25.11.09

ఎక్కువమంది ఎక్కువకాలం పాటు ప్రభుత్వసేవలో....



న దేశంలో అందఱికీ ఒకే విధమైన పదవీ విరమణ వయస్సు అమల్లో లేదు. దీనిక్కారణం తెలియదు. రాజకీయ నాయకులకి అసలు విరమణ వయస్సే లేకపోవడం ఒక వైచిత్రి కాగా ఉద్యోగుల విషయంలో అది రాష్ట్రాల్లో ఒకవిధంగాను, కేంద్రంలో మఱొక విధంగాను అమలవుతూండడం మఱో వైచిత్రి. మళ్లీ ప్రభుత్వోద్యోగులకీ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకీ కూడా ఒకే విధమైన పదవీ విరమణ వయస్సు లేదు. అదే సమయంలో ఆ కేంద్రప్రభుత్వంలోనే అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల విరమణ వయస్సు వేఱుగా ఉంది. మన రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల విరమణ వయస్సు ౫౮ సంవత్సరాలు మాత్రమే. అఱవైకి పెంచాలనే నిలదీతలు చాలాకాలం నుంచి కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించడంలేదు.

కానీ నా అభిప్రాయంలో పదవీవిరమణ వయస్సుని అఱవయ్యేళ్ళకే కాదు. అఱవైరెండేళ్ళకి పెంచడం కూడా మంచిదే. రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలకి నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 మొదలైన నియామక పరీక్షలకి ౩౫ ఏళ్ళ వయసు దాకా అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులనైతే నలభయ్యేళ్ళ దాకా అనుమతిస్తున్నారు. అంటే అంత వయసొచ్చినా ఉద్యోగం లేనివాళ్ళుంటారని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా ! మఱి ౩౫ ఏళ్ళకి ఉద్యోగంలో చేఱినవాణ్ణి ౫౮ ఏళ్ళకే ఇంటికి పొమ్మనడం సమంజసమా ? మఱోపక్క కనీస వివాహవయస్సుని పెంచాలని కూడా ఆలోచనలు చేస్తున్నారు. అదీగాక స్వాతంత్ర్యం వచ్చాక మనుషుల సగటు ఆయుర్దాయం ౬౫ ఏళ్ళకి పెఱిగింది. కానీ విరమణ వయస్సు విషయంలో మాత్రం యాభయ్యేళ్ళనాటి విధానానికే ప్రభుత్వం కట్టుబడి ఉండడం ఆశ్చర్యకరం.

ఇది యాదృచ్ఛికం కాదు. ప్రభుత్వం తన ఉద్యోగుల్ని ప్రజాసేవకి ఉపయోగపడే యంత్రాంగంగా కాక నెలవారీ జీతాల ఖర్చుగా మాత్రమే చూడ్డం ఇందుక్కారణం. వాళ్ళని తొందఱగా వదిలించుకొని వారి స్థానాల్లో కొత్తవారిని నియమించకుండా వాటిని చాలా సంవత్సరాల పాటు కొల్లపెట్టడం, తద్ద్వారా డబ్బు మిగల్చుకుందామని చూడ్డం - ఇదీ అసలు విషయం. ఇది ఈనాడు మొదలైన పోకడ (trend) కాదు. ఏ ప్రపంచీకరణలూ, ఆర్థిక మాంద్యాలూ లేని రోజుల్లోనే ఎన్‌టిఆర్ హయాంలో మొదలు కాగా ఇవే మాయల్నీ, ఎత్తుల్నీ అనంతర ప్రభుత్వాలు కూడా అందిపుచ్చుకున్నాయి. ప్రభుత్వం యొక్క వివిధ స్థాయిల్లో ఒక గణనీయ శాతం మంది ప్రజలు భాగమై పనిచేస్తేనే, అలా వారిని ప్రభుత్వం పోషిస్తేనే వారి ద్వారా మిగతావారికి సైతం ప్రభుత్వం పట్ల ఒక స్వప్రయోజనమూ (vested interest), అభిమానమూ, సెంటిమెంటూ ఉంటాయి. లేకపోతే ప్రభుత్వం బతికిందా ? చచ్చిందా ? జాతీయత ఉందా ? లేదా ? ఎవరూ పట్టించుకోరు. బ్రిటీషువారు రాకముందు జఱిగింది ఇదే. ఒకప్పటి మన నైజామ్, గ్వాలియర్, మైసూర్, మధుర, శ్రీరంగపట్నం, మరాఠా, జోధ్‌పూర్, బెంగాల్, కాశ్మీర్ మొదలైన స్వతంత్ర భారతీయ రాజ్యాలు ఒక్కొక్కటి ఐర్లాండ్ కన్నా ఇంగ్లండ్ కన్నా పెద్దవి. కానీ ఆ రాజాస్థానాల్లో మాత్రం సైన్యం తప్ప వేఱే ఉద్యోగాలు పెద్దగా ఉండేవి కావు. ప్రైవేట్ రంగమా, అసలు లేనేలేదు. అందువల్ల ఎవరొచ్చినా, ఎవరు పోయినా, అసలు దేశమే పూర్తిగా అన్యాక్రాంతమైనా ఆనాటి ప్రజలు పట్టించుకునేవారు కారు. ప్రస్తుతం ఈ కఠిన వాస్తవాన్ని, ఈ కఠోర చారిత్రిక పాఠాన్ని హాయిగా విస్మరిస్తున్నారు.

