
న్న (02.09.2009) హైదరాబాదులో ఉదయం ౮.౩౫ నిమిషాలకి చిత్తూరు వెళ్ళడం కోసం ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఎక్కిన Bell-430 హెలికాప్టర్ నుంచి ౯.౧౨ తరువాత సంకేతాలందడం ఆగిపోయాయి. దానికీ, వాయురద్దీ నియంత్రణ (ATC) కేంద్రానికీ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పదిన్నఱకల్లా చిత్తూరు చేఱాల్సిన హెలికాప్టర్ అలా చేఱకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలయింది. మొదట పావుగంట ఆలస్యమనీ, ఆ తరువాత అఱగంట ఆలస్యమనీ అనుకున్న అధికారులు ఆ తరువాత కూడా హెలికాప్టర్ రాకపోవడంతో ఉఱుకులూ, పరుగులూ పెట్టారు. హెలికాప్టర్ ఎక్కడో దారితప్పిందనేది స్పష్టమయింది. కాంగ్రెస్ నాయకులు చాలా కంగారు పడ్డారు. బహుశా ముఖ్యమంత్రి హెలికాప్టర్ చిత్తూరు జిల్లా శేషాచలం పర్వతాల్లో కూలిపోయిందనే అనుమానంతో అక్కడ మఱికొన్ని పోలీస్ పార్టీలు ముమ్మర గాలింపు చర్యలు మొదలుపెట్టాయి.ఈ లోపల "ముఖ్యమంత్రి మధ్యదారిలో క్షేమంగానే హెలికాప్టర్ దిగారనీ, కాలినడకన ఒక సమీపగ్రామం చేరుకున్నారనీ, శీఘ్రంగా కర్నూల్ వచ్చి అక్కణ్ణుంచి రోడ్డుమార్గంలో హైదరాబాదొస్తా" రనీ వదంతులు వ్యాపించాయి. తాత్కాలికంగా అందఱూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ కాసేపట్లోనే రాష్ట్ర ఆర్థికమంత్రి రోశయ్య సమావేశం పెట్టి ముఖ్యమంత్రి ఏమయ్యారో తెలియడం లేదని, ప్రజలంతా పూనుకొని ఆయన కోసం వెతకవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి కనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలంటూ మూడు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు. దాన్తో ఇంతకుముందు విన్న శుభవార్తలు కేవలం వదంతులేనని స్పష్టమయింది. క్షణాల మీద అంతా మారిపోయింది. నల్లమలలోని నక్సలైట్లు ముఖ్యమంత్రినీ, ఆయన సిబ్బందినీ అపహరించారేమోననే ఆందోళనని కొందఱు వ్యక్తం చేశారు. నక్సలైట్ల మూలంగా ఏర్పడ్డానికి అవకాశమున్న ఇంకా అధమ పరిస్థితిని ఊహించుకోసాగారు మఱికొందఱు. చీకటిపడే లోపల అయిదు హెలికాప్టర్లు నల్లమల అడవుల మీద కలియదిరుగుతూ గాలించాయి. అయినా ముఖ్యమంత్రి గుఱించి ఏ ఆచూకీ లభించలేదు. సి.ఆర్.పి.ఎఫ్., గ్రేహౌండ్స్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అంతా కలిపి అయిదువేలమంది పోలీసు బలగాల్ని హుటాహుటిన రంగంలోకి దించారు. కానీ నల్లమలలో హోరున కుఱుస్తున్న భారీవర్షాల దెబ్బకి లోపలికి వెళ్ళినవాళ్ళు కూడా తిరిగొచ్చారు. చీకటిపడిపోవడం వల్ల హెలికాప్టర్ల ద్వారా శోధనని నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం ప్రకటించారు. దాని బదులు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న సుఖోయ్ యుద్ధవిమానాన్ని నల్లమల పంపించారు. దాన్ని కూడా మధ్యలో ఆపేశారు.
