15.10.09

భాషాహక్కుల్ని కోల్పోతే అన్ని హక్కుల్నీ కోల్పోయినట్లే -1



ధ్రదేశంలో స్వలింగసంపర్కం (homosex) కంటే, వావిడికం (incest) కంటే అత్యంత నిషిద్ధమైన ప్రస్తావన (taboo topic) ఒకటుంది. దాని పేరు భాషాభిమానం. ఈ రాష్ట్రంలో భాషాభిమానం ప్రదర్శించడం తప్పు. భాషాభిమానం ఉండాలని చెప్పడం తప్పు. తెలుగుభాషకి స్థానం కల్పించమని అడగడం తప్పు. టోకుగా భాషకి సంబంధించిన ఏ టాపిక్కైనా తప్పే, తప్పున్నఱే. ఇక్కడ సర్వకాల సర్వావస్థల్లోను భాష గుఱించి అందునా తెలుగుభాష గుఱించి మాట్లాడ్డం చాలా అసందర్భంగా భావించబడుతుంది. అలాగని ఇదేమైనా బహుభాషారాష్ట్రమా ? అంటే కానేకాదు. అన్నిచోట్లా ఉన్నంతే ఇక్కడా భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు కొన్నున్నాయి. తెలుగువాళ్ళు తమ మాతృభాషని నీచంగా చూడ్డం గమనించి వాళ్ళు కూడా తమ మైనారిటీ హోదా మర్చిపోయి తెలుగుని నీచంగా చూడ్డం అలవాటు చేసుకున్నారు, మఱోపక్క తమ మైనారిటీ భాషల్ని మనసారా ప్రేమిస్తూ ! విచిత్రంగా ఇక్కడ నూటికి తొంభై అయిదుశాతం మంది అంతా తెలుగువాళ్ళే, తెలుగు రాయడమూ, చదవడమూ అందఱికీ వచ్చినా రాకపోయినా ! మఱి తెలుగుభాష ఇక్కడ ఇలా నిషిద్ధ ప్రస్తావనగా మారిపోవడానికి కారణమేంటి ?

ఏదైనా ఒక విషయం ఇలా నిషిద్ధ ప్రస్తావనగా దానంతట అది మారదు. దాన్నలా మార్చేందుకు ఆద్యులైనవాళ్ళు కొందఱుంటారు. వాళ్ళు సమకాలీన సమాజంలో బహు శక్తిమంతులై ఉంటారు. దాన్నలా మార్చడంలో వాళ్ళకి భారీయెత్తున స్వప్రయోజనాలుంటాయి, శాశ్వత ప్రయోజనాలుంటాయి. అవేంటో వాళ్ళు బయటపడి అందఱితోనూ వెల్లడించరు. తాము అనుకున్నదాన్ని నిషిద్ధవిషయంగా మార్చేస్తారంతే ! వాళ్ళని బట్టి మఱికొందఱు, వాళ్ళని బట్టి ఇంకొందఱు - అలా క్రమంగా అందఱికీ ఆ విషయాన్ని నిషిద్ధ ప్రస్తావనగా చూడ్డం అలవాటైపోతుంది. పాపం, ఈ అలవాటైనవాళ్ళలో చాలామందికి అందులో ఏ స్వప్రయోజనమూ ఉండదు, గుడ్డిగా ఒకడి తోక పట్టుకొని ఒకడు గోతిలోకి దిగడమే తప్ప ! "అది ఎందుకు నిషిద్ధప్రస్తావన ?" అనడిగితే మనకి సరైన సమాధానం రాదు. వాళ్ళు విశదీకరించి చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకే తెలీదు. అదొక అలవాటుగా మారిపోయిందంతే. అందఱూ తెలుగువాళ్ళే ఉంటున్న అపార్ట్ మెంట్ భవనంలో/ కార్యాలయంలో ఇంగ్లీషులో ఎందుకు నోటీసులు అంటిస్తున్నారని/ పంపిస్తున్నారని ఒకసారి అడిగిచూడండి, మిమ్మల్ని ఎలా చూస్తారో ! అసలు తాము చేస్తున్నది ఒక బుద్ధిలేని పని కాగా మీకే బుద్ధిలేనట్లు మొహం పెడతారు. అలాంటిదే జాతీయ రహదారుల మీద Speed thrills, but kills మొదలైనవి రాయడం కూడా. లారీలవాళ్ళక్కూడా మనలా ఇంగ్లిషొస్తే వాళ్ళు లారీలెందుకు తోల్తారు ? ఏమైనా నిరంకుశత్వం తర్కాన్ని పట్టించుకోదు. ఎందుకంటే దాని పేరే నిరంకుశత్వం కనుక. మన రాష్ట్రంలో ఇంగ్లీషు ఆధిపత్యం వెనక ఉన్నది ఇలాంటి మొండి, బండ, చండ నిరంకుశత్వం ఒకటే. దాని వెనక ఏ విధమైన తర్కమూ లేదు. ఇంగ్లీషుని కొన్ని దేశాల్లో మాట్లాడ్డానికీ, జనం మీద స్థానికంగా అమలవుతున్న ఈ విధమైన బలవంతపు భాషరుద్దుడు/ భాషబాదుడు కార్యక్రమానికీ ఏ విధమైన తార్కిక సంబంధమూ లేదు. ఉన్నదల్లా ఆ పేరుతో చెలామణీ అవుతున్న ఒక విదేశీ భాషాపశుత్వం. ఒకఱికో, ఇద్దఱికో ఇలాంటి నిర్హేతుకమైన అలవాట్లుంటే సరే, పోనివ్వండి ! అసలు మొత్తం జాతికే అదొక జాడ్యంలా పట్టుకుంటే ?

