7.6.09
వ్యభిచారం చట్టబద్ధం = సంసారం చట్టవిరుద్ధం
11:23 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: సాంఘికం
ఈ టపా రాస్తానని నేననుకోలేదు. కానీ మర్యాదస్తులు మాట్లాడ్డానికి సంకోచించే ఒక విషయం (వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యడం) మీద జఱుగుతున్న ప్రచారాన్ని చూశాక రాయాలనిపించింది. అంతే తప్ప ఇది ఎవరికీ వ్యతిరేకంగా ఉద్దేశించినది కాదు.
వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యడం అంటే ఏంటో సమగ్రమైన నిర్వచనం లేకుండా ఇది రాయడం కూడా భావ్యం కాదు. అయితే నా అవగాహన మేఱకు - వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసిన ప్రాంతాల్లో వ్యభిచారిణులకి గుర్తింపుఱేకులిస్తారు. వారు వృత్తిలో ప్రవేశించడానికి వయో నిబంధనలు ఉంటాయి. మైనర్ బాలికల్ని వృత్తిలో ప్రవేశించనివ్వరు. వారి ఆదాయం మీద పన్నుంటుంది. వారు నివసించే ప్రాంతాల్ని రెడ్ లైట్ ఏరియాలనే పేరుతో సాధారణ పౌరుల ఆవాసప్రాంతాల కంటే వేఱుగా ఏర్పఱుస్తారు. అక్కడ లైంగిక సేవలు పొందేవారి పైన గానీ, అందించేవారి పైన గానీ అభియోగాలు మోపరు, వారిని శిక్షించరు. అదే విధంగా నియమాల్ని ఉల్లంఘించిన వృత్తికారిణుల్ని, విటుల్ని విచారించడానికి ప్రత్యేకమైన వెసులుబాట్లు ఉంటాయి. ఖచ్చితంగా ఇదే కాకపోయినా దాదాపు ఇలాంటి ఏర్పాట్లతోనే వ్యభిచారం మన ప్రాచీన సమాజంలో ప్రభుత్వామోదం (రాజామోదం) పొందిన వృత్తిగా గుర్తించబడింది. ఉదాహరణకి - విజయనగర సామ్రాజ్యంలో వ్యభిచారానికి అనుమతి ఉండేది. భోగస్త్రీలపై పన్ను కూడా ఉండేది. ఉదార హృదయలైన భోగస్త్రీలనుంచి దేవాలయాలు భారీమొత్తంలో చందాల్ని స్వీకరించేవి కూడా. అదే విధంగా మన దేశంలో అనేక చెఱువులు ఆనాటి భోగంవారిచేత త్రవ్వించబడినవే.
అయితే ఆ కాలం వేఱు. ఈ కాలం వేఱు. ఇప్పుడు వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించాలని చేస్తున్న వాదన వల్ల సమాజానికి మేలు జఱిగే అవకాశం పూజ్యం. కారణాలు చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఉన్న తేడా, జనాల లోకజ్ఞానస్థాయిలో ! ఈ కాలపు జనంలో పూర్వీకుల అమాయకత్వం లేదు. వీళ్ళ దగ్గఱ చాలా కాలుష్యం, కాపట్యం పోగుపడి ఉంది. వీళ్ళు మనం చెప్పినవాటిని తమ సంస్కారాని కనుగుణంగా మార్చుకొని తప్పుదోవ పట్టించి వాడుకునేవాళ్ళే తప్ప చెప్పిన దాంట్లో స్వారస్యాన్ని చెప్పినట్లుగా విని అర్థం చేసుకుని ఆచరించేటంత పరిశుద్ధ వర్తనులు కారు. ఏ ఉద్దేశంతో నైనా గానీ, ఈ సమాజంలో ఏ ప్రతిపాదన చెయ్యాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచించకపోతే చాలా కొంపలు మునుగుతాయి. ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. ముఖ్యంగా శృంగారం వంటి విషయాల్లో మేధావులు భావోద్వేగ వశాన ఏ మాత్రం నోరు జాఱినా జనం తమ వెధవ పనులకి దాన్నొక లైసెన్సుగా తీసుకొని చెలఱేగి పోతారు. అందుకు చలంగారి రచనలే ఒక ఉదాహరణ. ఆ తరువాతి కాలంలో "ఆ రాతలు నాకు బుద్ధిలేక రాశాను" అని ఆయన మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఇప్పటికీ వినిపించుకోవడం లేదు.
