3.2.10

దొంగలు బాబోయ్ దొంగలు-1



ఆంధ్రప్రాంతీయుల్ని తమ వాచాకండూతి తృప్తిచెందే విధంగా దూషిస్తూ ఆ దూషణల్నే తమ వేర్పాటువాదానికి ప్రాతిపదికగా మలచుకొన్న కొద్దిమంది తెలగాణ్యుల సాముదాయిక తత్త్వాన్ని సక్రమంగా, వాస్తవిక దృష్టితో అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ విధమైన వాదనలు చేసే వారెవఱూ ఆంధ్రప్రాంతాన్ని జన్మలో ఒక్కసారి కూడా స్వయంగా కళ్ళారా చూసి ఉండరు. అక్కడ కొద్దిసంవత్సరాలైనా నివసించి ఉండరు. ఏదేదో ఊహించుకోవడం తప్ప ఆంధ్రప్రాంత చరిత్ర ఒక్కసారి కూడా చదివి ఉండరు. చరిత్ర సంగతలా ఉంచి ఆంధ్రప్రాంతపు పూర్వీకులు వ్రాసిన తెలుగు సాహిత్యంలో పట్టుమని పదీ-ఇఱవై పుస్తకాల్ని కూడా గట్టిగా తిరగేసి ఉండరు. ఈ ప్రాంతంలో అసలు సమస్య పట్ల సమీచీనమైన అవగాహన కంటే కూడా ఆంధ్రప్రాంతంవారిపట్ల ప్రచారం చేయబడ్డ అసత్యాలూ, తన్మూలకమైన అసూయాద్వేషాలూ ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రాంతీయులు తెలంగాణవాళ్ళ కంటే బాగున్నారనే ఏడుపుని ప్రతి తెలంగాణవాడిలోను కలిగించడంలో వేర్పాటువాదులు గత తొమ్మిదేళ్ళుగా సఫలీకృతులయ్యారు, ఆ మాటని ఏ ఆంధ్రావాడూ ఒప్పుకోకపోయినా సరే ! తెలంగాణవారు బాగాలేరట, బానే ఉంది. కానీ దానికి అంతర్గత కారణాలేంటనే ఆత్మవిమర్శ, అంతర్మథనమూ ఈ ప్రాంతంలో గోచరించడంలేదు. ఒకడు బాగున్నాడంటే దానిక్కారణం వాడు ఇంకొకణ్ణి దోచడమే అనే పాత కమ్యూనిస్టు పిడివాదం (dogma) లో తెలంగాణ యావత్తూ మునిగి తేలుతోంది. పక్కవాడు బాగాలేడంటే అందుకు తానే నూటికి నూఱుపాళ్ళూ కారణమని బాగున్నవాడు బేషరతుగా అంగీకరించి బేడీలేసుకొని స్వయం ప్రకటిత ముద్దాయిగా బోనెక్కాలి. బాగాలేనివాడికి తాను బాగుపడడం విషయమై ఏ విధమైన సొంత బాధ్యత గానీ, ఆసక్తి గానీ ఉండనక్కఱలేదు. ఇదీ తెలంగాణవాదుల న్యాయస్మృతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ నుండి తాగుడు ద్వారా వస్తున్న ఆదాయాన్ని (రాష్ట్రం యొక్క మొత్తం ఎక్సైజ్ ఆదాయంలో 60 శాతానికి పైనే) గమనిస్తే తెలంగాణ నిండా మద్యపానవ్యసనం (ఆడవాళ్ళు కూడా మినహాయింపు కాదు). ఇహ తెలంగాణ ఎలా బాగుపడుతుంది, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా ? తెలంగాణలోని అంతర్గత సామాజిక లోపాల్ని, వైరుద్ధ్యాల్ని, స్వకీయమైన వైఫల్యాల్ని సమైక్యవాదంలోని లోపాలుగా, మీదుమిక్కిలి ఆంధ్రప్రాంతంవారి మోసాలుగా చిత్రించే ప్రయత్నం జఱుగుతున్నది. తమకి ప్రత్యేకరాష్ట్రం ఎందుకు కావాలో స్పష్టంగా చెప్పలేక ఆంధ్రప్రాంతీయులపై అభాండాలు వేసి, దూషించి, నిందించి వారిని విలన్‌లుగా చేసి మాట్లాడుతున్నారు. ఇది మహమ్మదాలీ జిన్నాగారి అడుగుజాడల్లో నడవడం తప్ప తదన్యం కాదు.