సరే ! ఇలా ఒక విషయాన్ని నిషిద్ధాంశంగా మార్చేశాక ఏం జఱుగుతుంది ?

పైప్రశ్నకి సమాధానాన్ని వెతికేముందు ఇలాంటి ప్రశ్నే ఇంకొకటి - సుపరిచితమైనది వేసుకుందాం. స్త్రీల సమస్యల్ని సమాజమంతటా నిషిద్ధాంశం (taboo topic) గా మారిస్తే - వాటిమీద ఎవరూ రాయకూడదనీ, మాట్లాడకూడదనీ శాసిస్తే ఏం జఱుగుతుంది ? స్త్రీలు తమ బాధల్ని మనసులోనే దిగమింగుకోవాలనీ, పుట్టింటివారితో కూడా చెప్పకూడదనీ, తమ బాధలకి కారణమైనవాళ్ళని దేవుళ్ళలా పూజించాలనీ, వాళ్ళు తమని చంపేసినా ఆ చావు వరప్రసాదం అనుకొని ఆనందంగా చచ్చిపోవాలనీ, లేకపోతే ద్రోహమనీ, పాపమనీ, బాధల్ని మౌనంగా భరిస్తే మహాపుణ్యమనీ, ఏదైనా జఱగనీ, మొత్తమ్మీద స్త్రీలు బయటపడకూడదనీ, బయటపడితే పరువు పోతుందనీ చెబితే ఎలా ఉంటుంది ? పర్యవసానంగా - స్త్రీలు దారుణాతి దారుణమైన హింసలకి బలైపోతారు. స్వంత ఇళ్లల్లోనే మానభంగాలకి గుఱవుతారు. బయటివాళ్ళకి అమ్మివేయబడతారు. కట్టుకున్న భర్త దగ్గఱ కూడా వాళ్ళ స్థితి పనిమనిషి కన్నా కనాకష్టమైన స్థాయికి దిగజాఱిపోతుంది. మగవాడికి ఉన్న నానా రకాల ఉంపుడుగత్తెల్లో, వేశ్యల్లో ఒకరుగా మారిపోతారు. వారికి అంతిమంగా సామూహిక ఆత్మహత్యలే తప్ప వేఱు గత్యంతరం ఉండదు.

