15.11.09

మహాజనుల బుఱ్ఱతినుడు యుగం



iabetic care for everyone అని రాసున్న చేఱేకులు (placards) ఎత్తిపట్టుకుని రోడ్డుమీద ఊరేగింపుగా వెళుతున్న ఒక గుంపు యొక్క ఛాయాచిత్రాన్ని చూశానొక దినపత్రికలో ! "సమాజంలో ప్రతివాడికీ మధుమేహ (చికిత్స) జాగ్రత్తలెందుకు ? ఒకవేళ జాగ్రత్తంటూ పడితే అన్ని అనారోగ్యాల గుఱించీ పడాలి గానీ కేవలం మధుమేహం గుఱించే ఎందుకు ? అసలు ప్రతివాడికీ ప్రతీదీ ఎందుకు ?" అనే ప్రశ్నలు ఉదయించాయి. నేను తాదాత్మ్యం (identify) చెందే విషయాలు కొన్నుంటాయి. మీరు తాదాత్మ్యం చెందగల విషయాలు కొన్నుంటాయి. నాకు ముద్దొచ్చే అంశాలు (pet topics) కొన్నుంటాయి. మీకు ముద్దొచ్చేవి మఱికొన్నుంటాయి. పక్కింటాయనకి ముద్దొచ్చేవి ఇంకొన్నుంటాయి. కానీ అందఱూ అన్నీ పట్టించుకోవాలనీ, అందఱికీ అన్నీ ముద్దురావాలనీ ఈ సామాజిక పట్టుదలేంటి ? ఏమిటీ ప్రజాస్వామిక వొత్తిడి ? ఈ సర్వేషామ్ (అందఱికీ) అనే భావజాలం ఎందుకు వ్యాపించింది మన సమాజంలో ? మనమేమీ సకలకళా వల్లభులం (all-rounders) కామే ?

నా "మందిమన్నియం" భాగాలు చదివిన గౌరవనీయ జాలపాఠకుల్లో చాలామంది చేయగా నేను మఱుతలపు లేకుండా బుట్టదాఖలు చేసిన సూచన - "దీన్ని అందఱికీ అర్థమయ్యే శైలిలో వ్రాయండి" ! అదిగో, మళ్లీ "అందఱికీ" (సర్వేషామ్) భావజాలం ! దాన్ని దారిన పోయే ప్రతిదానయ్య కోసమూ వ్రాయలేదు. దాన్నిప్పుడు ఎంత అత్యవసరంగా వ్యావహారికంలోకి మార్చినా దేశంలో అందఱూ అంతే అత్యవసరంగా దాన్ని కొనుక్కుని చదవరు. కొన్ని ప్రస్తావనలు సమాజంలో కొంతమందికే అర్థమవుతాయి. అందఱూ ఒకే అవగాహనా స్థాయిలో జీవించరు. ’క’ స్థాయిలో కొందఱు, ’చ’ స్థాయిలో కొందఱు, ’ట’ స్థాయిలో మఱికొందఱు, ’ప’ స్థాయిలో ఇంకొందఱు జీవిస్తారు. దాని కింది స్థాయిలో కూడా ఇంకా చాలామంది జీవిస్తారు. అసలు ఆ విషయం మీద బొత్తిగా ఓనమాలు తెలియనివాళ్ళూ ఉంటారు. "అయ్యో ! పాపం, సామాన్య పాఠకులు కదా !" అని జాలిపడి ఎంత కిందికి దిగినా ఇంకా దిగిపోవాల్సినది కనిపిస్తూనే ఉంటుంది, అందుచేత ఏదీ అందఱి కోసమూ రాయలేం.

