14.6.09

నిజమైన గురువు-2




షిరిడీ సాయిబాబావారి తల్లిదండ్రులెవరో, స్వస్థలం ఎక్కడో ఎవరికీ తెలియదు. ఆయన కూడా ఆ వివరాలెప్పుడూ పేర్కొని ఉండలేదు. ఆయన అసలుపేరేంటో కూడా ఎవరికీ తెలియదు. ’సాయి” అంటే ’సన్న్యాసి” అని తప్ప మరో అర్థమేదీ లేదు. అదీ భక్తులు పెట్టిన పేరే. అయితే తన గుఱించి ఎప్పుడూ ఏమీ చెప్పుకోని శ్రీ సాయిబాబా తన గురువుగారి పేరు "రోషన్ షాహ్" అని చెప్పారు. ఆయన దగ్గఱ శ్రీ సాయిబాబా చాలా పసివయస్సులో (బహుశా మూణ్ణాలుగేళ్ళ వయస్సులో) చేఱారట. తల్లిదండ్రులే చేర్చారో, ఆయనే స్వయంగా చేఱారో తెలియదు. రోషన్ షాహ్ గారు పసి సాయిబాబాకి ఎప్పుడూ ఏమీ బోధించలేదు. ఆయన ఎల్లప్పుడూ ధ్యానంలో మునిగి ఉండేవారు. ఎంతగా ? అంటే శరీర మలినాలు వెలువడుతున్న విషయం కూడా ఆయనకి తెలియనంత ప్రగాఢ సమాధిస్థితిలో ఉండేవారట. పసి సాయిబాబా వారే వాటన్నింటినీ శుభ్రం చేసి ఆయనకి అన్నం తినిపించేవారట. "నేను మా గురువుగారిని మిక్కిలి గాఢంగా ప్రేమించాను. వారిని చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేనట్లు ఉండేవాణ్ణి. వారిని చూడలేనప్పుడు నాకు కళ్ళు లేకపోతేనే బావుండు ననిపించేది. వారి ముఖాన్ని చూస్తూ ఆనందంలో మునిగిపోయేవాణ్ణి. నా జీవశక్తులన్నింటినీ నా కళ్ళలోను, నా కళ్ళని మా గురువుగారి మీదా కేంద్రీకరించాను. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి." అన్నారు శ్రీసాయిబాబా. చాలా సంవత్సరాలకి రోషన్ షాహ్ గారు కళ్ళు తెఱిచినప్పుడు కిశోర సాయిబాబాని దగ్గఱికి పిలిచి, ఆయనకు గుండు చేయించి, రెండు పైసలు గురుదక్షిణ కోరారు. ఆయన కోరిన దక్షిణ ప్రభుత్వంవారు ముద్రించిన నాణేలు కావనీ, అవి నమ్మకమూ, ఓర్పూ అని తెలియజేశారు. శ్రీ సాయిబాబావారి గురుసేవకి, నమ్మకానికి సంతృప్తి చెందిన భగవత్ స్వరూపుడైన శ్రీ రోషన్ షాహ్ గారు ఆయన్ని "నిన్నందఱూ భగవంతుడుగా కొలుస్తారు" అని ఆశీర్వదించారు. ఈ వృత్తాంతాన్ని చెబుతూ భగవాన్ శ్రీ సాయిబాబా ఒకసారి ఇలా అన్నారు : "నేను మీ నమస్కారాలన్నింటినీ మా గురువుగారైన శ్రీ రోషన్ షాహ్ గారికి సమర్పించుకుంటాను. ఆయన ఆశీర్వాద ఫలితమే ఈ భక్తులూ, శిష్యులూ, ఈ వైభవమంతా !" అని తెలియజేశారు.

