సందర్భంగా నేను మా అబ్బాయితో చెప్పినదాని సారాంశం క్లుప్తంగా...."ఒరే నాన్నా ! మంత్రానుష్ఠానం ఫలించాలంటే ముందు శౌచం అవసరం. ఆ తరువాత అహింస, సత్యమూ, అస్తేయమూ, బ్రహ్మచర్యమూ, ఈశ్వర ప్రణిధానమూ అనే అయిదు లక్షణాల్ని అలవఱచుకోవాలి. బాహ్యమనీ, ఆంతరమనీ శౌచం రెండు రకాలు. రెండూ ముఖ్యమే. ఏదో ఒకటి మాత్రమే పాటించడం పనికిరాదు. మనస్సు, శరీరమూ అనేవి రెండూ ఒకే పదార్థంతో చెయ్యబడినవి కనుక అవి ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తాయి. మంత్రం కారులాంటిది. ఒక కారు కొనుక్కునేటప్పుడు ఎలాగైతే అన్నీ ఆలోచించి కొంటామో, అలాగే అన్నివిధాలా మనకీ, మన శక్తికీ తగిన మంత్రాన్నే ఉపదేశం తీసుకోవాలి, ఒకసారి మంత్రోపదేశం తీసుకున్నాక దాన్ని జీవితాంతమూ అనుష్ఠించాలి. మానితే ప్రత్యవాయం కలుగుతుంది. మంత్రసిద్ధికి కొన్ని పరిస్థితులు అనుకూలించాలి. ఒకటి, మనకి మంత్రోపదేశమిచ్చే గురువు దాన్ని తాను స్వయంగా సాధన చేసి అందులో సిద్ధుడై ఉండాలి. ప్రతి మంత్రజపానికి కూర్చోవాల్సిన దిక్కు, జపవేళ, జపసంఖ్య, ఆహార విహార నియమాలు మొదలైనవి ఉన్నాయి. అవన్నీ తెలుసుకుని అనుష్ఠించాలి. విధివిధాన రహితంగా చేసే ఉపాసనలు బలిచక్రవర్తికి చెందుతాయి కనుక ఆచారాన్ని సంపూర్ణంగా పాటించాలి. మంత్రాల్ని తూర్పువైపుగా కూర్చుని జపించడం ఉత్తమోత్తమం. మంత్రాలలో ఎక్కువభాగం అగ్నితత్త్వం గలవి. మన శరీరాలు మాత్రం పృథివీ, జలతత్త్వాలతో కూడుకొన్నవి. కనుక మనలో కూడా అగ్నితత్త్వం మేల్కొని ఉన్నప్పుడు వాటిని జపిస్తే మంత్రం ఫలిస్తుంది. మనం ఏమీ తినకుండా ఉన్నప్పుడు మనలో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది కనుక అప్పుడు జపం చేసుకోవడం మంచిది. అంతకు ముందు తిన్నప్పటికీ కడుపు కాలుతూంటే అది ఉపవాసంతో సమానం కనుక ఆ సమయంలో కూడా జపం చేసుకోవచ్చు. తిన్నప్పుడు మనలో ఉన్న పృథివీ, జలతత్త్వాలు ఎక్కువవుతాయి కనుక నీళ్ళలో పడేసిన తుపాకుల్లా మంత్రాలు నిర్వీర్యమౌతాయి. నిరంతర జపం భగవన్నామానికే తప్ప ఉపదేశం పొందిన మంత్రాలకి వర్తించదు. మంత్రాల్ని ఒకచోట కదలకుండా కూర్చొని జపించాలి. ఎందుకంటే, "స్థిరే కాయే స్థిరం చిత్తం చలే కాయే చలం మనః" శరీరం నిశ్చలంగా ఉంటేనే మనస్సు నిశ్చలమౌతుంది. శరీరం కదిలిపోతూంటే మనస్సు కూడా కదిలిపోతూంటుంది. జపం చేసేటప్పుడు దేవుడి పటాల్ని ధ్యానించ నక్కఱలేదు. ఎందుకంటే మంత్రం స్వయంగా దేవుడు. అక్షరం పరబ్రహ్మ స్వరూపం కనుక ఆ మంత్రాక్షరాల మీద సావధానం పెట్టి జపిస్తే చాలు. బ్రాహ్మీ ముహూర్తంలో జపించడం శ్రేష్ఠం. వేదమంత్రాల్ని తెలుగుభాషలా పలక్కూడదు. ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అని మూడు రకాల ఉచ్చారణ భేదాలున్నాయి. ఆ ప్రకారమే వాటిని ఉచ్చరించాలి. మంత్రానుష్ఠానం వల్ల మేధాజననం జఱుగుతుంది. ఏ శాస్త్రంలోకైనా బుద్ధి పదునైన కత్తిలా దూసుకుపోతుంది. ఇతరులకి స్ఫురించని విషయాలు కూడా స్ఫురిస్తాయి. దాని ప్రభావం మూడు తరాల వఱకు ఉంటుంది. ప్రపంచానికి తండ్రి మాత్రమే కాదు, తల్లి కూడా ఉంది. ఆవిడనే ఈ మంత్రం ద్వారా ఉపాసించాలి.
