నేనొకసారి ఒక మహాపరాధం చేశాను. మా నాన్నగారు నన్ను చావగొట్టే ఉద్దేశంతో నా వెంటపడ్డారు. నేను తప్పించుకుని పారిపోయాను. ఆయన నామీద కేకలేస్తూ కొంతదూరం వఱకు నన్ను తరిమారు. ఆ తరువాత వయోభారంచేత నాతో సమానంగా పరిగెత్తలేక ఒకచోట నీరసంగా కూలబడ్డారు. చాలాసేపటి తరువాత నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చాను. ఆయన కంటపడకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. (నేనాయన కంటపడలేదని నేననుకున్నాను). తరువాత ఆయన ఎదుటపడ్డప్పుడు నాకు తన్నులు తప్పవనుకున్నాను. కాని ఆయన ఆ విషయమే ఎత్తలేదు. కాని ఆయన నన్ను క్షమించలేదని నాకు తెలుసు. కాని నేను చాలా ఆనందించాను. తరువాత కొద్ది సంవత్సరాలకు ఆయన చనిపోయారు.
వెనక్కి తిరిగి చూసుకుంటే నాన్నగారిని అంత కష్టపెట్టి ఉండాల్సింది కాదని అనిపిస్తుంది. నేను ఆయనకు లొంగిపోయుంటే బావుండేది. నన్నాయన చావగొట్టి ఉంటే బావుండేది. తన్నులు తప్పాయని ఆనందించడం ఒక పిల్లచేష్ట. నా అపరాధం శిక్షించబడకుండా అలాగే మిగిలిపోయింది. దానిగుఱించి నన్ను దండించడానికి ఎవరికైతే సర్వాధికారా లున్నాయో ఆయన్ని నేనా పని చెయ్యనివ్వకపోవడం వల్ల, ఆ పనిని అలాగే ఉంచి ఆయన చనిపోవడం వల్ల, ఆ పని చెయ్యడానికి ఇంకెవరికీ అధికారం లేకపోవడం వల్ల అది ఇంకొక న్యాయస్థానంలోకి వెళుతుంది. అక్కడ కేవలం కొద్దిపాటి చావగొట్టుడుతోనే విషయం సరిపెట్టబడదు.
"ఆయన నన్ను కొట్టి ఉంటే బావుండేది" అని ఎవరో ఒక భార్య
"అన్నయ్య నన్ను తన్ని ఉంటే బావుండేది." అని ఎవరో ఒక తమ్ముడు
"అమ్మ నా చెంప పగలగొట్టి ఉంటే బావుండేది" అని ఎవరో ఒక కూతురు
ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు.
కుటుంబసభ్యులు చేసే తప్పులకు కుటుంబాధిపతి/కుటుంబాధికారిణి వారిని ఎప్పటికప్పుడు తగువిధంగా శిక్షించాలి. నిర్మొహమాటంగా నిర్మమంగా నిరహంకారంగా శిక్షించాలి. తెలిసీ శిక్షించకపోతే ఆ పాపాల్లో సగం అతనికి/ఆమెకు చుట్టుకుంటాయి. తరువాత ఆ కుటుంబసభ్యులు కూడా - అతడు విధించే శిక్షలకన్నా భయంకరమైనవాటిని భగవంతుడి చేతిలో అనుభవించాల్సి వస్తుంది. భగవత్ స్వరూపుడైన కుటుంబాధిపతి వేసే శిక్షలు గోటితో పోయేవి. మన పాపాల్ని అవి అనేక జన్మలకు వాయిదా వెయ్యకుండా ఇప్పటికిప్పుడే సూక్ష్మంలో పోగొట్టేస్తాయి. కాని భగవంతుడే స్వయంగా శిక్షించాల్సి వస్తే ఆయన గోళ్ళు వాడడు. ఖచ్చితంగా గొడ్డళ్ళే వాడతాడు. ఆ అనుభవం మానవులకు బహుబాధాకరంగా దుర్భరంగా ఉంటుంది. కనుక కుటుంబాధిపతి చేతిలో శిక్ష అనుభవించడం వీలుపడకపోతే తత్సమానులైన పెద్దల సమక్షంలో తప్పు ఒప్పుకుని వారు విధించగల ప్రాయశ్చిత్తానికి పాత్రులు కావాలని శాస్త్రం.
భగవంతుడి శిక్షలు ఎక్కువ బాధాకరంగా ఉండడానికి కారణం ఆయన క్రూరుడు కావడం కాదు. అందుకు విరుద్ధంగా ఆయన మనందరికంటే నిస్స౧దేహంగా పరమ దయామయుడు. అసలు కారణం - పాపమైనా పుణ్యమైనా అనుభవించకుండా పేరబెట్టేకొద్దీ, ఆ అనుభవాన్ని వాయిదా వేసేకొద్దీ అది "ఇంతింతై వటుడింతై" అన్నట్లుగా పెరిగి పోతూంటుంది. అంటే పాపం చెయ్యడానికీ, దాని ఫలితాన్ని అనుభవించడానికీ మధ్య ఎక్కువ ఎడం (gap) ఉండకూడదు. కుటుంబాధిపతి తక్షణం వేసే శిక్ష అలాంటి ఎడమేదీ ఏర్పడకుండా మనల్ని కాపాడుతుంది. ఉదాహరణకు - మీరొక దీపం పక్కన చెయ్యి పెట్టినప్పుడు మీ చేతికీ దాని నీడకీ నడుమ ఎడం పెరిగిపోయేకొద్దీ మీ చేతి నీడ పరిమాణం కూడా వందలాదిరెట్లుగా పెరిగిపోతుంది.
Friday, May 16, 2008
ఆ దెబ్బ దేవేంద్రలోకం
టపా చేసినవారు :
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
5
వ్యాఖ్యలు
ఈ టపాకు గల లంకెలు :
నామాంకం (లేబెల్) : అవశ్యమ్ అనుభోక్తవ్యమ్
Wednesday, April 09, 2008
ఎవరి చావు వారు చస్తే తప్పేంటి ?-7
ఆమె చనిపోయిన విషయం గుర్తొచ్చిన రామభద్రానికి తానిప్పుడు చూస్తున్నది భోజేశ్వరి ప్రేతాత్మనన్న విషయం స్పష్టంగా ఆకళింపైపోయింది. భయంతో కళ్ళు పెద్దవిచేసుకుని నోరు తెఱుచుకుని నిశ్చేష్టుడై ఆమెవంక చూస్తున్నాడు. "ఎందుకు భద్రం భయపడుతున్నావ్ ?" అని భోజేశ్వరి నవ్వుతూ గాలిలో కలిసిపోయి అంతర్ధానమైంది. అంతే ! పెరుగూ విరుగూ అన్నీ మర్చిపోయి రామభద్రం ఇంటికేసి పరుగో పరుగు. ఇంట్లోకి రాకముందే మెట్లదగ్గరే పడిపోయాడు. అసలు తాను ఇంటికెలా చేరుకున్నాడో తనకే తెలియదు. అందరూ ఆందోళనతో అతన్ని లేవదీసి లోపలికి మోసుకెళ్ళారు. ఎలా వచ్చిందో గాని అప్పటికప్పుడు 102 డిగ్రీల మాయదారి జ్వరం, రామభద్రం మూసిన కన్ను తెఱవకుండా మూడ్రోజులు పడుకున్నాడు.
