ధ్రదేశంలో స్వలింగసంపర్కం (homosex) కంటే, వావిడికం (incest) కంటే అత్యంత నిషిద్ధమైన ప్రస్తావన (taboo topic) ఒకటుంది. దాని పేరు భాషాభిమానం. ఈ రాష్ట్రంలో భాషాభిమానం ప్రదర్శించడం తప్పు. భాషాభిమానం ఉండాలని చెప్పడం తప్పు. తెలుగుభాషకి స్థానం కల్పించమని అడగడం తప్పు. టోకుగా భాషకి సంబంధించిన ఏ టాపిక్కైనా తప్పే, తప్పున్నఱే. ఇక్కడ సర్వకాల సర్వావస్థల్లోను భాష గుఱించి అందునా తెలుగుభాష గుఱించి మాట్లాడ్డం చాలా అసందర్భంగా భావించబడుతుంది. అలాగని ఇదేమైనా బహుభాషారాష్ట్రమా ? అంటే కానేకాదు. అన్నిచోట్లా ఉన్నంతే ఇక్కడా భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు కొన్నున్నాయి. తెలుగువాళ్ళు తమ మాతృభాషని నీచంగా చూడ్డం గమనించి వాళ్ళు కూడా తమ మైనారిటీ హోదా మర్చిపోయి తెలుగుని నీచంగా చూడ్డం అలవాటు చేసుకున్నారు, మఱోపక్క తమ మైనారిటీ భాషల్ని మనసారా ప్రేమిస్తూ ! విచిత్రంగా ఇక్కడ నూటికి తొంభై అయిదుశాతం మంది అంతా తెలుగువాళ్ళే, తెలుగు రాయడమూ, చదవడమూ అందఱికీ వచ్చినా రాకపోయినా ! మఱి తెలుగుభాష ఇక్కడ ఇలా నిషిద్ధ ప్రస్తావనగా మారిపోవడానికి కారణమేంటి ?ఏదైనా ఒక విషయం ఇలా నిషిద్ధ ప్రస్తావనగా దానంతట అది మారదు. దాన్నలా మార్చేందుకు ఆద్యులైనవాళ్ళు కొందఱుంటారు. వాళ్ళు సమకాలీన సమాజంలో బహు శక్తిమంతులై ఉంటారు. దాన్నలా మార్చడంలో వాళ్ళకి భారీయెత్తున స్వప్రయోజనాలుంటాయి, శాశ్వత ప్రయోజనాలుంటాయి. అవేంటో వాళ్ళు బయటపడి అందఱితోనూ వెల్లడించరు. తాము అనుకున్నదాన్ని నిషిద్ధవిషయంగా మార్చేస్తారంతే ! వాళ్ళని బట్టి మఱికొందఱు, వాళ్ళని బట్టి ఇంకొందఱు - అలా క్రమంగా అందఱికీ ఆ విషయాన్ని నిషిద్ధ ప్రస్తావనగా చూడ్డం అలవాటైపోతుంది. పాపం, ఈ అలవాటైనవాళ్ళలో చాలామందికి అందులో ఏ స్వప్రయోజనమూ ఉండదు, గుడ్డిగా ఒకడి తోక పట్టుకొని ఒకడు గోతిలోకి దిగడమే తప్ప ! "అది ఎందుకు నిషిద్ధప్రస్తావన ?" అనడిగితే మనకి సరైన సమాధానం రాదు. వాళ్ళు విశదీకరించి చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకే తెలీదు. అదొక అలవాటుగా మారిపోయిందంతే. అందఱూ తెలుగువాళ్ళే ఉంటున్న అపార్ట్ మెంట్ భవనంలో/ కార్యాలయంలో ఇంగ్లీషులో ఎందుకు నోటీసులు అంటిస్తున్నారని/ పంపిస్తున్నారని ఒకసారి అడిగిచూడండి, మిమ్మల్ని ఎలా చూస్తారో ! అసలు తాము చేస్తున్నది ఒక బుద్ధిలేని పని కాగా మీకే బుద్ధిలేనట్లు మొహం పెడతారు. అలాంటిదే జాతీయ రహదారుల మీద Speed thrills, but kills మొదలైనవి రాయడం కూడా. లారీలవాళ్ళక్కూడా మనలా ఇంగ్లిషొస్తే వాళ్ళు లారీలెందుకు తోల్తారు ? ఏమైనా నిరంకుశత్వం తర్కాన్ని పట్టించుకోదు. ఎందుకంటే దాని పేరే నిరంకుశత్వం కనుక. మన రాష్ట్రంలో ఇంగ్లీషు ఆధిపత్యం వెనక ఉన్నది ఇలాంటి మొండి, బండ, చండ నిరంకుశత్వం ఒకటే. దాని వెనక ఏ విధమైన తర్కమూ లేదు. ఇంగ్లీషుని కొన్ని దేశాల్లో మాట్లాడ్డానికీ, జనం మీద స్థానికంగా అమలవుతున్న ఈ విధమైన బలవంతపు భాషరుద్దుడు/ భాషబాదుడు కార్యక్రమానికీ ఏ విధమైన తార్కిక సంబంధమూ లేదు. ఉన్నదల్లా ఆ పేరుతో చెలామణీ అవుతున్న ఒక విదేశీ భాషాపశుత్వం. ఒకఱికో, ఇద్దఱికో ఇలాంటి నిర్హేతుకమైన అలవాట్లుంటే సరే, పోనివ్వండి ! అసలు మొత్తం జాతికే అదొక జాడ్యంలా పట్టుకుంటే ?