రెండోది - "వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే ప్రతివాడూ వ్యభిచార కొంపలకి వెళతాడని కాదు, వెళ్ళాలని కూడా కాదు. ఆ రంధి ఎక్కువగా ఉన్నవాడే వెళతా”డని, “దాని వల్ల సమాజంలో అక్రమసంబంధాలూ, వావి లేని వర్తనలూ, మానభంగాలూ తగ్గుముఖం పట్టుతాయ్"అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని అంశాల్ని గమనించాలి. ఇప్పుడు మనం బతుకుతున్న సమాజంలో - అంటే వ్యభిచారం ఒక నిషిద్ధ కార్యకలాపం అయిన సమాజంలో - వ్యభిచార కొంపలకి వెళ్ళేవాళ్ళూ, వెళ్ళనివాళ్ళూ అని రెండు రకాలుంటారు. కానీ ప్రతిపాదిత (భావి) సాంఘిక నమూనాలో మాత్రం అందఱూ అక్కడికి వెళ్లేవాళ్ళే - లేదా ఏదో ఒక సమయంలో వెళ్ళినవాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఈ ప్రతిపాదన చేస్తున్నవారు స్పష్టంగా తమ లక్ష్యాన్ని విశదీకరిస్తున్నారు. ఏమని ? ఎదిగిన మగపిల్లలకి పెళ్ళయ్యేలోపు కామోపశాంతి కలిగిస్తే వాళ్ళు ఇతరత్రా వ్యాపకాల జోలికి పోకుండా ఉంటారని. ఆ లెక్కన చూస్తే పెళ్ళయ్యేలోపు ప్రతివాడికీ కామోపశాంతి అవసరమే కనుక ప్రతివాడూ వెళ్ళాల్సిందే. కొన్నిసార్లు ఆసక్తి లేనివాళ్ళని కూడా బంధుమిత్రులే బలవంతాన "ఆ మజా ఒకసారి చూద్దువు గాని పద" అని తీసుకెళ్ళడం జఱుగుతుంది. గాంధీగారంతటివాణ్ణే అలా వ్యభిచార గృఃహానికి తీసుకెళ్ళారని చదివాం. ఇప్పుడు వెళ్ళనివాళ్ళలో సైతం గణనీయశాతం మంది దానిమీద సంఘంలో నిషేధం, లేదా చిన్నచూపు ఉండడం వల్లనే వెళ్ళడంలేదు. ఆ రెండూ పోతే, అందఱూ వెళ్ళడానికి మార్గం సుగమమౌతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ గర్భవతి ధైర్యంగా పుట్టింటికి వెళ్ళగలదు ? వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసిన దేశాల్లో కూడా మిగతా దేశాల్లో మాదిరే బూతుసైట్లకి గిరాకీ ఉంది. వావిడికం (incest), అత్యాచార నేరాలు కూడా యథాప్రకారంగా కొనసాగుతున్నాయి. అందఱి కామవాంఛలూ ఒకే రకంగా ఉండవని తెలుసుకుంటే ఇవెందుకు కొనసాగుతున్నాయో అర్థమవుతుంది. అంతేతప్ప ఈ రుగ్మతలకి వ్యభిచారాన్ని పరిష్కారంగా చూపించడం హాస్యాస్పదం.
మూడోది - అలా అన్ని మిలియన్లాది మందికి పెళ్ళికి ముందు కామోపశాంతి అవసరమైతే వారిని సంతుష్టి పఱచడానికి దేశానికి సుమారుగా ఎంతమంది వేశ్యలు అవసరమవుతారు ? నవ్వకూడదు. ఇది చాలా గంభీరమైన విషయం. ఎందుకంటే - సమాజంలో ఒక సూత్రాన్ని సార్వజనీనంగా అంగీకరించాక దాన్ని ఆచరణలో పెట్టడానికి కొన్ని మౌలిక సదుపాయాలు అవసరమౌతాయి. ఇక్కడ వేశ్యలే అలాంటి మౌలిక సదుపాయం. శృంగారంలో పాల్గోదగ్గ వయసులో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారో అందులో కనీసం రెండు-మూడు శాతం మంది అవసరం అవుతారనుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ లో అలాంటి మగవాళ్లు మూడు కోట్లమంది ఉంటే వారి అవసరాలు తీర్చడానికి కనీసం ఆఱు లక్షలమంది వేశ్యలు కావాలి. సగటున ఒక్కొక్క జిల్లాకి ఇఱవైరెండు వేలమందైనా కావాలి. కానీ ఇప్పుడు అంత సరఫరా లేదు. దానర్థం - ఇంకా చాలామంది ఆడవాళ్ళని ఆ వృత్తిలోకి లాగాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఎవరు లాగుతారు ? వంశ పారంపరికురాళ్ళని మినహాయిస్తే సాధారణంగా ఏ వేశ్య అయినా ముందు సంసారుల కుటుంబాల్లోంచే వస్తుంది. కనుక మనం పైన అనుకున్న సంఖ్యా బలాన్ని చేఱుకోవాలంటే ఎంతమంది సంసారుల్ని వ్యభిచారులుగా మార్చాల్సి ఉంటుంది ? తన ఆదాయం కోసం ప్రభుత్వం మారుస్తుందా ? ప్రైవేటువాళ్ళు మారుస్తారా ? అసలు అలా మారడానికెవరు సిద్ధంగా ఉన్నారు ? సిద్ధంగా లేనివాళ్ళని కూడా బలవంతంగా మార్చే ప్రయత్నాలు జఱుగుతాయా?