ఒంట్లో కాస్త కులాసా చిక్కింతర్వాత తాను చూసినది ఉన్నదున్నట్లు చెబితే ఎవ్వరూ నమ్మలేదు. వాళ్ళ నాన్న అప్పారావు చాలా సంవత్సరాల్నుంచీ నైట్ డ్యూటీలకెళుతున్నాడు. ఆయనకెప్పుడూ ఏ దెయ్యాలూ ఎదురుకాలేదు. అందుకని ఆయన కలాంటి నమ్మకాలేమీ లేవు. "పిఱికి నా కొడకా ! దేన్నో చూసి ఏదో అనుకుని బాగా జడుసుకున్నావులే గాని, ఇంక నోర్ముయ్యెహె !"అని కసిరాడు. తండ్రికి తగ్గ కొడుగ్గా రామభద్రానికీ పెద్దగా నమ్మకాల్లేవు. కాని తాను భోజేశ్వరి ప్రేతాత్మని చూసింది నిజమనీ, అందులో అబద్ధమేమీ లేదనీ, తానేమీ భ్రమపడలేదనీ అతను పలుమార్లు నొక్కివక్కాణించేవాడు. ఆమె ఇతనికెందుకు కనిపించిందో తెలియదు. ఏదేమైనా భోజేశ్వరి మరణానంతరం అతనిక్కనిపించడం అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా !
జీవి శరీరంలో ఒక మెదడుందని మనమందరం అనుకుంటాం. వాస్తవానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మెదడుంది. ఆ మెదళ్ళన్నీ ఒక కేంద్ర మెదటికి లోబడి పనిచెయ్యడం వేఱే విషయం. తద్ద్వారా కేంద్రమెదటికి (పరమాత్మస్వరూపమైన) జీవాత్మ అధిష్ఠానమైనట్లే ఆయా చిఱుమెదళ్ళక్కూడా వేఱువేఱు అధిష్ఠానదేవతలున్నారు. ఉదాహరణకు చేతులకు ఇంద్రతేజస్సు అధిష్ఠానదేవత. కుడిచెవికి పవిత్రనదులు అధిష్ఠానదేవతలు. మర్మాంగానికి ప్రజాపతులు అధిష్ఠానదేవతలు. వృషణాలకు పితృదేవతలు అధిష్ఠానం. ఆయా అధిష్ఠానదేవతలు ఆయా అవయవాల్లో నిత్యనివాసం చేస్తారు. వాళ్ళు మనిషి పుట్టకముందే దైవాదేశం మేఱకు అతని/ఆమె అవయవాల్లో తిష్ఠవేస్తారు. వాళ్ళని భౌతికశరీరంలో కాక అందులో ఉన్న సూక్ష్మశరీరంలో మాత్రమే దర్శించగలుగుతాం. ఆ కారణం చేతనే "దేహో దేవాలయ: ప్రోక్తో జీవో దేవస్సనాతన:" (ఈ దేహమే పవిత్రమైన దేవాలయం. ఇందులో నివసించే జీవుడే నిత్యుడూ, సత్యుడూ అయిన సనాతన భగవంతుడు) అని మన పూర్వీకులు మొత్తుకున్నది. అలాగే చావు సమీపించినప్పుడు దైవాదేశం మేఱకు ఆయా దేవతలు (జీవశక్తులు) తమంతట తాముగా శరీరాన్ని విడిచి వెళతారు. కాని వారు మృతశరీరంలోని పంచభూతాల్లాగా చెల్లాచెదఱు అవ్వరు. వారు సూక్ష్మశరీరాన్ని లోకాంతరాలకూ జన్మాంతరాలకూ తరలిస్తారు. దాన్తో పాటే ఉంటారు. అవి గతజన్మలకు చెందిన పాత కర్మఫలాల యొక్కా, జ్ఞాపకాల యొక్కా దస్తావేజుల్ని జన్మనుంచి జన్మాంతరానికి మోసుకెళతారు.
నిజానికి జన్మలెత్తేది ఆత్మ కాదు, సూక్ష్మశరీరమే. మనుషులు మేల్కొన్న స్థితిలో "నేను, నాది" అని వ్యవహరించేది కూడా దాన్నే. జనం దాన్ని ఆత్మ అని వ్యవహరించడం కేవలం భ్రమప్రమాదజనితం. శుద్ధపొఱపాటు మాత్రమే. ఆత్మస్థితిలో "నేను, నాది" ఉండవు. ఆత్మకు జన్మలూ, చావులూ, సుఖదు:ఖాలూ, ధర్మాధర్మాలూ, పాపపుణ్యాలూ, శుభాశుభాలూ, దేశకాలాలూ ఏమీ లేవు. అది ఒక దేహానికీ, ఒక మతానికీ, ఒక లోకానికీ పరిమితం కాదు. జీవులూ-జడాలూ, కుర్చీలూ-బల్లలూ, రాయీ-రప్పా, చెట్టూ-పుట్టా అన్నింట్లోను ఉండే సర్వాతీత సర్వాంతర్యామి ఆత్మ. అది అస్తిత్వానికే అస్తిత్వం. దానికే దేవుడని నామాంతరం.
