Showing posts with label అవర్గీకృతాలు. Show all posts
Showing posts with label అవర్గీకృతాలు. Show all posts

Tuesday, April 29, 2008

బ్లాగర్ డాట్ కామ్ బ్లాగుల్లోకి PDF కవిలెల పొందుపర్పు

బ్లాగరులు కాకముందే కవులూ, రచయితలైనవారికి ఎదురయ్యే బుఱ్ఱతొలుచు సమస్య - తమ పాతరచనల్ని తమ బ్లాగుల్లోకి ప్రచురించడం ఎలా ? అనేది. వాటన్నింటినీ మళ్ళీ అక్షరమక్షరమూ ఆసాంతం టైపుచేసి బ్లాగులోకి ఎక్కించడం చాలా కష్టం. అయితే ఇప్పటికే కంప్యూటరీకరింపబడి ఎలక్ట్రానిక్ గా భద్రపఱచబడ్డ ఫైళ్ళని మాత్రం మన బ్లాగులోకి యథాతథంగా ఎక్కించడానికి అవకాశముంది. ముందుగా గుర్తించాల్సిన విషయం - బ్లాగర్ డాట్ కామ్ కి చెందిన బ్లాగుల్లో స్వతహాగా పాఠ్యకవిలెల (text files) పొందుపర్పుకి వెసులుబాటు లేదు. అయినా సరే, అలా పొందుపఱచుకోవడానికి ఒక దివ్యమైన డొంకతిరుగుడు ఉపాయం లేకపోలేదు. ఇంకో విషయం - ఇక్కడ సూచిస్తున్న మార్గం కేవలం ఆతిథ్యం పొందే బ్లాగులకే కాక స్వతంత్ర సాలెగూళ్ళ(Websites)క్కూడా అక్కఱ కొస్తుంది. స్వతంత్ర గూళ్ళకు ఇలాంటి ఉపాయాల అవసరం ఏమిటంటారా ? మన సైటుకు కేటాయితమైన జ్ఞాపకజాగా (allotted memory space)ని పొదుపు చేసుకోవచ్చు.

ఏయే ఫైళ్ళని ఎక్కించగలం ? :- అది scribd వారు అనుమతించిన సంప్రకారాల్ని (file formats) బట్టి ఉంటుంది. సాధారణంగా MS-Word, Open Office, PDF, JPEG, GIF ఫైళ్ళన్నీ నిరాటంకంగా ఎగుమతవుతాయి

మనం చెయ్యాల్సింది ఇది :-

1.ముందుగా http://scribd.com/ సైటులోకెళ్ళి ఉచితంగా sign up అవ్వండి. మీ సంకేతపదాన్ని (password) మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.

2. అక్కడ వెబ్ పుట పైన upload అనే బొత్తాము (బటన్) ఉంటుంది. దాని మీద నొక్కండి. ఆ సైటులోనే upload పుట ఒకటి తెఱుచుకుంటుంది.

3. అందులో మళ్ళీ ఇంకో Click here to upload/browse బొత్తాము ఉంటుంది. దానిమీద నొక్కండి. అప్పుడు మీ కంప్యూటర్ లో ఉన్న My Documents చిట్టా తాలూకు మెన్యూ విండో ప్రత్యక్షమౌతుంది. అందులో మీక్కావాల్సిన PDF file ఎంచుకోండి. open అనండి. సదరు ఫైలు scribd.com లోకి ఎగుమతి కావడం మొదలవుతుంది.

4. ఎగుమతి పూర్తయ్యేదాకా వేచిచూడండి. పూర్తయ్యాక అదే వెబ్ పుటలో publish అనే column ప్రత్యక్షమౌతుంది. అక్కడ మీరు తప్పనిసరిగా నింపాల్సిన వివరాలు :

౧. మీ ఫైలు పేరు

౨. ఫైలు గుఱించిన వివరణ

౩. ఫైలుకివ్వాల్సిన Tag

౪. ఫైలు కేటగరీ ఎంపిక.

