20.5.09
Better beings than we.....
1:55 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: తెలుగు - తెలుగుజాతి - తెలుగునేల
శ్రీలంక తమిళులు ఎందుకు అలా హోరాహోరీ పోరాడుతున్నారో తెలుగువాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఒక భాషాజాతిగా వాళ్ళ ఆత్మగౌరవం మనకి ఊహించశక్యం కానిది. ఒక జంతువు మనిషి భావోద్వేగాల్ని ఎలాగైతే అర్థం చేసుకోజాలదో అలాగే తెలుగువాళ్ళకి ఆత్మగౌరవం ఉన్న జాతులు ఒకపట్టాన అర్థం కావు. అదే మనమైతే ? నాకు తెలిసి, అసలు మనకి ఎవరితోనైనా సరే పోరాడాల్సిన అవసరమే రాదు. శ్రీలంకలో సింహళీభాష నేర్చేసుకుని సింహళీలుగా మారిపోయి తెలుగుని మన స్వహస్తాలతో గొంతు నులిమి చంపేస్తాం. అదే మనమైతే ఆ చంపెయ్యడాన్ని ఒక విశాలహృదయంతో కూడుకున్న అద్భుత ధీరోదాత్త విషయంగా ప్రచారం కూడా చేసుకుంటాం. తమిళవీరులు తమిళజాతి కోసం బలయ్యారు. అదే మనమైతే ