26.1.10
అంతిమంగా అంతా మంచే జఱుగుతుంది
8:50 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: తెలుగు - తెలుగుజాతి - తెలుగునేల
విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉంది హైదరాబాదు వెళ్ళే ఆ పొగబండి. అందులో ఒక పెట్టెలో ఇద్దఱు స్త్రీలలో ఒకామె కింది బెర్తులో కూర్చున్న పురుషుణ్ణి అడుగుతున్నది. "సార్ ! ఈమె గర్భవతి. పైబెర్తుమీదికెక్కడం ఈమెకి మంచిది కాదు. అది మీరు తీసుకొని మీ బెర్తు మాకిస్తారా ? ప్లీజ్" అని !
అతను అనూహ్యంగా ఒక ప్రశ్న వేశాడు. "మీరు ఆంద్రోల్లా ?"
"అవునండీ !"
"అయితే ఇంకోల్లని అడుక్కోండి. నేనియ్య"
’ఈమధ్యకాలంలో తెలంగాణ నాయకులు ఎంత పెద్ద స్థాయిలో, ఎంత విస్తృతంగా రాజకీయాలతో సంబంధం లేని సామాన్య తెలంగాణ ప్రజల మనస్సుల్ని సైతం ఎలా ద్వేషకలుషితం కావించారో దానికి ఇదొక ప్రత్యక్ష దృష్టాంతం’ అనిపించింది. దీని గుఱించి తరువాత రాస్తాను. అయితే నా దృష్టిలో ఈ పరిస్థితి తాత్కాలికమే. ప్రపంచంలో రాష్ట్రవిభజనలూ జఱిగాయి. దేశవిభజనలూ జఱిగాయి. కానీ ఒక జనజాతికి ఇష్టం లేకుండా దాన్ని ఎల్లకాలం పరిపాలించడం ఎలాగైతే సాధ్యపడదో, అలాగే రాజకీయ స్వాతంత్ర్యం గలిగిన ఒక జనజాతిలో ఒక పెద్దభాగం యొక్క ఇష్టపూర్వకమైన అంగీకారం లేకుండా దాన్ని విభజించడం కూడా అలాగే సాధ్యపడదు. అలాంటి ప్రయత్నాలు చరిత్రలో ఎప్పుడూ సఫలం కాలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర గానీ ప్రపంచంలోని అనేక ఇతర అంతర్యుద్ధాల (civil wars) విషయం గానీ దీన్నే నిరూపిస్తున్నది. అందుచేత ఆంధ్రప్రదేశ్ విభజనకి గుఱయ్యే అవకాశాలు తక్కువ. గతనెల ఈ రాష్ట్రం ఆ అంచుదాకా వెళ్ళిన మాట నిజం. కానీ అలా వెళ్ళినది కాస్తా ఆంధ్రప్రాంత సోదరుల జోక్యంతో వెనక్కొచ్చింది. ఇలా అడ్డుకున్నందుకు తెలంగాణ సోదరులు ఆంధ్రసోదరులపై ప్రస్తుతానికి మండిపడినప్పటికీ సుదూర భవిష్యత్తులో వారూ, వారి సంతానమూ ఈ పరిణామానికి సంతోషించి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పే రోజొస్తుంది. నా ఉద్దేశంలో - ఇది వారి మంచి కోసమే జఱిగింది, భగవత్‌సంకల్పానుసారమే జఱిగింది. వారిప్పుడు జ్వరంలో ఉన్నారు. ఈ జ్వరం సిద్దిపేటకి చెందిన ఒకానొక మలేరియా దోమ కుట్టడం వల్ల వచ్చింది. జ్వరం మీద ఏం చెప్పినా అర్థం కాదు. ఒళ్ళు తెలియకుండా ఏవేవో కలవరింతలు. మధుర పదార్థాలు కూడా విషంలా పనిచేస్తాయి. కళ్ళు తెఱిస్తే విపరీతమైన కళ్ళమంట. కాంతిని భరించలేరు. శబ్దాల శ్రావ్యతని ఆస్వాదించలేరు. జ్వరంలో కూర్చుని ఆలోచించినా, మాట్లాడినా జ్వరం పెఱిగిపోతుంది. మగతలో పడి మనుషుల్ని గుర్తుపట్టలేరు. ఎవఱు శత్రువులో, ఎవఱు మిత్రులో అర్థం చేసుకోలేరు. ఇది ప్రస్తుతం తెలంగాణవారున్న పరిస్థితి. ఈ పూనకం పూర్తిగా దిగి వారు మళ్ళీ మామూలు మనుషులయ్యే రోజు త్వరలోనే వస్తుంది. దీనికి తగిన చికిత్సకుడు కాలపురుషుడే. అయితే జ్వరాలు మనుషుల్ని చంపవు. ఎక్కడ పొఱపాటు చేశామో తెలియజేస్తాయి. అంతే !