మంత్రానుష్ఠానంతో పాటు పూజా, పారాయణా కూడా ప్రతిరోజూ చెయ్యాలి. ముఖ్యంగా ఇలవేల్పుని పూజించడం మానేస్తే మహాదోషం. దరిద్రాలు చుట్టుకుంటాయి. అందుచేత ముందు గణపతిని, ఆ తరువాత ఇలవేల్పుని, ఆ తరువాత సద్గురువునీ, ఆ తరువాత ఇష్టదైవాన్ని పూజించాలి. ఇలవేల్పుని గానీ, ఇష్టదైవాన్ని గానీ పూజించడం వల్ల మనకు సద్గురు దర్శనం కలుగుతుంది. సద్గురు అనుగ్రహం ఉంటే సకల దేవతా సాక్షాత్కారమూ కలుగుతుంది. గురువు స్వయంగా భగవంతుడు. తనని పూజించడం మానేసి కేవలం గురువుని మాత్రమే పూజించినా భగవంతుడు సంతోషిస్తాడు. కానీ గురునింద చేసి భగవంతుణ్ణి పూజిస్తే ఆయన ఆ పూజని తిరస్కరించడమే కాకుండా మనల్ని నరకంలోకి విసిరేస్తాడు. కనుక తల్లి, తండ్రి, గురువు, దైవం - ఇదే మన సంప్రదాయం. కానీ గురువు తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. అందుచేత నీకు బళ్ళో పాఠాలు చెప్పిన టీచర్లనీ, మాష్టార్లనీ పూజ చేసేటప్పుడు తల్చుకొని "సర్వేభ్యో గురుభ్యో నమోన్నమః" అనుకుంటూ నమస్కారం చెయ్యి. గురుభక్తి సర్వశక్తిమంతమైనది. ఏ శాస్త్రాలూ చదవనివాడికైనా కేవలం గురుభక్తి ఉంటే చాలు, అన్నీ కాలక్రమంలో వాటంతట అవే అర్థమవుతాయి. ఎక్కువ కష్టపడకుండానే అతని అవసరాలన్నీ తీఱతాయి. ప్రత్యేక కారణమేమీ లేకుండానే అతన్ని అందఱూ గౌరవించడం మొదలుపెడతారు. అతను చెప్పినది ఇతరులకి నమ్మ బుద్ధేస్తుంది. అతని తీర్పు కోసం జనం ఎదురుచూస్తారు.
మానవశరీరాన్ని నిలబెడుతున్నది వాయుశక్తి. ఎలాగైతే గాలి నింపుకున్న లారీటైర్లు టన్నుల కొద్దీ బరువుల్ని మోస్తాయో, ఎలాగైతే అలాంటి టైర్లతో లారీ అమితవేగంగా పరిగెత్తుతుందో, అలాగే మన బలానిక్కూడా కారణం వాయుదేవుడు. భోజనం చేసేముందు ఆయనకి మానసికంగా ప్రాణాహుతులిచ్చి వందనం చెయ్యాలి. గాయత్రీ మంత్రవిధానంగా భోజనం మీద ప్రోక్షించి "అమృతమస్తు, అమృతోపస్తరణమసి స్వాహా" అని విస్తరి చుట్టూ ఉదకం చల్లి కొంత లోపలికి తీసుకోవాలి. ఆ తరువాత మన ద్వారా మనలోని వాయుదేవుడే తింటున్నాడని భావిస్తూ ఆపోఽశనానంతరం "ఓమ్ ప్రాణాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓమ్ ఉదానాయ స్వాహా, ఓమ్ సమానాయ స్వాహా, ఓమ్ అపానాయ స్వాహా, ఓమ్ బ్రహ్మణే స్వాహా" అని ఒక్కొక్క మంత్రానికీ కొన్ని మెతుకుల చొప్పున నోట్లో వేసుకుని భోజనం ప్రారంభించాలి. ప్రాచీనకాలం నుంచి ఈ సంప్రదాయం వస్తున్నది. ఈ ప్రకారమే తిండి తినాలి. ఎవఱో ఒక అతిథి పక్కన లేకుండా భోజనం చెయ్యడం దోషం. కానీ ఎవఱూ దొఱకనప్పుడు భగవంతుడికి అర్పించి తింటే ఆ దోషం పోతుంది.
చిన్నవైనా, పెద్దవైనా, తప్పులకి మన సంప్రదాయంలో తఱచుగా క్షమాపణ లేదు. చేసిన తప్పులు దిద్దుబాట్లతోను, పశ్చాత్తాపాలతోను రద్దు కావు. తప్పులకీ, వాటి దిద్దుబాట్లకీ వేఱువేఱుగా ఫలితాలిస్తాడు భగవంతుడు. ఒకసారి తప్పు చేస్తే రెండోసారి చెయ్య బుద్ధేస్తుంది. రెండోసారి తప్పుచేస్తే మూడోసారి కూడా చెయ్య బుద్ధేస్తుంది. అలా జీవితమంతా తప్పుల తడికైపోతుంది. తప్పు చెయ్యడమే మన అపర స్వభావంగా మారుతుంది. జన్మజన్మలకీ అదే మన అపర సంస్కారంగా రూపు దాలుస్తుంది. మనం తప్పుచేస్తే సమాజం కూడా తప్పు చేస్తుంది. మనం చెడిపోతే సమాజం కూడా చెడిపోతుంది.
ఈ మహనీయమైన సంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎందఱో పెద్దల చేతులు మారి మన దాకా వచ్చింది కనుక నువ్వు చాలా అదృష్టవంతుడివి. అది అదృష్టమని గ్రహించి దాన్ని యథాశక్తి నిలబెట్టుకోరా !"
