26.1.10
బ్రిటీషువారి గుఱించి ఒక మంచిమాట అనుకుందాం !
9:09 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: పిచ్చాపాటి
భారత గణతంత్ర దినోత్సవం నాడు ఇది రాయడం ఒక అసందర్భ విషయం అని ముందస్తుగా ఒప్పుకోక తప్పదు.
చిన్నప్పట్నుంచి మనకి బళ్ళల్లో పాఠ్యపుస్తకాల ద్వారా జఱపబడిన నిరంతర బ్రెయిన్‌వాషింగ్ ఫలితంగా మనలో జీర్ణించిన ప్రాగ్‌భావనల్ని (prejudices) పక్కన బెట్టి పునరాలోచిస్తే - బ్రిటీషు పాలన గుఱించి మన ప్రభుత్వాలు ప్రచారం చేస్తూవచ్చిన విషయాలతో స్వల్పంగా విభేదిందాలనిపిస్తుంది. బ్రిటీషువారిపై భారతీయులు పోరాడ్డం కొన్ని యథార్థమైన సమస్యల వల్ల జఱిగిందనే విషయంలో మనకి సందేహాలు అవసరం లేదు. బ్రిటీషువారి పాలనలో అన్ని ఉన్నతస్థానాల్లోను బ్రిటీషువారే ఉండేవారు. వ్యవసాయ వాణిజ్యాల మీద భరించలేనంత భారీగా పన్నులు వేసేవారు. కొన్ని ప్రాంతాల్లో ఆ పన్నులు అఱవైశాతం దాకా ఉండేవి అని తెలిస్తే ఇప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అది కాక గనుల సంపదనీ, అటవీసంపదనీ విపరీతంగా బ్రిటన్ కి తరలించేవారు. వారి పాలనలో దేశీయ భాషా సారస్వతాలకీ, శాస్త్రాలకీ, విద్యలకీ, కళలకీ ఆదరణ అతివేలంగా క్షీణించింది. అదేవిధంగా వారు సామూహిక మతమార్పిళ్ళకీ, మతకల్లోలాల్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించడానికీ పాల్పడ్డారు. ఒక పాలకవర్గాన్ని దించెయ్యడానికి ఎన్ని సమంజసమైన కారణాలుండాలో అవన్నీ బ్రిటీషు పాలనలో నూటికి నూఱుశాతమూ సలక్షణంగా ఉన్నాయి. కాదనడానికి లేదు. అయితే ఈ లక్షణాలు స్వతంత్రదేశంలో కూడా నూటికి నూఱుశాతమూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా బ్రిటీషువారినే ఎందుకు తప్పుపట్టాలో, వారినెందుకు శాశ్వత ప్రాతిపదికన భయంకరంగా విలనైజ్ చెయ్యాలో నాకు తెలియదు.
“బ్రిటీషువారు, బ్రిటీష్ పాలన" అని ఏకమొత్తంగా మాట్లాడేయడం దగ్గఱే నాకు చిక్కొస్తుంది. బ్రిటీషు హయామంతా ఒకే సరూప, ఏకాండీ కాలఖండం (uniform, monolithic period) కాదు. అందులో దశలు (phases) ఉన్నాయి. వారు ఈస్టిండియా కంపెనీగా ఇక్కడ యుద్ధాలు చేసిన కాలంలో వారి స్వభావం వేఱు. యుద్ధాలన్నీ అయిపోయాక పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో వారి స్వభావం వేఱు. సిపాయిల తిరుగుబాటు (sepoy mutiny) అనంతరం భారత సామ్రాజ్యాన్ని విక్టోరియా మహారాజ్ఞి నేరుగా పరిపాలించడం మొదలుపెట్టినాక వారి స్వభావం వేఱు. భారత రాజధానిని కొల్కతా నుంచి కొత్తఢిల్లీకి మార్చినాక వారి స్వభావం వేఱు. ఇలా అర్థం చేసుకోవాల్సి ఉంది. భారతదేశంలో తమ పాలన తతఃపూర్వం కంటే ఇనుమిక్కిలిగా స్థిరపడినాక భారతీయుల పట్ల బ్రిటీషువారి వైఖరిలో కొంత ప్రసన్నతా, సౌహార్దమూ అభివృద్ధి చెందాయని చెప్పుకోవచ్చు. సరిగ్గా ఆ మెత్తదనాన్ని ఆసరాగా చేసుకునే మన స్వాతంత్ర్యోద్యమాలు పెంపొందాయని నా ఊహ. ఒకవేళ వారు అంతకుముందు వహించిన కాఠిన్యాన్నే అవలంబించి ఉంటే మహాత్మాగాంధీ ఉండేవారు కారు. ఆయన అహింసా ఉండేది కాదు. చాలాసార్లు నాకు అనిపించేది - ఆనాటి అగ్రకులాలవారికి బ్రిటీషు ప్రభుత్వంలో ఒక స్థాయికి మించి పదోన్నతులు పొందడానికి అవకాశం లేకుండా పోవడం స్వాతంత్ర్యోద్యమానికి ఒక కారణమని ! తరువాత్తరువాత అనేకవర్గాల్ని, వారివారి సామాజిక, వర్గీయ అసంతృప్తుల్నీ కూడా తమ ఉద్యమంలో భాగంగా చేసుకుని ఉంటారు..
