27.12.09
ఉత్తుత్తి దీక్షలూ, ఉత్తుత్తి రాష్ట్రాలూ !!
10:48 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: తెలుగు - తెలుగుజాతి - తెలుగునేల
జీవితంలో కాస్త ఫ్యాంటసీ మోతాదు ఉంటే తప్పు లేదనీ, దాని వల్ల మనుషులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని చెబుతారు మనశ్శాస్త్రవేత్తలు. లోకంలో ఒక్కొక్కఱికి ఒక్కొక్క రకం ఫ్యాంటసీ ఉండొచ్చు. ఒక ధనికుడి దగ్గఱ కారు నడిపే అతను "ఆ కారు తనదే అయితే... ?" అని ఊహించుకోవచ్చు. ఒకే హీరోయిన్ సినిమాలు అనేకం చూసీ, చూసీ ఒక యువకుడు "ఆమే తన ప్రియురాలైతే..." అని ఊహించుకోవచ్చు. పొట్ట పట్టుకొని నగరానికి చేఱుకున్న గ్రామీణుడు "ఆ నగరంలోని భవనాలు తమ ఊళ్ళో కూడా ఉంటే...?" అని ఊహించుకోవచ్చు. కాబట్టి ఫ్యాంటసీల్లో రకాలున్నాయన్నమాట. బహుశా ఆ రకాల్లో ఒకటి రాజకీయ ఫ్యాంటసీ అనుకుంటా. రాజకీయ ఫ్యాంటసీలంటే ఎలా ఉంటాయంటే - యూదులు లేని జర్మన్ సమాజాన్ని ఊహించుకున్నాడు హిట్లర్. ఫలితం - 45 లక్షల మంది యూదుల్ని హత్య చేయడం. హిందువులు లేని సెక్యులర్ రాజ్యాన్ని ఊహించుకున్నాడు జిన్నా. ఫలితం - 5 లక్షల మంది హిందువుల హత్య. కమ్యూనిస్టు విప్లవ వ్యతిరేకులు లేని రష్యాని ఊహించుకున్నాడు జోసెఫ్ స్టాలిన్. ఫలితం - కోటిమంది సోవియట్ పౌరుల హత్య మఱియు దేశంలో మగవాళ్ళు దొఱకక రెండో ప్రపంచయుద్ధానికి ఆడవాళ్ళని పంపాల్సి రావడం. అలాగే ఇప్పుడు కొంతమంది "ఆంద్రోల్లు" లేని హైదరాబాదునీ, తెలంగాణనీ ఊహించుకుంటున్నారు. ఇప్పటికే మన దేశంలో ముస్లిములు లేని భారతదేశాన్ని ఊహించుకునే సంస్థలున్నాయి. బ్రాహ్మణులు లేని హిందూ సమాజాన్ని ఊహించుకునే సంస్థలూ, రచయితలూ కూడా ఉన్నారు. అయితే దేవుడు మేల్జేసి వాళ్ళకి రాజకీయాధికారం లేకపోవడం దేశం చేసుకున్న సుకృతం. ఏంటో Fantasies, fantasies, fantasies... wild fantasies... wild political fantasies, to be precise !