అలాగే కార్మికుల సమస్యల్ని సమాజమంతటా నిషిద్ధాంశంగా మారిస్తే - వాటిమీద ఎవరూ మాట్లాడకూడదనే ఆచారాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది ? ఇహ అప్పుడు, వారిచేత రోజుకు పద్ధెనిమిది గంటలపాటు పని చేయించుకునేవాళ్ళు బయల్దేఱతారు. వాళ్ళు ఏ కారణం చేతనైనా ఒకరోజు పనిలోకి రాకపోతే వాళ్ళ భార్యల్నో, పిల్లలనో పనిలోకి పంపమంటారు. వాళ్ళమీద అనుమానమొస్తే చెట్టుక్కట్టేసి చచ్చేదాకా చావగొడతారు. వాళ్ళ మూలంగా ఏదైనా నష్టమొస్తే ఆ నష్టం పూడేదాకా జీతం, బత్తెం లేకుండా వెట్టిచాకిరీ చెయ్యమంటారు. ఈ బాధలకి తాళలేక కార్మికులు చికిత్సాతీతమైన అస్వస్థతలకి లోనై అల్పాయుష్కులుగా చనిపోతారు. వాళ్ళేదో అంతకుముందు బాకీ ఉన్నారని అబద్ధాలు చెప్పి యజమానులు వాళ్ళ వారసుల్ని శాశ్వత బానిసలుగా మార్చుకుంటారు.

ఇదంతా ఎందుకు జఱుగుతుంది ? ఒక విషయాన్ని ఎవరూ మాట్లాడకూడదని శాసించడం వల్ల ! దాన్ని అలా వెలివేయడం వల్ల ! దాని లోతుపాతుల్ని విచారించే అవకాశాలన్నింటినీ నిర్మూలించడం వల్ల ! దాన్ని సాకల్యంగా, కూలంకషంగా అర్థం చేసుకోవడానికి వీలుకల్పించే అన్ని దారుల్నీ ధ్వంసం చెయ్యడం వల్ల ! దానిమీద సమాజంలో ఆత్మశోధనకీ, ఆత్మపరిశీలనకీ ఉన్న ద్వారాల్ని మూసిపారెయ్యడం వల్ల !

అలాగే తెలుగుభాష, తెలుగుభాషాభిమానమూ అనేవి ఈ రాష్ట్రంలో నిషిద్ధాంశాలుగా మార్చబడ్డాక జఱుగుతున్నది ఏమైనా భిన్నంగా ఉన్నదా ?


(మఱికొంత వచ్చే టపాలో....)

12.10.09

మీరు నాతో కలిసి నడవకపోవచ్చు - కానీ నా ప్రయాణం ఎవరి కోసమూ ఆగదు



ఒక మిత్రుడు తన బ్లాగులో వ్రాసిన టపా ఇది :

http://nagaprasadv.blogspot.com/2009/03/blog-post_22.html

దీనికి వ్యాఖ్యలు వ్రాసినవారిలో ఎక్కువమంది భాష, దాని చరిత్ర, దాని సమస్యలు, దాని అభివృద్ధి మొదలైనవాటి గుఱించి అవగాహన గానీ, ఏ విధమైన సానుభూతి గానీ, ప్రేమ గానీ, సృజనాత్మక ఆలోచనలు గానీ ఉన్నవారిలా అగుపించలేదు. పైగా తెలుగుని అవహేళన చేసే ధోరణి, వట్టి వెకిలితనం, విదూషక వ్యవహారం కనిపించింది. ’వారి యోచనాస్థాయి అంతే” అనుకోవడం మినహా ఏమీ చెయ్యలేకపోయాను. అక్కడ వ్యాఖ్య రాయాలనిపించలేదు. ఎందుకంటే నా స్థాయికి తగిన పనులు మాత్రమే నేను చేయడం నాకు బావుంటుంది.

