8.2.10

పరిప్లవ చింతన-2



ప్రాగ్‌భావనల (prejudices) కీ , ప్రాక్ ప్రభావాలకీ అతీతంగా బహుభూమికల (multiple planes) లో తాజాగా వర్తమానస్పృహతో విహరిస్తూ ఆలోచించడాన్ని పరిప్లవ చింతనగా చెప్పుకోవచ్చు. ఇది కొద్దిమందికి పుట్టుకతోనే సిద్ధిస్తుంది. ఈ ప్రజ్ఞ గుఱించిన పరిజ్ఞానం ప్రస్తుతం మృగ్యం కనుక దీంట్లో ఇతరులకి శిక్షణివ్వడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. లోకాన్ని గమనించినప్పుడు మహాత్ములూ, మహానాయకులూ, మహారచయితలూ అయినవారికి ఎంతమంది అభిమానులుంటారో అంతమంది ద్వేషులు కూడా ఉంటారు. దీనిక్కారణం వారిలో పరిప్లవ చింతన ఉండడం. సాధారణప్రజల్లో అది లేకపోవడం. అందువల్ల మహాపురుషులు మనకు అర్థం కారు. వారి మాటలూ, చేష్టలూ సమన్వయించరానటువంటి అనేక వైరుద్ధ్యాలతో కూడుకొని ఉన్నట్లు పైకి కనిపిస్తాయి. జనం అది తమ అవగాహనాలోపమే అని తెలుసుకోలేక మహాపురుషుల్ని నిందిస్తారు. అర్థంకాని ప్రతిదాన్నీ ద్వేషించడమే/ దూషించడమే మనుషుల లక్షణం. ఉదాహరణకి మనకి చీకట్లో ఏమీ కనిపించదు (అర్థం కాదు) కనుక మన దృష్టిలో అది అన్ని దోషాలకీ ప్రతీక. అందుకనే సంస్కృతంలో రాత్రికి "దోషా" అని పేరు కూడా పెట్టేశారు. కానీ చీకట్లో చూడగలవారికి అది శత్రువు కాదు. ఎందుకంటే అది వారికి అర్థమవుతుంది.

పరిప్లవ చింతన ప్రధానంగా ఏకకాలంలో అనేక రేంజిలలో ఆలోచించగల శక్తిని సూచిస్తుంది. సాధారణంగా మనం ఒక రేంజిలోనే ఆలోచిస్తాం. ఆ ఒక్క రేంజినే పెద్దదిగా విస్ఫారించుకొని "అదే మన ప్రపంచం" అనుకొని జీవిస్తూంటాం. ఏకకాలంలో అనేక రేంజిలలో ఆలోచించడం మనలాంటి సామాన్యులకి సాధ్యమా ? అంటే సాధ్యమే. ఇందులో మాయా, మంత్రమూ ఏమీ లేదు. మనకి తెలియకుండానే మనం అనేక సందర్భాల్లో పరిప్లవ చింతన చేస్తాం. ఉదాహరణకి రోడ్డు మీద ఒక కారు వెళుతోంది. ఒక్క చూపులో దానివంక చూసి శ్కాన్ చేసిపారేస్తే మనముందు ఈ విధంగా కొంత భోగట్టా (data) ప్రత్యక్షమవుతుంది.

౧. ఆ కారులో ఇద్దఱు వ్యక్తులున్నారు. వారిలో కారు నడుపుతున్న వ్యక్తి ఒక వైద్యుడు. అతని పక్కన ఉన్న వ్యక్తి ఒక ఆడమనిషి, అతని భార్య. ఆమె వైద్యురాలు కాదు.

౨. వారిద్దఱూ మాట్లాడుకుంటున్నారు. ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానంగా అతడు స్త్రీల వ్యాధుల గుఱించి ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు.

౩. ఆమెకి ఆ ప్రస్తావన మీద ఏ విషయమూ పూర్తిగా చెప్పేయడం అతనికి ఇష్టంలేదు. అందుచేత కాస్తకాస్త చెబుతున్నాడు.

౪. కార్ ఎంజిన్ బాగా వేడెక్కి ఉంది. దాని ఎలక్ట్రికల్ వైరింగ్‌లోని లోపాల వల్ల కారు క్యాబిన్ అంతా రబ్బరు వాసనొస్తోంది. ఆమెకి తక్కువగా వస్తోంది. అతనికి ఎక్కువగా వస్తోంది. బయట ఎవఱో టైర్లు కాల్చి ఉంటారని ఆమె అనుకుంటోంది. కానీ అది తన కారులోని లోపమని వైద్యుడికి తెలుసు. ఇంటికి చేఱుకున్నాక కారుని సర్వీసింగ్ కి పంపించాలని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూనే మాట్లాడుతున్నాడు.

ఇక్కడ సదరు వైద్యుడి ఆలోచనాధోరణిని గమనిస్తే అతడు ఒక విధమైన పరిప్లవ చింతన చేస్తున్నాడని మనకి అవగతమౌతుంది. ఎందుకంటే అతడు ఏకకాలంలో అనేక రేంజిల్లో ఆలోచిస్తున్నాడు.

రేంజ్-1 : అతడు ప్రొఫెషనల్ డ్రైవరు కాడు. కానీ మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నాడు.
రేంజ్-2 : అతని మాతృభాష ఇంగ్లీషు కాదు. కానీ ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు.
రేంజ్-3 : భార్య తనలా వైద్యురాలు కాకపోవడం చేత ఆమె అడిగిన సబ్జెక్టు గుఱించి పూర్తిగా చెబితే ఆమె భయపడుతుందనే స్పృహ మనసులో ఒకమూల ఉండడం చేత తన మాటల్ని తానే సెన్సారు చేసుకుంటూ మాట్లాడుతున్నాడు.
రేంజ్-4 : అదే సమయంలో కారులోని యాంత్రికలోపం గుఱించి గంభీరంగా యోచిస్తున్నాడు.

అతను ఏకకాలంలో ఇన్ని రేంజిల్లో ఆలోచించగలగడానికి కొంత నేపథ్యం ఉందని గమనించాలి. అతను ఉపయోగిస్తున్న, పైన పేర్కొన్న ఆలోచనానైపుణ్యాలు అతనికి ఒక్కరోజులో సిద్ధించినవి కావు. వాటి వెనక చిరకాల శిక్షణా, అనుభవమూ, ఊహ మొదలైన అనేక ఉపచయాలు (inputs) పనిచేస్తున్నాయి. కాబట్టి పరిప్లవ చింతన సామాన్యులకి అందని మ్రానిపండేమీ కాదు. ఒక విషయం గుఱించి ఆలోచించేటప్పుడు అనేక రేంజిల్లో దాన్ని చూడ్డమూ, ఒకే సమయంలో ఒకే రేంజిలో అనేక విషయాల గుఱించి ఆలోచించడమూ ఈ రెండూ పరిప్లవ చింతనలోని ప్రభేదాలే అవుతాయి.

(మఱికొంత వచ్చే టపాలో...)

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్