ఒక గుంటూరువాడు ఇలాంటి రాజకీయ ఫ్యాంటసీకి దిగితే "మా గుంటూరుకేం తక్కువ ? పాత హైదరాబాద్ స్టేట్ కి ఉన్నట్లే మాకూ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడనే రాజు ఉండేవాడు. ఏడులక్షల జనాభా ఉంది కనుక మా గుంటూరు కూడా మహానగరమే. మా జిల్లాలో యాభై లక్షల జనాభా ఉంది. ఇది ఇండియాలో కొన్ని రాష్ట్రాల జనాభా కంటే ఎక్కువ. అసలు, పక్కనే విజయవాడ ఉండడం వల్ల మాకు రావాల్సినంత ప్రాధాన్యం రాలేదు. లేకపోతేనా ? ఆ గన్నవరం విమానాశ్రయం, అదీ మాకు రావాల్సింది. విజయవాడవాళ్ళు మాకు కృష్ణానదినీళ్ళు రాకుండా అడ్డుకుంటున్నారు. అందుకే ఇంత మహానగరమై ఉండీ గుంటూరు ఇప్పటికీ నీటి సరఫరా కోసం సబర్బన్ చెఱువుల మీదే ఆధారపడుతోంది. అసలు కృష్ణా అని ఒక నదికి తమ జిల్లాపేరు పెట్టుకోవడంలోనే పెద్దకుట్ర దాగిఉంది. ఈ అన్యాయాలు ఇంకానా ? ఇకపై సాగవు. పదండి, ప్రత్యేక గుంటూరు రాష్ట్రానికై ఉద్యమిద్దాం. విజయవాడవాళ్ళందఱినీ గుంటూరులోంచి వెళ్లగొట్టేదాకా విశ్రమించొద్దు. బెజవాడవాలా భాగో ! గుంటూరువాలా జాగో ! జై గుంటూరు రాష్ట్రం ! జైజై గుంటూరు రాష్ట్రం !! జై గుంటూరు తల్లీ !" - దీన్ని ఎవఱైనా "హాస్యాస్పదం" అంటే మాత్రం నాకు పిచ్చికోపం వస్తుంది. అలాంటివారికి నా సమాధానం ఒకటే - "ఒకప్పుడు కేసీయార్ ని చూసి కూడా ఇలాగే నవ్వారు. ఱేపు మా డిమాండు కూడా దేశంలో ప్రకంపనల్ని సృష్టిస్తుంది. ఎంత చిన్నరాష్ట్రపు డిమాండునైనా సమర్థించడానికి అదృష్టవశాత్తు మాకు బి.జె.పి అనే పార్టీ ఉంది. ఇలాంటి విషయాల్లో వాళ్ళ సహాయం మాకు ఉచితంగా లభిస్తుంది. కనుక ఈ గుంటూరు రాష్ట్ర డిమాండుని మేము ఇండియా పేఱోలగం దాకా తీసుకెళ్ళడానికి సైతం అవకాశం లేకపోలేదు."
"అరే ! విజయవాడ మీకు పట్టుమని ఇఱవై కిలోమీటర్లు కూడా లేదే ? అంత ద్వేషమేంటి ?"
"అదంతే ! అసలు వాళ్ళకీ మాకూ ఏ విషయంలోను పోలిక లేదు. మా బాస, మా యాస వేఱు. మా చరిత్ర వేఱు. మా సంస్కృతి వేఱు. విజయవాడవాళ్ళతో మేము కలిసుండే పరిస్థితీ, కలిసి పనిచేసే పరిస్థితీ లేదు. మా ఆత్మగౌరవం కోసం మా గుంటూరు రాష్ట్రం. మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం. జై గుంటూర్, జైజై గుంటూర్."
"హే భగవాన్ ! ఏమిటిదంతా ?" అని మీకు పిచ్చెక్కవచ్చు. నాకెక్కదు. ఎందుకంటే నాది ఇప్పటికే ముదురుపిచ్చి. నా పిచ్చి నాకానందం. అయితే ఒక తేడా ఉంది. మీ పిచ్చలు మీతో ఆగుతాయి. నా పిచ్చి నాతో ఆగదు. దీన్ని కొన్ని సంవత్సరాల్లో కొన్ని వేలమందికి అంటిస్తాను. ఎందుకంటే రాజకీయ ఫ్యాంటసీలతో ఎంత ప్రమాదకరమైన చెత్తవాగుడు వాగడానికైనా భారత రాజ్యాంగం అనుమతిస్తున్నది. నా చెత్తవాగుడుని టీవీఛానల్స్ యథాతథంగా ప్రసారం చేస్తాయి. నన్నెవ్వడూ ముయ్యలేడు. నా కలల్ని, నా రాజకీయ ఫ్యాంటసీల్ని వాళ్ళవిగా మారుస్తాను. వాళ్ళని క్రమంగా శతసహస్ర పిచ్చిలోకి దించుతాను. నా ఫ్యాంటసీ కోసం, చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని ఊహాజనిత రాష్ట్రం కోసం వందలాది మందిని హత్యలు చెయ్యడానికీ, లక్షలాది మందిని నిరాశ్రయుల్ని, అనాథల్ని చెయ్యడానికీ వెనుకాడని పచ్చిరక్తం తాగే రాక్షసులుగా, కిరాతకులుగా, పిశాచాలుగా జనాన్ని తయారు చేస్తాను. అమాయకుల్ని కాస్తా హంతకులుగా మార్చి శిక్షణిస్తాను. నాకు బి.జె.పి మద్దతు ఉంది. ఏం తప్పా ? తప్పయితే ముందు ఇలాంటి ఉద్యమాల్లో ఇప్పటికే ఉన్నవాళ్ళ సంగతి చూడండి."
