6.2.10

ఏల నీకీ దుఱద ?



హైదరాబాదులో ఐ.టి.ఐ.ఆర్. (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్టక్చర్ రీజియన్ - సమాచార సాంకేతికతా మౌలిక సదుపాయాల బస్తీ) ఏదో ఏర్పాటు చేస్తామని రోశయ్య ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం షమ్సాబాదు దగ్గఱా, మఱొకచోటా కొన్నివేల ఎకరాలు కేటాయిస్తారట. సదరు చేపట్టు (project) కోసం రాబోయే ఆఱేళ్ళలో రెండులక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తారట. తద్ద్వారా పదిహేను లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని ఆశిస్తున్నారు.

దేనికీ డబ్బుల్లేవని చేతులెత్తేసిన రోశయ్యగారికి రెండు లక్షల కోట్లు ఎక్కణ్ణుంచి రాబోతున్నాయో, ఎవఱు ఇవ్వబోతున్నారో నాకు తెలియదు. ఇలాంటిదేదో మద్రాసు, బెంగుళూరు, బొంబాయి లాంటి చోట్ల ప్రతిపాదిస్తే అందులో నమ్మరానంత విడ్డూరమేమీ ఉండదు. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాదుకు అంత సీనుందా ? మొన్న మన సోదరుల ప్రతాపానికి చాలామంది బిచాణా ఎత్తేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రతాపాలు ఇలాగే ప్రదర్శిస్తూ పోతే ఉన్నవాళ్ళు కూడా ఉండరు. కొత్తగా ఎవఱొస్తారు, డబ్బుసంచులు పట్టుకొని ?

అదనంగా పదిహేను లక్షల ఉద్యోగాలంటే పదిహేను లక్షల అదనపు జనాభా. మనుషులు ఏకాకులుగా బతకరు కనుక వాళ్ళ కుటుంబసభ్యుల్ని కూడా కలుపుకుంటే రాబోయే ఆఱేళ్ళలో హైదరాబాదుకు కొత్తగా వచ్చిపడే జనాభా మఱొక యాభైలక్షలు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ జనాభాని భరించే సత్తా హైదరాబాదుకు ఉందా ? ఒక కుటుంబంలోనే ఇంకో మనిషి అదనంగా తోడైతే - ఆ మనిషి కోసం సకల ఏర్పాట్లూ అదనంగా చెయ్యాల్సివస్తుందనుకున్నప్పుడు యాభైలక్షలమందికి నీరూ, డ్రైనేజి, రోడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు - ఇవన్నీ సమకూర్చే సావకాశం మనకుందా, అదీ ఆఱేళ్ళ స్వల్పవ్యవధానంలో ? ఇప్పుడు మధ్యహైదరాబాదులో ఉన్న నీటి సరఫరా, డ్రెయినేజి ఏర్పాట్లే నిజాం కాలం నాటివి. మెదక్ జిల్లా అవసరాల కోసం ఏర్పాటు చేసిన సింగూరు జలాశయాన్ని హైదరాబాదు అవసరాల కోసం మళ్ళించారు. హైదరాబాద్ తూర్పు మండలానికి కృష్ణాజలాల్ని కూడా తరలించారు. అయినా సరిపోవడంలేదు. చేవెళ్ళ-ప్రాణహిత చేపట్టు ద్వారా గోదావరి నీళ్ళు తేవాలని సంకల్పించారు. అదింకా సంకల్పం స్థాయిలోనే ఉంది. ఎందుకంటే దాన్ని అమలు జఱపాలంటే ౩౮,౦౦౦ కోట్లు కావాలి. మఱొక పక్క హైదరాబాదులో భద్రత నానాటికీ తీసికట్టుగా మారుతోంది. దానికి రాష్ట్రసరిహద్దుతో గల సామీప్యం వల్ల అక్కడ నేరాలు చేసి గంట/ అఱగంటలో సరిహద్దు దాటి పారిపోయే అయాచిత సౌలభ్యం నేరస్థులకి వరప్రసాదంలా మారింది. హైదరాబాదులోని భటవ్యవస్థ సాపేక్షంగా దుర్బలమైనది. అంత పెద్ద నగరానికీ కలిపి తొమ్మిదివేలమంది కంటే భటులు లేరు. అదే, బెంగుళూరులో ముప్ఫైవేలమంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పోలీస్ కమీషనర్ నాతో చెప్పినదేంటంటే - పోలీసు వాహనాలు నడవడానికి సరిపడా ఇంధనఖర్చుల్ని కూడా ప్రభుత్వం ఇవ్వడంలేదనీ, కొదవపడ్డ మొత్తాల్ని తమ సిబ్బంది జేబులోంచి పెట్టుకొని జీపులూ, వ్యాన్‌లూ నడుపుతున్నారని ! మఱి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. మఱీ ఎక్కువ భిన్నంగా లేకపోవచ్చు. అందుచేత ఈరోజు పరిస్థితేంటంటే రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళి హాయిగా మనశ్శాంతిగా బతగ్గలం, హైదరాబాదులో తప్ప !

