29.11.09

మనుషులు పోతే పాత నినాదాలు బతికొస్తాయా ?



జశేఖరరెడ్డి బతికున్నంతకాలం బహిరంగంగా దర్శనమివ్వడమే మానేసిన కేసీయార్ అతను పోగానే ’తెలంగాణ ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష’ అనే కొత్త అంకానికి తెఱలేపాడు. ’రోశయ్య మెతక ముఖ్యమంత్రి, ఆయన్ని సులభంగా ఆగం చెయ్యొచ్చు’ అనే స్వీయ అంచనాలతో దిగినట్లు కనిపిస్తున్నది. తెలంగాణలో గొడవలు సృష్టించడానికీ, పోగొట్టుకున్న ప్రాచుర్యాన్ని తద్ద్వారా పునరార్జించుకోవడానికీ ఆయన పడుతున్న పాట్లు ఎంతవఱకు అనుకున్న ఫలితాలిస్తాయో వేచిచూడాల్సిందే. ఇప్పటిదాకా జఱిగిన విషయాల్ని బట్టి - కేసీయార్ కీ, అతన్ని హృదయపూర్వకంగా నమ్మి సమర్థించే ఇతరులకీ ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే అతను మంచి తెలివీ, సమయస్ఫూర్తీ గలవాడు.

తెలంగాణలో కేసీయార్‌కి ఇదివఱకు ఉన్న ప్రాచుర్యమూ, ప్రాధాన్యమూ ఇప్పుడు లేవు. అలాగే, మంత్రిపదవి లభించక ఆయన భుజానికెత్తుకుని మోస్తున్న తెలంగాణ నినాదానిక్కూడా ! ఒకసారి కూలబడ్డ ఏనుగుని లేవదీయడం ఎవఱి తరమూ కాదు. అది కూలబడకుండా ముందే చూసుకోవాలి. అయిదేళ్ళ కిందటే ఆ ఊపులో ప్రత్యేక రాష్ట్రం వచ్చేస్తే బావుండేది. ఇప్పుడిహ చాలా కష్టం. ప్రపంచవ్యాప్తమైన ఆర్థికమాంద్యం మధ్య ప్రత్యేక రాష్ట్రాలనే కొఱివితో తలగోక్కుకునే వెఱ్ఱిబాగుల ప్రభుత్వాలు ఎక్కడా ఉండవు. ఆ సంగతి కేసీయార్‌కీ తెలుసు. తెలియనిదల్లా అతన్ని నమ్మేవాళ్ళకే ! తెలగాణ్యులు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకం కాదు. అలాగని దానికోసం సర్వస్వాన్నీ అమాంతం త్యాగం చేసిపారేసేంత అనుకూలమూ కాదు. ఇస్తే ఆనందంగా తీసుకుంటారు. కానీ దానికోసం గొడవలకి దిగే ఓపిక ఎవఱికీ లేదు.

ఎన్ని గొడవలు చేసినా ప్రత్యేక తెలంగాణా వచ్చే సంభావ్యత సంశయాస్పదం. ఆ నినాదాల అధ్యాయం శాశ్వతంగా ముగిసిపోయింది. తెలంగాణ నాయకులూ, మేధావులూ ఈ సంగతి గ్రహించి ఇలాంటి నినాదాలతో ఊరికే సమయం వృథా చేసుకోకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోనే తెలంగాణ అభివృద్ధి కోసం కృషిచెయ్యాలి. తోటి తెలుగువారితో చేతులు కలపాలి, అడవులకి పారిపోయిన పిఱికిశక్తులతో కాదు. కానీ జఱుగుతున్న పరిణామాల దృష్ట్యా వారికి ఈ గ్రహింపు రావడానికి సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రాంతం పట్ల స్థానిక రాజకీయ నాయకులు రెచ్చగొట్టిన గుడ్డిద్వేషంతో ప్రస్తుతం కొద్దిమంది తెలగాణ్యులు తెలుగుజాతి యొక్క ఉమ్మడి శత్రువులందఱితోను చేతులు కలుపుతున్నారు. గతంలో తెలంగాణని నాశనం చేసింది సరిగ్గా ఆ శత్రువులేనని వారు మర్చిపోతున్నారు. ఎవఱూ ఇవ్వడానికి సిద్ధంగా లేని, ఎప్పటికీ రాని ఊహాజనిత ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థుల్ని రెచ్చగొట్టడం, అలా వారి జీవితాలతో ఆడుకోవడం, వారిని సమిధలుగా చేసి ఆ చితిమంటలతో రాజకీయ చలిమంటలు కాగాలని ప్రయత్నించడం, దానికో ఉద్యమం అని పేరుపెట్టడం - ఇదంతా ఒక వికృత పైశాచిక కళ. తెలంగాణ ప్రజలు ఈ కుటిల ఎత్తుగడలకి మోసపోరని ఆశిస్తాను.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్