మాతృభాషాభిమానం, మాతృభాషలోనే మాట్లాడ్డం అభివృద్ధి చెందిన జాతుల లక్షణం. తద్విరుద్ధంగా మాతృభాషని కించపఱచడం వెనకబడ్డ బానిసజాతుల లక్షణం. ఈ రెండింటిలో మనం ఏదనేది ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు. ఇంగ్లీషు రానివాళ్ళని అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల గడ్డమీద ససేమిరా అడుగు పెట్టనివ్వడం లేదు. వాళ్ళు సంకుచితులని ఎవరూ అనడంలేదు, నోరు మూసుకుని వాళ్ళు చెప్పినట్లే ఇంగ్లీషు నేర్చుకుని అక్కడికి వెళుతున్నారు. అదే అభిమానాన్ని మనం తెలుగుమీద చూపిస్తే అదో నేరంలా మాట్లాడుతున్నారు. అవహేళన చేస్తున్నారు. అమెరికన్ల ఆంగ్లభాషాభిమానం సంసారం ఎందుకయింది ? అదే సమయంలో మన తెలుగువాడి భాషాభిమానం మాత్రం వ్యభిచారం ఎందుకయింది ? అది పూజనీయం ఎందుకయింది ? ఇది హాస్యాస్పదం ఎందుకయింది ? వాళ్ళ తల్లి ఎందుకలా పతివ్రత అయింది ? మన తల్లి ఎందుకిలా పిచ్చికుక్క అయింది ? మూలకారణమేంటో ఆలోచించారా ఎప్పుడైనా ?

నా అవగాహనలో - తెలుగుభాష యొక్క, దాని హోదా యొక్క అసలు సమస్య, మఱియు దాని మూలం రాజకీయపరమైనది. తరతరాల పాటు ఒక జాతిని నిరాయుధం కావించి ప్రపంచపటంలోంచి ఒక జాతి యొక్క చిఱునామాని సమూలంగా తుడిచిపెట్టడానికి సంబంధించినది. సామ్రాజ్యాల పేరుతో, సమైక్యాల పేరుతో పరాయిజాతులవారు క్రూరంగా సాగించిన/ సాగిస్తూ ఉన్న దమనకాండకీ, అణచివేతకి సంబంధించినది. ఈ భాష యొక్క కన్నీటిగాథ, ఆదర్శం ముసుగులో కొనసాగిన ఒక సీరియల్ దురాక్రమణ కథ. మన భాషా, మనమూ వేఱు కాము. మనమే మన భాష. మన భాషే మనం. ఆ "మనం"లోంచి విడిపోతామని ఎవరైనా అంటే సరే, అలాగే కానివ్వండి. అది వారి వ్యక్తిగతం. కానీ ఉమ్మడి విషయాల స్పృహ ఎవరికైనా ఉంటే, వారికి నేను చెప్పేదొకటే - మన జాతికి, భూభాగానికీ, నాగరికతకీ, ఆఖరికి జాతీయతకీ ప్రత్యేక గుర్తింపు నిచ్చేది మన భాష. అది మన పూర్వీకుల యొక్క, మన యొక్క ఊహాశక్తికి, తెలివితేటలకీ, సృజనాత్మకతకీ, తనదైన స్వంత దృక్కోణానికీ చిహ్నం. స్వభాష నశిస్తే స్వకీయత నశిస్తుంది. స్వకీయత నశిస్తే స్వభాష నశిస్తుంది. అవి రెండూ పరస్పరం ఆధారితాలు. అది మన జాతియొక్క గతానికీ, వర్తమానానికీ వారధి. అలాగే మన వర్తమానానికీ, భవిష్యత్తుకీ సైతం వారధే. దాన్ని ఎంత పరిశుద్ధంగా, ఎంత నవనవోన్మేషంగా, ఎంత స్వతంత్రతతో నిలబెడితే మనం అంత గౌరవనీయమైన జాతిగా మారతాం. అలా కాక మనం ఫక్తు కాపీరాయుళ్ళుగా, అప్పుల అప్పారావులుగా మారితే మన జాతికి ప్రపంచంలో గౌరవం లభించదు. మన ప్రాచీన నాగరికత నుంచి ఇప్పటి మనవఱకు మిగిలి వచ్చిన ఆస్తులు మన భాష, మన మతం మాత్రమే. మిగతావన్నీ నశించాయి. కనీసం ఈ మిగిలినవాటినన్నా జాగ్రత్తగా కాపాడుకోవడం, అభివృద్ధి చేసుకోవడం మన విధ్యుక్తధర్మం,