ఇలా జఱగాల్సి ఉంది కనుక ఇలా జఱుగుతున్నది. దీని సమయం దాటిపోగానే ఇది ఎలా వచ్చిందో అలాగే సమసిపోతుంది. అప్పుడు వీర వేర్పాటువాదులు కాస్తా వీరసమైక్యవాదులుగా అవతరించడాన్ని మీ కళ్ళతో మీరే చూస్తారు. "అవునూ ! ఆరోజు మనం ఎందుకలా మాట్లాడామంటావ్ ?" అని వాళ్ళలో వాళ్లే ఆశ్చర్యపోతారు. దీని గుఱించి ఎవఱూ నిద్రలు మానుకుని ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇందులో బాధపడాల్సిందేమీ లేదు. జాతీయవాదాలు కాలపురుషుడి కఠినపరీక్షలకి తట్టుకొని నిలబడినప్పుడే అవి శాశ్వతమౌతాయి. ఇది తెలుగుజాతికి ఒక తాత్కాలిక పరీక్షే తప్ప వారి సమైక్యాన్ని శాశ్వతంగా అంతం చేసేటంత సామర్థ్యం కలిగినది కాదు. ప్రపంచంలోని అనేక భాషాజాతులతో పోలిస్తే తెలుగువారి రాజకీయ సమైక్యానికి మఱీ ఎక్కువ వయసు లేదు. యునైటెడ్ స్టేట్స్ 230 సంవత్సరాల నుంచి సమైక్యంగా ఉంది. ఇంగ్లండు 700 సంవత్సరాల నుంచి సమైక్యంగానే ఉంది. థాయ్‌లాండ్ 400 ఏళ్ళనుంచి సమైక్యంగానే ఉంది. జపాన్ 2000 (అక్షరాలా రెండువేల) సంవత్సరాల నుంచి సమైక్యంగానే ఉంది. "54 ఏళ్ళనుంచి... 54 ఏళ్ళనుంచి..." అని ఎన్నిసార్లు గొంతు చించుకున్నా 54 ఏళ్ళంటే పెద్ద కాలమేమీ కాదు. మన దేశంలో సగటు భార్యాభర్తల కాపరానిక్కూడా ఆ మాత్రం వయసు సర్వసాధారణం. అలాంటిది ఒక మహాజాతి చరిత్రలో 54 ఏళ్ళు ఒక లెక్కా జమా ? అంటే దానర్థం తెలగాణ్యులు గానీ, ఆంధ్రప్రాంతీయులు గానీ తాము ఒకఱి గుఱించి ఒకఱు ఏదో యమా కనిపెట్టేశామనీ, కూలంకషంగా తెలిసేసుకున్నామనీ అనుకోవడమూ, ఆ ప్రాతిపదికన వివాదపడడమూ అజ్ఞానజనితం, అమాయకత్వం.
మిత్రమా ! మనం కలిసి వెళ్ళాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. తగినంత దూరం వెళ్ళకముందే అపార్థం చేసుకోవడం సరికాదు. నాతో వ్యవహరించడం నువ్వెలాగైతే అభ్యసిస్తున్నావో నేనూ అలాగే అభ్యసిస్తూ ఉన్నాను. నేను నీకంటే సర్వజ్ఞుడినై తప్పులు చేస్తున్నానని నువ్వు భావిస్తున్నది సమీచీనం కాదు సుమా ! నేను నువ్వనుకుంటున్నంత శక్తిమంతుణ్ణి గానీ, సర్వజ్ఞుణ్ణి గానీ కాను. నేనూ నీలాంటివాణ్ణే. నేర్చుకోవడానికి నాకూ ఒక అవకాశమివ్వు.
