4.7.09

నాస్తికత్వం మంచిది కాదు



స్తికత్వం ఒక ప్రమాదకరమైన ఆలోచనాధోరణి. అది మనల్ని సుదీర్ఘకాలానికి నరకంలోకి విసిరివేయగల మహత్తరమైన దుష్టశక్తి. చాలామంది భావిస్తున్నట్లు నాస్తికత్వానికీ, హేతువాదానికీ ఏ సంబంధమూ లేదు. ఎందుకంటే అది కూడా ఒక విశ్వాసమే. తత్సంబంధిత తర్కాలూ, హేతువాదాలూ, ఆ విశ్వాసాన్ని సమర్థించుకోవడం కోసం కనిపెట్టబడతాయి. విజ్ఞానశాస్త్రాలు ఇంతగా అభివృద్ధి చెందని ప్రాచీనకాలంలో - అంటే నాస్తికత్వం భౌతికశాస్త్రాల్ని ఆశ్రయించని కాలంలో కూడా నాస్తికులు ఉండేవారు. ఈనాటి భౌతికశాస్త్రాలు వారి వాదనల కోసం (దుర్) వినియోగపడుతూండడం కేవలం యాదృచ్చికం. భగవంతుడు మనకిచ్చిన సమున్నత మేధాశక్తి మఱియు అగాధమైన హృదయవైశాల్యమూ యావత్తు ఆయన్ని తెలుసుకోవడం కోసం ఇచ్చినదే. మనం దాన్తో ఆ పని కాకుండా తద్విరుద్ధమైన పనులు చేస్తే అది భవిష్యత్తులో నిర్మొహమాటంగా ఉపసంహరించబడుతుంది. తద్ద్వారా మనం బుద్ధిహీన శ్రేణికి చెందిన జీవుల ప్రపంచంలోకి ప్రవేశిస్తాం.

ఈ కాలంలో చాలామంది భావిస్తున్నట్లు భగవద్ విశ్వాసం పూర్తిగా మానవుడి విచక్షణకి వదిలిపెట్టబడినది కాదు. మానవుడు భగవంతుణ్ణి నమ్మాలి. లేదా పర్యవసానాలకి సిద్ధంగా ఉండాలి. సమాజసేవ, పరోపకారం లాంటి పిచ్చికబుర్లు, వెఱ్ఱిమొఱ్ఱి మాటలేవీ భగవద్ భక్తితో సమానం కావు. అవన్నీ భగవద్భక్తికి అంగభూతమైన సహాయకారులే తప్ప దాని తలదన్నే ప్రత్యామ్నాయాలు కావు. ఎంత నిజాయితీగా చేసినా అవన్నీ డొల్లే. ఎందుకంటే అందఱికీ ఉపకారం చెయ్యగలవాడు భగవంతుడొక్కడే. ఆయన సంకల్పం లేకుండా ఏదీ జఱగదు. "మనం చనిపోతే మన పిల్లలెలా బతుకుతారో" అనుకుంటాం. కానీ ప్రపంచంలో రోజూ చాలామంది చనిపోతూనే ఉన్నారు. వారి పిల్లలు ఆ మూడో రోజు నుంచి యథాప్రకారంగా బతుకుతూనే ఉన్నారు. ఎందుకంటే అందఱి సంగతీ చూసేవాడు ఆయనే. మానవులు ఆయన చేతిలో పనిముట్లు మాత్రమే. భగవద్ భావాన్ని విడిచిపెట్టి వాటిల్లోకి దిగితే మానవుడిలో తానొక పెద్ద పరోపకారి పాపన్నననే అహం ప్రకోపిస్తుంది. అతనిలో కీర్తికాంక్ష ప్రబలి అవతలివారి నుంచి నెనరులాశిస్తాడు. అవి లభించకపోతే భంగపడి, మానవజాతిని దూషించి, ద్వేషించి అంతిమంగా పాపాన్నే మూటగట్టుకుంటాడు. అంతే తప్ప ఆ కార్యక్రమాల ద్వారా అనుకున్నంత పుణ్యాన్ని పొందజాలడు. సమాజసేవ చేసేవాడికీ, భగవద్ భక్తుడికీ ఎంత తేడా ఉందంటే - సమాజసేవ చేసేవాడు ఇంటింటా పనిచేసి డబ్బులు అడుక్కునేవాడైతే భగవద్ భక్తుణ్ణి ప్రభుత్వోద్యోగిగా చెప్పుకోవచ్చు.