మన తెలుగువాడుక మాటల్లోను, రాతలోను కూడా తెలుగులా ఉండాలి. అలా కాక దీన్ని చెవులారా విన్నప్పుడు "ఇదేదో ఇంగ్లీషులోంచి పుట్టిన క్రియోల్ (Creole) లేదా పిడ్జిన్ భాష" అనే అనుమానం ఇతరదేశాలవారికి కలిగేలా తెలుగుని ఖూనీ చెయ్యడం మంచిది కాదు. మన స్వకీయత (originality) మన భాషలో ఉట్టిపడాలి. అందుచేత సరికొత్త స్థానిక పదాల్ని మనం సృజించాలి. అలా సృజించేవారికి ప్రోత్సాహమివ్వాలి. "వాటిని ఎవరు వాడతారు ? అవి ప్రచారంలోకి వస్తాయా ? రావా ?" ఈ ప్రశ్నలు అనవసరం. ఏ తల్లీ తన బిడ్డ ఇంతకాలం పాటు జీవిస్తాడని తెలిసి అతన్ని కనదు. ఇప్పుడు ఇంగ్లీషులో ఉన్న పదాలలో కనీసం నలభై శాతం వఱకు ఒక వందేళ్ళ క్రితం వాడుకలోలేవు. కానీ ఇంగ్లీషువారు మనలాంటివారు కారు గనుక కొత్తపదాల్ని కనుగొన్నారు. అలా కనుగొనడాన్ని ప్రోత్సహించారు. మనదేమో ఒక జడజాతిలా మారింది. ఉన్నదానికంటే వేఱైన స్థితిని ఊహించుకోవడమే మనకి గిట్టదు. అందులో భాగమే, ఇలా కొత్త తెలుగుపదాల్ని వ్యతిరేకించడం.

కొత్త తెలుగుపదాలు ఆంగ్లపదాభిమానులకి అవసరం కాకపోవచ్చు. కానీ తెలుగుభాషకి అవసరం. వారు గానీ, మనం గానీ మారుతిలా, మార్కండేయుడిలా చిరంజీవులం కాము. కానీ భాష మాత్రం చిరంజీవి. పదాల ప్రామాణికతే కాదు, దేని ప్రామాణికతైనా, అంగీకారయోగ్యతైనా ఒక్కరోజులో వచ్చిపడేది కాదు. అది కాలప్రవాహానికి సంబంధించినది. అంగీకారయోగ్యత (acceptability) స్కాచ్ విస్కీ లాంటిది. పాతబడేకొద్దీ విలువ పెఱుగుతుంది. ఈనాడు మొదలుపెట్టిన వాడుక నలుగుఱూ వాడగా వాడగా దశాబ్దాలు గడిచి పాతపడే కొద్దీ దానికి సమాజంలో అంగీకారయోగ్యత పెఱుగుతుంది. ఈనాడు మనం వాడుతున్న పత్రికాభాష ఒకనాడు అసలు ఉనికిలోనే లేదు. పూర్వీకులు బతికొస్తే వారికి ఈ పత్రికాభాష అర్థం కాదు. అది క్రమక్రమంగా పోగవుతూ ఈ రూపానికి వచ్చింది. మన కొత్తపదాలైనా అంతే !

రెండేళ్ళ క్రితం మన తెలుగు బ్లాగరులు ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రాచీన తెలుగుపదం "నెనర్లు" (Thanks) కి ఈనాడు గూగుల్ ప్రదర్శిస్తున్న ఫలితాల సంఖ్య. ఇది కాక "నెనరులు" అనే వాడుకకి మఱో ఏడువేల చిల్లఱ ఫలితాల్ని సైతం గూగుల్ ప్రదర్శిస్తోంది.