టి.ఆర్.ఎస్. పార్టీ వారు గత తొమ్మిదేండ్లుగా ఒక ఆంధ్రద్వేష పుస్తకాన్ని ప్రచురించి తెలంగాణ మీదికి వదిలారు. దాన్ని లక్షలాది ప్రతులుగా ప్రచురించి అడిగినవాడూ, అడగనివాడూ అనే తేడా లేకుండా గోబెల్స్ ప్రచారంలా ప్రతి తెలంగాణవాడికీ అందించారు. అందులోని అవగాహనా రాహిత్యాలూ, అర్ధసత్యాలూ, అసత్యాలూ చదివిన ప్రతి తెలంగాణవాడూ అగ్గిమీద గుగ్గిలమైపోయి ఆంధ్రప్రాంతీయుల మీద ఒంటికాలిమీద లేస్తున్నాడు. అదే సమయంలో అది ఆంధ్రప్రాంతీయుల చేతిలో పడకుండా తెలంగాణవాదులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే అందులోని విషయాలు ఆంధ్రప్రాంతీయుల దృష్టికి వస్తే వాటి వాస్తవికత్వమూ, ప్రామాణికత్వమూ (authenticity) నిష్కర్షగా ప్రశ్నించబడతాయి. అవి రాష్ట్రవ్యాప్తంగా చర్చించబడతాయి. అప్పుడు ఆ పుస్తకపు విశ్వసనీయత (credibility) ప్రశ్నార్థకమవుతుంది. "ప్రత్యేక" వాదన దూదిపింజలా తేలిపోతుంది. అందుచేత అలాంటి పుస్తకం ఒకటి ఉన్నట్లు, అందులోని అబద్ధాలన్నీ నగ్నసత్యాల్లా ప్రచారమౌతున్నట్లూ నాబోటి బహుకొద్దిమంది తెలగాణ్యేతరులకి మాత్రమే తెలుసు. కానీ తతిమ్మా నాన్-తెలంగాణ ప్రాంతంలో ఎవఱికీ తెలియదు. ఆంధ్రప్రాంతీయుల మీద హఠాత్తుగా తెలంగాణలో పెల్లుబికిన అకారణ ద్వేషాన్ని (ఆంధ్రవారిని పొడిచి చంపేయాలన్నంత కసి - అవసరమైతే ఆంధ్రాహిందువుల్ని చంపడానికి బి.జె.పి/ ఎ.బి.వి.పి. మద్దతు) చూసి ఆంధ్రప్రాంతీయులు చాలా షాక్ కి, మనోవేదనకీ గుఱవుతున్నారు. వారీ నీలాపనిందల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ ప్రాంతాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాల గుఱించి వారు విచారిస్తున్నారు. కానీ ఇందులో సదరు టి.ఆర్.ఎస్. పుస్తకం పోషించిన పాత్ర ఎవఱి దృష్టికీ రావడంలేదు.

ఆ పుస్తక సారాంశం గుఱించి కొంచెం ఇక్కడ రాస్తాను :

స్థూలంగా వారి వాదన ఇలా ఉంది :(బ్రాకెట్లలోనివి నా వ్యాఖ్యలు)

౧. తెలంగాణ మొదట్నుంచి వెనకబడ్డ ప్రాంతం కాదు. ఆంధ్రప్రదేశ్ లో కలిశాకనే వెనకబడ్డం మొదలయింది. అంతకుముందు ఆంధ్రప్రాంతం కంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బావుంది. (నిజమేంటంటే - తెలంగాణ అనే రాష్ట్రమేదీ అప్పటికీ లేదు. అప్పటికి ఉన్నది తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ జిల్లాలతో కూడుకున్న హైదరాబాద్ స్టేట్ మాత్రమే. కానీ తెలంగాణ అని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అంతకు రెండుమూడేళ్ళముందునుంచి హైదరాబాద్ స్టేట్ లోటుబడ్జెట్‌లో ఉంది) అది చూసి తెలంగాణ సంపదల్ని (ఏమిటో అవి) దోచుకోవడం కోసమే ఆంధ్రప్రాంత నాయకులు నెహ్రూ దగ్గఱ తమ పలుకుబడి ఉపయోగించి బలవంతంగా రెండు ప్రాంతాల్నీ కలిపారు.

(ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో కలిపేటంత గొప్ప పలుకుబడి ఉన్నవాళ్ళు ధర్మపురి, కృష్ణగిరి, కోలారు, బళ్ళారి, గంజామ్, కోరాపుట్, బరంపురం మొదలైన అనేక తెలుగుజిల్లాల్ని ఎందుకు కోల్పోయారు ? ఛత్తీస్‌గఢ్‌లో కలిసిపోయిన దంతివాడ జిల్లాని ఎందుకు తిరిగి రాబట్టుకోలేకపోయారు ? మద్రాసు నగరాన్ని సైతం ఎందుకు పోగొట్టుకున్నారు ? కొత్త రాజధాని నిర్మాణం కోసం నెహ్రూ నుంచి నిధులు కూడా ఎందుకు సంపాదించలేకపోయారు ? అవన్నీ మనం అడక్కూడదు. హైదరాబాద్ స్టేట్ లోని తెలుగుజిల్లాలు ఆంధ్రప్రాంతంతో కలవాలని అప్పటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అధికసంఖ్యాక ఎమ్మెల్యేలు వోటింగ్ చేసిన ఫలితంగానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది. అది బలవంతంగా కలపడం ఎలా అవుతుంది ? కలిపినవాడు బూర్గుల రామకృష్ణారావు. తెలంగాణవాడు, ఆంధ్రావాడు కాదు. ఈ సందర్భంగా ఆ కాలపు మహానాయకులు ఎప్పుడూ అనని మాటల్ని కూడా నిజంగా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. తమ వేర్పాటువాదం పూర్వీకుల స్ఫూర్తి (inspiration) తో నడుస్తోందని చెప్పుకోవడమే ఇందులోని అసలు ఉద్దేశం. వాళ్ళు అలా అన్నారనడానికి చారిత్రిక లిఖిత ఆధారాలు చూపమని నిగ్గదీసి ఖరాఖండిగా అడిగితే చూపలేకపోతున్నారు. ఉదాహరణకి - ఆంధ్రా, తెలంగాణ కావాల్సినప్పుడు విడిపోవచ్చునని నెహ్రూ అన్నాడట. అలాగే బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ శాసనసభలో సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు న్యూఢిల్లీ వెళ్ళొచ్చి "నా మరణశాసనం నేను రాసుకున్నాను" అన్నాడట. దీనికింకో పాఠాంతరం (version) ఏంటంటే - "సమైక్య తీర్మానం ద్వారా తెలంగాణకి మరణశాసనం రాశాను" అన్నాడని కూడా చెబుతున్నారు.)

౨. పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘించారు.

(ఈ ఒప్పందం పేరుకే ఒప్పందం. అందులో ద్వైపాక్షికత (bi-partite-ness) దయనీయంగా లోపించింది. వాస్తవానికి అది తెలంగాణ నాయకులు ఆంధ్రప్రాంత నాయకుల నెత్తిమీద బలవంతంగా ఏకపక్షం (unilateral) గా రుద్దడానికి చూసిన అసంబద్ధ, సంకుచిత నియమావళి. అది పూర్తిగా తెలంగాణకే అనుకూలంగా ఉందనీ, ఆంధ్రప్రాంత ప్రయోజనాల ఊసే అందులో లేదనీ మనకి గుర్తురాకపోతే బావుంటుంది)

౩. తెలంగాణవారి నిధులూ, నీళ్ళూ, నియామకాలూ, వనరులూ అన్నీ దోచుకున్నారు. కనుక ఆంధ్రావాళ్ళు దొంగలు, బందిపోట్లు, వలసవాదులు. బ్రిటీషర్లవంటివాళ్ళు. వాళ్ళని వెళ్లగొడితేనే తెలంగాణకి నిజంగా స్వాతంత్ర్యం వచ్చినట్లు. లేకపోతే తెలంగాణది బానిసబతుకే.

(తెలంగాణ నిధులు అని చెప్పబడేవి 80 శాతం వఱకు హైదరాబాద్ మఱియు దాని పరిసర మండలాల నుంచి వచ్చేవి. అసలు రాష్ట్రం యొక్క స్థూల దేశీయోత్పత్తి (GDP) లోనే 60 శాతం కంటే ఎక్కువ "ఈ చోటు" నుంచి వస్తోంది. మిగిలిన యావత్తు రాష్ట్రం యొక్క స్థూల దేశీయోత్పత్తి అంతా కలిపి పిసికి పిండి చేసినా 40 శాతం కంటే తక్కువే. ఆ హైదరాబాదీ నిధుల్లో 70 శాతం వఱకు అక్కడి ఆంధ్రప్రాంత, ఉత్తరాది (North Indian) ప్రజల వృత్తివ్యాపారాల నుంచి, వారు చెల్లించే ఆస్తిపన్నుల నుంచి సమకూడేది. తెలంగాణరాష్ట్రం ఏర్పడితే వీటిల్లో సగం ఆంధ్రరాష్ట్రానికి తఱలిపోతాయి. ఎందుకంటే ఫ్యాక్టరీ ఎక్కడున్నప్పటికీ ఎక్కడ రిజిస్టర్డ్ ఆఫీసు ఉందో అక్కడి ప్రభుత్వానికి పన్నుకట్టాలి. ప్రస్తుతం ఇక్కడ ఆం.ప్ర.. రాజధాని ఉంది కనుక ఇక్కడ రిజిస్టర్డ్ ఆఫీసులు పెట్టారు. కనుక ఆంధ్రప్రాంతీయులు అనుభవిస్తున్నవి తమ నిధులే. ఇందులో తెలంగాణ ప్రసక్తి అనవసరం.

నీరు పల్లానికి పారడం ప్రకృతిసహజం. అది ఆంధ్రప్రాంతీయుల తప్పు కాదు. తమ దురదృష్టానికి అయిదున్నఱకోట్లమంది ఆంధ్రవారిని దొంగలు, దొంగలని పదేపదే నిందించడం అనాలోచితమూ, అసూయాపూరితమూ, అసమంజసమే కాదు, మహాపాపం కూడా ! తెలంగాణ యొక్క నీటివనర్లని దోచుకునే ఉద్దేశంతో ఆంధ్రవారు కట్టిన ప్రాజెక్ట్ ఏదీ లేదు. ఎందుకంటే బ్రిటీషువారు వెళ్ళిపోయిన తరువాత మన రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ తప్ప ఆ స్థాయి గల పెద్ద ప్రాజెక్టులేవీ కట్టలేదు. నాగార్జునసాగర్ యొక్క ప్రణాళికారచన మఱియు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందే, తెలంగాణ ఆంధ్రలో కలవకముందే 1955 లో తెలంగాణ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆధ్వర్యవంలో జఱిగింది. ధవళేశ్వరం. ప్రకాశం బ్యారేజి లాంటివన్నీ బ్రిటీషువారు నదులకు లోతట్టు (downstream) లో కట్టినవి. వాటికి ఆంధ్రప్రాంతీయులు బాధ్యులు కారు. ప్రస్తుతం జలయజ్ఞం పేరుతో కొన్ని కడుతున్నారు గానీ వాటిల్లో తెలంగాణకి మేలు చేసేవే 60 శాతం వఱకు ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు కూడా తెలంగాణకే అధికభాగం వెళుతున్నాయి. ప్రతిపాదిత ఆయకట్టు కూడా 60 శాతం తెలంగాణదే.