తత్‌ఫలితంగా మన రాష్ట్రంలో ఎన్‌టిఆర్ హయాం నుంచి ప్రభుత్వోద్యోగాలు భారీగా తగ్గిపోతూ వచ్చి ఈనాడు అవి ౧౦,౨౩,౦౦౦ కి దిగిపోయాయి. ఇవి కేవలం మూడేళ్ళ క్రితమే ౧౩ లక్షలుండేవని గుర్తు చేసుకుంటే ఈ ప్రభుత్వం ఎన్ని లక్షల ఉద్యోగాల నుంచి ఉద్దేశపూర్వకంగా విద్యావంత ప్రజల్ని వంచితుల్ని చేసిందో, ఉన్న ఉద్యోగుల్ని ఎలా పీడిస్తున్నదో అర్థమవుతుంది. వచ్చే సంవత్సరం ఇంకో లక్షమంది పదవీ విరమణ చెయ్యబోతున్నారు. మళ్లీ ఆ డబ్బులన్నీ మిగల్చుకుందామని పథకం వేస్తున్నారు. ఇప్పటికే కొత్తగా చేఱే ప్రభుత్వోద్యోగులకి పింఛను సౌకర్యాలెత్తేశారు. ఈ పని చేసింది ఎవరో కాదు, ఆ చచ్చిపోయిన రైతుజన బాంధవుడే. ఇలా అడుగడుగునా విద్యావంతుల నోళ్ళు కొట్టి, వాళ్ళందఱి జీవితభద్రతకీ టోకుగా గండికొట్టి మిగల్చుకున్న భారీ డబ్బంతా ఏమవుతోందో, ఎటు పోతోందో, మళ్ళీ యథాప్రకారం ఈ ప్రభుత్వం పాత బీద అఱుపులే ఎత్తుకుని అఱుస్తూ, ముష్టిజోలె ఊపుకుంటూ ఎందుకు రోడ్డున పడుతోందో నాకర్థం కాకుండా ఉంది. చూస్తే, ఏం అభివృద్ధి చెందామో ఏంటో ఏమీ తెలియకుండా ఉంది. ఈ అభివృద్ధులేమీ లేని రోజుల్లోనే, అంటే రాష్ట్రం వచ్చిన కొత్తల్లోనే ప్రభుత్వోద్యోగుల పరిస్థితి హాయిగా ఉండేదేమో అనిపిస్తోంది.

మనలో చాలామందికి ప్రభుత్వోద్యోగులంటే వల్లమాలిన ద్వేషం. వారు సోమరులనీ, లంచగొండులనే అభిప్రాయం. ప్రభుత్వంలో కూడా అవినీతికి పాల్పడాలంటే అది అందఱివల్లా కాదు. సరైన స్థానంలో "సరైన కులానికి" చెంది ఉంటేనే బాగా అవినీతి చెయ్యొచ్చు. అలా కానివాళ్లు అఱుదుగా చేసినా చప్పున పట్టుబడిపోతారు. ప్రభుత్వంలో "పనిచేసేవాళ్లు" చాలా కష్టపడి చేస్తారు. చెయ్యనివాళ్ళు ఏం చెప్పినా చెయ్యరు. పనిచేసేవాడొక్కడి పేరు చెప్పుకొని పదిమంది ఘనత కొట్టేయడం ప్రభుత్వంలో చాలా మామూలు. ఇలా అనేక పరిస్థితులుంటాయి. అందుచేత ప్రభుత్వోద్యోగులందఱినీ ఏకమొత్తంగా విమర్శించడం సమంజసం కాదు.

ప్రభుత్వ విధానాల్ని ఉదాహరించి ప్రైవేట్ సంస్థలవారు తమ చర్యల్ని సమర్థించుకుంటారు. అందుచేత అందఱికంటే ముందు ప్రభుత్వ విధానాలే వీలైనంత మానవీయంగా ఉండాలి. వారి పదవీ విరమణ వయస్సు ౬౨ సంవత్సరాలకి పెంచి, ఆరోగ్యపథకాలూ, దీర్ఘకాలిక గృహఋణాలు మంజూరు చేసి, పింఛను గట్రా వృద్ధాప్య సదుపాయాల్ని కూడా పునరుద్ధరిస్తే వారిలో అవినీతి చాలావఱకు మాయమవుతుంది. మనుషులు అవినీతికి పాల్పడేది ప్రధానంగా భవిష్యత్తు పట్ల అభద్రతాభావం మూలాన ! నిబంధనల పేరుతో వారిని మఱింత భద్రతాభావానికి గుఱిచేయడం వల్ల మన సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు. తమ సేవాకాలం అంతటా ఏ అవినీతి ఆరోపణలూ, కర్తవ్యంలో నిర్లక్ష్య అభియోగాలూ లేని, ఉన్నా నిరూపణ కాని ఉద్యోగుల పిల్లలకి వారి విరమణ తరువాత ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన పెడితే కూడా ఉద్యోగుల్లో నిజాయితీ పెఱుగుతుంది. పూర్వం రాజఱికాల్లో ఇలాంటి వెసులుబాట్లు ఉండేవి. మానవత్వంలో రాజఱికాల కంటే తీసిపోతోందేం ఈ ప్రజాస్వామ్యం ?

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్