11.9.09
పౌర డయనమే ప్రముఖులకీ క్షేమకరం
12:26 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: నా అనుకోలు (assumption)
చనిపోయిన ముఖ్యమంత్రి డా|| రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ లో కాకుండా ఏదైనా పౌరవిమానమెక్కి చిత్తూరు వెళ్ళుంటే ఎలా ఉండేది ? అని ఆలోచిస్తున్నాను. చావు ఖరాఖండిగా రాసిపెట్టి ఉన్నప్పుడు ఏదైనా ఒకటేననుకోండి. దివ్యపిత (పరమాత్మ) మన వేలు పట్టుకున్నంత వఱకు మనకేమీ కాదు. వదిలేశాక ప్రకృతిమాత కూడా సహకరించడం మానేస్తుంది.
"అడవి రక్ష లేని అబలుండు వర్ధిల్లు
రక్షితుండు మందిరమున చచ్చు" నన్నారు పోతన మహాకవి.
కానీ పౌరవిమానాలు దిగడానికి పనికొచ్చే విమానాశ్రయమేదీ చిత్తూరులో లేదు. చనిపోయిన ముఖ్యమంత్రి ఇలాంటి ఇబ్బంది ఉందని గమనించక పోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో అందఱి కంటే ఆయనకే విమానాల అవసరం ఎక్కువగా ఉండేది. ఆయనకున్న ప్రత్యేకమైన జీవిత చరిత్ర దృష్ట్యా ఆయన మీదా, ఆయన కుటుంబం మీదా ఓ కన్నేసి తిరుగుతున్న ఫ్యాక్షనిస్టులున్నారు. మావోయిస్టుల ఖతం జాబితా (hit-list) లో ఆయనదీ, ఆయన కుటుంబసభ్యులవే తొలిపేర్లు కూడా ! అందుచేత భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ వాడనన్ని ఎక్కువ సార్లు (అక్షరాలా ఏడొందల యాభైసార్ల కంటే ఎక్కువ) ఆయన ప్రభుత్వ హెలికాప్టర్ ని వాడుకోవడం జఱిగింది. అందుకే జిల్లాకొక విమానాశ్రయం ఉండాలనే చంద్రబాబు హయాం నాటి పాత ప్రతిపాదనని ఆయన రెండేళ్ళ క్రితం తిరగదోడాడు. కానీ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా భూముల్ని కబళించడంలో నిమగ్నుడై ఉండడం వల్ల ఆ ప్రతిపాదన దిశగా ఏ చర్యలూ తీసుకోలేక పోయాడు. అయితే ఆ విధమైన నిష్క్రియాపరత్వానికి అందఱి కంటే ముందు ఆయనే మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
ఆ ప్రతిపాదన కింద మొదట రామగుండం, ఆదిలాబాద్, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, వరంగల్ మొ|| విమానాశ్రయాలు కట్టాలని అనుకున్నారు. అప్పట్లో కడప విమానాశ్రయాన్ని కొంచెం అభివృద్ధి చేశారు కూడా ! హైదరాబాదు నుంచి కడపకి వాయు రవాణా సేవలందించడానికి అప్పట్లో ఎయిర్ డెక్కన్ సంస్థ అధిపతి అయిన కెప్టెన్ గోపీనాథ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ దరిమిలా ఉప్పతిల్లిన పరిణామాలలో - ఆ సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తో విలీనం కావడం, కింగ్ ఫిషర్ దృష్టిలో కడప తగినంత వాయురద్దీ (air traffic) ని కల్పించగల స్తోమత (potential) ఉన్న ప్రాంతంలా కనిపించక పోవడం మొదలైన కారణాల మూలాన ఆ సంసిద్ధత కాస్తా అటకెక్కింది.
