28.5.09
జీవితానిక్కావాలి ఊహా, ఉత్ప్రేక్షా - రసం, స్వప్నం - శైలీ, శిల్పమ్
6:00 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: పిచ్చాపాటి
నేనీమధ్య పాతపుస్తకాల దుమ్ము దులిపి చదువుకుంటున్నాను. బాలనాగమ్మ కథ, ఆంధ్రరాష్ట్రము, మాతృమందిరము మొదలైనవన్నమాట. ఈ చదవడం, రాయడం అనేవి చాలా పెద్దపనులు. పైకి కనిపించినంత, అందఱూ అనుకుంటున్నంత సులభం కాదు. చిన్నప్పుడు ఒక్కరోజులో మూణ్ణాలుగొందల పుటలు అవలీలగా చదివేసిన సందర్భాలున్నాయి. ఆ పఠనవేగం ఇప్పుడు మందగించడానికి ఎన్నో కారణాలుండొచ్చు. ధనసంపాదనా వ్యాపకం, తదితర బాధ్యతలూ భౌతిక కారణాలైతే, లోకానుభవం (అని మనం అనుకుంటున్నది) ఏ విషయాన్నీ ఒకపట్టాన ఒప్పుకోనివ్వక పోవడం, అందుమూలంగా ప్రతిదాన్నీ సవిమర్శంగా చదివేటప్పటికి పుణ్యకాలం గతించడం మొదలైనవి మానసిక కారణాలని చెప్పుకోవచ్చు.
"పాత పుస్తకాలెందుకు ? బహుకొత్త పుస్తకాలుండగా ?" అని ఎవరైనా అడగొచ్చు. కొత్త పుస్తకాలున్నాయని తెలుసు. కానీ నేను వాటిని దూరంగా పెట్టడానికొక చిత్రమైన కారణం ఉంది. ఎందుకో గానీ కొత్త పుస్తకాల్లో ఊహాశక్తి బాగా తగ్గిపోయింది. అంతా వాస్తవం, వాస్తవం, వాస్తవం, వాస్తవాల మయం. బ్లాగులు కూడా పచ్చి వాస్తవాల భూయిష్ఠం. ఎలాగూ చచ్చినట్లు ప్రతిరోజూ వాస్తవ ప్రపంచంలోనే బతుకుతున్నాం కదా, కాస్తయినా మన ఊహల పల్లకీని ఉఱకలెత్తించే సాహిత్యం వద్దా ? హృదయానికి హత్తుకునే కల్పనలొద్దా ? మనిషి ఎల్లపొద్దులూ సమకాలంలోనే బతికితీఱాలనేముంది ? మానవాత్మ సంకుచిత స్థల, కాలపరిధుల్ని అధిగమించి భూత భవిష్యత్తుల్లోకి శాఖాచంక్రమణం చేస్తే తప్పేముంది ? సర్వదా ఇవే రాజకీయాలు, ఇవే పొట్టకూటి చదువులు. ఇవే ఉద్యోగాలూ, వ్యాపారాలూ, వీటిల్లో కుళ్ళూ, కుత్సితాలూ. రసానందంలో ధ్వని (suggestivity) కి చాలా ప్రాధాన్యముంది. అయితే ఆ ధ్వని స్ఫురించాలన్నా, తద్ద్వారా రసానందం కలగాలన్నా చెప్పేవాడితో పాటు వినేవాడిక్కూడా ఊహాశక్తి ఉండాలి. ధ్వని అంటే రచయిత/ దర్శకుడు కొంచెం చెప్పి కొంచెం చెప్పకుండా సూచించి వదిలెయ్యాలి. మనం హాస్యాన్ని ఆస్వాదించ గలగడానికి కారణం ఈ ధ్వనే. కొంచెం చెప్పి వదిలెయ్యడంలో ఉన్న మాధుర్యం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి - చాలా సంవత్సరాల క్రితం మీకు రైల్వే స్టేషన్ లో పరిచయమైన వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కార్యాలయానికొస్తాడు. మీరు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి లేచి చేయందిస్తూ, "మీరు..." అని ఒక్కముక్కతో ఆగిపోతారు. ఆ ఒక్క "మీరు..." అన్న పదానికే ఆ వ్యక్తికి ఎంతో ఆనందం కలుగుతుంది. రసానందం కూడా అలాంటిదే.