ఈ పదిహేను లక్షల ఉద్యోగాల్లో మూడొంతుల కంటే ఎక్కువశాతం స్థానికేతరులకే వెళతాయనేదాంట్లో నాకు సందేహం లేదు, గత పరిశీలనల దృష్ట్యా ! తద్భిన్నంగా జఱగడానికి వాస్తవ పరిస్థితులు అనుకూలించకపోవడం వేఱే విషయం. ఏతత్కారణం చేత ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రాంతీయ తలనొప్పులూ, దుష్‌ప్రచారాలూ అప్పటికి ఇంకా ఇబ్బడిముబ్బడిగా ఇనుమడించే అవకాశం కనిపిస్తోంది. మన రాష్ట్రానికి హైదరాబాదు ఒక శాపం. ఆ నగరం మన రాష్ట్రానికి పట్టిన సైతాన్. అది మనకి జన్మజన్మల శని. అది మన జాతికి అక్రమసంబంధాల ద్వారా అంటుకున్నఎయిడ్స్ వ్యాధి. అదొక క్యాన్సరు. అది మన రాష్ట్ర అభివృద్ధినంతటినీ ఒక బ్రహ్మరాక్షసిలా, మహాభూతంలా భక్షించి వేస్తోంది. గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ ఏరియాల్ని మినహాయిస్తే విజయవాడ-గుంటూరు అర్బన్ అగ్లోమరేట్, రాజమండ్రి అర్బన్ అగ్లోమరేట్ తో సహా మిహతా తెలుగురాష్ట్రమంతా పరమ దారుణంగా, ఎవఱికీ ఏ ఉద్యోగమూ ఇవ్వజూపలేనంతగా వెనకబడిపోయి ఉంది. హైదరాబాద్ ముసలి సుందరికి మాత్రం తొమ్మిదికోట్లమంది రాష్ట్రప్రజలు కట్టిన పన్నాదాయంతో ఎప్పటికప్పుడు సరికొత్త శోభలూ, సోయగాలూ అద్దుతున్నారు. ఎక్కడెక్కడి డబ్బూ, వనరులూ అన్నీ బలవంతంగా హైదరాబాదుకి తరలిస్తున్నారు. కార్యాలయాలన్నీ హైదరాబాదులోనే. విశ్వవిద్యాలయాలన్నీ హైదరాబాదులోనే. పరిశ్రమలన్నీ హైదరాబాదులోనే. ఉద్యోగాలన్నీ హైదరాబాదులోనే. ఈ జాతి చేస్తున్న అప్పులూ, తప్పులూ అన్నీ హైదరాబాదు కోసమే. రోశయ్య ప్రభుత్వం కల్పించదల్చుకున్న 15 లక్షల ఉద్యోగాల్నీ వరంగల్ లోనో, కరీంనగర్ లోనో, నెల్లూరులోనో, కర్నూలులోనో ఎందుకు కల్పించకూడదు ? అక్కడ ఏం కొదవ ? సరే, ఏదైనా కొదవపడితే దాన్ని పూరించడానికి ఆ రెండులక్షల కోట్లు అక్కడ చెల్లవా ? సర్దుబాటు కావా ?

