7.2.10

పరిప్లవ చింతన-1



The Future Shock అనే పుస్తకంలో అమెరికన్ రచయిత Alvin Toffler అన్నాడు : "భవిష్యత్తులో నిరక్షరాస్యులంటే చదువు నేర్చుకోనివారు కాదు, ఎలా నేర్చుకోవాలో తెలియనివారే" అని ! అంటే అసలు సమాచారమే దొఱక్కపోవడం గతకాలపు నిరక్షరాస్యతా లక్షణం కాగా, విపరీతమైన సమాచారం లభిస్తున్నప్పటికీ దాన్నెలా వెతికి పట్టుకోవాలో తెలియక పోవడం ఆధునిక అవిద్య అని నేనర్థం చేసుకున్నాను. సమకాలీన నాగరికత సమాచార బాహుళ్య సమపేక్షమైనదని అందఱికీ విదితమే. ఈ సమాచార వెల్లువ కేవలం విశేషిత (specialized) వృత్తివిద్యారంగాలనే కాక యావత్తు రోజువారీ జీవితపరిధినీ ఆక్రమించేసింది. ఉదాహరణకి - ఈ రోజుల్లో ఒక మనిషి సగటున జ్ఞాపకం ఉంచుకోవాల్సిన నంబర్ల సంఖ్య చూడండి : ఇంటి నంబరు, దాని సర్వేనంబరు, తన ఉద్యోగం నంబరు, తన వాహనం నంబరు, తన ఫోన్ నంబరు, బీమా పాలసీ నంబరు, బ్యాంకు ఖాతానంబరు, విద్యుత్ ఎస్.సి. నంబరు, ఋణఱేకు (credit card) నంబరు, దాని పిన్ నంబరు, పాన్‌కార్డు నంబరు... ఇలా ఉంది ఆధునిక జీవితం. ఈ ఆధునిక జీవితపు సంక్లిష్టతని మనిషి లెస్సగా నిర్వహించాలంటే అతనికి దేవుడిచ్చిన మెదడు సరిపోదని, ఆ మెదటికి ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ సాధనాల్ని జోడించాలని కొంతమంది శాస్త్రశోధకులు అభిప్రాయపడి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంటే మెదటికి మెమొరీ చిప్స్ గానీ, ఎలక్ట్రోడ్స్ గానీ జతచేసి మానవుడి ప్రాకృతిక ప్రతిభాపాటవాల్ని కృత్రిమంగా ఇనుమడింపజేయడమన్నమాట. కొద్దిమంది అలా ప్రయోగాత్మకంగా చేయించుకున్నవాళ్ళున్నారు. వాళ్ళని Cyborgs అంటున్నారు.

మన అసలు సమస్య సమాచారాన్ని నిర్వహించడం కాదని, మన భావోద్వేగాల్ని, మానవసంబంధాల్ని నిర్వహించడం మాత్రమేననీ నాకు మొదట్నుంచి ఒక నమ్మకం. ఈ కాలంలో మనం తినే ఆహారం ద్వారా మనకి లభించే శక్తి దాన్ని జీర్ణించుకోవడానికి మాత్రమే సరిపోతున్నది. అలాగే రోజూ రకరకాల భావోద్వేగాల్నీ, మనుషుల్నీ సమన్వయించుకోలేక మన మేధాశక్తి అంతా చవకబారు విషయాల్లో వృథా అవుతున్నది. నాకు తెలిసిన ఒక తెలుగుభాషా-అధ్యాపకురాలు కొన్నివందల ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకొని ఎప్పుడు, ఎక్కడ ఏ నంబరడిగితే అప్పుడు, అక్కడ ఆ నంబరు సరిగ్గా డయల్ చేసి ఇచ్చేది. నేనామె మేధాశక్తికి దిగ్‌భ్రాంతి చెందేవాణ్ణి. కానీ బాగా ఆలోచించగా మనుషుల పట్ల ఆమెకున్న ఆసక్తి, అభిమానమూ, సహానుభూతి ఆమె జ్ఞాపకశక్తిని ఆ స్థాయికి తెచ్చాయేమోననిపించింది. ఇది ఇలా ఉంటే మఱి మన మెదళ్ళకి చిప్స్ అవసరం ఆలోచనీయం.