ఒక లండన్ సిటీబస్సుపై నాస్తికులు వ్రాసిన నినాదాలు :
దాగుడుమూతలాడే పిల్లలు "నేనిక్కడ లేను" అని అఱవడం లాంటి పిల్లచేష్టలివి.

అలాంటిదే తల్లిదండ్రుల్ని భగవత్ స్వరూపాలుగా భావించి సేవించడం కూడా ! అది అపార పుణ్యప్రదమే గానీ భగవద్ భక్తితో ఎంతమాత్రమూ సాటిరాదు. నవవిధ భక్తిమార్గాల్లో భగవంతుణ్ణి తల్లిగాను, తండ్రిగాను భావించడం కూడా ఒకటని చెప్పబడింది. అయితే ఇప్పుడు దీన్ని తిరగేసి ప్రచారం చెయ్యడం జరుగుతోంది. నిజానికి కర్మయోగం చెప్పిన ప్రకారం - కన్నబిడ్డల్ని కూడా భగవత్ స్వరూపాలుగా భావించడం కూడా ఒక మోక్షమార్గం. అది మాత్రం ప్రచారంలోకి రాలేదు. ఎందుకంటే చిన్నబిడ్డలు ప్రచారాలు చెయ్యలేరు గదా ! "మాతృదేవో భవ, పితృదేవో భవ" అని చెప్పినది సామాన్య మానవుల కోసం మాత్రమే. ఉత్కృష్టమైన భగవత్ ప్రేమ (పరాభక్తి) ఇంకా కలగనివాళ్ళకి, భగవద్ దర్శనం కానివాళ్ళకి దానివల్ల కొంత ప్రయోజనం. అయినవాళ్ళకీ, అవతార పురుషులకీ, కారణజన్ములకీ దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. అయితే వారు కూడా లోకానికి ఆదర్శంగా ఉండడం కోసం ఎప్పటిలాగే తల్లిదండ్రుల పట్ల భక్తిగా ఉంటారు. ప్రపంచంలో తమ పట్ల మనకున్న భక్తిశ్రద్ధల్ని, విధేయతనీ దుర్వినియోగం చేసేవారు హెచ్చు. కొందఱు తల్లిదండ్రులు ఇందుకు మినహాయింపు కాదు. అయితే వారి వ్యక్తిగత మంచిచెడులతో సంబంధం లేకుండా, వారు అధిష్ఠించిన పవిత్రమైన పితృపీఠం దృష్ట్యా వారిచ్చే దీవెనలకీ, శాపాలకి, శక్తి ఉంటుంది కనుక సామాన్య మానవులు అలాంటి దుష్ట తల్లిదండ్రుల పట్ల కూడా యథావిధిగా శ్రద్ధాభక్తుల్ని చూపడం అవసరం.

భర్తని భగవంతుడుగా భావించడం కూడా సామాన్యస్త్రీల కోసమే చెప్పబడింది. భగవంతుని యందు పరాభక్తి కలిగిన స్త్రీలకి అది ఆనుషంగికం. కానీ దైవభక్తి గల స్త్రీలు స్వతహాగా పతిభక్తి కూడా కలిగినవాళ్ళయి ఉంటారు. అది వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేపని లేదు. హెచ్చుశాతం మంది స్త్రీల విషయంలో పతిభక్తి పుణ్యప్రదమే కాక మోక్షప్రదం కూడా ! సామాన్యస్త్రీలు పతిభక్తి ద్వారా అసామాన్యురాళ్లుగా, గురువులుగా, అవధూతలుగా, దేవతలుగా అవతరిస్తారు. మన మైసమ్మ, పోచమ్మ, తలుపులమ్మ, సత్తెమ్మ, తిరుపతమ్మ మొదలైన వందలాదిమంది గ్రామదేవతలు మొదట్లో దేవతలు కారు. ఎక్కువమంది మనుషులే. ప్రాచీన పతివ్రతలే. వారంతా స్త్రీలే కావడం యాదృచ్ఛికం కాదు. కొంతమంది ప్రచారం చేస్తున్నట్లు దానికీ, మాతృస్వామ్య వ్యవస్థకీ ఏ సంబంధమూ లేదు. హిందూ సంప్రదాయంలో భర్త గురువు. భార్య శిష్యురాలు. గురుసేవ ద్వారా శిష్యుడు తానే భగవత్ స్వరూపంగా మారతాడు. పతిసేవ గురుసేవే. పతినింద గురునిందే. గురుశిష్య సంబంధం ఎట్టి పరిస్థితుల్లోను రద్దయ్యేది కాదు. అందువల్ల హిందూధర్మంలో విడాకుల్లేవు.