శ్రీ సాయిబాబా ఇంకా కొద్ది సంవత్సరాలకి మహాసమాధిలో ప్రవేశిస్తారనగా, పిష్యా అనే ఏడేళ్ళ పిల్లవాడు ఆయన దగ్గఱికి తఱచుగా వస్తూండేవాడు. శ్రీ సాయిబాబావారు అతనితో గోళీలు ఆడుకోవడమే కాక అతన్ని దగ్గఱ కూర్చోబెట్టుకుని మధురమైన పదార్థాలన్నీ అతనికి తినిపించేవారు. ఇది చూసి కొందరు భక్తులు అతని అదృష్టానికి అసూయ చెందేవారు కూడా. కొందరైతే "ఏంటి బాబా ! అతనిలో అంత ప్రత్యేకత ?"అని ఒకసారి ఆయన్ని నేరుగా అడిగేశారు కూడా. బాబా కోపగించుకోకుండా వారితో "వీడంటే నాకెంతో ప్రేమ. ఎందుకంటే వీడు అల్లాహ్ భక్తుడు. రోజూ క్రమం తప్పకుండా అయిదుసార్లు నమాజ్ చేస్తాడు. వీడు భవిష్యత్తులో చాలా గొప్పవాడవుతాడు. లక్షలాది మంది వీణ్ణి అనుసరిస్తారు." అని ఆశీర్వదించారు. ఏ అసూయా, కుళ్ళూ కుత్సితమూ లేని భగవంతుడు మాత్రమే ఇవ్వగలది, మానవమాత్రు డెవ్వడూ ఇవ్వలేని ఆశీర్వాదం. అది విని భక్తులంతా నిర్ఘాంతపోయారు. కానీ కొంతకాలానికి పిష్యా అర్ధాంతరంగా చనిపోయాడు. జనం మళ్ళీ నిర్ఘాంతపోయారు. "బాబా ఆశీర్వాదం కూడా వృథాపోయిందా ఏమిటి ?" అని లోలోపల శంకాపీడితులయ్యారు. కానీ బాబా మాట సాక్షాత్తు భగవంతుడి మాటే. అది ఎట్టి పరిస్థితుల్లోను వృథా కావడానికి వీల్లేదు. పిష్యా చనిపోయాక కొన్ని సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ లో హిందువుగా జన్మించాడు. బాబా దీవెనలు అక్షరాలా ఫలించాయి.

బళ్ళలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని కూడా శ్రీ సాయిబాబా గురువులుగా మన్నించేవారు. ఒకసారి షిరిడీకి ఒక చిత్రకారుడొచ్చాడు. ఆయనతో బాబా బొమ్మ వేయించాలని భక్తుడూ, స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడూ అయిన శ్యామా (మాధవ్ రావ్ దేశ్ పాండే) సంకల్పించాడు. "దేవా ! నీవంటి సద్గురుని ధ్యానించుకోవాలంటే మావంటి భక్తులకొక పటం అవసరం" అని చెప్పాడు. బాబా ఇష్టపడలేదు. "శ్యామా ! నువ్వు కూడా గురువ్వే కదా ! నీ పటం కూడా ప్రజలకి మేలు చేస్తుంది. అదెందుకు గీయించుకోకూడదు ?" అని అడిగారు. కానీ శ్యామా బలవంతం మీద ఆయన అంగీకరించక తప్పలేదు.

ఇలాంటి సంఘటనే మనకి (నెల్లూరు) శ్రీ వెంకయ్యస్వామివారి జీవితంలోనూ తారసపడుతుంది. శ్రీస్వామివారు ఒకనాడు తన భక్తుడైన రోశిరెడ్డిని పిలిచి పూజించి బట్టలు పెట్టారు. "ఇదేంటి స్వామీ ! నేను మీకు పూజ చెయ్యాల్సింది పోయి, మీరు నాకు చేస్తున్నారు ?" అనడిగాడు రోశిరెడ్డి. "పూర్వజన్మలో నాకు తెలుగూ, సంస్కృతమూ బోధించిన పంతులివి నువ్వు. అందుకే పూజిస్తున్నా" నన్నారు శ్రీస్వామి.

ఇలా గురుతత్త్వం గుఱించి చెప్పాలంటే చాలా ఉంటుంది. వీలైనప్పుడు రాస్తాను. ఈ లోపల గురుతత్త్వం గుఱించి నేను చేసిన ప్రసంగాన్ని ఈ క్రింది శ్రవ్యకం (audio) ద్వారా వినవచ్చు.




(సమాప్తం)

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్