ఎందుకు చెబుతున్నానంటే - ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు తమ శరీరంలోని అధిష్ఠాన దేవతల్ని అకాలంగా బలవంతంగా వెళ్ళగొడతారు. దైవాదేశం లేకపోవడం చేత ఆ దేవతలు వెళ్ళడానికి ఇష్టపడరు. కాని నశించిపోతున్న శరీరంలో ఉండడం సాధ్యపడదు. సదరు దేహం సహజంగా నిర్ణీత సమయానికి పతనమయ్యేటప్పుడు దాని పాత ఫైళ్ళని సజావుగా ప్రశాంతంగా ఇంకో జన్మకు బదిలీ చెయ్యడానికి వాళ్ళు నియమించబడ్డారు. ఆ ఫైళ్ళలో గతజన్మల పాపాలూ, పుణ్యాలూ, జ్ఞాపకాలూ, వాటికి నిర్ణయించబడ్డ ఫలితాలూ అన్నీ ఉంటాయి. దైవద్రోహియైన జీవుడితో కలిసి ఉండడానికి వాళ్ళకిష్టం లేకపోవడంతో ఆ ఫైళ్ళు పట్టుకుని వాళ్ళు తమ లోకాలకు తాము వెళ్ళిపోతారు. తిరిగి దైవాదేశం వచ్చేదాకా ఆ దైవద్రోహి శరీరంలో ప్రవేశించడానికి వాళ్ళు సాహసించరు. ఇంక మిగిలేది ఏమిటి ? అంటే ఏ అధిష్ఠానదేవతలూ లేనటువంటి పాడుపడ్డ దేవాలయంలాంటి దైవద్రోహపు సూక్ష్మశరీరం. దాన్ని సామాన్యులు దెయ్యం/పిశాచం అని వ్యవహరిస్తారు. అధిష్ఠాన దేవతలు గతం తాలూకు అన్ని ఆనవాళ్ళూ తమవెంట తీసుకెళ్ళిపోవడంతో జీవి తన సర్వస్వాన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డ పరమబికారి దివాలాకోరులా మారిపోతాడు/మారిపోతుంది. దేవుడికి దూరమైపోవడం మాట సరేసరి. అంతకుముందటి జన్మల్లో చేసిన అమూల్యమైన, మహోజ్జ్వలమైన పుణ్యఫలాలు చాలావఱకు రద్దయిపోతాయి. అదొక భయంకరమైన పరిస్థితి. చచ్చీచెడీ ఏడాదిపాటు చేసిన ప్రాజెక్టు మొత్తం నిశ్శేషంగా క్ర్యాష్ అయిపోయే సంభావ్యతని ఊహించుకోండి. కోట్లల్లో మీరు డిపాజిట్లు పెట్టిన బ్యాంకు ఆకస్మికంగా మూతపడిపోయాక దాన్ని తిరిగి ఎప్పుడు తెఱుస్తారో మీ డబ్బు మీకెప్పుడు చేతికందుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడితే మీ అవస్థ ఎలా ఉంటుందో యోచించండి !
బతికున్న రోజుల్లో సంపాదించుకున్నపుణ్యఫలం అపారంగా ఉన్నప్పటికీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం పిశాచజన్మ తప్పదు. ఇందుకు కొన్నిసార్లు దైవక్రోధం కారణం కాగా, మఱికొన్నిసార్లు ఆయనకి ఏ కోపమూ లేకపోయినా పిశాచజన్మే ఇస్తాడు. అది తప్ప వేఱే గత్యంతరం లేని పరిస్థితిని ఆయనకు అత్మహంతకులు కల్పిస్తారు. కారణం ఏంటంటే - దేవుడికి సంబంధించినంతవఱకు ఈ ప్రపంచంలో నిజంగా వ్యర్థుడూ, పనికిమాలినవాడూ ఎవడూ లేడు. అందరూ ఆయనకు ఏదో ఒక రకంగా పనికొచ్చేవాళ్ళే. చిన్నదో-పెద్దదో, మంచో-చెడ్డో ప్రతివాడికీ ఆయన తన జగన్నాటకంలో ఒక పాత్ర ఇచ్చి దాన్ని సక్రమంగా పోషించమని భూలోకంలోకి పంపిస్తాడు. ఇక్కడ మన సన్నిధానంలో జరగాల్సిన సంఘటనలున్నాయి. మనమీద మనకు తెలియకుండా ఆధారపడే మనుషులున్నారు. మనం ఆత్మహత్య చేసుకుంటే మన స్థానాన్ని నిజంగా మనలానే భర్తీచెయ్యగలవాళ్ళెవ్వరూ లేరు. మనం కేవలం పాత్రధారులమే కనుక మనకిందులో లోతుపాతులు పెద్దగా అర్థంకావు. సమాజం దృష్టిలో ఒకడు పోతే మఱొకడు (No one is indispensable, they say.). కాని దేవుడి దృష్టిలో కాదు. ఒక అప్పారావుకు ఇంకో సుబ్బారావు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాడు. ప్రతివాడూ ఒక విశిష్టవ్యక్తి (unique personality). అందుచేత ప్రజాస్వామ్యాలూ, ప్రజాభిప్రాయాలూ, గణాంకాలూ (statistics) ఆయనకి గడ్డిపోచతో సమానం. ఆయన మనుషుల్ని గుంపులుగా కాక వ్యక్తులుగా చూస్తాడు. పైపైన కాక లోలోపలికి తొంగిచూస్తాడు. ఆ తీఱికా, ఓపికా, నేర్పూ ఆయన కొక్కడికే సొంతం.
కాబట్టి ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే - ఆ చర్య దేవుడి ప్రణాళికలో భాగం కాకపోవడంతో అతనికి/ఆమెకు వెంటనే మానవజన్మనివ్వడం ఆయనకు ఇబ్బందికరంగా మారుతుంది. ప్రపంచంలో 330 కోట్లమంది ఆడవాళ్ళు ఉన్నప్పటికీ, మానవజన్మెత్తాలని ఆత్రంగా కాచుక్కూర్చున్న ఆత్మల సంఖ్యతో పోలిస్తే అందుబాటులో ఉన్న మానవగర్భాల యొక్క వాస్తవసంఖ్య చాలా పరిమితమైనది. అవి వందేళ్ళకంటే ముందే రకరకాల వ్యక్తులకు కేటాయించబడి ఉంటాయి. వీటిల్లో ఎక్కడో ఒకచోట ఉన్నపళాన ఆత్మహంతకుల్నిఇఱికించడం ఆయనక్కూడా సాధ్యపడదు. అసలు ఆయన వాళ్ళగుఱించి అంత తీవ్రంగా ఆలోచించాలంటే తమ జీవితంలో ఆయనకు ఏదో ఒక సేవా, ప్రార్థనా చేసి ఉన్న చరిత్ర వాళ్ళకు ఉండాలి కదా ! ఆయనకు ఎంత దయ ఉన్నప్పటికీ అంతిమంగా గర్భాన్ని మొయ్యాల్సింది ఆడది కనుక ఆమె అందుకు సరిపోతుందో లేదో, ఆమెకి ఇలాంటిది ఇష్టమౌనో కాదో కూడా ఆయన చూస్తాడు. అరుదుగా అలాంటి ఆడది దొరికినప్పడు ఆమెకి ఒకే కాన్పులో ముగ్గురిని, నలుగురినీ, ఐదుగురినీ కూడా ప్రసాదించేస్తాడు. ఆయన ఒకణ్ణి పుట్టించాలంటే అంతకుముందే చాలా పూర్వరంగాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఆయన ఒక వైద్యుణ్ణి పుట్టించాలంటే కనీసం వెయ్యిమంది రోగుల్ని కూడా పుట్టించాలి. ఒక పోలీసుని పుట్టించాలంటే కనీసం ఒక వందమంది నేరస్థుల్ని కూడా పుట్టించాలి. ఇది కేవలం మనుషుల సంగతి. ఇతర జీవజాలం సంగతి ఇందుకు కొన్ని లక్షల రెట్లు సంక్లిష్టం. దీన్ని ఆయన మాత్రమే నిర్వహించగలడు. అలాంటి భగవంతుణ్ణే అయోమయంలోకి నెట్టేస్తాడు బుద్ధిహీనుడైన ఆత్మహంతకుడు. తత్ఫలితంగా ఆయన ఆత్మహంతకులకు పిశాచజన్మ ఇచ్చి వాళ్ళ ఆత్మహత్యాపాతకం పరిహారమయ్యేదాకా, పునర్జన్మకి పరిస్థితు లనుకూలించేదాకా వేచిచూస్తాడు. ఆ అనుకూల పరిస్థితులు ఏర్పడ్డానికి వందేళ్ళు పట్టొచ్చు, వెయ్యేళ్ళు పట్టొచ్చు, పదివేలేళ్ళు కూడా పట్టొచ్చు. ఇదొక loop-line గా, waiting list గా భావించవచ్చు. పుట్టగతులు (మళ్ళీ పుట్టడానికి మార్గాలు) లేకపోవడమంటే ఇదే.