ఇంకొక పెనుతేడా ఉంది. మనుషులు తాము పొందిన మేలు చాలా తేలికగా మర్చిపోతారు. అలాంటివాళ్ళలో మీరూ, నేనూ, వాడూ, అందఱమూ ఉన్నాం. కానీ భగవంతుడికి భక్తుడు చేసిన సేవ, భజన, ఉపాసన ఆయనకి సదాకాలం గుర్తుంటాయి. ఆయన హాజరుపట్టిలో మన పేరు శాశ్వతంగా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మనుషులకి ఎంత చేసినా, వాళ్ళు దానికి విలువ కడతారే తప్ప విలువివ్వరు. అది వాళ్ళ తప్పు కాదు. జీవులుగా వాళ్ళ పరిధి అంతే ! ఇందులో ఉన్న రహస్యమేంటంటే మనం జీవులకి చేసే ఉపకారాన్ని తన విశ్వాంతరాళ మహామేధస్సుతో గుర్తు పెట్టుకునేవాడు కూడా భగవంతుడే, ఆ జీవులు కాదు. అన్ని జీవుల్లోను భగవంతుణ్ణి దర్శించి సేవ చెయ్యడం గట్రా చాలా పెద్దమాటలు. ఆ స్థితికి చేఱుకున్నవాళ్ళు మాత్రమే వాటి గుఱించి మాట్లాడితే బావుంటుంది. తక్కినవారంతా భగవంతుణ్ణి ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా ఉపాసిస్తే బావుంటుంది.

నాస్తికత్వంలో చాలా రకాలున్నాయి. వాటిని కేవలం అభిప్రాయ భేదాలుగా కొట్టిపారెయ్యడానికి వీల్లేదు. అవి వేసుకున్న రంగురంగుల ముసుగులతో నిమిత్తం లేకుండా అవన్నీ నాస్తికత్వాలే. కొంతమంది "దేవుణ్ణి నమ్ముతాం, కానీ పూజలూ పునస్కారాలూ చెయ్యం" అంటారు. మఱికొంతమంది "ఏదో శక్తి ఉందని నమ్ముతాం కానీ, గురువుల పట్ల, ప్రామాణిక గ్రంథాల పట్ల విశ్వాసం లే"దంటారు. మరికొందఱు "దేవుడున్నాడు గానీ ధర్మాధర్మాలేవీ లే"వంటారు. ఇవన్నీ మాఱువేషం దాల్చిన నాస్తికత్వాలేనని, అంతిమంగా మనిషితో దైవద్రోహం చేయించేవేననీ గ్రహించాలి. ఇంకొందఱు "మేము దేవుణ్ణి నిందించడం లేదు. అసలు దేవుడే లేడంటున్నాం. లేనివాణ్ణి నిందించే ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది ?" అని వాదిస్తారు. ఏ మేధాశక్తి అయితే తనని తెలుసుకోవడం కోసం దేవుడి చేత ప్రసాదించబడిందో ఆ మేధాశక్తితోనే ఆయన లేడనడం ఆయన్ని అశ్లీలంగా నిందించడమే అవుతుంది. ఆయన మనకోసం అనేకసార్లు భూమి మీద అవతరించాక కూడా, అనేకమంది ప్రవక్తల్ని తనగుఱించి తెలపడానికి పంపిన తర్వాత కూడా మనం నమ్మకపోవడం దైవద్రోహమే అవుతుంది. పాతికేళ్ళపాటు పెంచి పోషించిన కొడుకు "నాకు అమ్మా, నాన్నా ఎవరూ లేరు. ఇంత బువ్వ పెట్టండి" అని వీథుల్లో అడుక్కోవడాన్ని కళ్ళారా చూసిన లౌకిక తండ్రి ఎంత వ్యథకి లోనవుతాడో అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ వ్యథకి లోనవుతాడు మన నాస్తికత్వాన్ని చూసిన మన అసలైన తండ్రి.