ఇస్రోవారు ఈ లోపల నల్లమల అడవుల ఉపగ్రహచిత్రాలు నలభయ్యొక్కింటిని తీసి పంపారు. వాటిని హైదరాబాదులో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీవారు రాత్రంతా విశ్లేషిస్తూనే ఉన్నారు. గూగుల్ వారినడిగితే తమకి ఇఱవైనాలుగ్గంటల సమయం కావాలని అడిగారు. ఎంత రాత్రయినా ముఖ్యమంత్రి కోసం అన్వేషణ ఆగకూడదని కేంద్రప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో స్థానికంగా ఉండే నూట పన్నెండుమంది చెంచుతెగ గిరిజనులకి మొబైల్ ఫోన్లూ, టార్చిలైట్లూ ఇచ్చి అడవిలోకి పంపించారు. అప్పటికింకా నల్లమలలో హోరున వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి.
కానీ తెల్లవాఱాక ఆదుకోలు విమానాలు (rescue aircrafts) జఱిపిన అన్వేషణలో అసలు విషయం తెలియవచ్చింది. చనిపోయినవారిలో వెస్లీగారి సెల్ ఫోన్ ఇంకా అప్పటికి పనిచేస్తూనే ఉంది. దానికి పంపిన ఎస్సెమ్మెస్ ఎంత దూరంలోంచి అందుకోబడిందో, ఏ దిక్కులో అందుకోబడిందో కనిపెట్టి ఆదుకోలు విమానాల్ని అటు పంపారు. తద్ద్వారా తెలియవచ్చినది ఏమంటే - ప్రతికూల వాతావరణంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ చోదకుడు (pilot) ఏ కారణం చేతనో అసలు వెళ్ళాల్సిన వాయుమార్గం (regular flight route) నుంచి దాన్ని పద్ధెనిమిది కిలోమీటర్లు ఇవతలికి తప్పించాడు. ఆ తరువాత నల్లమల ప్రాంతాన్ని కప్పేసిన ఆ మంచులో, జడివానలో దారి కనిపించక అక్కడే అయిదాఱు చక్కర్లు కొట్టాడు. ఆ తరువాత ఉదయం ౯.౩౦ కి రుద్రకోడూరు ప్రాంతానికి పద్ధెనిమిది కిలోమీటర్ల దూరంలో భూతలానికి పధ్నాలుగొందల అడుగుల ఎత్తులో ఉన్న పావురాల కొండ (పావురాల గుట్ట/ పశువుల గుట్ట) మీద ఉన్న ఎత్తయిన చిఱుమాను చెట్లని ఢీకొట్టాడు. అందుకు సాక్ష్యంగా ఉదయవేళ ౯.౩౦ చూపిస్తున్న చేతి గడియారం ఆ ఘటనాస్థలంలో లభ్యమయింది. హెలికాప్టర్ తునాతునకలయింది. దానిలోని ఇంధనం భగ్గున మండి అందులో ప్రయాణిస్తున్న అయిదుగుఱూ - ఒకఱు నలభై శాతం, ఇంకొకఱు అఱవై శాతం చొప్పున కాలి బయటికి విసిఱివేయబడ్డారు. ఆ ఉష్ణోగ్రతకి అక్కడి చిఱుమాను చెట్లు కూడా కాలిపోయాయి. (ఆ కాలిపోయిన చెట్లని పైనుంచి చూసి ఇక్కడేదో జఱిగిందని అన్వేషకులు పసిగట్టారు) వారి మృతదేహాలు ఆ విమాన శకలాల చుట్టూ చెల్లాచెదఱుగా పడిఉన్నాయి, వై.ఎస్. అయితే ఒక కాలూ, రెండు చేతులూ తెగిపడ్డారు. తల మొండెం నుంచి వేఱై ఎగిఱి అవతల పడింది. ప్రయాణికులు గుర్తుపట్టడాని క్కూడా వీల్లేని స్థితిలో ఉన్నారు. మొత్తమ్మీద వై.ఎస్. ఒంటరిగా చనిపోలేదు. తనవెంట నలుగుఱిని తీసుకెళ్ళారు. వారు - ఆయన ప్రిన్సిపల్ కార్యదర్శి జి.సుబ్రహ్మణ్యం (ఐ.ఏ.ఎస్.), ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎ. సోలోమన్ కారల్ వెస్లీ, ప్రధాన పైలట్ ఎస్.కె. భాటియా మఱియు సహాయ పైలట్ ఎమ్. సత్యనారాయణరెడ్డిగార్లు.
