
లంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అభ్యంతరకరం. ఇందులో రెండు విషయాలున్నాయి. ఒకటి - సైద్ధాంతికం. రెండు - ఆచరణాత్మకం. కానీ ప్రస్తుతం ఆ పార్టీలో ఈ రెండూ లోపించాయి. తెలుగుదేశం పార్టీ తెలుగువారి సంక్షేమం కోసమే కాక వారి సమైక్యం కోసం కూడా ఆవిర్భవించింది. దాని వ్యవస్థాపకుడు స్వర్గీయ డా|| ఎన్.టి. రామారావుగారు లేవనెత్తిన తెలుగువారి ఆత్మగౌరవ నినాదంలోనే తెలుగువారి సమైక్య భావన అంతర్‌నిహితంగా ఇమిడి ఉంది. ఎందుకంటే సమైక్యం లేని ఆత్మగౌరవం ఒక మనోభ్రాంతి. జాతినంతా ఒకే మానకం (unit) గా చూడకపోతే ఆత్మగౌరవ నినాదం అర్థం కాదు కూడా. చీలికలూ, వాలికలై కొట్టుకుచచ్చే జాతులు ఇతర జాతుల దృష్టిలో అపహాస్యానికి గుఱవుతారు తప్ప వారికి ఏ గౌరవమూ ఉండదు. పైగా ఆ కొట్టుకుచచ్చేవారు తమ అంతఃకలహాలలో భాగంగా తమవారి గుఱించే తాము హీనంగా ప్రసంగిస్తారు.తెలుగుదేశం పార్టీ బెదుఱుగొడ్డు రాజకీయాలు : ఆచరణాత్మకంగా తెలుగుదేశం పార్టీ వేర్పాటువాద శక్తులతో చేతులు కలిపింది. లేని తెలంగాణ సెంటిమెంటుని ఊహించుకొని, బలం లేని తె.రా.స.తో జట్టుకట్టి, తమ బలంతో దాన్ని పది స్థానాల్లో గెలిపించి అనవసరంగా వేర్పాటువాదాన్ని పెంచిపోషించిన పాపం ఆ పార్టీది. చిరంజీవిని చూసి మళ్ళీ ఆయనకు లేని బలాన్ని ఊహించుకొని గడగడా వణికిపోవడం, ఆ వణుకులో ఆదుర్దా నిర్ణయాలు తీసుకొని బోల్తాపడడం ఇందుకొక కారణం. ఇప్పుడు రాష్ట్రంలో విజృంభించిన వేర్పాటువాదాలన్నింటికీ తెలుగుదేశం పార్టీ అవలంబించిన తప్పుడు విధానాలే కారణం అంటే అతిశయోక్తి కాదు.
ఈ మాట చెప్పేటప్పుడు నేను 2004 నాటికి ముందున్న పరిస్థితి గుఱించి మాట్లాడ్డంలేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రవిభజనకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే ఈ రాష్ట్రంలో సమైక్యవాదులకి, వారి ఆస్తులకీ భద్రత కఱువైంది. వ్యక్తిగతంగా చంద్రబాబునాయుడుగారికి తప్ప ఎవఱికీ భద్రత లేని దారుణ పరిస్థితి. సమైక్యం గుఱించి మాట్లాడ్డమే నేరమైపోయింది. సమైక్యభావనే అపహాస్యం పాలైపోయింది. తెలుగుదేశంవాళ్లే రాష్ట్రవిభజనని సమర్థిస్తూంటే మీరెంత ? మేమెంత ? అనే వాదాలు మిన్నుముట్టాయి. తెలుగుదేశాన్ని చూసి కాంగ్రెస్సూ అదే బాట పట్టింది. "నీకంటె పెద్ద చవటాయిని నేను, నీకంటె పెద్ద వెధవాయిని నేను" అన్నట్లు వేర్పాటువాదాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేయడానికి పార్టీల మధ్య తోపుళ్ళూ, తొక్కిసలాటలూ మొదలయ్యాయి. ఇదంతా నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ పుణ్యమే.