అనాథలైన వీథిపిల్లల్ని పోగేసి వాళ్ళతో భిక్షమెత్తించే నేరస్థ ముఠాలున్నట్లే - ఇలా ఆత్మహత్యలకు పాల్పడి దైవబలాన్ని కోల్పోయి పిశాచరూపాన్ని పొందిన మానవాత్మల్ని వెతికిపట్టుకుని క్షుద్రమంత్రాలతో బంధించి వాటికేవో భౌతికానుభవాల్ని ఎఱగా వేసి తమ యొక్క నీచకార్యకలాపాలకు వాటిని వాడుకునే దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ మన సమాజంలో రహస్యంగా సంచరిస్తున్నారని మర్చిపోవద్దు. వాళ్ళని తక్కువ అంచనా వెయ్యొద్దు. కొన్నికొన్ని పిశాచాల్ని తమకప్పగించవలసిందిగా వాళ్ళు పిశాచాలకు రాజైన బేతాళుణ్ణి ఆవాహన చేసి ప్రార్థిస్తారు. అలా...అలా... ఒకసారి ఆత్మహత్యచేసుకున్న జీవి పరిస్థితి రోజురోజుకీ దారుణంగా దిగజారిపోతూ ఉంటుంది. కనుచూపు మేఱలో దాన్నుంచి విముక్తే కనిపించదు. అలా గత 400 సంవత్సరాల నుంచి పిశాచాలుగానే మిగిలిపోయినవాళ్ళున్నారు. ఆ ప్రస్తావన ఇక్కడ సందర్భ సహితం కాదు. ఐతే పిశాచత్వం గుఱించిన నా పరిశోధన వివరాల్ని ఎప్పుడో ఒకప్పుడు ఈ బ్లాగులో ఇలాగే వరుస-టపాలుగా ప్రకటిస్తాను.
చచ్చే ధైర్యమున్నప్పుడు బతికే ధైర్యం కూడా ఉండాలి.(సమాప్తం)
టపా చేసినవారు :
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
3
వ్యాఖ్యలు
ఈ టపాకు గల లంకెలు :
నామాంకం (లేబెల్) : అవశ్యమ్ అనుభోక్తవ్యమ్
ఎవరి చావు వారు చస్తే తప్పేంటి ?-6
లౌకికదృష్టితో చూస్తే ఇద్దరూ ఒక్కసారే ఒక్కలాగే చనిపోయినట్లు అనిపిస్తుంది. కాని ఆ రెండు చావులకూ మధ్య చాలా తేడా ఉంది. అతను బతికి బావుండాలనుకున్నాడు. ఆమెని పెళ్ళి చేసుకుని ఆనందంగా జీవించాలనుకున్నాడు. కాని అలా అర్ధాంతరంగా చనిపోవాల్సి వస్తుందనుకోలేదు. కాని ఇంకొన్ని గంటల్లో తమ వివాహం అయిపోతుందనగా అతను అనివార్యంగా చనిపోయాడు. అందువల్ల అతను పుట్టుకతోనే అల్పాయుష్కుడయ్యుంటాడని తోస్తుంది. ఆ రకంగా అతను ఇరుక్కున్న జలగండం విధినిర్ణయం. అందుచేత అతనిది అకాలమరణమే గాని అసహజ మరణం కాదు. అతనికి చనిపోయాక వేఱేచోట జన్మించే యోగం రాసిపెట్టి ఉంది. అతన్ని నర్తకి పెళ్ళిచేసుకోవడమూ అంత త్వరలో విధవరాలుగా మారడమూ దేవుడికి అభిమతం కాదు. అందుకనే ఇంకొన్ని గంటల్లో వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుంటారనగా అతన్ని ముందుగానే తీసుకెళ్ళిపోవడం. కాని నర్తకి సంగతి అలా కాదు. అయితే ఆ సమయంలో ఆమె కూడా అతని మనీష (mood)లోనే ఉంది. మఱి జరిగినదాన్ని బట్టి చూస్తే మాత్రం ఆమెకి ఆ జన్మలో వివాహయోగం ఉన్నట్లు తోచదు. ప్రియతముల దుర్మరణాన్ని ఆసాంతం కళ్ళారా చూసినవాళ్ళు ఒక జీవితకాలానికి సరిపడా దిగ్భ్రాంతికి లోనౌతారు. వాళ్ళు మళ్ళీ పూర్తిగా పూర్వపు మనుషులయ్యేది కల్ల. ఆ రకంగా ఆమె అతని మరణానంతరం వెనక్కి వెళ్ళిపోయి ఇంక ప్రేమలూ పెళ్ళిళ్ళ లాంటి తగలాటాలేం పెట్టుకోకుండా అతని గతస్మృతుల నీడలో ఒంటరిగా జీవించే యోగం బహుశా రాసిపెట్టి ఉంది. కాని ఆ నొసటిరాతకి వ్యతిరేకంగా ఆమె భగవంతుడిపై తిరగబడింది. తన దయనీయమైన దురదృష్టానికి అక్కడికక్కడే నిలువునా అధోపాతాళానికి క్రుంగిపోయింది. ఆ భంగపాటులో ఆత్మహత్య చేసుకుంది.
ఏ బాధల నుంచి తప్పించుకోవాలని మనుషులు ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ పుట్టి సరిగ్గా అవే బాధల్ని అంతే స్థాయిలో అనుభవించాల్సి వస్తుంది. ఆవార మిగిలిన ఆయుర్దాయం మళ్ళీ అదే బాధానుభవం కోసం మళ్ళించబడుతుంది. అందువల్ల ఆత్మహత్యతో ఆశించిన ప్రయోజనం నెఱవేఱదు. ఉదాహరణకి - ఎయిడ్స్ సోకిందని ఆత్మహత్య చేసుకున్నవారు మళ్ళీ పుట్టి, లేదా అసలింకా పుట్టకముందే తల్లిగర్భంలో ఉండగానే ఆ రోగం సంక్రమించవచ్చు. అదే విధంగా ఆత్మహత్య చేసుకున్న నర్తకి ఈ జన్మలో కూడా జీవితాంతం అవివాహితగా ఉండిపోవాల్సివచ్చింది.