బ్రిటీషువారు నాగరికులు కావడానికంటే ఎన్నో సహస్రాబ్దుల ముందే మనం నాగరికులమనేది నిజమే కానీ, వారు భారతదేశంలో అడుగుపెట్టేనాటికి మన దగ్గఱ ఆ లక్షణాలేవీ వారికి కనిపించలేదు. ఏవో ఒకటి-రెండు అగ్రకులాల్ని మినహాయిస్తే వారిక్కడ అడుగుపెట్టేనాటికి మనమంతా ఏ విషయంలోను స్పష్టత లేనివారుగా ఉన్నాం. మన నాగరిక గతమేంటో మనకే తెలియనంతగా దిగజాఱి ఉన్నాం. ఆ నాగరికతాభ్రంశమే మనం వారికి పాదాక్రాంతులం కావడానికి దోహదించింది. ఇంగ్లీషే కాకుండా వాళ్ళు మనకి చాలా చాలా నేర్పిపోయారు. జాతీయతాభావన నేర్పారు. తాము స్వయంగా రాజఱికవాదులైనప్పటికీ ప్రజలకి జవాబ్దారీ అయిన నవీన పరిపాలనావ్యవస్థల్ని ఎలా నిర్మించుకోవాలో మనకి నేర్పారు. కులమత విచక్షణ లేని సార్వజనిక విద్యావ్యవస్థని ఎలా ఏర్పఱచుకోవాలో నేర్పారు. అలా ప్రతిరంగంలోను అనుసరించదగ్గ ప్రమాణాల్ని (standards) నెలకొల్పారు. మన ఆధునిక జీవనంలోని ప్రతిరంగం మీదా వారి ముద్ర బలంగా ఉంది. వాటికింద వారు వేసిన పునాదులున్నాయి. ఏదైనా చేసి ఏదో ఒకరోజున మనం ఇంగ్లీషుభాష ఆధిపత్యాన్ని వదిలించుకోవచ్చు. కానీ వారు నేర్పిన పద్ధతుల్ని, దృక్పథాన్ని మాత్రం వదిలించుకోలేం. వాటిల్లో మన సంస్కృతిని మించిన ఆధునికత ఉంది. మన అవగాహనని మించిన అవగాహన కొంత ఉంది. మఱింత స్పష్టత ఉంది. మఱింత క్రమం ఉంది.
బ్రిటీషు పాలకుల సంగతెలా ఉన్నా, వారి ఉద్యోగులుగా ఇక్కడ పనిచేసిన తెల్లవారు స్థానికంగా అనేకప్రాంతాల్లో ప్రజలకీ, వారి కళాసారస్వతాలకీ ఇతోధికంగా సేవ చేసి పోయారు. అలా చెయ్యమని వారినెవఱూ అడగలేదు. కేవలం స్వీయసంకల్పచోదితులై, జగద్ధితకాంక్షతో, లోకోపకారబుద్ధితో చేశారు. వ్యావహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడైన Yates దొర, తెలుగువారి స్థానికచరిత్రల్ని క్రోడీకరించిన మెకంజీ, తెలుగుభాషాసాహిత్యాల్ని ఉద్ధరించిన సి.పి.బ్రౌన్, గోదావరికి ఆనకట్ట కట్టిన సర్ ఆర్థర్ కాటన్ దొర.... ఈ జాబితా చాలా పెద్దది. అలా అన్ని రాష్ట్రాలలోను లెక్కలేనంతమంది తెల్లవాళ్ళు భారతీయుల సంక్షేమం కోసం జీవితాల్ని అంకితం చేశారు. తమకున్న పరిజ్ఞాన పరిధిలోనే ప్రపంచానికి భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని పరిచయం చేశారు. ఆ క్రమంలో వారు కొన్ని మానవ సహజ స్ఖాలిత్యాలకి ఒడిగట్టి ఉండొచ్చు. అంతమాత్రాన వారు పడ్డ శ్రమని తగ్గించి, లేదా వక్రీకరించి పొడకట్టించడం (projecting) భావ్యం కాదు.
బ్రిటీషువారు భారతదేశాన్ని దోచుకోవడం తప్ప మఱింకేమీ చెయ్యలేదనే ఈ అర్ధసత్య ప్రచారాల్ని తీఱికచెయ్యక తప్పదు. కనీసం వారు ఈ దేశాన్ని వదిలివెళ్ళిన అఱవైమూడేళ్ళకైనా వారీ దేశానికి చేసిన అమూల్యమైన వితరణనీ, సేవనీ కూడా గుర్తించి, స్మరించి నెనర్లు చెప్పుకోవడం మానవీయం అనిపించుకుంటుంది.
26.01.2010