ఈ దేశంలో మొదట్నుంచి బాలసాహిత్యం అంటూ ఏమీ లేదు. ఇక్కడ పెద్దల సాహిత్యమే పిల్లలు కూడా చదువుతారు. పెద్దల సాహిత్యమే పిల్లల శైలిలోకి తర్జుమా చేయబడి బాలసాహిత్యంగా చెలామణి అవుతోంది. అలాంటిది, ఇప్పుడు తలెత్తిన సరికొత్త పరిణామమేంటంటే - ఆఖరికి ఆ పెద్దల సాహిత్యం కూడా కఱువైపోవడం. పిల్లల సంగతి సరే సరి ! వాళ్ళిప్పుడు అన్ని రకాల సాహిత్యాలకీ పూర్తిగా దూరమైపోయారు. ముందేమో "తెలుగు మాట్లాడొద్దు, తెలుగు పుస్తకాలు చదవొద్దు" అనేవారు. ఇప్పుడేమో "ఏ పుస్తకాలూ చదవకూడదు, క్లాసు పుస్తకాలు తప్ప !" అనే పరిస్థితి వచ్చింది. ఏతావతా వాళ్ళు కూడా మనలాగే కటిక వాస్తవ ప్రపంచంలో బతుకుతున్నారు. ఈ కటిక వాస్తవాల వాతావరణంలో ఆదర్శాలూ, ఆశయాలూ వికసించడం దుస్సాధ్యం. చక్కని పరిణత ఊహలతో, కల్పనలతో, నవ్య కథనశైలితో, భాషాసౌందర్యంతో రసాత్మకత్వంతో అలరించి, ఆనందింపజేసే నవలలూ, నాటకాలూ, పద్యకావ్యాలూ విస్తారంగా ఉత్పత్తి కావడంలేదు, కనీసం ఈ పెఱిగిన జనాభా నిష్పత్తిలో ! ఆ ఉన్న కొద్దిపాటి కల్పనా సాహిత్యమూ ఏవో జగన్నాథ రథచక్రాల్లాంటి బరువైన సిద్ధాంతాల మోపు భుజాన వేసుకుని కాయలు కాచిన వ్యవహారం. ఆ విధంగా అలిసిపోయి చెమట తుడుచుకుంటున్న ఆ సాహిత్యంలో అమాయకత్వ పరిమళం లోపించింది. అమాయకత్వం నశించడం ఊహాశక్తికి దెబ్బ. అందుచేత ఇప్పుడు ఎటు చూసినా ఊహకి పనిచెప్పని పుస్తకాలే. ట్రావెలాగులు, లేదా ఎవరికి వారు సుత్తీ, శాణం తీసుకుని తమని తాము చెక్కుకోవాలని చెప్పే వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ, ఇంటర్వ్యూ గైడ్లు, డబ్బు సంపాదించడం ఎలా ? జీవితచరిత్రలు, మోనోగ్రాఫులు, ఫలానా కమిటీవారి నిజనిర్ధారణ నివేదిక, విరోధి నామసంవత్సర పంచాంగం !