నాలుగోది - మానవ నాగరికతా పరిణామాన్ని మనం పరిశీలించినప్పుడు - కొసర్లలాగా వచ్చినవన్నీ అసళ్ళై కూర్చోవడాన్ని గమనించవచ్చు. పెళ్ళాం లేని స్థితిలో ఆశ్రయించబడ్డ వేశ్య చివరికి పెళ్ళాం అవసరాన్నే త్రోసిరాజనేటంత స్థాయిలో మగవాడికి ముఖ్యమైపోతే ? ఆడవాళ్ళకి మొగుళ్ళే దొఱకని పరిస్థితి తలెత్తి వాళ్లు కూడా మగవాళ్ళ లాగానే దారి తప్పడానికి నిశ్చయించుకుంటే ? ఆ పరిణామాన్ని క్రమ్మఱించడం (roll back) అసాధ్యమై కూర్చుంటుంది. దానికెవరు బాధ్యులు ? ఆ స్థాయికి సమాజం వెళ్లదని చెప్పడానికి త్రాగుడుని ఉదాహరణగా చెబుతున్నారు. "ఎన్ని బార్లు, బెల్టు షాపులూ ఉన్నా వెళ్ళేవాడే వెళుతున్నాడు గానీ అందఱూ వెళ్ళట్లేదు" అని ! అదే నిజమైతే, బ్రిటీషు పాలనలో కూడా లేని విధంగా వీథివీథికీ బార్లు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది ? అదే నిజమైతే, మన రాష్ట్రంలో ఏడాదికి పదివేల కోట్లకి మించి మద్యం అమ్మకాలెందుకు జఱుగుతున్నాయి ? ఈ రాష్ట్రంలో మద్యపాన వ్యతిరేకోద్యమాలు ప్రభుత్వాల్ని కూలదోసేటంత స్థాయిలో ఎందుకు లేచాయి ? గత కొద్దికాలంగా మన ప్రజల్లో ఎన్నడూ లేనంతగా కాలేయపు జబ్బులూ, మూత్రపిండాల సమస్యలూ ఎందుకు విజృంభించాయి ? ప్రభుత్వామోదం అనేది కొన్ని వ్యాపారాల దశనీ, దిశనీ సమూలంగా మార్చేస్తుంది.
అయిదోది - ఈ ప్రతిపాదన అమలైతే అది మన సంసారపక్ష ఆడవాళ్ళలో కలిగించే మనోవికృతి ఎలాంటిదై ఉంటుంది ? ప్రతి మగవాడూ పెళ్ళికి ముందు తప్పనిసరిగా వేశ్యానుభవాల్ని పొందుతున్నాడనే ప్రచారం పెళ్ళికాని ఆడపిల్లల్లో ఎలాంటి అసహ్యాన్ని, జుగుప్సనీ, వాంతినీ కలిగిస్తుంది ? ఆ అనుభవాలు పొందుతున్నది కేవలం ఒక పది-పాతిక శాతం మంది మాత్రమే అయినా ? అలా ఆడపిల్లలు ఏకమొత్తంగా పెళ్ళీ-పెటాకులూ మానేసే సంభావ్యత హెచ్చు. సమానత్వ సిద్ధాంతాలు ముదురుతున్న ఈ కాలంలో కొంతమంది ఆడవాళ్ళు దాన్ని తప్పు పట్టకపోయినా, అలా వ్యభిచరించడానికి తమకూ హక్కుండాలని కోరతారు. కొంతమంది ఇప్పటికే ఆ హక్కుని వినియోగించుకుంటున్నారు కూడా ! ఇప్పుడు హైదరాబాదు వంటి నగరాల్లో మగవేశ్యలు కూడా లభ్యమవుతున్నారు. ముందుగా మాట్లాడుకున్న రేటుకి కొందఱు ధనికస్త్రీలు వారిని ఇంటికి పిలిపించుకుంటారు. అలా ఆడవేశ్యలకి గిరాకీ హెచ్చేకొద్దీ మగవేశ్యలక్కూడా గిరాకీ హెచ్చుతుంది. ఏతావతా సమాజంలో ఎల్లెడలా వ్యభిచారాలే తప్ప, సంసారాలు నల్లపూసలై పోయే ప్రమాదం ఉంది.
