1.6.09

తీతువా ! మా ప్రాణముల్ తీతువా ?



తీతువుపిట్ట (Francoline Partridge - Hydrophasianus chirurgus) అని ఒకటుంది. అది ఏ యింట్లోకొచ్చి కూస్తే ఆ యింట్లోవాళ్ళొకరు పోతారని నమ్మకం. ఆ విధంగా వాటివల్ల చాలా ప్రమాదం ఉందనుకున్నాడేమో దేవుడు, అవిప్పుడు బాగా తగ్గిపోయాయి.”అవి లేని కొఱత తీర్చడానికా’ అన్నట్లు మనుషుల్లోనే చాలామంది బయల్దేఱారు ఈమధ్య. వీళ్ళు కూడా తీతువులే. ఎందుకంటే వీళ్ళు "సర్వాతీతువులు". లేదా వీళ్ళు తమని తాము అలా భావించుకుంటారు, సంభావించుకుంటారు కూడా.

బ్రిటిష్ ఇండియాలో ప్రకృతిసహజమైన తీతువుపిట్టలే తప్ప ఈ మానవ కల్పిత "సర్వాతీతువు" పిట్టలేవీ ఉండేవి కావు. ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్లోనే కాదు, తమలో కూడా ఇలాంటివి ఉండడానికి ససేమిరా అనుమతించేవారు కారు. ఈ రకం పిట్టలన్నీ స్వాతంత్ర్యం వచ్చినాక పుట్టుకొచ్చాయి. అసలు ఆ స్వాతంత్ర్యం వచ్చింది మనక్కాదు, సర్వాతీతువులకే అంటే సరిపోతుంది. మొదట్లో ఒకటో, రెండో ఉన్న సర్వాతీతువు పిట్టలు కాస్తా ఇప్పుడు లక్షల సంఖ్యలో తయారై ఎక్కడ పడితే అక్కడ, కిందా, మీదా, పైనా, పక్కనా వాల్తూ, నోటికొచ్చినట్లు తత్తరబిత్తరగా కూస్తూ కసితీఱా మన అంతు చూస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే, సర్వాతీతువుల నుంచి తప్పించుకోవాలంటే దేశం వదిలి పారిపోవడం తప్ప మార్గాంతరం లేదు. ఎందుకంటే ప్రసార మాధ్యమాలు (media) కూడా వాళ్ళకే మద్దతు. "మళ్ళీ అదెందుకయ్యా ?" అంటే వాళ్ళు కూడా ఈ తరహా సర్వాతీతువు పిట్టలే గనుకను, విధ్వంసక పనులు చెయ్యడానికి, చేసి తప్పించుకోవడానికి, తమ జాతి పిట్టలకి రాజ్యాంగం ప్రసాదించిన జన్మహక్కుల్ని కాపాడ్డమూ, వాటికి వత్తాసు పలకడమూ తమకి విధాయకం గనుకను.. ఇంకా ఎవరెవరున్నారయ్యా సర్వాతీతువుల్లో ? అంటే ఆ జాబితా సుదీర్ఘమైనది. కులనాయకులూ, మతనాయకులూ, పాత్రికేయులు, సినిమావాళ్ళు,, సైనికులూ, న్యాయవాదులూ, మహిళాసంఘాలూ.....!

సర్వాతీతువుల జాబితా మాదిరే వాళ్ళ ప్రత్యేకతల జాబితా కూడా పెద్దదే. వాళ్ళు చట్టానికి, ధర్మానికీ, సాంఘికమైన మట్టుమర్యాదలకీ, ఇంగిత జ్ఞానానికీ, వ్యక్తిగత హుందాతనానికీ, శాంతిభద్రతలకీ అతీతులు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. మనమేమీ అనకూడదు. వాళ్ళు ఏమైనా రాస్తారు. మనం "తప్పు అనకూడదు". వాళ్ళు మన పడగ్గదిలోకి దూరి మన సంసారాన్ని సకలకోణాల్లోంచి పంచరంగుల్లో చిత్రీకరిస్తామంటారు. మనం అభ్యంతరపెడితే వాళ్ళ పత్రికాస్వేచ్ఛకి భంగం. వాళ్ళు వీథుల్లోకొచ్చి జనజీవితాన్ని స్తంభింపజేస్తారు. మనం మౌనప్రేక్షకుల్లా చూస్తూండిపోవాలే తప్ప నోరెత్తకూడదు. వాళ్ళ పబ్లిక్-ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తారు. మనం దాన్ని మార్క్సిజమ్ గా భావించి సంతోషించాలే తప్ప "నా ఆస్తి నాయనోయ్, నా వస్తువులు బాబోయ్, నా పరువుప్రతిష్ఠలు దేవుడోయ్" అంటూ ఫ్యూడల్, పెట్టుబడిదారీ, బూర్జువా పురుషాహంకార అఱుపులు అఱవకూడదు. మనం పొఱపాట్న సర్వాతీతువులకి ఎదురు మాట్లాడితే ప్రభుత్వం గానీ, న్యాయస్థానాలు గానీ, భటవర్గం గానీ మనల్ని రక్షించడానికి ఎట్టి పరిస్థితుల్లోను ముందుకు రావు. పైపెచ్చు మనల్నే ఎదురు- హింసించే సంభావ్యత కూడా ఉంది.