వక్తవ్య విషయం తనకి సముచితమైన రూపాన్ని తానే వెతుక్కుంటుంది దాన్ని మఱో రూపంలో పెడితే శోభించదు. సృజనాత్మక స్వేచ్ఛ లాగానే బౌద్ధిక స్వేచ్ఛ అనేదొకటుంది. దాన్ని సంపూర్ణంగా అనుభవించే మేధావి సమాజానికి అన్యాయం చేస్తున్నాడని కాదు అర్థం. అతని స్థాయిని అందుకోవడానికి ప్రయత్నం చేయని సమాజం తనకి తానే అన్యాయం చేసుకుంటోందని అర్థం. చదివితే వెంటనే అర్థం కావడం, చూస్తే ఆనందించడం - ఇవి సర్వేషామ్ భావజాలానికి అవసరమే. కానీ మేధావుల భావజాలమూ, దృక్కోణమూ ఇంకో రకంగా ఉంటాయి. ప్రతి కృతిలోను వారు నేర్చుకోవడానికి గల నూతనావకాశాల్ని అన్వేషిస్తారు. నేర్చుకోవడానికందులో కొత్త విషయం ఏమీ కనిపించనప్పుడు అది పైకెంత బావున్నా సరే, వారికది మేకపెంటికతో సమానం.

అందఱికీ సాహిత్యం, అందఱికీ సైన్సు, అందఱికీ వాతావరణ స్పృహ, అందఱికీ ఇంగ్లీషు, అందఱికీ ఉన్నతవిద్య, అందఱికీ పాస్‌పోర్టులు, అందఱికీ అమెరికా వీసాలు, అందఱికీ ఉగ్రవాదం మీద అవగాహన, అందఱికీ సౌందర్యపోషణ, అందఱికీ లైంగికస్వేచ్ఛ, అందఱికీ ఫెమినిజమ్, అందఱికీ అధ్యాత్మిక జ్ఞానం, అందఱిలోను క్యాన్సరు జాగృతి, అందఱికీ వినియోగదారుల హక్కుల పరిజ్ఞానం, అందఱికీ దేశభక్తి, అందఱికీ బళ్ళలో యోగా, అందఱికీ కంప్యూటర్ పరిజ్ఞానం, అందఱికీ అది, అందఱికీ ఇది....

దీన్నే తిరగేసి ఇంకోలా చూస్తే - అందఱికీ తలనొప్పి, అందఱికీ నాస్తికత్వం, అందఱికీ కాలుష్యం, అందఱికీ ఆత్మన్యూనతాభావం, అందఱికీ పేరాశ, అందఱికీ బడిఫీజుల మోత, అందఱికీ వలసపోయే దుర్గతి, అందఱికీ అభద్రతాభావం, అందఱికీ విడాకులు, అందఱికీ డయగ్నాస్టిక్ సెంటర్లు, అందఱికీ కంజ్యూమర్ కోర్టుకేసులు, అందఱికీ పాకిస్తాన్‌తో యుద్ధం, అందఱికీ కళ్ళజోళ్ళు....