ఇహపోతే నియామకాలు : ఇదొక పాతపాట. ఇది చెన్నారెడ్డి పాడిన పాచిపాట. వాస్తవం చెప్పాలంటే ఇది ఈ కాలానికి వర్తించదు. ఎందుకంటే 1974 లో రాష్ట్రపతి ఉత్తర్వులూ, జోనల్ నియామకాల పద్ధతీ వచ్చాక మన రాష్ట్రంలో ప్రతివాడూ బలవంతంగా తాను పుట్టిన జోన్ కే పరిమితం చేయబడ్డాడు. మిహతా జోన్ లలో నాన్-జోన్ వ్యక్తికి ఉద్యోగం రాని పరిస్థితి. అటువంటప్పుడు తెలంగాణవారి ఉద్యోగాల్ని ఆంధ్రావాళ్ళు కొట్టేయడం ఎలా సాధ్యం ? అనే ప్రశ్న లేవనెత్తకుండా/ లేవనెత్తనివ్వకుండా పొలోమని ప్రచారం చేసేస్తున్నారు. ఈ పాట టి.ఆర్.ఎస్. పెట్టిన కొత్తల్లో లక్షా అఱవై వేల తెలంగాణ ఉద్యోగాలతో మొదలయింది. ఆ తరువాత పాట పెంచారు - మూడులక్షలన్నారు. కాదు, కాదు, నాలుగు లక్షలన్నారు. ఇప్పుడేమో ఏకంగా ఆఱు లక్షలంటున్నారు. ఆంద్రోల్లు ఎల్లిపోతే ఆ ఉద్యోగాలన్నీ మనకే అని తెలంగాణ పల్లెప్రాంతాల్లో హోరుగా జోరుగా ప్రచారం చేసేశారు. వాళ్ళు అదంతా నమ్మి నిజంగానే ఆంద్రోల్లంతా విలన్‌లనీ, ఆంద్రోల్లు ఎల్లిపోతేనే గాని తాము బాగుపడమనీ గుడ్డిగా విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వోద్యోగాల్లో తెలంగాణకి రావాల్సిన శాతం ప్రకారం ఆఱులక్షల ఉద్యోగాలు రావాలట. అసలు ఇప్పుడక్కడ ఉన్నదే తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు కాగా ఒక్క తెలంగాణ ప్రాంతానికే ఆఱులక్షల ఉద్యోగాలెలా వస్తాయనే ప్రశ్నకి సమాధానం లేదు. పైగా అవి ఖాళీలు (vacancies) కూడా కావు. ఆ కుర్చీల్లో ఇప్పుడు జనం హాజరుగా ఉన్నారు. మఱి తెలంగాణ వస్తే ఏ కొత్త ఉద్యోగాలివ్వబోతున్నారు ? ఎన్ని కొత్తఖాళీలని సృష్టించబోతున్నారు ? ఇప్పుడు మనం వాళ్ళ దగ్గఱికి పోయి "అది కాదయ్యా బాబూ ! అసలు పరిస్థితి వేఱుగా ఉంది" అని నిజం చెప్పబోయినా వాళ్ళు వినిపించుకునే పరిస్థితి లేదు. అంతగా జనానికి గోబెల్స్ ప్రచారంతో పిచ్చెక్కించేశారు.

తెలంగాణ వనరులట. ఆంద్రోల్లు దోచుకుంటున్నారట. ఏమున్నాయబ్బా, తెలంగాణలో అంత విఱగబడిపోయే వనరులు, ఆంద్రోల్లు వాటిని భారీ స్థాయిలో దోచుకోవడానికి ? ఎన్నిసార్లు లెక్కపెట్టుకున్నా హైదరాబాదులో ఆంధ్రప్రాంతీయుల పెట్టుబడుల ద్వారా పెఱిగిన భూమి విలువలు లేదా సింగరేణి బొగ్గు తప్ప ! వాస్తవానికి పనికొచ్చే ప్రకృతివనరులన్నీ ఆంధ్రప్రాంతంలోనే ఉన్నాయి. అక్కడ ప్రకృతిసిద్ధంగా సారవంతమైన వ్యవసాయభూములే కాక సున్నపురాయి, ఆస్బెస్టాస్, బాక్సైట్, సోడియమ్, మ్యాంగనీస్, గ్రానైట్, యురేనియమ్, ఇనపఖనిజం, వజ్రాలు, గ్యాస్, పెట్రోలియమ్ ఇలా లెక్కలేనన్ని వనరులున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే తెలంగాణవాదుల దృష్టిలో దొంగలైన ఆంధ్రవారి వనరులు ఇతరరాష్ట్రాలవారి చేతుల్లో నిరంతర దోపిడికి గుఱికావడం, ఆంధ్రప్రాంతీయులు తమ దగ్గఱి వనర్లని తామే దోచుకోలేని నిస్సహాయస్థితిలో ఉండడం)


(ఇంకా ఉంది)

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్