ఆఱోది - “జీవితంలో స్థిరపడ్డ మగవాడు వివాహం చేసుకొని అవసరాలు గడుపుకుంటాడు. అలా స్థిరపడని మగవాడు అందాకా ఏం చెయ్యాలి ?” అంటున్నారు. "స్థిరపడనివాడు వ్యభిచరించాలంటే డబ్బు ఎక్కణ్ణుంచి వస్తుంది ? ఎవరివ్వాలి ?" అని అడుగుతున్నాను. వేశ్యలు ఉచితంగా ఒళ్ళప్పగించరని అందఱికీ ఎఱుకే. ఇలా పైకి రావాల్సిన వయసులో వ్యభిచారుల దగ్గఱికి వెళ్ళడం అలవాటు చేసుకొన్నవాడు మాదకద్రవ్యాల బానిసలా అందుకోసం పిచ్చెక్కిపోయే అవకాశం లేకపోలేదు. ఆ డబ్బు కోసం అతను నేరాలకి పాల్పడే సంభావ్యతా లేకపోలేదు.
ఏడోది - జీవితంలో స్థిరపడని నవయువకుల కామోపశాంతిని ఒక హక్కుగా గుర్తిస్తే అది వారి తలిదండ్రులకి తెచ్చిపెట్టే వైవిధ్య భరితమైన తలనొప్పులు ఎలా ఉంటాయి ? అది పిల్లల హక్కుల్లో ఒకటిగా పరిగణితమై, క్రమంగా తల్లిదండ్రుల హక్కుల్ని హరించదు గదా ?
ఎనిమిదోది - ప్రాచీన సమాజంలో వ్యభిచారం రాజామోదం గల వృత్తి అయినప్పటికీ మతధర్మశాస్త్రాల్లో దాన్ని ఆమోదించలేదు. " చేప అన్నింటినీ తింటుంది కనుక చేపల్ని తినేవాడు సర్వభక్షకుడు" అంటాడు మనువు! అలాగే అన్నిరకాల అపరిశుద్ధులతోను కలిసే వేశ్యతో కలిసేవాడు అంతకంటే ఘోరాతిఘోరమైన అపరిశుద్ధుడు, పరమ భ్రష్టుడు, పంచమహా పాతకుడు. ఆమే, ఆమె విటులూ చేసే యావత్ పాపరాశిలోను అతనికి తనదంటూ ఒక వాటా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకే వేశ్య దగ్గఱికి మిస్టర్ ఎక్స్ వెళతాడు. ఎక్స్ తమ్ముడు వెళతాడు. అతని బావమఱిది వెళతాడు. అతని తండ్రి వెళతాడు. అతని కొడుకు కూడా వెళతాడు. "ఎప్పటికీ వెళ్ళరు" అని మీరంత ఖచ్చితంగా బల్లగుద్ది నొక్కి వక్కాణించజాలరు. "నేను ఫలానా వేశ్య దగ్గఱికి వెళుతున్నాను. ఆమెకి నువ్వు పాత కస్టమర్ వి కాదు గదా ?" అని గానీ, లేదా "నేను వెళుతున్న వేశ్య దగ్గఱికి నువ్వెళ్ళకు, ఆమె నీకు తల్లివంటిది సుమా !" అని మాట్లాడుకుని గానీ వ్యభిచరించేవాడెవడూ లేడు. ఈ అసహ్యమంతా మనిషికి అవసరమా ? వ్యభిచారానికి ఆమోదముద్ర పేరుతో ఈ ముఱికిని యావత్తు సమాజమూ ఒళ్ళంతా పులుముకోవాల్సిందేనా ?
ఆలోచించండి.
(గమనిక :- ఈ వ్యాసపు సందర్భాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. ఇది స్వచ్ఛందసంస్థల ప్రయత్నాలకి ప్రతిస్పందనగా వ్రాసినది కాదు. వేశ్యల బాధలతో నిమిత్తం లేకుండా, యువకులందఱికీ వేశ్యానుభవాలు పొందే అవకాశం ఉండాలని వాదిస్తున్న కొందరు మేధావుల వాదనకి ప్రతిచర్యగా వ్రాసినదే. ఈ వ్యాసకర్తకి వేశ్యల ఇబ్బందుల పట్ల సానుభూతి లేదని తలంచడం సరికాదు)