సరే ! ఇలా ఒక విషయాన్ని నిషిద్ధాంశంగా మార్చేశాక ఏం జఱుగుతుంది ?
పైప్రశ్నకి సమాధానాన్ని వెతికేముందు ఇలాంటి ప్రశ్నే ఇంకొకటి - సుపరిచితమైనది వేసుకుందాం. స్త్రీల సమస్యల్ని సమాజమంతటా నిషిద్ధాంశం (taboo topic) గా మారిస్తే - వాటిమీద ఎవరూ రాయకూడదనీ, మాట్లాడకూడదనీ శాసిస్తే ఏం జఱుగుతుంది ? స్త్రీలు తమ బాధల్ని మనసులోనే దిగమింగుకోవాలనీ, పుట్టింటివారితో కూడా చెప్పకూడదనీ, తమ బాధలకి కారణమైనవాళ్ళని దేవుళ్ళలా పూజించాలనీ, వాళ్ళు తమని చంపేసినా ఆ చావు వరప్రసాదం అనుకొని ఆనందంగా చచ్చిపోవాలనీ, లేకపోతే ద్రోహమనీ, పాపమనీ, బాధల్ని మౌనంగా భరిస్తే మహాపుణ్యమనీ, ఏదైనా జఱగనీ, మొత్తమ్మీద స్త్రీలు బయటపడకూడదనీ, బయటపడితే పరువు పోతుందనీ చెబితే ఎలా ఉంటుంది ? పర్యవసానంగా - స్త్రీలు దారుణాతి దారుణమైన హింసలకి బలైపోతారు. స్వంత ఇళ్లల్లోనే మానభంగాలకి గుఱవుతారు. బయటివాళ్ళకి అమ్మివేయబడతారు. కట్టుకున్న భర్త దగ్గఱ కూడా వాళ్ళ స్థితి పనిమనిషి కన్నా కనాకష్టమైన స్థాయికి దిగజాఱిపోతుంది. మగవాడికి ఉన్న నానా రకాల ఉంపుడుగత్తెల్లో, వేశ్యల్లో ఒకరుగా మారిపోతారు. వారికి అంతిమంగా సామూహిక ఆత్మహత్యలే తప్ప వేఱు గత్యంతరం ఉండదు.
అలాగే కార్మికుల సమస్యల్ని సమాజమంతటా నిషిద్ధాంశంగా మారిస్తే - వాటిమీద ఎవరూ మాట్లాడకూడదనే ఆచారాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది ? ఇహ అప్పుడు, వారిచేత రోజుకు పద్ధెనిమిది గంటలపాటు పని చేయించుకునేవాళ్ళు బయల్దేఱతారు. వాళ్ళు ఏ కారణం చేతనైనా ఒకరోజు పనిలోకి రాకపోతే వాళ్ళ భార్యల్నో, పిల్లలనో పనిలోకి పంపమంటారు. వాళ్ళమీద అనుమానమొస్తే చెట్టుక్కట్టేసి చచ్చేదాకా చావగొడతారు. వాళ్ళ మూలంగా ఏదైనా నష్టమొస్తే ఆ నష్టం పూడేదాకా జీతం, బత్తెం లేకుండా వెట్టిచాకిరీ చెయ్యమంటారు. ఈ బాధలకి తాళలేక కార్మికులు చికిత్సాతీతమైన అస్వస్థతలకి లోనై అల్పాయుష్కులుగా చనిపోతారు. వాళ్ళేదో అంతకుముందు బాకీ ఉన్నారని అబద్ధాలు చెప్పి యజమానులు వాళ్ళ వారసుల్ని శాశ్వత బానిసలుగా మార్చుకుంటారు.
ఇదంతా ఎందుకు జఱుగుతుంది ? ఒక విషయాన్ని ఎవరూ మాట్లాడకూడదని శాసించడం వల్ల ! దాన్ని అలా వెలివేయడం వల్ల ! దాని లోతుపాతుల్ని విచారించే అవకాశాలన్నింటినీ నిర్మూలించడం వల్ల ! దాన్ని సాకల్యంగా, కూలంకషంగా అర్థం చేసుకోవడానికి వీలుకల్పించే అన్ని దారుల్నీ ధ్వంసం చెయ్యడం వల్ల ! దానిమీద సమాజంలో ఆత్మశోధనకీ, ఆత్మపరిశీలనకీ ఉన్న ద్వారాల్ని మూసిపారెయ్యడం వల్ల !
అలాగే తెలుగుభాష, తెలుగుభాషాభిమానమూ అనేవి ఈ రాష్ట్రంలో నిషిద్ధాంశాలుగా మార్చబడ్డాక జఱుగుతున్నది ఏమైనా భిన్నంగా ఉన్నదా ?
(మఱికొంత వచ్చే టపాలో....)