ఆత్మహత్య పర్యవసానాలు : (ఈ ఉదంతంలో పేర్కోబడుతున్న వ్యక్తులు ఇంకా జీవించే ఉన్నారు కనుక వారి గోప్యత నిమిత్తం వారి పేర్లని స్వల్పంగా మార్చడమైనది)
(క్రీ.శ.1980-90) ఎమ్.రామభద్రం వాళ్ళ నాన్న అప్పారావు ఆ రోజుల్లో గుంటూరు పోలీసు శాఖలో కానిస్టేబుల్. వాళ్ళు గుంటూరులో సంపన్నులు నివసించే నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ క్వార్టర్సులో ఉండేవారు. నగరంపాలెం కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తులు గల ప్రాంతం. గుంటూరు జిల్లాకి సంబంధించిన పరిపాలనాయంత్రాంగం యావత్తూ అక్కడే కేంద్రీకృతమై ఉంది. ఆ క్వార్టర్సులోనే భోజేశ్వరి అనే ఒక తెలివైన చలాకీ పిల్ల ఉండేది. ఆమే, హుస్సేన్ అనే ఒక తెలుగు ముస్లిమ్ యువకుడూ ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారం చాలా నెలలపాటు నడిచింది. తరువాత అతనికి వేఱేచోట ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. అయినా మధ్యలో అప్పుడప్పుడు గుంటూరు వచ్చి ఆ పిల్లని కలిసి వెళ్ళేవాడు. ఈలోగా అతని తల్లిదండ్రులు అతనికొక ముస్లిమ్ సంబంధం చూశారు. వాళ్ళింట్లో, వాళ్ళూ వాళ్ళూ ఏం మాట్లాడుకున్నారో మఱి, మొత్తం మీద భోజేశ్వరిని మర్చిపోయి తన కులం అమ్మాయిని చేసుకోవడానికి హుస్సేన్ అంగీకరించాడు. పెళ్ళి ఏర్పాట్లన్నీ శరవేగంతో జరిగిపోయాయి. శుభలేఖలు కూడా అచ్చేశారు. మర్నాడు పెళ్ళి అనగా హుస్సేన్ బావుండదనుకున్నాడో ఏమో భోజేశ్వరికి ఫోన్‌చేసి తన పెళ్ళి విషయం చెప్పేశాడు. తన పెళ్ళికి తప్పకుండా రావాలని కూడా ఆహ్వానించాడు. "అందరికీ వ్యక్తిగతంగా శుభలేఖలిచ్చి ఇంతకాలంపాటు స్నేహంచేసినదాన్ని నాకు మాత్రం ఇంత ముఖ్యమైన విషయం ఫోన్‌లోనా చెప్పేది ?" అని నిష్ఠూరమాడింది భోజేశ్వరి. "సరే ! స్వయంగా వచ్చి శుభలేఖ ఇస్తాలే."అన్నాడు హుస్సేన్. అన్నప్రకారంగానే మఱో గంటలో భోజేశ్వరివాళ్ళ ఇంటిముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. శుభలేఖ తీసుకుని అభినందనలు చెప్పింది. "చివరిసారిగా నేనిచ్చే కాఫీ తాగవా ?" అని అడిగింది. సరేనన్నాడు హుస్సేన్, భోజేశ్వరి వాలకం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంటూ. అక్కడున్న వార్తాపత్రిక తీసి తిరగెయ్యసాగాడు. వంటగదిలోకి వెళ్ళిన భోజేశ్వరి బయటికొచ్చింది, అగ్నిదేవతలా ఒంటినిండా కిరోసినాయిల్ వాసనతో నిలువెల్లా నాలుకలు సాచిన జ్వాలలతో భగభగ దహించుకుపోతూ చడీచప్పుడూ లేకుండా అతని దగ్గరికొచ్చి మీదపడి అతన్ని గట్టిగా పట్టుకుని వాటేసుకుంది. వార్తాపత్రిక చదువుకుంటున్న హుస్సేన్ ఒక జీవితకాలపు దిగ్భ్రాంతిని పొందాడు. ఆ వచ్చినదీ, దహించుకుపోతున్నదీ, తనని పట్టుకున్నదీ ఎవరో అతనికి చప్పున అర్థంకాలేదు. "భోజేశ్వరీ ! భోజేశ్వరీ !"అని సహాయం కోసం పిలుస్తూ పెనుగులాడుతున్నాడు. కాలిపోతున్న భోజేశ్వరి "నేనే...నేనే...భోజాన్ని" అంటూ కాలిపోతోంది. ఆ గొంతు విన్నాక అసలు విషయం అర్థమైంది హుస్సేన్‌కి. ఆమెనుంచి ఎలానో తప్పించుకుని ఆమె గడియపెట్టి ఉంచిన తలుపుని తెఱుచుకుని బయటికి పరిగెత్తాడు. అతని ఒళ్ళు కూడా కొంత కాలింది. అతన్ని పొరుగువాళ్ళు వెంటనే ఆస్పత్రికి తరలించారు. భోజేశ్వరి అక్కడికక్కడే సజీవంగా కాలి బొగ్గైపోయింది. హుస్సేన్ పెళ్ళి వాయిదాపడింది కాని నెలరోజుల చికిత్స అనంతరం అతను శారీరికంగా మళ్ళీ మామూలు మనిషయ్యాడు.
రామభద్రం వాళ్ళ నాన్న ఆరోజుల్లో రాత్రిపూట విధినిర్వహణలో పడి ఇంటికి ఆలస్యంగా వచ్చి భోజనం చేసేవాడు. ఆయనకొక విచిత్రమైన అలవాటు ఉండేది. అదేమిటంటే రాత్రిపూట పెరుగన్నం తినడం. భోజేశ్వరి చనిపోయిన 15 రోజులకి ఆయన యథాప్రకారం రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చేసరికి ఇంట్లో పెరుగు లేదు. నగరంపాలెం కలక్టరాఫీసు దగ్గర ఒక హోటల్లో రోజూ 24 గంటలూ పాలూ పెరుగు అమ్ముతారు. భారతీయ నగరాల్లో ఇలాంటి 24-గంటల సేవలు చాలా మామూలు విషయం. నిద్రపోతున్న వేళలో తనని తండ్రి ఇలా లేపి ఏదో ఒక పనికి పంపడం రామభద్రానికి కొత్త కాదు. అందుచేత ఒక స్టీలు టిఫిన్ డబ్బా పట్టుకుని పెరుగు తేవడం కోసం గుంటూరు జిల్లా కలెక్టరాఫీసు దగ్గరికి బయలుదేరాడు. నగరంపాలెం ఒక విలాసవంతమైన ప్రాంతం (posh area) కావడం చేత ఆ రోడ్లన్నీ అర్ధరాత్రివేళ కూడా పట్టపగల్లా ధగద్ధగాయమానంగా మెఱిసిపోయేలా అధికారులు శ్రద్ధవహిస్తారు. రామభద్రం ఈలవేసుకుంటూ పాటపాడుకుంటూ ఆ నిర్జన రహదారికున్న సువిశాలమైన పేవ్‌మెంట్ (సైడ్‌వాక్) మీద నడుస్తున్నాడు. ఆ సైడ్‌వాక్ పక్కన గాలికి చిఱుసవ్వడితో ఊగుతున్న అవెన్యూ ప్లాంటేషన్ వెనుకనుంచి "భద్రం !" అనే నెమ్మదైన ఆడగొంతు పిలిచిన పిలుపు వినపడింది. ఈ సమయంలో ఈ రోడ్డుమీద ఆడవాళ్ళెవరా ? అనుకుంటూ రామభద్రం పక్కకి తిరిగి చూశాడు. ఆ చెట్టు వెనక విద్యుద్దీపాల నీడల్లో ఎఱ్ఱటి చింతనిప్పుల్లాంటి కళ్ళతో అదే చిఱునవ్వుతో-
ఆమె...ఆమె...భోజేశ్వరి ! సరిగ్గా 15 రోజుల క్రితం కాలిపోయి చచ్చి బూడిదైన భోజేశ్వరి !!