నా మటుకు నేను నా భాషాపాండిత్యాన్ని బట్టి నాకు దోషరహితం అనిపించిన వాడుకల్ని నా రచనల్లో చేస్తున్నాను. ఇతరులు కూడా అలాటి వాడుకల్ని కనుగొన్నప్పుడు వాటిని ఆమోదించి వాటికి నా రచనల్లో స్థానం కల్పిస్తున్నాను. నా బ్లాగు లేదా రచనలు చదవమని నేనెవరినీ బలవంతం చెయ్యడంలేదు. నేను వాడే పదాలే అందఱూ వాడాలని జీవో జారీ చెయ్యవలసిందిగా నేను ముఖ్యమంత్రి రోశయ్యగారి దగ్గఱ పైరవీ చేయడంలేదు. అటువంటప్పుడు పైన పేర్కొన్న బ్లాగులోని వ్యాఖ్యాతల యొక్క నిగ్రహం లోపించిన వావదూకతకి ప్రేరణ ఏంటో నాకు అనూహ్యం.

కొన్ని విదేశీ పదాలకి ప్రత్యామ్నాయాలు లేవు. నిజమే. అంత మాత్రాన దేనికీ దేశీయ ప్రత్యామ్నాయాలు లేవని, ఉండకూడదని వాదించడం సబబు కాదు. ఇక్కడ తెలుగుపదాలు సిద్ధాన్నంలా ఉన్నా వాటికి ప్రాచుర్యం లభించకపోవడానికీ, ఇంగ్లీషువారి కొత్తపదాలకి ప్రాచుర్యం లభించడానికీ ఉన్న కారణం - తెలుగుపదాలు హాస్యాస్పదమైనవి కావడమూ కాదు, తెలుగు ఇంగ్లీషులా అంతర్జాతీయ భాష కాకపోవడమూ కాదు. మన గడ్డమీదే మన తెలుగు అధికారభాష కాకపోవడం. కానివ్వకపోవడం. తెలుగుగడ్డమీద తెలుక్కి ఏ రంగంలోను ఏ విధమైన స్థానమూ లేకపోవడం. ఉన్న స్థానం కూడా అధికారపూర్వకంగా, కృత్రిమంగా, బలాత్కారంగా తొలగించబడ్డం. ఇవీ అసలు కారణాలు. ఇది ఒక పేద్ద సమస్యలో అంతర్గతంగా ఇమిడిఉన్న ఒక చిన్ని సమస్య మాత్రమే. ఇంగ్లీషువారి గడ్డపై వారి మాతృభాషే అన్నిరంగాల్లోను అధికారభాష. ఇంగ్లీషు ఇంట గెలుస్తున్నది కనుక రచ్చ గెలవగలుగుతోంది. తెలుక్కి మనం ఆ అవకాశం ఇస్తున్నామా ? అసలు తెలుగు అధికారభాష అనే కాన్సెప్టుని ఆమోదించేవాళ్లు మనలో ఎందఱు ? ఇంత మాతృభాషాద్వేషం, అసహ్యం నరనరాల్లోను జీర్ణించిన/ నూఱిపోయబడిన ఈ జాతీయుల నుంచి నేను పై టపాలోని వ్యాఖ్యల నాణ్యత కంటే మెఱుగైన జీవనవేదాంతాన్ని ఆశించడంలేదు. అయితే ఈ జాతిలో పుట్టిపెఱిగినంతమాత్రాన దీని జీవనవేదాంతాన్ని నేను ఒంటబట్టించుకోదల్చుకోలేదు. నా దృక్పథం వేఱు. నా జ్ఞానం వేఱు. నా వివేకం వేఱు. నా అవగాహన వేఱు. అందుచేత నా మార్గం, నా ప్రయాణం కూడా ఖచ్చితంగా వేఱు.