చిదంబరం డిసెంబరు 9 న తెలంగాణకి అనుకూలంగా ప్రకటన చేయడానిక్కూడా తెలుగుదేశమే ప్రధాన ప్రేరణ. ఆ రోజు వాళ్ళు "మద్దతిస్తా" మని చెప్పకపోతే చిదంబరం కేసీయార్ లొల్లిని నిశ్శబ్దపఱచడానికి ఇంకో మార్గం ఎంచుకుని ఉండేవాడు. వాళ్ళు మద్దతిస్తామని చెప్పడం వల్లనే "కందకు లేని దుఱద కత్తిపీటకెందుకు ? ప్రాంతీయపార్టీకి లేని అభ్యంతరాలు జాతీయపార్టీ అయిన మనకెందుకు ?" అనే తెగింపుతో చిదంబరం ఒక కత్తిలాంటి విధానప్రకటన బయటికి తీశాడు. జాతిని నిలువునా నఱికేశాడు. ఆ ప్రకటన అప్పటిదాకా సమైక్యవాదులుగా ఉన్న తెలగాణ్యుల్ని సైతం వేర్పాటువాదులుగా మార్చివేసింది. సందిగ్ధంలో పడి డోలాయమానంగా కొట్టుమిట్టాడుతున్న శంకాసంకోచపరులనేమో కఱుడుగట్టిన ఆంధ్రద్వేషులుగా ఉత్పరివర్తన (mutation) చెందించింది. కఱుడుగట్టిన వేర్పాటువాదుల్ని హింసలకూ, ఆత్మహత్యలకూ ప్రేరేపించింది. ఒక్కముక్కలో చెప్పాలంటే తెలంగాణ మొత్తం ఒక ఎఱ్ఱగడ్డ పిచ్చాసుపత్రిగా మారిపోయింది. కేసీయార్ తొమ్మిదేళ్ళపాటు అష్టకష్టాలు పడీ సాధించలేకపోయిన మానసిక పరిణామాన్ని చిదంబరం ఒక్కరోజులో సాధించేశాడనడం సబబు. బుద్ధిలేని/ బుద్ధిరాని తెలుగుదేశం పార్టీ : 2009 సాధారణ ఎన్నికల్లో తె.రా.సతో జట్టుకట్టడం వల్ల తెలుగుదేశం పార్టీకి విఱగబడిందీ, ఒఱిగిపడిందీ ఏమీ లేదు. అటువంటప్పుడు ఎన్నికలైపోగానే "తెలంగాణ ప్రజలు తె.రా.స.తో మా జట్టుని ఆమోదించలేదు. ఎందుకంటే మాకు మెజారిటీ రాలేదు" అని కన్వీనియంట్ గా వేర్పాటువాద కోఱల్లోంచి తెలుగుదేశం తాను బయటపడి ప్రజల్ని కూడా బయటపడేయాల్సింది. ఆ పార్టీ అలా చెయ్యలేదు. మూతి కాలినా కుంపటే ముద్దు అన్నట్లు ఇంకా "మేము స్పష్టంగా చెబుతున్నాం. ప్రత్యేక తెలంగాణకి మా మద్దతుంటుంది" అని పిచ్చికూతలు కూస్తూ వచ్చారు. దివంగత రాజశేఖరరెడ్డి పదేపదే "తెలుగుదేశానికున్న విశ్వసనీయతెంత ?" అని ప్రశ్నించడంతో అతని మీద పోటీగా తెలంగాణవాదుల్లో విశ్వసనీయత సంపాదించుకోవడం కోసం ఈ మూర్ఖధోరణిని కౌగలించుకున్నట్లు కనిపిస్తున్నది. విశ్వసనీయత అంటే పరిస్థితులకు విరుద్ధంగా నడిచే మూర్ఖత్వం కాదని వారు అర్థం చేసుకోలేదు. తత్ఫలితంగా కేసీయార్ దీక్ష, తదనంతర పరిణామాల్ని ఎదుర్కునే సత్తా తెలుగుదేశానికి లేకుండా పోయింది. 2009 ఎన్నికలైపోయిన వెంటనే మార్చుకుని ఉండాల్సిన పాలసీని హఠాత్తుగా ఉన్నపళాన మార్చుకోవడం సాధ్యపడక తాము తెలంగాణవాదులుగా, సమైక్యవాదులుగా చీలినట్లు నటించడానికి నిశ్చయించుకున్నారు. అలా మనతో (ప్రజలతో) డబల్ గేమ్ ఆడుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ వ్యూహం ఫలించే అవకాశం శూన్యం. ఆంధ్రప్రాంతంలోను, తెలంగాణలోను కూడా తెలుగుదేశం పార్టీని అందఱూ అసహ్యించుకుంటున్నారు. ఎన్నికలు, ఇప్పుడు పెట్టినా, నాలుగేళ్ళ తరువాత పెట్టినా మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ కాంగ్రెస్ కాకపోతే, జగన్ కాంగ్రెస్ - ఏదైతేనేం ? నాయుడుగారికి ప్రతిపక్షనాయకుడి హోదా పెర్మనెంటయ్యేలా ఉంది.