మఱికొంత వచ్చే టపాలో...
టపా చేసినవారు :
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
4
వ్యాఖ్యలు
ఈ టపాకు గల లంకెలు :
నామాంకం (లేబెల్) : అవశ్యమ్ అనుభోక్తవ్యమ్
Thursday, April 03, 2008
ఎవరి చావు వారు చస్తే తప్పేంటి ?-5
ఆత్మహత్య పర్యవసానాలు :ఆమె కొన్నివందల సంవత్సరాల క్రితం ఉత్తరభారతదేశంలో ముస్లిమ్ గా జన్మించింది. ఆ రోజుల్లో మంచి సౌందర్యవతి. ఒక సుల్తాను కొలువులో తాను రాజనర్తకిగా పనిచేసేది. ఆమెకొక హిందూయువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ వారి వివాహం అటూ ఇటూ ఎవరికీ ఇష్టంలేదు. చాలా గొడవలు కూడా అయ్యాయి. అందుచేత అందరినీ వదిలిపెట్టి ఆ రాజ్యానికి దూరంగా ఎటైనా పారిపోయి పెళ్ళిచేసుకోవాలని, భార్యాభర్తలుగా జీవించాలని వారిద్దరూ నిశ్చయించుకున్నారు. అలా వారు బయలుదేరి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ పోయి ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఆమె ప్రియుడికి స్నానం చెయ్యాలనిపించింది. ఆమెని ఒడ్డునే ఉండమని చెప్పి అతను నదిలోకి దిగాడు. దిగి నాలుగడుగులు లోపలికి వేస్తూనే "అమ్మో ! మునిగిపోతున్నాను. నేను మునిగిపోతున్నాను"అని కేకలు వేశాడు. అతనికి ఈత రాదు. నర్తకి దిగ్భ్రాంతిచెంది చూస్తూండగానే ఆమెకి భర్త కావాల్సినవాడు ఆ విధంగా మునిగిపోయాడు, క్షణాలమీద చనిపోయాడు. నర్తకి కూడా వెనువెంటనే ఆ నదిలోకే దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ ప్రేమకథ అలా అనూహ్యంగా అర్ధాంతరంగా పరిసమాప్తమైంది.
ఆమె మళ్ళీ 1941-42 ప్రాంతంలో ఆంధ్రదేశంలో హిందూస్త్రీగా జన్మించింది. ఆమె పూర్వజన్మప్రియుడేమయ్యాడో తెలియదు. ఆమెక్కూడా ప్రస్తుతం తన పూర్వజన్మ గుర్తులేదు. కాని తన పూర్వజన్మని శోధించడానికి ఆమె జ్యోతిష్కుల్ని అనుమతించింది. ఈ జన్మలో తాను తెలుగుదైనప్పటికీ, తనకి ఉర్దూ ఒక్కముక్క కూడా రాకపోయినా ఆ భాషంటే మటుకు చాలా ఇష్టం. ముస్లిమ్ లను గుఱించిన సినిమాలూ, వారికి సంబంధించిన పాతబడ్డ కోటలూ రాజప్రాసాదాలూ చూడ్డమంటే కూడా చాలా ఇష్టం. ఆ జన్మలో లాగే ఈ జన్మలో కూడా తనకి వివాహం కాలేదు. కారణం ఆమెకీ తెలియదు. ఈ జన్మలో కూడా ఆమె కాస్తో కూస్తో అందగత్తే. అలా అని ఎవరినీ ప్రేమించలేదు. ఆమెని కూడా ఎవరూ ప్రేమించలేదు, పెళ్ళిచేసుకుంటానని ముందుకు రానూలేదు. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటీ కుదరలేదు. కాని ఆమె బాగా చదువుకుంది. నాట్యమైతే రాదు కానీ అనేక కష్టనష్టాలనుభవించింది.
ఆమె ఈ మధ్యలో ఇంకెక్కడా జన్మలెత్తలేదని భావించబడుతోంది. ఎందుకంటే ఒకానొక భారతీయ జ్యోతిశ్శాస్త్ర పద్ధతి ననుసరించి కనుగొనబడ్డ ఆమె యొక్క తక్షణ పూర్వజన్మల్ని గుఱించిన ప్రశ్నలో పై ఉదంతం మాత్రమే తెలియవచ్చింది. ఈ నడిమి కొన్నివందల సంవత్సరాల వ్యవధానాన్ని ఆమె ఎక్కడ గడిపిందో అంతకాలమూ ఎలా ఉందో తెలియరావడంలేదు. పూర్వజన్మలో ఆమె తన ప్రియుడి మరణానంతరం ఆత్మహత్యకు పాల్పడ్డంలోని ఉద్దేశం (motive) కూడా సరిగా అర్థంకావడంలేదు. ఇంత కష్టపడి ఈ ప్రాచీన సంఘటనకు చేసిన జ్యౌతిషిక పునర్ నిర్మాణం (astrological reconstruction) లో సైతం ఈ విధంగా కొన్ని పూరింపబడని ఖాళీలు మిగిలిపోయాయి. అతను లేని తన జీవితం వ్యర్థమని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకుందా ? లేక చావైనా బతుకైనా ఇద్దరమూ కలిసే అనుకుని చనిపోయిందా ? లేక దు:ఖోద్వేగంలో నిరాశోపహతస్థితిలో తొందఱపడి నిర్ణయం తీసుకుందా ? జంటగా వెళ్ళినది కాస్తా ఒంటరిగా వెనక్కి రావాల్సిరావడం అవమానకరంగా భావించిందా ? లోకాపవాదేదైనా మీదపడుతుందని భయపడిందా ? తన ప్రియుడు తన కళ్ళముందే మునిగి చనిపోతూంటే చేతగాక చేష్టలుదక్కి చూడాల్సివచ్చి అతనికి ఆ క్లిష్టపరిస్థితిలో ఏ సహాయమూ చెయ్యలేకపోయిన తన అసమర్థతని అసహ్యించుకుని ఒకవిధమైన ఆత్మనిందాభావంతో చనిపోవ నిశ్చయించుకుందా ? ఏది ఏమైనా ఆమె పాల్పడ్డది ఆత్మహత్యకు, ఒక నిషిద్ధపాపానికి ! అయితే సతీసహగమనం శాస్త్రసమ్మతమైనప్పుడు ఆమె చేసింది మాత్రం శాస్త్రవిరుద్ధమెలా అవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. అది ఆత్మహత్య కానప్పుడు ఇది మాత్రం ఆత్మహత్య ఎలా అవుతుంది ? అంటే సతీసహగమనం కూడా ఆత్మహత్యే. అది పుణ్యం కాదు, పాపమే. సతీసహగమనం యొక్క మూలాల్ని శోధించినప్పుడు బయటపడే విషయమిది. ఆ ప్రస్తావన ఇక్కడ ప్రసక్తం (relevant) కాదు కనుక ఇంతకంటే ఎక్కువ రాయలేను.