వీటిల్లో మొదటి రెండూ మీరు తెలుగులోనే చెయ్యడానికి అవకాశం ఉంది. మీరు కేటగరీ నింపకపోతే scribd.com వాడే తన యిష్టమొచ్చిన Default Category కేటాయిస్తాడు. అది ఖచ్చితంగా బావుండదు.

5. ఇవన్నీ నింపాక Publish అని నొక్కండి. మీ ఫైలు scribd.com లోకి ఎక్కినట్లే ! ఎక్కినట్లు తెలియజేస్తూ ఇంకో వెబ్ పుట తెఱుచుకుంటుంది కూడా.

6. scribd.com వెబ్ పుట పైభాగంలో కనిపించే మీ User-name మీద నొక్కితే మీ వ్యక్తిగత scribd ఖాతాల పుటలోకి వెళతారు. అక్కడ మీరు ఎగుమతి చేసిన ఫైలు కనిపిస్తుంది. దానిపేరుమీద నొక్కితే ఇంకో వెబ్ పుట తెఱుచుకుంటుంది.అక్కడ మీ ఫైలు i-Paper software వారి ప్రత్యేక విండోలో పైకీ కిందికీ బద్దలతో జరుపుకొని చూసుకోవడానికి వీలుగా దర్శనమిస్తుంది.

7. దానిపక్కనే సదరు ఫైలు తాలూకు Embed code (Scribd.com వారు కేటాయించినది) కనిపిస్తుంది. దాన్ని copy చేసి మీ బ్లాగు యొక్క Compose Box లో అతికించండి. Publish అనండి. ఇప్పడు మీ బ్లాగు యొక్క బహిరంగ పుటలో ఆ ఫైలు యావత్తూ Youtube మాదిరి ప్రత్యక్షం. మీ పాఠకులు దానికున్న బద్దతో పైకీ కిందికీ జరుపుకుని మొత్తం ఫైలుని చదువుకుంటారు. ఉదాహరణకు నా బ్లాగులో నేను పెట్టిన ఫైలుని ఈ కిందిలంకెలో చూడవచ్చు.

http://naasaahityam.blogspot.com/2007/03/jpeg_19.html

ఇదంతా మొదట్లో అదో మాదిరిగా అనిపించవచ్చు. పోను పోను మీరే ఆస్వాదిస్తారు. కొన్నిసార్లు "మీరు embed చేసిన కోడ్ బాలేదు గట్రా" అంటూ మీ బ్లాగు మిమ్మల్ని సతాయించవచ్చు. అయినా నిరుత్సాహపడకుండా పాతకోడ్ చెఱిపేసి కొత్తకోడుతో ప్రయత్నిస్తూ విజయులం కావాలి.


ప్రత్యామ్నాయం : నేరుగా బ్లాగులోకి మీ ఫైళ్ళని ఎక్కించాలనుకుంటే మాత్రం http://blog.co.uk/ లో సంతకించండి (sign up అవ్వండి). అక్కడ ఒక బ్లాగు ప్రారంభించండి.

(తెలుగుబ్లాగు గుంపులో ఈ విషయమై శ్రీ జాన్ హైడ్ కనుమూరిగారడిగిన ప్రశ్నకు నేనిచ్చిన సమాధానాన్ని బ్లాగులో పెట్టమని నెటిజన్ గారిచ్చిన సూచనకు అనుగుణంగా .....ఆ సమాధానాన్నే మఱికొంత విస్తరించి ఇక్కడ వ్రాయడమైనది)

Friday, January 25, 2008

విడుపు (Break)

పలు ఇతరేతర కార్య వ్యగ్రతల వల్ల వచ్చే మూణ్ణెల్లలో కలగూరగంప బ్లాగులో కొత్త టపాలు కనిపించవు.మళ్ళీ 2008 మే నెలాదిలో కలుద్దాం !