ముందేమో (ఛందః) కవిత్వాలొద్దన్నారు, కవితలు ముద్దన్నారు. ఆ తరువాత కవితలు కూడా వద్దు, నవలలు కావాలన్నారు. ఆ తరువాత నవలలు కూడా వద్దు, చిన్నకథలు చాలన్నారు. ఆ తరువాత అవీ వద్దు, టీవీ సీరియళ్ళు చాలన్నారు. ఈ రోజు టీవీ సీరియళ్ళక్కూడా మంగళం పాడి న్యూస్ ఛానళ్ళు చూస్తున్నారు. పోనీ, ఆ టీవీయే చూద్దామంటే అక్కడ కూడా అన్నీ వాస్తవాలే. అన్నీ న్యూస్ ఛానళ్ళే. మనకిన్ని న్యూస్ ఛానళ్ళెందుకో అర్థంకాదు. ఈ రకమైన ఛానళ్ళు ప్రారంభించడంలో ఉన్న సౌలభ్యం - వీటిల్లో ఏ కార్యక్రమాన్నీ ఊహాశక్తితో రూపొందించే పనుండదు. అన్నీ వాస్తవ సంఘటనలే చూపిస్తారు. మేకప్ లేని వాస్తవ మనుషులే మాట్లాడతారు. సెట్టింగులు కాని వాస్తవ ప్రదేశాలే చూపిస్తారు. సొంతతనం గల కల్పనా కథలతో కూడుకున్న టెలిఫిలిములూ, ధారావాహికలూ ప్రసారం చేసే ఛానళ్లు మనకి చాలా తక్కువ. ఆ ధారావాహికలు కూడా పచ్చి వాస్తవాల మయం. వార్తాపత్రికల నుంచి స్ఫూర్తి పొందినట్లుంటాయి వాటిల్లో సంఘటనలు. ఉదాహరణకి - వాస్తవ ప్రపంచంలో అమ్మాయిల మీద ఆమ్లదాడి (acid attack) జఱిగితే వెనువెంటనే టీవీకథలో కూడా ఆమ్లదాడి ఘటనొకటి ప్రవేశపెడతారు. మీ వాస్తవ ముఖ్యమంత్రి భూకబ్జాల మనిషైతే సీరియల్లో మంత్రిగారు కూడా అలాంటివాడే అయ్యుంటాడు. ఇహ కల్పనకి తావేముంది ? రచయిత గొప్పేముంది ? వీటి సంగతే ఇలా ఉంటే ఇంకా కఠోర వాస్తవాల భరితంగా రియాలిటీ షోల పేరుతో ఊహకి స్థానం లేని ప్రత్యక్ష ప్రసారాలొకటి. ఈ పోకడ పధ్నాలుగేళ్ళ క్రితమే మొదలయింది. "ఊహా ! నీ చిఱునామా ఎక్కడ ?" అని ఆర్తనాదం చేస్తూ దేవులాడాల్సిన పరిస్థితి.
మన తెలుగు సినిమాల కథలన్నీ ఎక్కణ్ణుంచో ఎత్తుకొచ్చినవనే అపప్రథ ఉండనే ఉంది. కొత్త కథల మీద డబ్బులు పెట్టే దమ్ము మన నిర్మాతలకి లేదనేది అందఱికీ తెలిసినదే. దాన్తో పాటు, ఒక ఊహా, ఉత్ప్రేక్షా, రొమాన్సు ఏమీ లేకుండా ఈ కటిక వాస్తవాల ప్రపంచంలోనే చిన్నప్పట్నుంచి పెఱగడం కూడా మనలో ఊహాశక్తులు వికసించకపోవడానికీ, మనం ఫక్తు కాపీరాయుళ్ళుగా అవతరించడానికీ ఒక కారణం కావచ్చు. మన చుట్టూ ఉన్న సమాజం ఏ భాష మాట్లాడుతుందో ఆ భాష (మాతృభాష) లో చదవక పోవడం కూడా ఊహాశక్తికి దెబ్బే. ఊహల్ని కూడా పరాయిభాషా సమాజం నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మన చదువులన్నీ విజ్ఞానానికి (science) పెద్దపీట వేస్తాయి. ఈ తరహా చదువుల్లో మునిగినవాళ్ళకి అన్నీ చిహ్నాల (symbols) లోను, మాటల్లోను ఆలోచించడం అలవాటై వాటికి అందని భావపటలాల్ని అబద్ధాలనుకుంటున్నారు. కేవలం మాటల్ని ఆశ్రయించుకున్నవారి ఆలోచనాశక్తిలో ఏర్పడే లోపమేంటంటే - అటువంటివారు తర్కాలు బాగా సాగదీస్తారు కానీ ఊహాశక్తి లోపించడం చేత, అవతలివారికి Benefit of doubt ఇవ్వడానికి ఇష్టపడరు గనుక, వారు విషయాల్ని ఏకమొత్తంగా కాక ముక్కలు ముక్కలుగా ఆలోచిస్తారు. అందుచేత వారిలో అవగాహనా లోపాలు హెచ్చు. మా చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా ఒక విషయం చెబితే మిగతాది మేము ఊహాశక్తితో అల్లుకుపోయేవాళ్ళం. ఈ తరంలో ఆ లక్షణమే కనిపించడం లేదు. "అలా అన్నావు కాబట్టి మిగతాది కూడా నువ్వే చెప్పు" అంటున్నారు. తెలియడమూ, తెలియజెప్పడమూ - ఈ రెండూ వేఱువేఱు విషయాలని వీళ్ళకి తెలియదు. అనుభూతిల్లడమూ, అనుభూతిని వ్యక్తీకరించడమూ - ఇవి విభిన్న అంశాలని వీళ్ళెఱగరు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు మిగతాది చెప్పడానికి ఇష్టపడకపోతే, లేదా చెప్పలేకపోతే మీకు తెలియదనే వీళ్ళ లెక్క. దాన్ని తమ ఊఃహాశక్తిలోపం అని కాక అవతలివాళ్ళ తర్కహీనత్వం అనుకుంటున్నారు.
