28.11.09

2012 : ఒక పిల్లల సినిమా



012 అన్న పేరు విన్నప్పుడు నాలో కలిగిన తొలి భావోద్వేగం మిక్కుటమైన ఆశ్చర్యం. "ఈ దర్శకుడు ఖచ్చితంగా 2012 వ సంవత్సరాన్నే ఎలా ఎంచుకోగలిగాడు ? గత పదిహేనేళ్లుగా నాకొక్కడికే తెలుసు ననుకున్న విషయం తాలూకు వాసనల్ని వేలాది కిలోమీటర్ల దూరాన ఇతనెలా పసిగట్టాడు ? ఎవరు చెప్పారు ?" అని ! ఆ సంగతేంటో తేల్చుకుందామనే నేనా సినిమాకి వెళ్ళాను. సినిమా అంతా చూశాక ’హమ్మయ్య’ అనిపించింది. ’ఇతనికి విషయం పూర్తిగా తెలియదు’ అని నమ్మకం కలిగి హాయిగా ఊపిరి పీల్చుకున్నాను.

ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా ప్రచారం కోసం అంటించిన గోడపత్రాల్లో ’యుగాంతం’ అని రాశారు. అదింకా నవ్వొచ్చింది. ఎందుకంటే వాస్తవానికి ఒక యుగం ఇప్పటికే అయిపోయింది. అయిపోయి కూడా పదేళ్ళవుతోంది. ఇప్పుడు సంధియుగం నడుస్తోంది. ఇది ఇంకో ౩౬౦ సంవత్సరాలుంటుంది. ఈ కాలఖండం లోపల మనకి తెలిసిన నాగరికత చాలావఱకు నశించే అవకాశం ఉంది. సినిమాలో చూపించినట్లు ప్రళయాల వల్ల కాదు గానీ దానంతట అదే కాలు నిలదొక్కుకోలేక, దాన్ని నిభాయించడం భావితరాల మనుషులకి చేతకాక పోవడం వల్ల, నవీన నాగరికతలోని అనేక విషయాలు మంచివి కావని అనుభవపూర్వకంగా గ్రహించడం వల్ల, వనరులు ఖాళీ అవ్వడం వల్ల క్షీణించిపోవచ్చు. అంత ఆలస్యం మనకెందుకనుకుంటే అణ్వాయుధ యుద్ధాలు ఉండనే ఉన్నాయి, ఓ చెయ్యి వేసి ఆదుకోవడానికి ! ఒక రకంగా ఆలోచిస్తే ఈ నాగరికత గత ౩౦౦ ఏళ్ళలో వచ్చింది. ఇంకో ౩౦౦ ఏళ్ళలో అదృశ్యమవుతుం దనిపిస్తుంది. అంటే దీని ఆయుర్దాయమంతా కలిపి కేవలం ౬౦౦ ఏళ్ళా ? యావత్తు మానవజాతి చరిత్రలో ఈ కాలఖండం ఏపాటిది ? ఒక ముసలి మఱ్ఱిచెట్టు ఆయుర్దాయమంత కూడా లేదే ! ఔరా ! అల్పమానవులు ఈ అల్పాయుర్దాయపు నాగరికతని చూసుకొని ఎంత విఱ్ఱవీగుతున్నారు ! అనిపిస్తుంది. ఇందులో జనం అర్థం చేసుకోని మతలబు ఒకటుంది. యుగాంతం, ప్రపంచాంతం, నాగరికతాంతం, మానవజాత్యంతం - ఇవన్నీ ఒకటి కాదు. వీటిల్లో రెండోదీ, నాలుగోదీ మాత్రమే మనకి ప్రమాదకరాలు. మిగతావి కాదు.

