
ప్రస్తుతం మానవాళి కుత్తుక మీద ఒక కత్తి వేళ్ళాడుతోంది. భూతాపం (global warming) ఇంకొక్క భాగ (డిగ్రీ) పెఱిగినా చాలు, కొంపలు మునిగే/ కొంపలంటుకునే పరిస్థితి గోచరిస్తోంది. నిఱుడు పర్వతాల మీద హిమానీ నదాలు (glaciers) మునుపటంత భారీగా ఏర్పడలేదని వార్తలొచ్చాయి. అవి ఏర్పడకపోతే వాటి ఆధారంగా ప్రవహించే హిమనదులు ఎండిపోతాయి. అటువంటి నదుల్లో గంగానది కూడా ఉంది. ఎందుకంటే కృష్ణ, గోదావరి, నర్మద మొదలైన ద్వీపకల్ప నదుల (peninsular rivers) మాదిరి హిమనదులు వర్షాల ఆధారంగా పారేవి కావు. అవి ఏడాది పొడవునా ఒకే ఉఱవడితో ప్రవహించగల్గడానికి హిమానీనదాలే కారణం. పర్వతాలపై మంచుకట్టి, కఱిగి నదులుగా ప్రవహించకపోతే ఉన్న నదీజలాలు కాస్తా సముద్రంలోకి పయనించి ఖాళీ అయిపోతాయి. కొత్తగా జలాలు రావు.
ఈ భూతాప పరిణామానికి ఎక్కడో ఒకచోట అత్యవసరంగా అడ్డుకట్ట పడకపోతే, ఆ విధంగా మన భయాలే నిజమైతే, మనకి తెలిసిన గంగా యమునా నదులు పూర్తిగా అదృశ్యమైపోతాయి. అది వచ్చే సంవత్సరమే కావచ్చు, ఆ పై సంవత్సరం కావచ్చు, అయిదేళ్ళకి కావచ్చు, పదేళ్ళకి కావచ్చు. అవి ఎండిపోవడమైతే ఖాయం. కానీ ’ఎప్పుడు ?” అనేదే ఖచ్చితంగా చెప్పలేక పోతున్నాం. మొత్తం మీద మన కళ్ళముందే అది జఱగబోతోందనిపిస్తోంది. "ఈ పరిణామం శాశ్వతమా ? తాత్కాలికమా ?" అనడిగితే, శాశ్వతమనీ, అనివర్తనీయం (irreversible)అనీ అనిపిస్తోంది. కారణం - భవిష్యత్తులో ఈ భూతాప దశ గడిచిపోయాక భూశీత దశ (Global cooling) ప్రారంభమౌతుంది.
అదీగాక ఉత్తరధ్రువం (north pole) మఱిన్ని భాగలు (డిగ్రీలు) ఉత్తరానికి వాలే అవకాశం ఉంది. ఇప్పుడు చలిదేశాలుగా పిలవబడుతున్నవి అప్పుడు ఆర్కిటిక్ ఉన్న స్థానంలోకి వస్తాయి. అంటే అవన్నీ శాశ్వతంగా గడ్డకట్టుకుని నిర్మానుష్యమై పోతాయి. అటువంటప్పుడు భారతదేశంలాంటి వేడి దేశాలు చలిదేశాలవుతాయి. అందుచేత హిమానీనదాలు మళ్ళీ ఏర్పడినా అలాగే పర్వతాల మీద ఉంటాయి తప్ప కఱిగి ఇదివఱకటిలా నదులుగా ప్రవహించే అవకాశాలు తక్కువ. ఒకవేళ ప్రవహించినా అది బహుశా మూణ్ణాలుగు నెలలకి పరిమితం కావచ్చు. ఎండిపోయిన నదుల్ని చూడ్డం బాధాకరంగా ఉంటుంది. నేనటువంటివి చూశాను. నదీగర్భాలు (river beds) నదీతీరం కంటే వందలాది అడుగుల లోతులో ఉంటాయి. అంటే పది నుంచి ముప్ఫై అంతస్తుల భవనాన్ని వాటిల్లో దిగెయ్యవచ్చు. గంగానది ఎండిపోతే ఒకనాటి ఐతిహాసిక జలరాశి స్థానంలో అటువంటి గుంటలూ, గోతులూ, ఇసకా, గడ్డీగాదం దర్శనమిస్తాయి. అవి మూడు నుంచి అయిదు కిలోమీటర్ల వెడల్పు ఉండొచ్చు. కాలక్రమంలో ఆ నది స్థానంలో ఒక చిట్టడవి పెఱగొచ్చు కూడా. ఒకప్పుడా నది మీద ఆధారపడి జీవించిన తీరప్రాంత జిల్లాలన్నీ ఖాళీ అయిపోయి అక్కడొక శాశ్వత శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తుంది.