అదీ సంగతి. మన ఫ్యాంటసీలు మనలోపలే అణిగిపోతే ప్రమాదమేమీ లేదు. అవి ఒక బహిరంగ సిద్ధాంతరూపాన్ని సంతరించుకున్నాక ఉపసంహారం లేని బ్రహ్మాస్త్రంలా ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తూ ముందుకు సాగుతాయి.
ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం అని కలవరిస్తున్నారు. చూస్తే నవ్వొస్తుంది. వాళ్ళకి తెలియదు. ఇండియాలో రాష్ట్రాలనేవి ఏ అధికారమూ లేని ఉత్సవ విగ్రహాలని. ఇవి డిగ్నిఫైడ్ మునిసిపాలిటీలు. వీటిని ఉత్తుత్తి రాష్ట్రాలంటే సరిపోతుంది. అలా చేసిపోయాడు జవాహర్‌లాల్ నెహ్రూ. పేరుకి భాషారాష్ట్రాలన్నారు గానీ తమ రాష్ట్రభాషని అమలు జఱుపుదామనుకుంటే ఇండియా ప్రభుత్వమో, సుప్రీంకోర్టో అడ్డుపడతాయి. ఈ వ్యవస్థలో మైనారిటీలకున్న హక్కులు మెజారిటీకి లేవు గాక లేవు. మత మైనారిటీలైనా ఇదే పరిస్థితి, భాషామైనారిటీలైనా ఇదే పరిస్థితి. అన్ని వనరులూ ఇండియా ప్రభుత్వానికి చెందినవి. రాష్ట్రాలకి తమ వనరుల మీద ఏ హక్కూ లేదు. ఏ ప్రాజెక్టునీ సొంత నిర్ణయంతో కట్టుకునే పరిస్థితి లేదు. ఒక పత్రిక పెట్టుకోవాలన్నా ఇండియా హోమ్ శాఖ అనుమతి కావాలి. ఒక పరిశ్రమ పెట్టుకోవాలన్నా అంతే ! అనుమతులిచ్చే అధికారం రాష్ట్రాలకి లేదు. రాష్ట్రాల ఆర్థిక వనరులన్నింటినీ ఉమ్మడి జాబితా పేరుతో ఇండియా ప్రభుత్వం ఎప్పుడో కొట్టేసింది. ఇప్పుడు రాష్ట్రాల అమ్మకం పన్నుతో పాటు ఇండియా ప్రభుత్వపు అమ్మకం పన్ను ఒకటి కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఈ కొత్తపన్ను వల్ల అన్ని వస్తువుల ధరలూ తడిసి మోపెడవుతాయి. అయినా వాళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవు. "మఱి ఈ నపుంసక రాష్ట్రాల వల్ల ప్రయోజనం ఏంటయ్యా ?" అంటే ప్రజలకి వాస్తవంగా ఏ ప్రయోజనమూ లేదు. కానీ రాజకీయ నాయకులు బాగా ప్రజాధనాన్ని భోంచెయ్యొచ్చు, తమ స్థానిక శత్రువుల మీద కక్ష సాధించొచ్చు. ఇలాంటివాటి కోసమా మనం పోరాడాల్సింది ? వ్రతం చెడకపోయినా ఫలితం మాత్రం దక్కదు.
ఈ వేర్పాటువాదాలూ, భ్రాతృహంతకోద్యమాలూ చరిత్రచెత్తబుట్టలో కలిసిపోయాక ఒకసారి గతం కేసి తిరిగి చూసుకుంటే మనమీద మనకే అసహ్యమేస్తుంది. సిగ్గేస్తుంది.
28.12.2009