తానేంటో తనకే అర్థం కాకుండా పోతున్న నాయుడుగారు : కేసీయార్ పార్టీపెట్టకముందు అతనికీ, నాయుడుగారికీ మధ్య రహస్యంగా నడిచిన భీకర పోరాటాలేంటో మనకి తెలియదు. అతనిలో నాయుడుగారి పట్ల ద్వేషం యావత్తు ఆంధ్రావాళ్లమీద ద్వేషంగా మారింది. చివఱికి నాయుడుగారు - కేసీయార్ ల మధ్య సంవాదం కాస్తా ఆంధ్రా-తెలంగాణ సంగ్రామంగా రూపాంతరం చెందించబడింది. కేసీయార్ యొక్క తొమ్మిదేళ్ళ రాజకీయ నిరుద్యోగం కాస్తా ఏకంగా అఱవయ్యేళ్ళ తెలంగాణ అస్తిత్వపోరాటం అని ప్రచారమైపోయింది. నాయుడుగారు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ వాదాన్నైతే ఖండించారో ఆ వాదాన్నే ప్రతిపక్ష హోదాలో అంగీకరించి, ఆమోదముద్ర వేసి వాటేసుకోవాల్సిరావడం - ఆయనకెలా ఉందో గానీ ఆయన అభిమానులకీ, తెలుగుదేశం సానుభూతిపరులకీ మాత్రం తలకొట్టేసినట్లుంది. ఎవఱేమన్నా "మనకి తెలుగుదేశం ఉందిలే" అని క్రిందటేడాది వఱకూ మానసిక భరోసాలో జీవిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు హఠాత్తుగా మొఘలాయి సామ్రాజ్యపు చివఱి రోజులప్పుడు నాదిర్‌షా దండయాత్రలోని ఢిల్లీలో ఉన్నట్లు అనుభూతి చెందడం మొదలుపెట్టారు.తెలుగుదేశం నాయకుల ప్రవర్తన : ఈ మధ్య ఒక తెలుగుదేశం నాయకుణ్ణి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణం (campus) లో విద్యార్థులు పృష్ఠం మీద తన్ని, కింద పడేసి కుళ్ళబొడిచారు. అదే, నాబోటివాడయితే "ఛీ ! ఈ ఉద్యమానికి దూరంగా ఉంటా"నని నిశ్చయించుకుని అవతలికి పోయేవాడు. ఆ చీమూ, నెత్తుఱూ తెలుగుదేశం నాయకుల్లో కలికానిక్కూడా కానరావట్లేదు. అలా తన్నించుకొని మళ్ళీ తెలంగాణ ఐ.కా.స. (ఐక్య కార్యాచరణ సమితి) నాటకంలో పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. సిద్ధమవ్వడమే కాకుండా, అప్పటిదాకా కేసీయార్ చేసిన రెచ్చగొట్టుడు ప్రకటనల్లాంటివి పెద్ద వీరతెలంగాణవాదుల మల్లే తాము కూడా చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ఒకప్పుడు చంద్రబాబునాయుడుతో సమానంగా రాష్ట్రస్థాయి మంత్రులుగా పనిచేసినవాళ్ళు. యావత్తు తెలుగుజాతిలోను ఒక గౌరవనీయ మూర్తిమత్త్వం (respectable image) ఉన్నవాళ్ళు. ఇప్పుడిలా ప్రాంతస్థాయికీ, ఉపప్రాంతస్థాయికీ దారుణంగా దిగజాఱిపోయారు.
కాంగ్రెస్ పోషించిన పాత్రని తలకెత్తుకున్న తెలుగుదేశం : కాంగ్రెస్ తాను అధికారంలో లేనప్పుడల్లా ప్రాంతీయద్వేషాలు రెచ్చగొట్టి తెలుగుదేశాన్ని అస్థిరపఱచాలని ప్రయత్నిస్తూ వచ్చింది.