దేవుడు సైతం కావాలని తపించే వస్తువు ప్రేమ. భగవంతుడి పట్ల హృదయపూర్వకమైన కృతజ్ఞత వహించడం మానవజాతికి శాశ్వతంగా విధాయకం. మతమేదైనా కావచ్చును గానీ ప్రతి మనిషికీ ఏదో ఒక విధమైన భగవద్ విశ్వాసం మాత్రం ఉండాలి. అది ఎంతటి ఆదిమ, అనాగరిక విశ్వాసమైనా ఫర్వాలేదు. మనం ఆయన్ని నమ్మడం మనకి విధాయకం. తానున్నానని అడుగడుగునా మనందఱినీ ఒప్పించడం భగవంతుడికి విధాయకం కాదు. ఆయనతో పోలిస్తే మనం చాలా అల్పులం. మనం తనని తెలుసుకున్నా తెలుసుకోక పోయినా ఆయనకి లాభనష్టాలేమీ లేవు. ఆయన పట్ల చొఱవ (initiative) ముందు మననుంచి ప్రారంభం కావాలి. ఆయన తనంత తానుగా చొఱవ తీసుకోవడం సకృత్తు(seldom). అయితే ఆయన అపార కరుణాసముద్రుడు కనుక మనం ఆయన వైపు ఒక అడుగు వేస్తే ఆయన తప్పకుండా మనవైపు పదడుగులు వేస్తాడు. ప్రపంచంలో ఉన్న మొత్తం జీవులతో పోలిస్తే ఆయన్ని నమ్మే జీవుల సంఖ్య కనీసం వందకోట్ల కొక్కఱు కూడా లేరు. మనం ఆయన్ని నమ్మకపోతే ఆ వందకోట్లలో మనల్ని కూడా జమకడతాడంతే. తానెంచుకున్న అతికొద్దిమంది పవిత్రులకి మాత్రమే ఆయన తన ఉనికిని వ్యక్తిగతంగా బహిర్గతం చేస్తాడు. వారు ఆయన ఆదేశం మీద ఆ విషయాన్ని లోకానికి ప్రకటిస్తారు. ఆ భగవద్ వృణీతులైన (God-chosen) పెద్దల్ని యథాతథంగా నమ్మి అనుసరించడమే మన కర్తవ్యం.

భగవంతుడు తన గుఱించి ప్రకటించడం కోసం తన ప్రతినిధుల్ని అన్ని ఖండాల్లోను, దేశాల్లోను నియమించి ఉన్నాడు. వారిని మనం నమ్మితేనే మంచిది. ఎందుకంటే వారి మాటలు భగవంతుని మాటలే. "మేం నమ్మం" అని మొండికేస్తే నష్టపోయేది వారు కాదు, మనమే. ఇంత చేసినా నమ్మనివాళ్ళకి, ఎంత చెప్పినా గ్రహించడం ఇష్టం లేనివాళ్ళకి, పైపెచ్చు చెప్పినవాళ్ళనే పరిహసించేవాళ్ళకి తగిన శరీరాల్ని - ఏ నమ్మకాలూ అవసరం లేని, ఏదీ గ్రహించ నవసరం లేని శరీరాల్ని ఆయన సిద్ధం చేసిపెడతాడు - వారి ఆశంసలకు అనుగుణంగానే ! ఎందుకంటే భగవంతుణ్ణి తెలుసుకోలేనివాళ్ళకి మానవశరీరం అవసరం లేదు. అవసరం తీఱిన ప్రతీది అంతరించడం ప్రకృతిసహజం.

అసలైన/ సమగ్ర మానవత్వం మతంతోనే మొదలవుతుంది, అది దైవత్వంలో పర్యవసిస్తుంది. మతాన్ని త్రోసిపుచ్చిన మానవతావాదం పునాదుల్లేని కట్టడం. సాంఘిక స్థాయిలో అది అతిత్వరలో పశుత్వానికి దారితీస్తుంది. ఎందుకంటే మనిషి ఏ నిబంధననీ కనిపెట్టజాలడు, అమలు పఱచనూ జాలడు. అతని మాట ఎవరూ వినరు. వాక్కుకొక శక్తి ఉంది. అది దేవుడి దగ్గఱే ఉంది. అది మనిషికి ఆయన ప్రసాదిస్తేనే వస్తుంది.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్