నొప్పెడుతూంటే "అమ్మా, అబ్బా" అని అఱవడానిక్కూడా అవకాశం లేకుండా ప్రజల నోరు నొక్కేసి, గుడ్డలు కుక్కిన ఈ ప్రభుత్వం లాంటివి, ఈ చట్టాల్లాంటివి, ఈ స్పెషల్ ప్రివిలేజిల వ్యవస్థ లాంటివి ప్రపంచంలోనే నభూతో న భవిష్యతి. బ్రిటీష్ ప్రజాస్వామ్యం పేరు పెట్టుకొని సర్వేసర్వత్రా అంతా భారతీయ సర్వాతీతువుల దేశీ క్రౌర్యం, దేశీ నిరంకుశత్వం, దేశీ అమానుషత్వం. "ఇదేంటయ్యా ! సమానత్వ మంటున్నారొకపక్క ? కొంతమందికి మఱీ ఎక్కువ హక్కులున్నాయి ?" అని అడిగితే ఏదో సంబంధం లేని ఆకాశపురాణం వల్లిస్తారు తప్ప మన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పరు, మన బాధ తీర్చరు, మన సమస్య పరిష్కరించరు. మనం అహింసాత్మకంగా, శాంతియుతంగా ఒక సమస్య మీద న్యాయస్థానంలో మర్యాదగా ఫిర్యాదు చేసుకుని చట్టపరమైన ఉపశమనం (legal redress) పొందడానికి అనువైన అన్ని బహిరంగ మార్గాల్నీ గత అయిదేళ్ళుగా ఒక్కొక్కటీ మూసేసుకుంటూ వెళుతున్నారు. ఉత్తుత్తి సమాచారహక్కు చట్టం మాత్రం ఒకటి తెచ్చారు. దురదృష్టమేంటంటే ఈ సంగతి ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్ళు చాప కింద నీరులా దేశాన్ని ఆక్రమిస్తూంటే మన పూర్వీకులు ఎలాగైతే గమనించలేదో, ఎలాగైతే అంతా అయిపోయాక మేల్కొన్నారో, ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం.

ఈ సంవత్సరం (౨౦౦౯) ఫిబ్రవరి నెలలో మద్రాస్ హైకోర్ట్ ఆవరణలో జఱిగిన హింసాయుత ఘటనల గుఱించి అందఱూ వినే ఉంటారు. ఎల్.టి.టి.ఇ. మీద జనతాదళ్ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వెలిబుచ్చిన ప్రతికూల అభిప్రాయాలకు నిరసనగా అక్కడి న్యాయవాదులు కొందఱు తమ న్యాయమూర్తుల సమక్షంలోనే ఆయన్ని కులపరంగా దూషిస్తూ దాడిచేశారు. ఆ న్యాయవాదులు అధికారపక్షమైన డి.ఎమ్.కె.కి అనుబంధస్థులు. వారిని వెంటనే నిర్బంధించి వారిపై విచారణకి న్యాయస్థానం ఆదేశించింది. అందుకు నిరసనగా న్యాయవాదులంతా మర్నాడు న్యాయస్థాన ఆవరణలో ఆందోళనకి దిగారు. న్యాయస్థాన ఆవరణలో ఉన్న పోలీస్ స్టేషన్ కి నిప్పంటించారు. ఆ విధంగా అరాచక చర్యలు హద్దు మీఱడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. అనుకోకుండా అది కొంచెం శ్రుతిమించింది. తత్ఫలితంగా గాయాలతో చాలామంది వకీళ్ళు ఆస్పత్రి పాలయ్యారు. ఈ దేశంలో ఏం జఱిగినా అది ఆఘమేఘాల మీద కులం రంగు పులుముకోవడం చాలా మామూలు. తమిళనాడులో నైతే మఱీను. రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఒక ప్రత్యేక కులం చేతిలో కీలుబొమ్మగా మారిందనీ, వారు తమపై ఎప్పట్నుంచో కక్ష గట్టి ఉన్నారనీ, ఈరోజు అవకాశం దొఱికింది గదా అని తమని విచక్షణా రహితంగా పోలీసుల చేత చావగొట్టించి పగ తీర్చుకున్నారనీ డి.ఎమ్.కె. న్యాయవాదులు ఆరోపించారు.