హెలికాప్టర్ ఇంధనం నల్లమల అడవుల గుండా ప్రవహించే నెఱిగంగానదిలో చముఱుతెట్టు (oil slick) గా తేలడాన్ని కొందఱు బెస్తవారు గమనించారు. నిన్నటి సాయంకాలమే వారీ సంగతి అధికారులకి తెలియజేసినా వారు నమ్మలేదు, నెఱిగంగ ఒడ్డుకు వెళ్ళి ప్రవాహాన్ని వ్యక్తిగతంగా పరిశీలించిన పాపానా పోలేదు.
ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల అభయారణ్యాలు (Nallamala Reserve forests) ప్రపంచంలో కొన్ని చిఱుదేశాల కంటే విశాలమైనవి (పదివేల చదరపు కిలోమీటర్లు). అవి బహు దట్టమైనవి. మార్గాలు లేనివి. కాఱుచీకట్ల గుయ్యారాలు. మనిషి జాడే కనిపించని నిర్జన నీరవ నిశ్శబ్దమయాలు. అంతుపట్టని కొండలతో, గుట్టలతో, పర్వత శిఖరాలతో అనేక విధాలుగా భయంకరమైనవి. జలగలతోను, మొసళ్ళతో కూడుకొన్న లోతైన వాగులతో, వంకలతో, నదులతో దాటశక్యం కానివి. Project Tiger లో భాగంగా వందలాది పులుల్నీ, కొండచిలువల్నీ తమలో దాచుకొన్నటువంటివి. అక్కడ కొన్ని చెంచుగూడేలు తప్ప మానవసంచారం లేదు. చందమామ కథల్లోని రాకాసిలోయల్లాంటివి ఆ ప్రాంతాలు. ఆఱు జిల్లాలలో సుమారు 200 కిలోమీటర్ల పొడవున వ్యాపించిన నల్లమల అరణ్యాల మధ్యలో ఒంటరిగా దారితప్పినవారెవరైనా ప్రాణాల మీద ఆశ వదులుకోవలసిందే. వాటిని చూసినవారెవరూ ఈ దేశంలో వందకోట్ల జనాభా ఉందంటే నమ్మలేరు.
కానీ అలాంటివారికి అర్థం కాని విషయం - నల్లమల అడవుల నట్టనడుమ చరగోపురాల్ని (cellular phone towers) నిర్మించడం సాధ్యమయ్యే పని కాదు. నిజంగా సాధ్యమైతే ఎప్పుడో చేసుండేవారు. అప్పటికీ అడవి ముఖద్వారాల్లోని కొన్ని గ్రామాల్లో బి.ఎస్.ఎన్.ఎల్. కొన్ని గోపురాలు స్థాపించింది కూడా. ఆ ప్రాంతంలో జనం నివసించరు గనుక పెట్టిన పెట్టుబడికి సార్థకత ఉండదు. పోనీ, లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేద్దామనుకున్నా గోపురాలకి మరమ్మత్తులు చేసేందుకు అడవిలోకి వెళ్ళడం అనేక ప్రమాదాలతో కూడుకొని ఉంటుంది కనుక సిబ్బంది అందుకు సాహసించలేరు. రోడ్డుమార్గాలు లేకపోవడం చేత నల్లమల ప్రాంతంలో ఎక్కడికైనా నడిచే వెళ్ళాలి. కర్ణాటకలోని బండిపూర్ అడవులకీ, రాయలసీమ అడవులకీ గల ప్రధానమైన తేడా ఇది.
ఇంత ఘోరం జఱిగినా నాకు మనసులో ఒక మూలన ఇసుమంత ఉపశమనంగా అనిపించిన విషయం - ఎవరో కావాలని చేయించారనే ఆరోపణలకి అవకాశం లేని విధంగా ఈ ప్రమాదం యాదృచ్ఛికంగా దైవికంగా జఱిగిందని తేలడం. అదే ఆ విమానిక నగరానికి దగ్గఱలో కూలిపోయుంటే అధికారపక్షంవారు బహుశా ప్రతిపక్షంవారి మీద అమానుషమైన దాడులకి తెగబడేవారు. గతానుభవాల్ని బట్టి ఇలా అనుకోక తప్పడంలేదు.

