21.11.09

ఇవి హిందూ దేవాలయాలా ? ఇంగ్లీష్ చర్చిలా ?



ఈ రోజుల్లో ఏ హిందూ దేవాలయంలో చూసినా ఇంగ్లీషు రాజ్యమేలుతున్నట్లు కనిపిస్తున్నది. దేవాలయం గుమ్మం దగ్గఱ అడుగుపెడుతూనే Phalaanaa Swamy -Phalaanaa Ammavaarla Devasthaanam అని ఇంగ్లీషులో రాసున్న ఱెక్కమాను కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాక Silence, Q, No smoking అని కనిపిస్తాయి. దేవుడికి చేసే సేవల జాబితా ఇంగ్లీషులో రాసి గోడకి తగిలిస్తున్నారు. Ticket Counter అని రాసుండడమే కాక ఆ టిక్కెట్లూ, రశీదులూ, టోకెన్‌లూ అన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి. ఇహ భక్తులకి సంబంధం లేని కార్యాలయ సామగ్రి అయిన దేవాలయ చిట్టాలూ, లెక్కలూ, ఆవర్జాలూ, కవిలెలూ, ఉత్తర ప్రత్యుత్తర వ్యవహారాలూ అన్ని సర్వం సమస్తం ఇంగ్లీషులోనే ! ఇంకా శంకుస్థాపన ఫలకాలూ, దాతల పేర్లు కూడా ఇంగ్లీషులోనే !

ఈ మధ్య గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో ఇంకో వైచిత్రి కూడా గమనించాను. అక్కడ పైన చెప్పిన విధంగా ఫలకాలూ, టిక్కెట్లూ ఉండడమే కాక మంత్రాల్ని ఇంగ్లీషులో ముద్రించిన శాలువాలు కప్పుకొని పూజారులు పూజలు చేయడం గోచరించింది. ఉండబట్టలేక అడిగేశాను : "మీరు హిందూదేవాలయంలో పనిచేస్తూ ఇలా ఇంగ్లీషులో రాసున్న శాలువాలతో పూజలు చేయొచ్చునా ? దీని బదులు జీన్ ప్యాంట్లేసుకొని పూజ చెయొచ్చు గదా ?" అని ! అతని పక్కనున్న కొంచెం పెద్ద పూజారి అందుకొని "భాష ఏదైనా ఆ స్వామినామం ఉంటే చాలని మా ఉద్దేశం" అని సమర్థించుకోబోయాడు. "బావుందండీ ! కానీ సంప్రదాయం సంప్రదాయమే కదా ? నా మనస్సు కలుక్కుమంది అందుకే అడిగాను" అన్నాను నేను. నా నోటిదాకా ఎన్నో మాటలొచ్చాయి. కానీ నేనక్కడికి వెళ్ళిన ప్రయోజనం అక్కడి పూజారులతో వాదించడం కాదు గనుక నోరు మూసుకొని పూజచేయించి బయటపడ్డాను. మంత్రాలయ రాఘవేంద్రస్వామి వారి ఆలయంలో కూడా సర్వేసర్వత్ర ఇదే తంతు. సేవ చేయించిన భక్తులకి స్వామినామాన్ని శ్లోకాన్ని ఇంగ్లీషులో ముద్రించిన సిల్కు శాలువా బహుకరిస్తారు. ఇంగ్లీషు అక్షరాల్లో మఠం పేరు చెక్కిన స్వామివిగ్రహాన్ని ఇస్తారు. ఇక్కడి వైచిత్రి ఇంకో రకంగా ఉంటుంది. భాష విషయంలో ఇంత సంప్రదాయ ఉల్లంఘన చేస్తున్న మంత్రాలయ మఠం వారు ప్యాంటూ, చొక్కా ధరించిన భక్తులకి భోజనం పెట్టరు. పరాయిభాషని ఆప్యాయంగా కౌగలించుకున్నవారు పరాయివేషాన్ని మాత్రం ఎందుకలా కౌగలించుకోలేక పోతున్నారో వారే చెప్పాలి. నా దృష్టిలో ఆ రెండూ మన మతానికి విసర్జనీయాలే.

ఇలా ఉన్నారు బ్రాహ్మలు, తాము చెడిపోయింది గాక తతిమ్మా హిందువులందఱినీ చెడగొడుతూ ! వీళ్ళని హిందువులు నమ్ముకున్నదొకదానికి. వీళ్ళు ఆచరణలో చేస్తున్నది మాత్రం ఇంకొకటి. వీళ్ళు మధ్వులో, వైష్ణవులో, శైవులో, స్మార్తులో ఎవరైతేనేంటి ? ఏ ఱాయైతేనేం పళ్ళూడగొట్టుకోవడానికి ? మఱి దేవాలయాల్లో క్రైస్తవుల్ని నియమిస్తే మనమెందుకు నెత్తీ నోరూ లబలబా కొట్టుకోవడం, ఇక్కడ పనిచేస్తున్న బ్రాహ్మలే ఇలా క్రమక్రమంగా మానసిక, అనుష్ఠాన క్రైస్తవులుగా మారిపోతున్నప్పుడు ?

నిజమేనా ? భాష ఏదైనా ఆ స్వామినామం ఉంటే చాలా ?

దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మొదట్లో ఈ దేశంలో ఇంగ్లీషువారి సైనికస్థావరాలకే పరిమితమైన ఇంగ్లీషు, వారికి రాజకీయాధికారం దఖలుపడ్డాక కార్యాలయాల్లో ప్రవేశించింది. అటుపిమ్మట పాఠశాలల్లోకి ప్రవేశించింది. పిదప ఇళ్ళలోకి ప్రవేశించింది. ఇప్పుడు సంప్రదాయానికీ, సంస్కృతులకీ కాణాచిగా నిలవాల్సిన దేవాలయాల్ని సైతం సంపూర్ణంగా ఆక్రమించేసింది. ఇక్కడ నేర్చుకోవాల్సిన గుణపాఠం "ఏదీ అక్కడితో ఆగదు" అని ! ఈరోజు ఏ భాషయినా ఏ లిపైనా ఫర్వాలేదంటున్నవారు ఱేపు ఏ దేవుడైనా ఫర్వాలేదంటే ? వాళ్ళు అనేదేంటి ? వాళ్ళ బదులు భక్తులే అనేస్తారు. ఱేపు మంత్రాలు కూడా ఇంగ్లీషులోనే చదివే సంభావ్యతని నేను త్రోసిపుచ్చలేను. అలాగే ఇంగ్లీషు రామాయణాలూ, ఇంగ్లీషు గీతలూ మైకులు పెట్టి మఱీ వినిపిస్తారేమో తెలియదు. ఆ తరువాత వాటి స్థానంలో బైబిల్ వినబడుతుంది. మతానికీ, జాతీయతకీ, సంస్కృతికీ, భాషే ఆయువుపట్టు. భాష మారితే అన్నీ మారిపోతాయనే జ్ఞానం ఈ జాతికెప్పుడు కలుగుతుంది ? ఇంగ్లీషేమైనా భారతీయభాషా ? అదేమైనా మన మతానికి సంస్కృతంలా పవిత్రమైన భాషా ? ఇతరదేశాలవాళ్ళకి మన సంస్కృతిని పరిచయం చేయడం కోసం మాత్రమే ఇంగ్లీషు. మనలో మనకి ఇంగ్లీషు అవసరమా ? మన దేవాలయాల్లో ఇంగ్లీషు అవసరమా ? ఇతరదేశాలతో వ్యవహరించడం కోసం ఇంగ్లీషన్నారు. తలూపాము. సైన్సూ, టెక్నాలజీ ఇంగ్లీషులో ఉన్నాయన్నారు. సరేనన్నాము. కంప్యూటర్లకోసం ఇంగ్లీషన్నారు చేతులెత్తేశాము. ఇప్పుడు దేవాలయాల్లో కర్ణకఠోరంగా ఈ ఇంగ్లీషేంటి ? అది కనీసం మనల్ని ప్రేమగా చూసుకున్నవాళ్ళ భాషైనా కాదు.

మనం ఇలా మన భాషల స్థానంలో అవి ఎక్కడుంటే అక్కడల్లా వాటిని ఎత్తి అవతల పారేసి అతికినా అతక్కపోయినా ఇంగ్లీషుని ప్రతిష్ఠిస్తున్నాం. తద్ద్వారా మనం చరిత్రలో మన ఉనికినీ, మన పూర్వీకుల ఉనికినీ రద్దు చేసిపారేస్తున్నాం. తెల్లవాళ్ళ చేతుల్లో నశించిపోయిన ఎన్నో ఆఫ్రికన్, అమెరికన్ తెగల దారిలో మనం నడుస్తున్నాం, మహోజ్జ్వలమైన చరిత్రా, సంస్కృతీ ఉండీ కూడా ! ఇంతమందిమి ఉండీ మనం ఒక భాషాజాతిగా నిష్కారణంగా అనవసరంగా ఎవరూ మనల్ని చంపకుండానే అంతరించిపోతున్నాం. కాదు, విదేశీ భాషావ్యామోహంతో మనల్ని మనమే అంతం చేసుకుంటున్నాం. ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఇలా కొనసాగితే భావితరాలకి మనం దొఱక్కుండా పోతాం. మన పేర్లు, మన పూర్వీకుల పేర్లూ వినిపించవు. మన ఘనతలు కనిపించవు. ఇంగ్లీషే కనిపిస్తుంది. ఇంగ్లండే వినిపిస్తుంది. భవిష్యత్తులో ప్రతిదానికీ మూలాలు తెల్లవాళ్ళలోనే వెతకబడతాయి. ఆంధ్రా తెలియదు. ఆంధ్రుల గొప్పతనం తెలియదు. అసలు మనమంటూ మనుషులం ఉన్నామని కూడా భావితరాలకి ఎఱుక కలిగే అవకాశం లేదు.

ఈ దేశంలోంచి ఇంగ్లీషువాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళదైన ప్రతిదాన్నీ ఆబగా అప్యాయంగా కావిలించుకున్న ఈ జాతికి స్వాతంత్ర్యం ఎందులోనో, దేనికో నా కర్థం కావడంలేదు. మనకీ కుహనా స్వాతంత్ర్యం లేనిరోజుల్లోనే మనం సరైన మార్గంలో ఉన్నట్లు కనిపిస్తున్నది.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్