29.11.09

శబ్దాతీత యోచన



లికిన ప్రతి అక్షరమూ గతంలోకి జాఱుకుంటుంది. ఇహ వాటి సమ్మేళనాలకి (పదాలకి) అర్థమేంటి ? ప్రతి పదమూ ఒక గడిచిపోయిన అనుభూతికి సంకేతం. మఱి అవి నవనవోన్మేష వర్తమానానికెలా పనికొస్తాయి ? ప్రతి వ్యక్తీకరణా ఇతరుల నుంచి అఱువు తెచ్చుకున్నదే. అటువంటప్పుడు మనదంటూ వాటిల్లో ఏముంది ? ఏ అనుభూతీ మన స్వోపజ్ఞం కాదు, యాదృచ్ఛికమే తప్ప. దాన్ని వ్యక్తీకరిస్తే మాత్రం స్వంతం చేసుకోగలమా ? ఆలోచనలకి మాటలు అచ్చమైన ప్రతిబింబాలే అయితే చెప్పినంత మాత్రాన అవతలివారికి అవి ఎందుకు అందడం లేదు ? వారెందుకు మారడం లేదు ? ఆలోచన అనే ప్రతి ఎండ్రకాయ పదసంతానాన్ని కన్నవెంటనే ఎందుకు మరణిస్తోంది ప్రసవ వేదనలో ? అనుభూతులు వాటి ననుభవించనివారి ముందు వ్యక్తీకరిస్తే బూతులుగానే మిగుల్తున్నాయెందుచేత ? మాటల వల్ల చెలరేఁగే ఘర్షణల్నీ, అంతస్సంఘర్షణల్నీ ఆ మాటలతోనే ఉపశమింప జేయాలనుకోవడం తెలివైన పనేనా ? మాటలు రాజ్యమేలడం మానేస్తే యుద్ధభూములు చర్చించుకుంటాయా ?

మాటలకి మనం వేసిన నెమలి సింహాసనాల్ని ఏ నాదిర్‌షా అయినా దాడిచేసి ఎత్తుకుపోతే బావుండును. మాట మారితే మతం మారుతోంది. మాట మారితే రాజకీయం మారుతోంది. మాట మారితే మనసు మారుతోంది. మాట మారితే మంచీ చెడూ తాఱుమాఱవుతున్నాయి. అనుభూతుల నుంచి మాటలు పుట్టడం మానేసి అవే అనుభూతుల్ని కలిగించే స్థాయికొచ్చేశాయి. అలా మన మాటలు ఉన్నవాటికి ప్రాతినిధ్యం వహించడం మానేసి లేనివాటిని అపర విధాతలై సృజిస్తున్నాయి. అవి వరమిచ్చిన శివుణ్ణే భస్మం చెయ్యబోయిన భస్మాసురుణ్ణి తలపిస్తున్నాయి. మాటలు సృష్టించిన ఒక వితథ్య ప్రపంచం (virtual world) లో మనం శతాబ్దాల తరబడి జీవించాం, కంప్యూటర్‌లు పుట్టకముందే ! ఇప్పటికీ అలా జీవిస్తూనే ఉన్నాం. మనం బాగా ప్రవర్తించడం మానేసి బాగా మాటలాడడం నేర్చుకున్నాం. మనం మంచి ఆలోచనల్ని అభ్యసించడం మానేసి మంచిమాటల్ని మాత్రం దిట్టంగా భట్టీయం పట్టుతున్నాం. ఈ మాటల పిచ్చాసుపత్రిలోని రోగులతో వ్యవహరించడం కోసం అందఱమూ మాటల సైకియాట్రీ నేర్చుకుంటున్నాం. అలా కొత్తదనం లేని, ఒకదాన్నొకటి ప్రతిఫలించే పాత మాటలనే కళాయి వెలిసిన అద్దాల మధ్య కాపరం చేస్తున్నాం. మన నీడలతోనే మనం నేస్తం చేస్తున్నాం.

మాటల మంచుని కఱిగించి నీరవ నిశ్శబ్దపు టెండలో వస్తువుల్ని వస్తువులుగా, ఘటనల్ని ఘటనలుగా, మనుషుల్ని మనుషులుగా నిర్మలంగా, నిరాడంబరంగా చూసే రోజు తనంతట తానొస్తుందా ? మనమే ప్రయత్నం చేసి రప్పించుకోవాలా ? మాడు పగిలినా సరే, మానవ మనస్సు సత్యాన్ని కనుగొనడానికే తపిస్తుంది. సత్యాలు సైతం మాటల అద్దాల్లో రంగుమారి, పల్చబడి, బక్కచిక్కి అసత్యాల్లా కనిపిస్తాయి. శక్తి నిస్తాయనుకొని మాటల్నీ, పేర్లనీ, బిరుదాల్నీ నాశ్రయించాక అవి కొంతకాలానికి మనకి శక్తి నివ్వడం మానేసి అవే మనకన్నా శక్తిమంతమైపోతే ? మనం మనం కావడం మానేసి అవే మనమైపోతే ? వాక్కులు మనల్ని అవాక్కు కావిస్తే ? అద్భుతదీపంలోని రాక్షసుడు అల్లాఉద్దీన్‌మాట వినకుండా అతన్నే ఎదిఱిస్తే ?

సమాజం నేర్పిన మాటలనే విదేశీ సైన్యాలు మనస్సుని దురాక్రమించక ముందు నిశ్శబ్ద ఊహలపై నర్తించిన యోచన యొక్క నిరంజన కేవలస్థితి మళ్ళీ కావాలి. మధుర స్మృతులన్నీ మాటలు లేకుండా అనుభవించిన స్థితులే కాదా ? మాటలు బాహ్యపరిసరాలకి మాత్రమే పరిమితమై లోపల్నుంచి వాటి ప్రతిధ్వనులు వినిపించడం నిల్చిపోయినప్పుడు ఏర్పడే ఆ ఏకాగ్రత కావాలి. మాటల్ని మఱచినప్పుడు మనస్సు కూడా తనంతట తానే మఱుగున పడుతుంది. దాన్తో పాటే దాని ప్రేమలూ, ద్వేషాలూ అన్నీ ! ఆ ప్రశాంతిని, ఆనందాన్ని మనిషి కనుగొనాలి. ఎందుకంటే ప్రశాంతికీ, ఆనందానికి నిజమైన అర్థం ఏకాగ్రతే. మనం మనుషులతో మాట్లాడ్డం మానేస్తే ప్రకృతి మనతో నేరుగా మాట్లాడ్డం మొదలుపెడుతుంది.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్