అసలు విషయాన్ని ఆచ్ఛాదించి జనాన్ని పక్కదోవ పట్టించడానికి మాత్రమే ఉపయోగపడే ఇలాంటి ఆరోపణల మీద కాసేపు శీతకన్నేసి పరిశీలించిన పక్షంలో - అక్కడ జఱిగిన ఘర్షణ, తమని తాము చట్టానికి, జవాబ్దారీతనానికీ సర్వాతీతులుగా భావించుకుంటున్న రెండు వ్యవస్థల మధ్య జఱిగిందని తేల్తుంది. పోలీసులేమో తమని తాము సర్వాతీతులుగా భావించుకుంటున్నారు. న్యాయవాదులూ అలాగే భావించుకుంటున్నారు. ఒకరి సర్వాతీతత్వాన్ని ఇంకొకరు సవాల్ చెయ్యడం దగ్గఱ మొదలయింది గొడవ. తామెవరూ సర్వాతీతులు కారనీ, అందఱమూ చట్టానికి జవాబ్దారీయేననీ ఒప్పుకోకుండా తమకే అనుకూలంగా వ్యవహరించాలని కోరుతూ ఇరుపక్షాలవారూ న్యాయమూర్తుల్ని ఇఱకాటంలో పెట్టారు.
సరిగ్గా అదే నెలలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) కార్యకర్తలు కూడా రాష్ట్ర ఎస్సీ కోటాని వెనువెంటనే వర్గీకరించాలని డిమాండు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభా భవనం మీదికెక్కి సంచలనం సృష్టించారు. ఎంత న్యాయబద్ధమైన డిమాండ్ అయినప్పటికీ తీవ్రమైన భద్రతా సమస్యలకి హేతువై మనం ఎన్నుకున్న శాసనసభ్యుల ప్రాణాల్నే ప్రమాదంలోకి నెట్టివేయగల ఇటువంటి చర్యలు హర్షణీయం కాదు. ఎందుకంటే వారి బాటలోనే మఱొకరు అలా అక్రమంగా చట్టసభల ప్రాంగణాల్లోకి చొఱబడరనే భరోసా లేదు. వీటికి పాల్పడుతున్నవారు ఎస్సీలుగా తమకున్న రాజ్యాంగ రక్షణని దుర్వినియోగం చేస్తున్నారని మొహమాటం లేకుండా చెప్పక తప్పదు. కానీ వారి దృష్టిలో తాము చేసింది న్యాయమే, సమర్థనీయమే. ఎందుకంటే ఎస్సీలుగా తాము సర్వాతీతులు. తమనెవరూ ఏమీ అనకూడదు. అయితే మన సమాజంలో అసంతృప్తితో రగిలిపోతున్నది మాదిగలు మాత్రమే కాదు. ఒక్కొక్క వర్గానికీ ఒక్కొక్క విధమైన గుఱ్ఱు ఉంది. కానీ అందఱూ ఇదే విధంగా వ్యవస్థల భద్రతా వాతావరణాన్ని ప్రశ్నార్థకం చేస్తే భవిష్యత్తులో మనం ఇక్కడ బతకడం చాలా కష్టమౌతుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. కారణం - అసలు ఇలా ప్రవర్తించాలనే సంకల్పం మాదిగల్లో కలగడానికి - రాజస్థాన్ లో గుజ్జర్లు చేపట్టిన అరాచక ఆందోళనే స్ఫూర్తి. కానీ శాసనసభలకి హక్కులు (House privileges) కొన్నున్నాయి. వాటిని ఉల్లంఘించినవారు తప్పనిసరిగా శిక్షార్హులు. శాసనసభలోకి అననుమతంగా చొఱబడ్డం దాడి కిందికొస్తుంది. అయనా ఈ ఉదంతంలో ఏ కార్యకర్తకీ శిక్ష పడలేదు. అందుక్కారణం ఎస్సీ వోట్ల రాజకీయం. అందుచేత ఈ సర్వాతీతువుల వర్గాల్ని చేతులారా సృష్టిస్తున్నది ప్రభుత్వమేనని మనకి అవగతమౌతుంది.