గంగా, యమునా నదుల మీద ఆధారపడి సుమారు నలభైకోట్ల జనాభా జీవిస్తోందని చెబుతున్నారు. వాటిల్లో గంగానది కనీసం అయిదాఱు జనాభాయుత రాష్ట్రాల/ దేశాల గుండా ప్రవహిస్తోంది కనుక ఈ లెక్క సరైనదే కావచ్చు. వాటిల్లో ఆంధ్రప్రదేశ్ కంటే భౌగోళికంగా చిన్నదైన ఉత్తరప్రదేశ్ ఒక్కదాని జనాభానే పద్ధెనిమిది కోట్లుంది. బీహార్ ఆఱున్నఱ కోట్లుంది. ఆ నదులు ఎండిపోతే అన్ని కోట్లమందీ కలిసి ఒకేసారి ఎక్కడికి వెళ్ళాలి ? ఏం పండించుకోవాలి ? ఏం తినాలి ? ఏం తాగాలి ? వేలాది సంవత్సరాలుగా ఆ నదుల మీదనే నూటికి నూఱుశాతం ఆధారపడి నిర్మించుకున్న నాగరికత, సంస్కృతి, వ్యవస్థలు ఏమైపోతాయి ? హిందీ విషయమే తీసుకుంటే అది పూర్తిగా గంగానది మీదనే ఆధారపడి విస్తరించిన భాష. గంగామైదాన ప్రాంతాల సాటిలేని సారవంతత్వం మూలాన అక్కడ ఒకప్పుడు విపరీతంగా, అనూహ్యంగా జనాభా పెఱిగింది. రెండున్నఱవేల కిలోమీటర్ల దూరం ప్రవహించే గంగానది మీదుగా జలమార్గంలో ఆయా భూభాగాల్లోకి వలసపోవడం, చొచ్చుకుపోవడం హిందీవాళ్ళకి సాధ్యమైంది. అలా అది జాతీయభాషగా ప్రకటించబడే స్థాయికి ఎదిగింది. గంగానది ఎండిపోయి, హిందీవాళ్ళు వలసపోతే ఇదంతా తారుమారవుతుంది. అంత రాక్షస జనాభా గలవాళ్ళని ఏ రాష్ట్రంవాళ్ళు/ ఏ దేశంవాళ్ళు భరించగలరు ? ఎందుకంటే మిగతా భారతీయ రాష్ట్రాల్లో జనాభా తక్కువేమీ కాదు గదా ! ఎవరి కఱువు - కాటకాలూ, ఈతిబాధలూ వారికున్నాయి. నిజానికి మిగతావారు తమకున్న రాష్ట్రజనాభాకే అన్నీ సమకూర్చలేక సతమతమవుతున్నారు. కాలక్రమంలో భూతాపం పెఱిగే కొద్దీ మిగతా రాష్ట్రాల్లో కూడా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హిందీవాళ్ళని ఎవరు భరిస్తారు ? అదీగాక దురదృష్టవశాత్తు వారికి దేశంలో అంత చెప్పుకోదగ్గ మంచిపేరు కూడా ఏమీ లేదాయె. వారి మానవ వనరుల నాణ్యత మిక్కిలి అధమస్థాయికి చెందినది. అత్యధిక శాతం మంది నిరక్షరాస్యులు. ముఖ్యంగా - క్రమశిక్షణ విషయంలో మనమే అనుకుంటే, వారు మన తాతల్లాంటివారు. ఆ రాష్ట్రాల్లో నేరప్రవృత్తి సైతం మనకంటే హెచ్చు. వారికి తక్కువ సంఖ్యలో పిల్లల్ని కనే అలవాటు లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యే. అంతకంటే ప్రధానంగా - స్థానికంగా ఎవరి సాంస్కృతిక ఆధిక్యాన్ని కాపాడుకోవాలని వారికుంటుంది. బయటివారు ఒకేసారి కోట్లాదిగా వలసొచ్చేసి వారి జనాభాతో తమ రాష్ట్రాన్ని ముంచెత్తుతామంటే తమ భాష, సంస్కృతి ఏమైపోతాయోనని అస్సామీ ప్రజల్లాగానే భయపడ్డం ఎవరికైనా సహజం.
సుమారు రెండు దశాబ్దాల క్రితం నేనొక సమాచారం విన్నాను. ఉత్తరప్రదేశ్ భూభాగం కింద సుమారు ఆ రాష్ట్ర వైశాల్యానికి సమానమైన విస్తీర్ణంలో ఒక భూగర్భ సరస్సుని శాస్త్రవేత్తలు కనుగొన్నారట. ఆ తరువాత ఏం జఱిగిందో, ఏం చేశారో తెలియలేదు. గంగానది ఉనికికి ముప్పేర్పడనున్న ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజల అవసరాల దృష్ట్యా అటువంటి సరస్సుకి చాలా ప్రాధాన్యముంది. ఆ ప్రయత్నాలెవరైనా సత్వరమే మొదలుపెడితే బావుంటుంది.
మఱోపక్క, గంగానది ఎండిపోతే మనకి తెలిసిన రాజ్యాంగ వ్యవస్థలు కూడా నిలబడతాయనే నమ్మకం లేదు. బయటివారు తమ దగ్గఱికి భారీగా వలస రావడాన్ని స్థానికులు భరించలేక తిరగబడొచ్చు. ఇదంతా దేనికి దారితీయగలదో వేఱే చెప్పనక్కఱలేదు.