ఆత్మహత్య చేసుకున్నవారు చనిపోయాక పిశాచాలవుతారు. కనుక ఆమె చనిపోయాక పిశాచమై కొన్నివందల సంవత్సరాలు అలాగే ఉండిపోవడం చేత ఈ మధ్యలో జన్మలెత్తలేకపోయి ఉండొచ్చు. పిశాచజన్మ సాంకేతికంగా లోకాంతరం కావడానా, మానవలోకంతో సంబంధం లేనిదిగా భావించడం మూలానా అది పూర్వజన్మప్రశ్నలలో కనిపించడం అరుదు. అందువల్లనే ఆమెయొక్క తక్షణ పూర్వజన్మ గుఱించిన ప్రశ్నలో ఆనాటి రాజనర్తకి జన్మ ఒక్కటే తెలియవస్తూండి ఉండొచ్చు. ఈ జన్మలోని కష్టాలక్కూడా ఆనాటి ఆత్మహత్యాపాపం కొంతవఱకు కారణం కావచ్చు. "జన్మజన్మలకూ నువ్వే నా భర్తవి" అంటూ ప్రేమమైకంలో చేసిన భావోద్వేగపూరితమైన, హృదయపూర్వకమైన ప్రతిజ్ఞల వల్ల ఈ జన్మలో కూడా భర్త లభించకపోయి ఉండొచ్చు.
మఱికొంత వచ్చే టపాలో....
టపా చేసినవారు :
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
2
వ్యాఖ్యలు
ఈ టపాకు గల లంకెలు :
నామాంకం (లేబెల్) : అవశ్యమ్ అనుభోక్తవ్యమ్
Saturday, March 29, 2008
ఎవరి చావు వారు చస్తే తప్పేంటి ?-4
దుర్మరణాలు సంభవించబోతున్నట్లు సకాలంలో - పెద్ద శాస్త్రజ్ఞానం ఉపయోగించకుండానే - ఖచ్చితంగా తెలుసుకునే పద్ధతేమీ లేదా ? అంటే లేకేం ? ఉంది. కానీ ఎక్కువమంది ఆ సూచనల్ని నిర్లక్ష్యం చేస్తారు. మనిషికి భగవంతుడు పంచేంద్రియాలతో పాటు Sixth sense కూడా ఒకటిచ్చాడు. కానీ మనిషి నాగరికతాక్రమంలో అన్ని సహజలక్షణాల్నీ పోగొట్టుకున్నట్లే దాన్నికూడా పోగొట్టుకుంటున్నాడు. పైగా తనకు లేని Sixth sense ఎవరికన్నా ఉంటే వాళ్ళేదో వెనకబడ్డట్లూ sentimental fools ఐనట్లూ, తాను మాత్రం నికార్సైన హేతువాదైనట్లూ ఎగతాళి చెయ్యడం కూడా నేర్చుకున్నాడు. తత్ఫలితంగా భాష, మరియు దానిమీద విపరీతంగా అధారపడ్డ తర్కమనే రంగులరాట్నమూ అనే రెండు కుంటిసాధనాలు మినహాయించి మనిషిలో ఇతరవిధాలైన ప్రతిభలూ, శక్తులూ వికసించడం మానేశాయి.
ఫలితార్థంగా ఇప్పడేమౌతోందంటే - Sixth sense అనేది ఈరోజు ఆడవాళ్ళల్లోను, జంతువుల్లోను తప్ప మిగతా మానవజాతిలో క్రమంగా మఱుగున పడుతోంది. ఆడవాళ్ళు మగవాళ్ళని అనుకరించడం హెచ్చేకొద్దీ అది వాళ్ళల్లో కూడా అరుదైపోతుంది. ముఖ్యంగా మత్తుపదార్థాలకూ, త్రాగుడుకూ అలవాటుపడ్డవాళ్లల్లోను, ఎక్కువసార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నవాళ్ళల్లోను, పాపాలు అపరిమితంగా చేసినవాళ్ళల్లోను Sixth sense నశిస్తుంది.అందుకనే ఆధ్యాత్మిక మహాపురుషులు ఎట్టి పరిస్థితుల్లోను మత్తుపదార్థాల వాడకానికి ఇష్టపడరు. మహాత్మాగాంధి పూర్తి మెలకువలో ఉన్నప్పుడే అపెండిసైటిస్ కి శస్త్రచికిత్స చేయించుకున్నారు. జిడ్డు కృష్ణమూర్తి కూడా అంతే !
Sixth sense ని కోల్పోయిన పర్యవసానమేంటంటే - అది కోల్పోయినవాళ్ళు జరగబోయే విషయాల్ని ముందుగా పసిగట్టలేరు. తమకు తారసిల్లిన అపరిచితుల యొక్క అవాంఛనీయ వ్యక్తిత్వం గుఱించి వాళ్ళ మనసు వాళ్ళని హెచ్చరించడం మానేస్తుంది. సుదూరంలో ఉన్న తమ ఆప్తులకు అనర్ధాలు సంభవిస్తూంటే వాళ్ళకు మాత్రం అందుగుఱించి తమ శరీరంలోనూ, మనసులోనూ ఏ విధమైన ప్రతిచర్యలూ కనిపించవు. కనీసం పీడకలలు కూడా రావు. కళ్ళముందు ప్రత్యక్షంగా జరుగుతున్న విషయాల్లో కూడా లోగుట్టు గ్రహించలేరు. వాళ్ళు ఎంత తర్కాన్ని ఉపయోగించినా మనిషి తర్కం ప్రాథమికంగా గతం, వర్తమానం చుట్టూ మాత్రమే తిరగ్గలదు గనుక వాళ్ళు భవిష్యత్తు గుఱించి ఎవరైనా హెచ్చరించినా తెలుసుకోజాలరు.