అలాగే అయిదేళ్ళ క్రితం ఒక పోలీస్ కానిస్టేబులు ఢిల్లీలోని లోధీ గార్డెన్ ప్రాంతంలో ఒక యువతిని ఏడిపిస్తూ వెంటపడుతున్న సైనికుల్ని చూసి వారించబోయాడు. వాళ్ళు అతన్ని లెక్కచెయ్యలేదు. "పోవోయ్ ! నీ పని నువ్వు చూసుకో ! మేము ఆర్మీ జవానులం. నువ్వు మమ్మల్నేమీ చెయ్యలేవ్" అని చౌకచేసి మాట్లాడ్డమే కాకుండా అతన్ని చావగొట్టారు. ఇక్కడ మనకర్థం కానిదేంటంటే - రైఫిల్స్ పట్టుకున్నంత మాత్రాన ఆర్మీ జవానులు చట్టానికతీతులా ? వాళ్ళేమైనా దేవుళ్ళా ? అంతగా అవసరమైతే ఆ మాత్రం డొక్కు రైఫిల్స్ ప్రజలు కూడా పట్టుకోలేరని వాళ్ళు ఎందుకనుకుంటున్నారు ? అందఱమూ అవి పట్టుకోవడం పద్ధతి కాదనే, మనం వాళ్ళ చేతుల్లో రైఫిల్స్ పెట్టినది. వాళ్ళ ప్రవర్తన ఇలాగే గాడితప్పుతూ పోతే ఈ దేశంలో ప్రతి ఒక్కడూ తప్పకుండా రైఫిల్ పట్టుకుంటాడు. ఎందుకంటే ఆర్మీవాళ్ళొక్కళ్ళే మగాళ్ళు కారు. సగం మందిమి మగ జన్మెత్తినవాళ్ళమే. ప్రతి మగవాడిలోను ఒక పోరాటయోధుడు, పౌరుషశాలి దాగి ఉన్నాడు. ఎటొచ్చీ ఆ సమయం రావాలంతే ! ఆర్మీవాళ్ళని అంతలావున పోషిస్తున్నదెవరు ? ప్రజలు కాదా ? స్వదేశ స్త్రీలందఱిని వాళ్ళకెవరైనా ఆటోమేటిక్ పెళ్ళాలుగా రాసిచ్చారా ? దేశప్రజల రక్షణ కోసం నియమించబడ్డవాళ్ళు ఆ కర్తవ్యానికి ద్రోహం చెయ్యడం, అందుకు విరుద్ధమైన కార్యకలాపాలకి దిగడం మన మనసుల్ని విస్తుగొల్పుతుంది. కానీ చరిత్రలో మొదట్నుంచి జఱుగుతూ వస్తున్నది అదే. అయితే, అలా అని ప్రజలేమీ అలాంటి ప్రవర్తనని నోరు మూసుకుని సహించలేదు. పాకిస్తాన్ లో దశాబ్దాలుగా సైనికుల ఆధిపత్యమే నడుస్తోంది. కానీ వాళ్ళని చూసి, వాళ్ళ మూలంగా, వాళ్ళ మీది కక్షతో అక్కడ చాలామంది తుపాకులు ధరించారు. అక్కడ సైన్యం సంఖ్య అయిదు లక్షలైతే తుపాకులు ధరించి తిరుగుతున్న సామాన్యుల సంఖ్య మూడు లక్షలు. ఏం చెయ్యగలుగుతోంది పాక్ సైన్యం ? వాళ్ళ దుర్గతి చూసైనా భారతసైన్యానికి బుద్ధి రాకపోతే ?

ఎవరు సర్వాతీతులు ? అసలు సమాజంలో ఇంతమంది సర్వాతీతుల్ని, వారి వికృత చేష్టల్ని, మాటల్ని, రాతల్ని ఎందుకు మౌనంగా భరిస్తూ నోరు మూసుకుని బతకాలి ? ఇలా ఎంత కాలం ? ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్