ఇందాక చెప్పినట్లు మన సమస్య రాజకీయపరమైనది. తెలుగువాళ్ళ సమస్య - తరతరాలుగా పరాయిజాతుల పరిపాలనలో బతుకుతూ వాళ్ళని తృప్తిపఱచడం కోసం, తద్ద్వారా డబ్బు సంపాదించుకోవడం కోసం వాళ్ళ భాషలు నేర్చుకోవడం, అందుకోసం మాతృభాషని కించపఱచడం. తెలుగుభాష ఇతరభాషల మాదిరి గౌరవనీయమైనది కావాలంటే ఈ జాతి కూడా ఆ జాతుల్లాగానే సర్వస్వతంత్రమైనది అవ్వాలి. ఇప్పటిలా ఒక ప్రాంతీయభాషగా కాక ఏదో ఒక స్వతంత్రదేశానికి జాతీయభాషగా తెలుగు ఐక్యరాజ్యసమితి స్థాయిలో నమోదయ్యే రోజు రావాలి. అంతేతప్ప ఇప్పుడు మనం చేస్తున్నట్లు న్యూఢిల్లీ చంకలో మట్టి దులపడం లాంటి పనికిమాలిన వెధవపనులు చేస్తున్నంతకాలం ఈ భాష, ఈ జాతి, ఈ సంస్కృతి ఇలాగే జీవనమరణ సమస్యని ఎదుర్కుంటూనే ఉంటాయి. జాతిదేహానికి ఎఱ్ఱరక్తకణాల్లాంటి భాషాభిమానులు ఇలా అవహేళనలకి గుఱవుతూనే ఉంటారు. జాతికేర్పడ్డ అక్రమసంబంధాల ద్వారా అంటుకున్న ఎయిడ్స్ రోగం లాంటి పరభాషాదాసులు ఇలా పేట్రేగిపోతూనే ఉంటారు. యజమానిభాషల ముందు బానిసభాషగా తెలుగు ఇలా ఎప్పటికీ చేతులు కట్టుకుని నిలబడుతూనే ఉంటుంది. ఒక జాతిగా, మనుషులుగా, భూభాగంగా మనకి లేని గౌరవమూ, బలమూ, హోదా మన భాషకి రావు,

ఈ సత్యాన్ని చాలామంది ఇప్పటికే గుర్తించారు, తెలుగువాళ్ళు తప్ప !

3.10.09

జగనన్నమన అధినాయక జయహే....



గనన్న మన అధినాయక జయహే
కాంగ్రెసు చీలికనేతా
కర్నూలు, కడప, చిత్తూరనంత
శ్రీకాకుళం దాకా
శేషాచల నల్లమలల్లో
లంచాల వఱదలు పొంగ
తన ఘనకబ్జా సాగె
తన వ్యాపారమె రేగె
చాల్లే తమ ఘనత సొద
జగనన్న ఝగడాకారక జయహే
కాంగ్రెసు చీలికనేతా
జయహే జయహే జయహే
జయజయజయ జయహే


ప్రతిజ్ఞ

ఎస్. రాజశేఖరరెడ్డి మా జన్మజన్మల రాజు. జగన్ మా యువరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వారి కుటుంబ ఎస్టేటై యున్నది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వారి తాతముల్లెయై యున్నది. నేను వారి ఎస్టేటును, వారి తాతముల్లెను వారి కొఱకు కాపలా కాసెదను. సుసంపన్నమైన, బహువిధమైన, నడమంత్రపు సిరియైన మా వైఎస్. కుటుంబ ఆస్తులు మాకు మిక్కిలి గర్వకారణమై యున్నవి. వారి కుటుంబము చేత మఱింత దోచుకొనబడుటకు నేను సర్వదా కృషి చేయుదును. వారి వారసుడైన జగన్ గారి తొత్తులను, తాబేదార్లను, చెంచాలను, రౌడీలను, గూండాలను నేను భయభక్తులతో గౌరవించెదను. వారికి సాష్టాంగపడెదను. వారి పేరు చెప్పి మమ్ములను బెదిఱించువారందఱి తోడను మర్యాదగా నడచుకొందును.

వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్