"శ్రీ పెరుంబుదూరులో మీకు ప్రాణహాని ఉం"దని ఆనాటి కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి కీ.శే. రాజీవ్ గాంధికి సందేశం పంపినా అతను లెక్కచెయ్యకుండా ఆ ఊరికే వెళ్ళాడు, చావుని వెతుక్కుంటూ ! ఇందుకు విరుద్ధంగా హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులతో దాడి జరగడానికి కొన్నిరోజులముందే అక్కడి వీథిజంతువులన్నీ (కొన్ని పెంపుడు జంతువులు కూడా) ఆ నగరాల నుంచి పారిపోయిన సంఘటనని స్థానిక చరిత్రకారులు నమోదుచేశారు. గ్రహణాలు కూడా అంతే ! ఆ సమయంలో జంతువులూ, పక్షులూ ఆహారం కోసం వెళ్ళవు. మఱి వాటికెవడు బోధించాడో ఆస్ట్రానమీ ! తెలియదు.
మనిషిని బతికించేదే అతన్ని చంపుతుంది కూడా ! చావు జీవశక్తుల రూపంలో మన శరీరంలో ఇన్-బిల్ట్. వాటిని మనం యముడు, యమకింకరులూ అనే పేర్లతో పిలుస్తున్నాం. మనిషి చనిపోవడానికి కొన్నిరోజులముందునుంచే అతని శరీరంలోని జీవశక్తులన్నీ బయటికొచ్చి విహరిస్తాయి-ఇల్లు ఖాళీచెయ్యడానికి హడావిడి పడుతున్నవాళ్ళలాగా ! అవి సాధారణంగా పెంపుడు జంతువులకు కనిపిస్తాయి. ముఖ్యంగా కుక్కలకి ! వాళ్ళెవరో ఏమిటో వాటికర్థంకాక గుబులుచెంది అహోరాత్రాలూ ఏడవడం, మొఱగడం చేస్తాయి. మనం వాటిమీద విసుక్కుని కసురుతాం, కొడతాం కూడా ! అంతేతప్ప వాటిద్వారా వ్యక్తమౌతున్న సూచనల్ని గ్రహించం.
ఒక్క విచారకరమైన విషయం. ఆత్మహత్య చేసుకునేవాళ్ళ విషయంలో మాత్రం ఈ సూచనలేమీ ఉండవు.
మఱికొంత వచ్చే టపాలో !
టపా చేసినవారు :
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
2
వ్యాఖ్యలు
ఈ టపాకు గల లంకెలు :
నామాంకం (లేబెల్) : అవశ్యమ్ అనుభోక్తవ్యమ్
Saturday, March 08, 2008
ఎవరి చావు వారు చస్తే తప్పేంటి-3
బహుకాల పరిశోధనల తరువాత హత్యలూ ఆత్మహత్యలూ దొంగతనాలూ దాడులూ ద్రోహాలూ లేదా అలాంటి విషాదాలు (tragedies) సాధారణంగా 4 మఱియు 8 అనే అంకెలకు సంబంధించినవని గుర్తించబడింది.అంటే ఇవి ఐకాంతిక (stand-alone) సంఖ్యలుగా ఉన్నప్పుడు లేదా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 4 గానీ 8 గానీ అయినప్పుడు మాత్రమే ప్రమాదకరంగా పరిణమిస్తాయి.అంతేతప్ప ఒక పెద్దసంఖ్యలో భాగంగా నాలుగో ఎనిమిదో ఉన్నంతమాత్రంచేత కొంపలేమీ మునగవు.వీటిల్లో మొదటిది (4) రాహువుకు సంబంధించిన అంకె.రెండోది (8) శనికి సంబంధించినది.వీటి ఆకారమే ఉరిపోసుకున్నట్లు ఉండడం గమనార్హం. శనివద్ రాహు: (రాహువు, శని వలెనె) అని శాస్త్రాలు పేర్కొనడం చేత రాహువు దాదాపుగా శనిలాగానే ప్రవర్తిస్తూ ఆయన ఇచ్చే ఫలితాల్నే తాను కూడా ఇస్తాడు.
అన్ని అంకెల్నీ కూడగా 4 లేదా 8 వచ్చే సంఖ్యలు కూడా ప్రమాదకరమైన సంకేతాలే.అంటే 13, 17, 22, 26, 31 లాంటి తేదీలూ, ఆ నెంబర్లు గల ఇళ్ళూ గదులూ వీథులూ వాంఛనీయం కాదు.అలాగే 35, 40, 44, 53, 62, 71, 103, 107, 202, 206, 301, 305, 400, 404, 503, 602, 701 మొదలైన నెంబర్లు కూడా ! ఇవి మనిషి కంటికి కనిపించని ప్రతీప శక్తుల్ని (negative forces) ని అమితంగా ఆకర్షిస్తాయి.దురదృష్టాల్ని ఆహ్వానిస్తాయి.ముఖ్యంగా-నాలుగో నెంబరు వ్యక్తులూ ఎనిమిదో నెంబరు వ్యక్తులూ వాటిల్లోకి ప్రవేశించినప్పుడూ ఆ తేదీలు కూడా నాలుగో నెంబరు, ఎనిమిదో నెంబరు అయినప్పుడు ఒక సర్క్యూట్ పూర్తవుతుంది.ఇంక భయంకర విస్ఫోటంతో నేరం జరగడమే తరువాయి.(నాలుగో నెంబరు వ్యక్తి అంటే ఆ తేదీన పుట్టినవాడు)ఈ నెంబర్లు గల ఇళ్ళకు ఏళ్ళతరబడి పాతకాపులైనవాళ్ళని ఎవరినడిగినా తమ యింట్లో ఒక పెనువిషాదం జరిగిందని చెబుతారు.కాని అక్కడ ఉండడం మానేస్తే ఆ నష్టం జరగదు.ఈ నెంబర్లు గల వాహనాలు కూడా మంచివి కావు.కానీ కర్మచాలక అలాంటి సంఖ్యలు అజ్ఞానులచేత ఆధికారికంగా కేటాయించబడ్డ సందర్భాల్లో ఆ కేటాయిత సంఖ్య పక్కన "అ" అనే తెలుగు అక్షరాన్ని గాని A అనే ఆంగ్ల అక్షరాన్ని గానీ అనాధికారికంగా జతచేర్చుకుని వ్యవహరించడం మూలంగా 90 శాతం కీడు జరక్కుండా తప్పించుకోవచ్చు.
అలాగే వీథిమూతల (Dead-ends or blind alleys) పక్కనే ఉన్న ఇళ్ళలో నివసించే కుటుంబాల్లో కూడా ఏదో ఒకరోజు ఒక అసాధారణమైన విషాదం చోటుచేసుకోవచ్చు.అది సాధారణంగా వంశనాశనం చేసే రీతిలో ఉంటుంది.అంటే ఆ కుటుంబంలో కనీసం ఒక మగపిల్లవాడు అల్పాయుష్కుడుగా నిస్సంతుగా తొందఱగ&