మిహతా రాష్ట్రం ఎలా బతుకుతోందో ఒక్కసారి పరిశీలించండి. అక్కడ రైసుమిల్లులూ, పిండిమరలూ, నూనెగానుగలూ మినహా వేఱే పరిశ్రమలేవీ లేవు. బడిపంతులు ఉద్యోగాన్ని లేదా స్థానిక చిట్‌ఫండ్/ కంపెనీలో గుమాస్తా ఉద్యోగాన్ని జాక్‌పాట్‌/ లక్కీ డ్రా కొట్టడంగా భావించే దశలోనే ఉన్నారు మన జనం. ఎక్కువమంది టైలరింగ్ మొదలైన అల్పాదాయపు స్వయం ఉపాధిరంగంలో స్థిరపడ్డవాళ్ళే ఉంటారు. మన జనాభా ఎగబడి ఎమ్.సి.ఏ.లూ గట్రా చదువుతున్న స్థాయికీ, జిల్లాలలో ఉన్న కంప్యూటర్ సదుపాయాలకీ పోలికే లేదు. వాటిని భరించే స్తోమత అక్కడ ఎవఱికీ లేదు. ఎందుకంటే అక్కడ ఆదాయాలు లేవు. (నిజం చెప్పాలంటే హైదరాబాదులో కూడా అంతర్జాలాన్ని (Internet) కార్యాలయ కంప్యూటర్ల ద్వారా తప్ప సొంత కంప్యూటర్ల ద్వారా ప్రాపించేవారు అఱుదు, అఱుదున్నఱ) ఇప్పటికీ మన ఊళ్ళల్లో నెలకి నికరంగా అయిదాఱువేలు సంపాదించేవాడు ఒక పెద్దమగాడని లెక్క. బహుశా కొన్నిమండలాల్లో ఆఱేడువేల ఆర్జనాపరుడు పెద్దమగాడు కావచ్చు. అంతకంటే భారీ వ్యత్యాసం ఉండదు. మన ఊళ్ళలోని విద్యావంత మధ్యతరగతికి సొంతిల్లు అనేది ఇప్పటికీ ఒక తీఱని యావజ్జీవిత కల. అక్కడి జనం అద్దెకొంపల్లో పుట్టి, అద్దెకొంపల్లో పెఱిగి, అద్దెకొంపల్లోనే చనిపోవడం చాలా మామూలు. కానీ హైదరాబాదుకు ఉద్యోగరీత్యా వచ్చినవారు వచ్చిన అయిదాఱేళ్ళలోనే, అదీ కేవలం ముప్ఫయ్యేళ్ళ వయసులోనే ఒక పెద్ద సొంత ఫ్లాటుకో, ఇంటికో స్వంతదారులైపోతారు. ఎందుకంటే హైదరాబాదులో బ్యాంకుల ద్వారా గృహఋణాల పరపతి సౌకర్యం బహు ఉదారమూ, బహువిఱివి. ఇవే బ్యాంకుల దృష్టిలో మన పల్లెపట్ల జనానికి మాత్రం అస్పృశ్యులతో సహపంక్తి. రాజశేఖరరెడ్డి వృద్ధాప్య పింఛన్లని కేవలం ఒక డెబ్భై అయిదు రూపాయలు పెంచినందుకు అతను పోతే మన ఊళ్ళలో మిలియన్లాది ముసలిజనం కన్నీళ్ళు పెట్టుకున్నారంటేనే తెలుస్తుంది, హైదరాబాదుకీ, మిహతా రాష్ట్రానికీ మధ్య ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి అగాధాలూ, పర్వతాలూ, సముద్రాలూ, లోయలూ, కొండలూ, గుట్టలూ ఉన్నాయో ! సగటు నాన్-హైదరాబాదీ తెలుగువాడి సంపాదనాశక్తి ఎంత అధమాతి అధమంగా ఉందో ! వ్యవసాయమూ, చిన్నా చితక చిల్లఱవ్యాపారాలూ తప్ప తెలుగురాష్ట్రంలో వేఱే ఆదాయమార్గాలే లేవు. వాటిని కల్పించడం తన బాధ్యతగా ఈ ఆంధ్రప్రభుత్వం ఎప్పుడూ భావించి ఉండలేదు. గత 54 సంవత్సరాల్లో హైదరాబాదు, విశాఖపట్నం గుఱించి తప్ప ఇహ దేని గుఱించి పట్టించుకున్న పాపాన పోలేదు. తత్ఫలితంగా మన పల్లెలూ, పట్టణాలూ అష్టకష్టాలతో నిష్ఠదరిద్రమోడుతున్నాయి. విద్యావంతులంతా హైదరాబాదు బండి ఎక్కక తప్పని పరిస్థితిని యావద్రాష్ట్రంలోను కల్పించిందీ ప్రభుత్వం. ఇందులో తెలగాణ్యులు, దత్తమండలాలవారూ, కోస్తావారూ అనే తేడా కనిపించడం లేదు.

మన రాష్ట్రానికి పట్టిన, పట్టుతూ ఉన్న దౌర్భాగ్యాలన్నింటికీ కారణం మనం ఇంతకాలం హైదరాబాదు చంకలో మట్టి దులుపుతూ బిజీ అయిపోవడం. హైదరాబాదు కంటే, విశాఖపట్నం కంటే ప్రాచీనమైన, ఉజ్జ్వల చరిత్ర గల పట్టణాల్నీ, నగరాల్నీ - వరంగల్, నెల్లూరు, కర్నూలు వంటివాటన్నింటినీ శంకరగిరిమాన్యాలు పట్టించారు. నిర్దయగా నిర్దాక్షిణ్యంగా పక్కన బెట్టారు. గతంలో ఆమోదించిన అన్ని ఒప్పందాల్లోను హైదరాబాదుని బాగుచేసే పథకాలకే పెద్దపీట వేశారు. అదొక్కటి పనిగట్టుకుని లెస్సగా అమలుజఱిపారు, మిహతా అంశాల సంగతెలా ఉన్నా ! రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు ఏ జిల్లావారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ రాజకీయ పక్షంవారైనా అందఱూ తడుముకోకుండా, బీరుపోకుండా చేసిన వెధవపని - హైదరాబాదుని బాగుచేయడం, ఆ తరువాత అక్కడ తమ పెట్టుబడులు పెట్టి వాటి మీద లాభాలు తీయడం. అదేంటో గానీ హైదరాబాదులో కానవచ్చే ౨౧ వ శతాబ్దపు జీవితానికీ, మన ఊళ్ళలో కనిపించే పదహాఱో శతాబ్దపు జీవితాలకీ అసలు పోలికే లేదు. అలా కేంద్రీకరించి పారేశారు అభివృద్ధిని ఒకే ఒక్క నగరంలో ! మన తెలుగువారి వేర్పాటువాదాల యొక్క, అంతర్గత కల్లోలాల యొక్క చరిత్రని ఇతివృత్తంగా తీసుకొని ఎవఱైనా భవిష్యత్తులో పుస్తకంగా రాస్తే దానికి నేను A Tale of One City అనే పేరు సూచించదల్చుకున్నాను.