రాష్ట్రంలో ముప్ఫైమూడు విమానాశ్రయాలున్నాయి. వీటిల్లో షమ్సాబాద్ లాంటి అంతర్జాతీయ విమానాశ్రయాలూ, విజయవాడ, రాజమండ్రి, లాంటి ప్రాంతీయ విమానాశ్రయాలతో పాటు దొనకొండ (ప్రకాశం జిల్లా) వంటి చిన్న విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఎక్కువ శాతం ఆంధ్రప్రాంతంలోనివి. అవి రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ వారి దాడుల్ని కాచుకునే నిమిత్తం బ్రిటీష్ వారు కట్టించినవి (Military Airbases). ఈ ముప్ఫై మూడింటిలో ప్రస్తుతం ఆఱు మాత్రమే అనునిత్య ఉపయోగం (regular use) లో ఉన్నాయి (హైదరాబాద్, గన్నవరం, విశాఖపట్నం, రేణిగుంట, మధురపూడి, పుట్టపర్తి) . మిహతావాటికి కనీసం నిర్వహణ (maintenance) కూడా కఱువైంది. కానీ అదే సమయంలో రాష్ట్రంలో తిరిగే విమానాల సంఖ్య అనూహ్యంగా పెఱిగిపోతోంది. పని చేస్తున్న ఆఱు విమానాశ్రయాల నుంచి ఇప్పుడు ప్రతిరోజూ నూట పధ్నాలుగు విమానాలు బయల్దేఱుతున్నాయి. వాటిని నిలపడానికి తగినన్ని హ్యాంగర్లు లేవు.
అందుచేత ఎవరైనా గంభీరంగా పూనుకోవాలే గానీ మిహతా ఇఱవయ్యేడింటిని కూడా పూర్తిస్థాయి విమానాశ్రయాలుగా రూపుదిద్దవచ్చు. జంబోజెట్లూ, బోయింగులూ కాకపోయినా తక్కువ సీటింగ్ కెపాసిటీ (నలభై నుంచి డెబ్భై మంది ప్రయాణీకులు) గల చిన్న విమానాలు దిగడానికైనా ఆస్కారం కల్పించవచ్చు. ఒకే రోజులో కాకపోయినా ఒక పదేళ్ళ పక్కా ప్రణాళికతో కొద్దికొద్దిగా చేసుకుంటూ పని పూర్తి చెయ్యొచ్చు. అలాంటి ప్రణాళికేదైనా ఉంటే, బడ్జెట్ కేటాయింపులు కూడా భారం కావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు వార్షిక బడ్జెట్ రూ. లక్ష కోట్లకి కాస్త అటూ ఇటూగా ఉంటుంది. అందులో ఈ పని నిమిత్తం ప్రతిసంవత్సరం మూడొందల నుంచి అయిదొందల కోట్లు కేటాయించడం నిండా సాధ్యమే. నిజం చెప్పాలంటే మన రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం సుమారు ముప్ఫై వేలకోట్లు నానా ఉచిత పథకాల రూపంలో ధర్మసత్రంలా ప్రజలకి పందేరం చెయ్యబడుతోంది. అదంతా తిరిగిరాని డబ్బే. కేవలం ఎన్నికల్లో గెలవడం తప్ప వేఱే మహోదాత్త ఆశయాలేమీ లేని అలాంటి దండుగమారి పథకాల్ని రద్దుచేసి ఇలాంటి మౌలిక సదుపాయాల్ని కల్పించడం మీదికి ఈ జాతి దృష్టి ఎప్పుడు మళ్ళుతుందో తెలియదు. షమ్సాబాద్ విమానాశ్రయానికి చేసినట్లే వీటి విషయంలో కూడా ప్రైవేట్ పాల్గోలు (private participation) ని ఆహ్వానించవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థ ఉంది. ప్రస్తుతం అది వి.వి.ఐ.పి.ల విమాన ప్రయాణాల గుఱించి తప్ప ఇహ దేన్నీ పట్టించుకోదు. దానికి మఱిన్ని నిధుల్నీ, బాధ్యతల్నీ, నిపుణుల్నీ, చేపట్టుల (projects) నీ అప్పగించాల్సిన తరుణం ఆసన్నమైంది. డయనం (aviation) ఇప్పుడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల గుత్తాధికారం (monopoly) కాదు గనుక, రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలు హైదరాబాద్ నుంచి జిల్లాకేంద్రాలకి చిన్న విమానాల్ని నడిపేలా ప్రోత్సహించవచ్చు. లేదా రాష్ట్రప్రభుత్వమే ఎ.పి. ఎయిర్ లైన్స్ పేరుతో వాటిని నడపొచ్చు. తల్చుకుంటే ఎంతో చెయ్యొచ్చు.
