలో ఆయనకూ ఆయన కుటుంబానికీ ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఇమేజి-బిల్డింగులో నిమగ్నమైన ఇతర పిచ్చకొట్టుడు బుడ్డ హీరోలకు తమ తమ స్వప్రయోజనాలున్నాయి.ఈ వర్తమాన పోకడలో పెద్దగా నటనానైపుణ్యం అవసరం లేదు.దర్శకత్వ ప్రతిభ కూడా అవసరం లేదు.ఎందుకంటే ఇది ఇప్పుడు బాగా నలిగిన బాట (beaten track).

మఱికొంత వచ్చే టపాలో....

Tuesday, October 30, 2007

"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....- 2
షుమారు గత పాతికేళ్ళుగా తెలుగు సినిమారంగం (మంచికో చెడుకో) శ్రీ చిరంజీవినే కేంద్రబిందువుగా చేసుకుని రూపొందుతూ వచ్చిన నేపథ్యంలో శ్రీ చిరంజీవి యొక్క వ్యక్తిగత విజయాలు ఏ విధంగా అపార్థానికి గురయ్యాయో అవగాహన చేసుకుంటే తప్ప ఈ సినిమా రొంపికి కారణాలు బోధపడవు.

1. అన్నిటికంటే ముందు అర్థం చేసుకోవలసినది - శ్రీ చిరంజీవికి గాని ఆయన కుటుంబానికి గాని అంతకుముందు ఏ విధమైన సినిమా నేపథ్యమూ లేదు.ధనబలమూ లేదు.కులబలమూ లేదు.గాడ్‌ఫాదర్లూ లేరు.ఆయన కేవలం తన వ్యక్తిగత ప్రతిభా పాటవాల మీద ఆధారపడి నెగ్గుకొచ్చిన మహామనిషి.

2. శ్రీ చిరంజీవి మొదటి నుంచి మెగాస్టార్ కాడు.ఈ బిరుదు ఆయన పదీ, పన్నెండేళ్ళ పాటు సినిమారంగంలో అహోరాత్రాలూ శ్రమించగా వచ్చినటువంటిది.ఆయన మెగాస్టార్ కావడానికి కారణం మనకిప్పుడు సుపరిచితమైన చిరంజీవి మార్కు పిచ్చకొట్టుడూ, బండలాగుడూ కాదు.1986 తరువాత ఆయన్ని అందరూ కలిసి ఆ తరహా పాత్రల్లో బంధించిపారేశారు.ఇప్పటికీ అలాగే బంధించేస్తున్నారు.ఆయన్నే కాక ఆయన యొక్క యావత్తు కుటుంబాన్నీ అదే మార్గంలో ఏ మాత్రం వైవిధ్యం లేని పిచ్చకొట్టుడు మనుషులుగా మార్చిపారేస్తున్నారు.వాళ్ళు అందుకు తప్ప ఇంకెందుకూ పనికిరారనే అభిప్రాయం మేధావివర్గంలో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.ప్రస్తుతం అందరూ పిచ్చకొట్టుడు హీరోలే కనుక చిరంజీవికి గాని ఆయన కుటుంబానికి గాని ఇందులో ప్రత్యేకమైన విశిష్టత ఏమీ లేదు.

శ్రీ చిరంజీవి మెగాస్టార్ కావడానికి అసలు కారణం - ఆయన పిచ్చకొట్టుడు హీరోగా స్థిరపడకముందు నటించి మెప్పించిన గొప్ప కథాబలం ఉన్న చిత్రాలు.అంతకుముందు వారపత్రికలలో ధారావాహికలుగా వచ్చి నవలలుగా ప్రచురించబడిన కొన్ని అత్యుత్తమ కథలకు ఆయన హీరోగా నటించారు.వాటిల్లో ముఖ్యమైనవి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ నవలలు. శ్రీయండమూరి, చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని నవలలు వ్రాయలేదు.అప్పట్లో చిరంజీవి అంత గొప్ప హీరోగా పరిగణింపబడేవాడు కూడా కాదు.అయితే వాటిల్లోని హీరో పాత్రలకు శ్రీ చిరంజీవి సరిగ్గా సరిపోయారు.అలా సరిపోవడం కోసం ఆయన యండమూరి నవలల్ని శ్రద్ధగా అధ్యయనం చేశారు కూడా.అవి ఒక మహానటుడుగా చిరంజీవి స్థానాన్ని శాశ్వతం చేశాయి.ఆ సినిమాల్లో మనకు కనపడే చిరంజీవే అసలైన మెగాస్టార్.

1983వ సంవత్సరం ఆంధ్రదేశ చరిత్రలో ఒక పెద్ద మలుపు.అప్పుడే శ్రీ NTR 35 సంవత్సరాల నిరంకుశ కాంగ్రెస్ పాలనని తొలిసారిగా కూలద్రోశారు.ఆ సంవత్సరం మన సినిమారంగచరిత్రలో కూడా ఒక పె