అధికారంలో ఉన్నప్పుడు సమైక్యవాదినని చెప్పుకున్న దివంగత రాజశేఖరరెడ్డి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నరోజుల్లో "రాయలసీమ విద్రోహదినం" అంటూ ఉద్యమాలు నడిపాడు. 1999 లో కేసీయార్ ఇంకా తెలుగుదేశంలో కొనసాగుతున్నరోజుల్లోనే - ప్రత్యేక తెలంగాణ కావాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కేంద్ర కమిటీకి పంపిన విజ్ఞాపన పత్రం మీద సంతకం కూడా పెట్టాడు. అధికారంలోకి వచ్చాక దాని గుఱించి అడిగితే "అందులో ఏముందో చదవకుండానే సంతకం పెట్టేశాను, హడావిడిలో" అని బుకాయించాడు. అసలు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ముఠాల పని - ప్రాంతీయభావాల్ని తమ పదవుల కోసం, ముఖ్యమంత్రుల్ని అసమ్మతితో ఇఱుకున పెట్టడం కోసం రెచ్చగొట్టడమే. ఇప్పుడు తెలుగుదేశం ఆ పనిని భుజానికెత్తుకున్నట్లు తోస్తున్నది. "తెలంగాణ రాదు" అనే నమ్మకం మీద ఉన్నంతకాలం ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రలోను కూడా ఎవఱిష్టమొచ్చినట్లు వారు ఆ సమస్యతో ఫుట్‌బాల్ ఆడుకున్నారు. ఉదాహరణకి - అంతా అయిపోయాక ఇప్పుడు సమైక్యవాద కబుర్లు చెబుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2004 ఎన్నికల్లో "తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పులే"దని యథేచ్ఛగా మాట్లాడిన వ్యక్తే. అప్పుడు తన భార్య తె.రా.స.తో జట్టుకట్టిన కాంగ్రెస్ తరఫున బరిలో ఉంది కనుక తనకా మడతనాలుక అవసరమైంది. ఆ ఫుట్‌బాల్ ఇప్పుడు రాష్ట్ర గోదా దాటిపోయి కేంద్రం కోర్టులోకి వెళ్లినాక ఫైర్‌బాల్‌గా మారింది. అందుకని ఇప్పుడు దిక్కుతోచడం లేదెవఱికీ.
మరణశయ్యపై రాజకీయాలా ? : ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల పూర్వ మహామహులు కొన్ని ఉన్నతాదర్శాలతో, ఉదాత్తాశయాలతో, దూరదృష్టితో కలలుగని స్థాపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటుపిమ్మట ఇంకెందఱో మహనీయులు శ్రమించి నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం - దీని ఉనికికే ప్రమాదం ఏర్పడ్డ స్థితిలో మన చర్యలూ, మాటలూ మఱింత జాగ్రత్తగా ఉండాలి. కానీ తెలుగుదేశంవారి దగ్గఱ ఆ బాధ్యతాయుత భావమేమీ కనిపించడంలేదు. ఒక పక్క రాష్ట్రం చావుబతుకుల్లో ఉంటే వారు మంచం పక్కన చేఱి రాజకీయాలాడుతున్నారు. చావుబతుకుల సమస్య వస్తే ఎటో ఒకవైపు దూకెయ్యాలి గానీ రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం మొదటికే మోసం. రాజ్యమంటూ ఒకటుంటే ఎన్ని రాజకీయాలైనా ఆడొచ్చు. రాజ్యమే పోయాక రాజకీయాలతో పనేంటి ? కుటుంబమే లేనివాడికి సొంతిల్లైనా అద్దిల్లైనా ఏ యిల్లైనా ఒకటే. "అబ్బిగాడు చస్తే ఆ పంచె నాకే" అనుకొని పరస్పర వినాశనాన్ని కోరుకుంటే అందఱమూ నశిస్తాం. "ఆంధ్ర, తెలంగాణ రెండూ నాకు రెండు కళ్లు" లాంటి ఉద్ఘాటనలు ఎందుకవసరమవుతాయో నేనూహించజాలను. రాష్ట్రం ఇంకా చనిపోలేదు. బతికే ఉంది. అది తెలంగాణగా, ఆంధ్రాగా ఇంకా ముక్కలవ్వలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గానే ఉంది. అదింకా చనిపోకుండానే దాన్ని ఇలా మాటలతో చంపేయడం అన్యాయం. అది రెండు కళ్ళో, రెండు కాళ్ళో కాదు. అదొక సర్వసమగ్ర శరీరం. ఈ మాటలతో వారు రాష్ట్రాన్ని చంపుతున్నారు. తెలుగుదేశం సిద్ధాంతాల్ని చంపుతున్నారు. టోకుగా ఎన్.టి.రామారావుగారినే సైద్ధాంతికంగా చంపేశారు.
ఇప్పుడేం మిగిలింది తెలుగుదేశంలో చూసుకుని గర్వించడానికి ?