మనుషులు గానీ, జాతులు గానీ, ప్రాంతాలు గానీ తమ అధీనంలో తాము ఉండి, పూర్తిగా తమ స్వసంకల్పానుసారంగా తాము ప్రవర్తించజాలవు. అన్నీ/ అందఱూ కాలపురుషుడికి అధీనమే. తెలుగువాళ్ళు 1995 నుంచి 2014 దాకా 19 ఏళ్ళపాటు ఇలా అంతర్గత వివాదాలతో సతమతం కావాల్సి ఉంది. కనుక ఆ ప్రకారమే సతమతమవుతున్నారు. విడిపోవడానిక్కాదు ఆంధ్రప్రదేశ్ 1956 లో ఏర్పడినది. విడిపోవడానిక్కాదు ఇది గతంలో ఇలాంటి వేర్పాటువాదాల్ని తట్టుకొని నిలబడినది. మనల్ని విడిపొమ్మని కాదు ఈ వేర్పాటువాదాలు సూచిస్తున్నది. తద్ద్వారా మన ఆచరణలోని లోటుపాట్లని సూచిస్తూ, ఇప్పటివఱకు అయిన అనుభవాల నుంచి సరికొత్త సమైక్య పాఠాలు నేర్చుకొమ్మని మాత్రమే అవి సందేశిస్తున్నాయి. ఒక జాతిగా మనల్ని మనం నియంత్రించుకుంటూ బాధ్యతాయుతజాతిగా రూపొందే పరిణామక్రమంలో ఈ వేర్పాటువాదాలొక భాగం. ఎదుగుతున్న పిల్లలు (adolescent children) తమ పెద్దల మీద తాత్కాలికంగా తిరుగుబాటు చేస్తారు. వారు పూర్తిగా ఎదిగినాక తిరుగుబాట్లు మాయమై మిత్రులుగా మారతారు. గతంలో 1930 ప్రాంతాల్లో రాయలసీమవారు ఇంతకంటే ఎక్కువగా తెలుగుకోస్తాని ద్వేషించేవారని మర్చిపోకూడదు. వారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేఱడానికి తిరస్కరించిన చరిత్ర నమోదై ఉంది. కానీ ఈనాడు సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం కోస్తావారికంటే వారే ముందుండడం గమనార్హం. వారి పాత్రని భవిష్యత్తులో తెలంగాణ సోదరులు తీసుకుంటారు. రాష్ట్రంలోని వేర్పాటువాదాల్ని ఉక్కుపాదంతో అణచివేయాలని తెలంగాణవారే కోరే రోజులొస్తాయి. ఇందుక్కనీసం రెండుమూడు దశాబ్దాలు పట్టుతుంది. మొత్తమ్మీద ఎలాగైనా సరే, మనం మన ప్రాంతాలవారీగా తాత్కాలికంగా నష్టపోయినా ఫర్వాలేదు, మన ప్రాంతం మీద ఇతరప్రాంతాలే బాగుపడ్డా ఫర్వాలేదు గానీ, మన మహాజాతిక్కూడా ఇతరజాతుల మాదిరే ఒక సుదీర్ఘ సమైక్య చరిత్రని ఏర్పఱచాలి. అదే నా ఆశ. అదే నా ధ్యాస.
తొందఱపడకండి తెలంగాణ మిత్రులారా ! ఈ సందర్భంగా ఏదో ఒక పాత తెలుగు సినిమాలో ఒక స్వామీజీ మాటలు నాకు గుర్తొస్తున్నాయి. "ఎంతగా ద్వేషిస్తున్నావో అంతగా తపించే రోజులూ వస్తాయి నాయనా !"
26.01.2010
