1.7.09

మహానుభావుడు శ్రీ గౌరు



ఆయన :మీరు అనుసరించేది ఏ వాస్తుశాస్త్రం ? మయవాస్తా ? సనత్కుమారవాస్తా ?

నేను : అవేవీ కాదు, గౌరువాస్తు.

ఆయన : గౌరంటే ? మీరనేది గౌరు తిరుపతిరెడ్డా ?

నేను : అవును, ఆయనే !

ఆయన : తిరుపతిరెడ్డి నాస్తికుడంటారు కదా ! ఆయన రాసింది మనకెలా ప్రమాణమవుతుంది ?

నేను : నాస్తికుడో ఆస్తికుడో నాకు తెలియదు. కానీ వాస్తు వఱకు ఆయన సబ్జెక్టు బావుంది.

ఆయన : నాస్తికులు రాసిన శాస్త్రాలు మనం చదవకూడదు. అనుసరించడం అసలే పనికిరాదు.

నేను : ఆస్తికుల్లో ఉన్నట్లే నాస్తికుల్లో కూడా రకరకాలున్నారు. దేవుడు లేడనేవాళ్ళు కొందరు. ఉన్నాడో లేదో తెలియదనేవాళ్లు కొందరు, దేవుడున్నా మనకి ఏ ప్రయోజనమూ లేదనేవాళ్లు కొందరు. ఉన్నాడని నమ్ముతాం గానీ పూజలూ, పునస్కారాలూ చెయ్యడం ఇష్టం లేదనేవాళ్లు కొందరు. దేవుడో, కర్మసిద్ధాంతమో ఏదో ఒకటే నిజం కావాలనీ, ఆ రెండూ ఏకకాలంలో నిజమయ్యే అవకాశం లేదనేవాళ్ళు కొందరు. అలాగే వాళ్ళలో జ్యోతిష్యమూ, వాస్తూ నమ్మేవాళ్ళు కూడా ఒక రకం ఉన్నారు.

ఆయన :
వింటూంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.

నేను : అంత ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదండీ ! ప్రాచీన జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలు రాసినవాళ్ళలో దైవవిశ్వాసం లేనివాళ్ళు చాలామందున్నారు. అవన్నీ ఇప్పుడు మనం ప్రామాణిక గ్రంథాలుగానే పరిగణిస్తున్నాం కదా !

ఆయన : మఱి వాళ్ళలో ఎవరైనా వాస్తుశాస్త్రం రాశారా ? అని !

నేను :
వాస్తు గుఱించైతే వాళ్ళెవరూ రాసినట్లు లేదు.

ఆయన : తిరుపతిరెడ్డి రాసిన శాస్త్రం పూర్వశాస్త్రాల్ని అనుసరించినది కాదట కదా ! అదంతా ఆయన సొంత కవిత్వమని విన్నాను. మీరేమంటారు ?

నేను :
అలా పేర్లు పెట్టడం బాలేదు. అది సొంతకవిత్వం కాదండీ, అనుభవ వాస్తు. అనుభవంలో ఖచ్చితంగా ఫలితాలు చూపిస్తూండడం చేతనే నేనాయన్ని అనుసరిస్తున్నాను.

ఆయన : మన పూర్వశాస్త్రాల కంటే ఆయన శాస్త్రం ఏ విధంగా మెఱుగంటారు ?

నేను :
మెఱుగూ, తఱుగూ నేను మాట్లాడ్డం లేదు. విషయమేంటంటే - పూర్వశాస్త్రాల్లో చెప్పిన భవనశిల్పం ఇప్పుడెక్కడా లేదు. అందుచేత వాటి సూత్రాల్ని ఈ కాలానికి యథాతథంగా అన్వయించుకోవడం కష్టం. అదీగాక ఇదివఱకు లేని కట్టడాలు కడుతున్నారు కదా, ఫ్యాక్టరీలనీ, మాల్స్ అనీ, ఫ్లాట్ లనీ ! వాటికి పూర్వసూత్రాల్ని నూటికి నూఱుశాతం అన్వయించలేం. అటువంటి సందర్భాల్లో రెడ్డిగారి వాస్తు మనకి దారి చూపిస్తుంది. అదొక్కటే కాదు, వాస్తుని బట్టి కుటుంబసభ్యుల భవిష్యత్తు తెలుసుకునే పద్ధతుల్ని కూడా రెడ్డిగారి శాస్త్రం ద్వారా ఊహించవచ్చు. ఈ విషయాలు ఇంత సమగ్రంగా పాత శాస్త్రాల్లో ఉన్నట్లు నాకెక్కడా కనిపించలేదు.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్