భావప్రజ్ఞ (Emotional intelligence) అని ఒకటుంది. అంటే విషయాల్ని తర్కం ద్వారా కాక, పరిస్థితుల్ని మనసుకు ఆవహింప జేసుకుని, అనుభూతి చెందడం ద్వారా పసిగట్టి తెలుసుకొని, అర్థం చేసుకునే శక్తి. అది బాగా తగ్గిపోయింది. అది ఆడవాళ్ళకి మగవాళ్ళ కంటే ఒక అంగుళం ఎక్కువ అంటారు. కానీ ఆడవాళ్ళని మగ విద్యావిధానంలోకి తోశాక వాళ్ళలో కూడా అది తగ్గిపోతోందని నా అనుమానం. ఏ ప్రశ్నలూ వెయ్యలేనివాడు ఏ విధంగానైతే ఎద్దుమొద్దు స్వరూపమో, ప్రతీది అడిగి చెప్పించుకునేవాళ్లు కూడా అలాంటి ఎద్దుమొద్దు స్వరూపాలే. ఎటొచ్చీ వాడికి నోరు లేదు. వీళ్ళకి ఉంది, అంతే తేడా. ఊహాశక్తి లోపం మన భాషాశైలి మీద కూడా ప్రభావాన్ని ప్రసరిస్తోంది. తెలుగులో గానీ, ఇంగ్లీషులో గానీ ఒకే భావాన్ని నాలుగు రకాలుగా మార్చి చెప్పడం ఈ తరానికి చేతకావడం లేదు. అలా చెప్పగల ప్రతిభా పాటవాలు అరుదుగా ఎవరికైనా ఉన్నా దాన్ని గుర్తించలేని, మెచ్చుకోలేని రసహీనులుగా తయారయ్యారు. "వాడో పెద్ద బోర్" అని వ్యాఖ్యానిస్తారు. ఆయా భావాల్ని వాటికి స్వాభావికమైన ఊనికతో, వాటికి సముచితమైన పదజాలంతో, భావోద్వేగంతో వ్యక్తం చెయ్యడానికి ప్రాధాన్యం క్షీణించి అందఱూ గానుగెద్దుల్లా ఒకే మూసలో నిర్మమం (detached) గా వ్యక్తీకరించడాన్ని గౌరవప్రదమని తలపోస్తున్నారు.
సాధారణంగా జాతకంలో మీనరాశి బావుంటే ఊహాశక్తులు వికసిస్తాయి. కానీ అది బావుండాలంటే మనిషి అంతకుముందుజన్మలో బాగా గురుసేవ చేసి ఉండాలి. "మీ సార్ మీదేమైనా కంప్లెయింట్లు ఉంటే వెంటనే మేనేజ్ మెంట్ కి రిపోర్ట్ చెయ్యండి" అని విద్యార్థుల్ని బహిరంగంగా గురువుల మీదికి ఉసిగొల్పుతున్న రోజుల్లో, ఆ భయంతో దినదినగండంగా గురువులు బతుకుతున్న సమాజంలో అందఱూ గురుద్రోహులూ, గురుశాపాలకి గుఱైనవాళ్ళే ఉంటారు తప్ప మీనరాశి బావున్నవాడు ఒక్కడూ కనిపించే అవకాశం లేదు. ఈ వాతావరణంలో ఊఃహాశక్తి వికసించడం అసాధ్యంలా కనిపిస్తోంది.