అన్నీ తెలిసి, జఱిగినదంతా చూసి, జఱుగుతున్నది అనుభవించీ కూడా ఇంకా మన ప్రభుత్వం హైదరాబాదుని బాగుచేయడానికే కంకణం కట్టుకున్నదంటే, అందుకు మనం బుద్ధిహీనుల్లా బుఱ్ఱకాయలాడించి ఆమోదం తెలుపుతున్నామంటే "ఛీ ! మనకెంత సిగ్గు లేదో ! సిగ్గలా ఉంచితే మనకెంత బుద్ధి లేదో !" అనిపిస్తున్నది. వాస్తవానికి హైదరాబాదు హోదా గత మూణ్ణెల్లుగా చాలా దిగజాఱింది. దాన్ని పరికించాల్సిన దృక్కోణంలో ఖచ్చితంగా మార్పొచ్చింది. అదిప్పుడు ఒక జాతికి ఉమ్మడి సమావేశకేంద్రం కావడం మానేసి ఆ జాతిలోని కొద్దిమంది వేర్పాటువాదుల చేతుల్లో బీభత్స మారణాయుధంగా మారింది. అది పట్టుకొని వారు ఇతరుల్ని బెదిఱిస్తున్నారు. ఈ బెదిఱింపులు జాతికి అవసరమా ? ఇహనైనా మేల్కొని హైదరాబాదుకు ప్రత్యామ్నాయ నగరాల్ని తయారు చేసుకొని, అలా అభివృద్ధిని వికేంద్రీకరించి వేర్పాటువాదాల బెడదని వదిలించుకోవాల్సిన తరుణం కాదా ఇది ? మనం ఇప్పటిదాకా నేర్చుకొన్న బహుచేదు గుణపాఠాల దృష్ట్యా హైదరాబాదు యొక్క తదుపరి అభివృద్ధిని శాయశక్తులా అడుగడుగునా అడ్డుకోవాల్సిన చారిత్రిక అవసరం మనకుంది. నా అభిప్రాయంలో - దీని అభివృద్ధి మీద కఠినమైన సీలింగులు విధించాలి. భవిష్యత్ ఉపాధికేంద్రాలన్నింటినీ తతిమ్మా తెలుగు నగరాలకే మళ్ళించాలి. ఉన్నవాటిని కూడా ఉన్నపళాన ఎత్తేసి అక్కడికి తఱలించమన్నా తప్పులేదు. ఇహముందు హైదరాబాదులో పరిశ్రమలూ, వ్యాపారాలూ పెడతామనేవాళ్ళని ప్రయత్నపూర్వకంగా నిరుత్సాహపఱచాలి. అసలు హైదరాబాదుని మనం చూసే పద్ధతిలోనే విప్లవాత్మకమైన మార్పు రావాలి. అది కేవలం ఒక ప్రభుత్వ కార్యాలయాల సముదాయంగా ఉండాలే తప్ప ఇతరత్రా దాన్ని మన యావత్తు జాతి జీవితానికీ ఆయువుపట్టుగా మార్చుకోవడం భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరం. మన చుట్టూ ఉన్న మనుషుల సంగతెలా ఉన్నా, ఉదాహరణకి హైతీలో వచ్చిన భూకంపంలాంటి ప్రకృతివైపరీత్యం హైదరాబాదులో వస్తే అప్పుడేం చేస్తారు ? అడుక్కుతిందామా ?

ఈ హైదరాబాదు దుఱదకి మంచి మందు వేసుకుని మళ్ళీ ఆరోగ్యవంతులుగా మారదాం. ఏ చేతులతో ఈ విషవృక్షాన్ని పెంచామో ఆ చేతులతోనే దీన్ని నిర్దాక్షిణ్యంగా పీకిపారేద్దాం. గత్యంతరం లేదు.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్