ఇలా విమానాశ్రయాల్ని అభివృద్ధి చెయ్యడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా నాయకుల వ్యక్తిగత పర్యటనల నిమిత్తం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడ్డం, అందునిమిత్తం యావత్తు భద్రతా వ్యవస్థనీ దుర్వినియోగం చెయ్యడం ఒక బాధ్యతారహితమైన, అనుత్పాదకమైన దుబారా చర్య అని చెప్పక తప్పదు. ఒక్కొక్క పర్యటనకి లక్షలూ, మిలియన్లూ వదిలిపోతాయి. అలా ఇంధన రూపంలో తగలబడేదంతా ప్రజాధనమేనని మర్చిపోరాదు. గతంలో ఎన్నికల సమయానికే పరిమితమైన హెలికాప్టర్ విహారాలు, జడ్ శ్రేణి భద్రతలానే, వై.ఎస్. నెలకొల్పి పోయిన దుష్ట సంప్రదాయం మూలంగా, భవిష్యత్తులో నాయకులందఱికీ ప్రతిష్ఠాచిహ్నం (status symbol) గా, విలాసద్యోతకం (style statement) గా, నిత్యకృత్యంగా మారే ప్రమాదం ఉంది. మఱోవైపు పక్క రాష్ట్రాల పారిశ్రామికవేత్తలంతా సొంత కార్ల లాగే సొంత విమానాలు కొనుక్కుని విహరిస్తున్నారు. వాళ్ళని చూసి మన అంజిరెడ్లూ, లగడపాటులూ, రామానాయుళ్ళు, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాదులూ సొంత విమానాలో, హెలికాప్టరులో కొనుక్కునే అవకాశాల్ని కొట్టిపారెయ్యలేం. తద్ద్వారా రాష్ట్ర గగనతలంలో వాయుకాలుష్యం పెచ్చుమీఱడం మొదటికే మోసం. ఒక్కడే సొంత కారులో వెళ్ళడం కంటే నలుగుఱితో కలిసి బస్సులో వెళ్ళడం చౌకా, క్షేమమూను. అలాగే మన నాయకులూ, పారిశ్రామికవేత్తలూ నలుగుఱితో కలిసి చౌకయిన పౌర డయనాన్ని (civil aviation) ఆస్వాదించడం వారికీ, మనకీ అంతిమంగా చాలా మేలు చేస్తుంది. అంతే కాక జిల్లాల్లో వఱదలూ, కఱువులూ, ఆరోగ్యపరమైన అత్యవసరాలూ (health emergencies) సంభవించినప్పుడు స్థానికంగా ఏదో ఒక విమానాశ్రయం ఉంటే సహాయచర్యలు చేపట్టడం ప్రభుత్వానికి సులభతరమౌతుంది. అలాగే సంఘవ్యతిరేక శక్తులు చెలఱేగినప్పుడు వెనువెంటనే సాయుధ బలగాల్ని అక్కడికి తఱలించడం కూడా వేగవంతమౌతుంది.
ఒకచోటినుంచి మఱొకచోటికి విమానాలు అనునిత్యం నడిచినా నడవక పోయినా, అసలంటూ విమానాశ్రయాలుంటే ఏదో ఒకటి చెయ్యగలుగుతాం. గంటకి మూడొందల కిలోమీటర్ల వేగంతో ఎగిఱే విమానమెక్కినా సరే, ఈ రాష్ట్రంలో ఒక మూల నుంచి ఇంకో మూలకి ఎగఱాలంటే మూడు గంటలకి తక్కువ సమయం తీసుకోదు. అలాంటిది, ఈ ఇఱవయ్యొకటో శతాబ్దంలో ఎనిమిదిన్నఱ కోట్ల మహాజాతి ఆఱే ఆఱు విమానాశ్రయాలతో సరిపెట్టుకోవడం తెలివైన పని కాదనిపిస్తోంది. శకునపక్షులు సర్వకాల సర్వావస్థల్లోను ఉంటారు. ఎక్కువమంది విమానప్రయాణాలకి మఱిగితే ప్రపంచంలో పెట్రోలు తొందఱగా అయిపోతుందని వారు చెబుతారు. వెధవ పెట్రోలు ఎప్పటికైనా అయిపోయేదే. మనం ఆపేదేమీ లేదు. ఎన్ని పొదుపుచర్యలు చేపట్టినా అది ఇంకో నలభయ్యేళ్ల తరువాత అయిపోతుందని పెద్దలు చెబుతున్నారు. అది అయిపోయినంత మాత్రాన మనం ఆఱున్నొక్కరాగం ఆలపించాల్సిందేమీ లేదు. పైగా బాగుపడతామేమో నని నా నమ్మకం.