నాకేమనిపిస్తుందంటే - కొద్దిమంది నోరున్నవాళ్ళు తమ ఆసక్తుల కనుగుణంగా ప్రజల వ్యక్తిగత జీవితాలలో సందర్భశుద్ధిని కలిగిఉండని అనేక అనవసర విషయాల్లో యావత్‌ ప్రజాసామాన్యాన్నీ బలవంతంగా ఇఱికిస్తున్నారని ! ఏ అభిప్రాయాలూ లేనివాళ్ళకి తమ అభిప్రాయాల్ని అంటించడమే కాకుండా ఆ తరువాత అదే ప్రజాభిప్రాయమని ప్రచారం కూడా చేస్తున్నారు. ఇదొక నవీన పౌరోహిత్యంలా తయారైంది. పూర్వకాలంలో ఏదైనా ప్రజల్లో చెలామణి చెయ్యాలంటే "ఇది దైవాజ్ఞ" అనేవారు. ఇప్పుడేమో "ప్రజాభిప్రాయం/ రాజ్యాంగంలో రాసుంది/ సైంటిస్టులు చెప్పారు/ పరిశోధనల్లో తేలింది/ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి/ వార్తాపత్రికల్లో వచ్చింది/ టీవీల్లో చూపించారు" అంటున్నారు. అంటే "మీరు మళ్ళీ నోరెత్తితే ఖబడ్దార్" అన్నట్లు. ఎంత ప్రజాస్వామ్యమైతే మాత్రం, ప్రచారాల రూపంలో ఎంతగా బుఱ్ఱతింటే మాత్రం, ప్రజలు ఎన్నని పట్టించుకోగలరు ? ఎన్నని ఆలోచించగలరు ? ఎన్నిటి మీద స్థిరమైన అభిప్రాయాలేర్పఱచుకోగలరు ? ఎన్నిటిమీద పోరాడగలరు ? ఆయా విషయాల మీద విశేషకృషీ, పరిశ్రమా చేసిన మేధావులు సమాజంలో కొద్దిమంది ఉంటారు. వాళ్ళ స్థానాన్ని తీసుకోవడం, వాళ్ళ పాత్ర పోషించడం ప్రసార మాధ్యమాలతో సహా మిహతా ప్రజానీకానికి సాధ్యపడదు. వాళ్ళని నమ్మి గుడ్డిగా అనుసరించి పోవడమే ఏ వ్యవస్థలోనైనా ఎవరైనా చేయగలిగినది. చక్రవర్తయినా మంగలిముందు తలవంచాల్సిందే. అదే కదా స్పెషలైజేష‍న్‌ల మహిమ !

ఎక్కడో జఱిగినది, ఎవఱికో జఱిగినది అందఱికీ జఱిగినట్లు భ్రమపెట్టడం, ఱేపు అందఱికీ అలాగే జఱగ బోతోందని చెప్పడం, అలా జనాన్నీ, ప్రభుత్వాన్నీ ఎగసన దోయడం కూడా సర్వేషామ్ భావజాల ప్రభావమే. విషయాలకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యాన్ని మాత్రమే ఇవ్వకుండా ఈ భావజాలం మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. కానీ వ్యాపారస్థులకీ, రాజకీయ నాయకులకీ, సర్వేషా‍మ్ భావజాలం చాలా అవసరం. ఎందుకంటే అవసరాల్నీ కనిపెట్టేవారొకఱు. అవి అందఱికీ (మళ్ళీ సర్వేషామ్) అందాలనీ, అలా అందేలా చేస్తామనీ వాగ్దానాలు చేసేవారు మఱొకరు. ఈ కాలపు వ్యాపారాలు భారీ ఉత్పత్తి పరిమాణాలు (massive production volumes) కలిగినవి. అవసరమైనవాళ్ళకే వాటిని అందించాలంటే కుదఱదు. వ్యాపారాల్ని మూసెయ్యాల్సి వస్తుంది. అందుచేత అవసరం లేనివాళ్ళక్కూడా అవి అవసరమని ప్రచారం చెయ్యాలి. అవి లేని బతుకు బతుకే కాదనే నమ్మకాల్ని నూఱిపొయ్యాలి. "ఇంటింటా సన్, టన్ టనా టన్" అని అందఱూ పాడుకోవాలి.

ప్రసార మాధ్యమాలూ, వ్యాపారస్థులూ, రాజకీయ నాయకులూ, వారికింద వారికనుకూలంగా పనిచేసేవారూ మొదలైనవారి సంగతేమో గానీ మామూలు జనానికి మాత్రం సదరు సర్వేషామ్ భావజాలం మూలాన ఏ ప్రయోజనం ఒనగూడుతుందో అగమ్యగోచరం. బహుశా అదే దాని గొప్పతనమేమో ! తమకి ఏ పాత్రా, ప్రయోజనమూ, లాభనష్టాలూ లేకపోయినా అవి ఉన్నట్లు భ్రమింపజేసి అందఱినీ ఇఱికించి వాళ్ళచేత పనిచేయించడం, పరుగులెత్తించడం.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్