ఈ నాగరికతని ఈ స్థాయిలో నిర్వహించాలంటే ఒక్కొక్కఱికీ ఒక్కొక్క రంగంలో లోతైన పరిజ్ఞానమూ, అభినివేశమూ ఉండక తప్పదు. కానీ అదే సమయంలో మనం విశేషితాల చాదస్తదశ దాటిపోయి post-modernism లాగా post-specialization దశలోకి అడుగుపెడుతున్నామేమోనని నాకప్పుడప్పుడు తోస్తుంది. ఈ నాగరికతకి ఇప్పుడు కావాల్సింది "అది నాకు సంబంధం లేని సబ్జెక్టు" అనే మనుషులు కాదు. అలాంటివాళ్ళు ఇతరేతర రంగాల గుఱించి తమకున్న అజ్ఞానంతో సమాచార అంతరానికి (communication gap) కారకులై అంతిమంగా ఈ నాగరికతని ఒక గండాల గౌరీదేవిగా మార్చేస్తారు. మనకిప్పుడు కావాల్సింది. వైవిధ్య నైపుణ్యాలూ, వైవిధ్య ఆలోచనలూ గల విశేషిత-అతీత వ్యక్తులు (those above specializations). ఇలాంటి వ్యక్తులు తప్పకుండా ఉంటారు. కానీ అఱుదుగా ఉంటారు. ఇతరులకి మనం ప్రత్యేక శిక్షణిచ్చి విశేషిత-అతీతులుగా మార్చగలమో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇది కొంతవఱకు వారివారి సంస్కారవిశేషాల్నీ, వైయక్తిక జీవితాల్లోని ప్రాథమ్యక్రమాల్నీ (order of priority) అనుసరించి ఉంటుంది.

అలాగే మనుషుల మెదళ్ళలో చిప్పులని నాటడం (implant) లోని మంచి-సెబ్బఱలూ నాకు తెలియవు. అయితే సాధారణంగా మనుషులు కొత్త అవసరాల్ని సృష్టించుకోవడం, వాటికోసం కొత్త సాధనాల్ని అలవాటు చేసుకోవడం, తద్ద్వారా జబ్బుపడడం, ఆ జబ్బులకోసం మళ్ళీ వైద్యశాస్త్రంలో కొత్త విభాగాల్ని (medical departments) తెఱవడం, అప్పట్నుంచి "ఆహా ! వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో" అని గుడ్లు తేలేసి, ముఱిసి ముక్కలవ్వడం - ఇదంతా ఒక అంతులేని కథలా నడుస్తోంది. వైద్యులు చికిత్సలో చేసిన పొఱపాట్ల వల్ల వచ్చే రోగాల కోసం ఇప్పుడు Iatrogenics అనే ఒక ప్రత్యేక మెడికల్ డిసిప్లిన్ ఆవిర్భవించింది. అలాగే ఈ సైబోర్గు జనానికి ఏమైనా ఆరోగ్య సంక్లిష్టతలు తలెత్తితే అప్పుడు cyborgogenics అనే సరికొత్త శాస్త్రాన్ని ఆవిష్కరిస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి దేవుడిచ్చిన మెదళ్ళకి చిప్పుల తిప్పలు తప్పాలంటే మేధాశక్తి అనే మాటకి ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చిన నిర్వచనాన్నీ, దాని ప్రక్రియనీ, ప్రయోగపద్ధతినీ ఇహనైనా మార్చుకోవాల్సిన తరుణం సమీపించిందనుకుంటాను. ఈ కొత్త తరహా మేధోపయోగాన్ని పరిప్లవ చింతన అని చెప్పుకోవచ్చు.

విద్యావంతులుగా చెలామణి అవుతున్న ఆధునిక సంకుచితులు విశేషిత-అతీతులుగా మారడానికి పరిప్లవ చింతన తోడ్పడుతుంది. యాంత్రికతని పారద్రోలి నవనవోన్మేషమైన ఉత్సాహంతో నిజమైన ఆసక్తితోను, స్వకీయమైన స్వతంత్ర ప్రేరణతోను పనులు చేయడానికి అది సహకరిస్తుంది. వైవిధ్యభరితమైన ఆలోచనలకీ, గతిశీలమైన వ్యక్తిత్వానికీ అది దోహదిస్తుంది. మనస్సుని నిత్యయౌవనంలో ఉంచుతుంది. బాల్యాదిగా సామాజిక ఒదుగుదల (social conformity) ప్రక్రియలో మనం కోల్పోయిన సృజనాత్మకతనీ, స్వకీయత (originality) నీ అది పునరుద్ధరిస్తుంది.

(ముగింపు వచ్చే టపాలో....)

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్