మళ్ళీ సినిమా దగ్గఱికొద్దాం. ఇందులో పెద్దగా కథేమీ లేదు. ప్రపంచం అంతం కాబోతోందని ఒక శాస్త్రవేత్త కనుగొంటాడు ఆ విషయం ఆఘమేఘాల మీద అన్నిదేశాలవారికీ తెలుస్తుంది. ప్రముఖుల్ని రక్షించడానికి ఓడలు తయారు చేస్తారు. ఆ తరువాత ఆ ఓడల్లో గొప్పగొప్పవాళ్ళంతా ఎక్కుతారు, త్యాగమూర్తులైన అమెరికా అధ్యక్షుడు, వాటికన్ అధిపతి పోపు తప్ప ! (చూసి నవ్వలేక చచ్చాను) ఆ ఓడల్లో అత్యాధునిక వాతావరణ నమోదు సాధనాలు పెట్టుకొని ఎల్.సి.డి. తెఱల మీద ప్రపంచ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించే సిబ్బంది కూడా ఉంటారు. ప్రళయం మొదలుతుంది. బైబిల్ లో వర్ణించిన ప్రకారం భూకంపాలూ, ఱేవుకెఱటాలూ (tsunamis), అగ్నిపర్వతాల ప్రేలుళ్ళూ సంభవిస్తాయి. భూకంపాల దెబ్బకి నగరాలు భూనభోఽన్తరాళాలు దద్దఱిల్లేంత ప్రచండ విస్ఫోటాలతో నేలమట్టం అవుతున్న దృశ్యాల్ని బాగా చిత్రీకరించారు. పైకి ధగద్ధగాయమానమైన ఈ నాగరికత యొక్క పెళుసుదనాన్ని బాగా బయటపెట్టాడు దర్శకుడు. ఇందులో కథానాయకుడైన అమెరికను, అతని భార్యాబిడ్డలూ, అతని మిత్రుడూ ఈ వైపరీత్యం నుంచి విమానమెక్కి ఎలా తప్పించుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది. (అసలలా తప్పించుకోవడం అసాధ్యమనుకోండి. విమానం ఎక్కొచ్చు కానీ ఎక్కడ దిగుతారు ?) ఓడకి వచ్చిన సాంకేతిక ఇబ్బందిని కథానాయకుడు ఏ విధంగా ప్రాణాలకు తెగించి మఱీ పరిష్కరించాడో చూపించారు. తెలుగు సినిమాల్లో మాదిరి నవరసాలూ ఉన్నాయి. శృంగారం, వీరం, రౌద్రం, హాస్యం, బీభత్సం, భయానకం గట్రా, గట్రా ! అయితే హిమాలయాలు కూడా మునిగిపోయినట్లు బౌద్ధలామా మఠాలు నేలమట్టమైనట్లు చూపించారు.. ఇది చాలా అవాస్తవికంగా ఉంది. బైబిల్ కథల్ని గుడ్డిగా నమ్ముతున్నట్లు, ఆ ప్రకారం చిత్రీకరించాలని ప్రయత్నించినట్లు తోచింది. నాకు తెలిసి ఎంత ఉగ్రరూపం దాల్చినా సముద్రానికి అంత సీన్ లేదు. అదే విధంగా ప్రళయం అయిపోయాక (అప్పుడు చూపించిన తేదీ ’ఒకటో’ సంవత్సరమట. ఏ శకమో తెలియదు) నల్లజాతికి చెందిన శ్వేతసౌధ అధికారి హాయిగా విద్యుద్దీపాల కింద అంకోపరి (laptop) మీద టిక్కుటిక్కుమని పని చేసుకుంటున్నట్లు చూపించారు. నిజంగా హిమాలయాల్నే ముంచెత్తగల భీకర ప్రళయమే వస్తే మనుషులకి ల్యాప్స్ మాత్రమే మిగుల్తాయి. టాపులుండవు. ల్యాప్‌టాపులు అసలే ఉండవు. ఎందుకంటే ఒకసారి అంత స్థాయిలో నాగరికత నశించిపోయాక మళ్లీ అది అభివృద్ధి చెందాలంటే గతంలో మాదిరే వేలాది సంవత్సరాలు తీసుకుంటుంది.

ఈ సినిమాలో ఇంకొన్ని ఆసక్తికరాలున్నాయి. అమెరికా అధ్యక్షుడుగా ఒక నల్లజాతీయుణ్ణి చూపించారు, వర్తమాన వాస్తవానికి సరిపోలాలని కాబోలు. రాజకీయ సాధుత్వం (political correctness) కూడా ఒక ఆలోచన కావచ్చు. తెల్లవాణ్ణి అధ్యక్షుడుగా చూపిస్తే నల్లవారి అధ్యక్షత్వాన్ని దర్శకుడు అంగీకరించడం లేదనే మాట పుట్టే అవకాశం ఉంది.

వాస్తవాలతో నిమిత్తం లేకపోయినా ఈ సినిమా మంచి వినోదాన్నే అందిస్తుంది. పెట్టిన టిక్కెట్టు డబ్బులకి దండగ లేదు. అందుకే ఇదొక మంచి పిల్లల సినిమా అంటున్నాను.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్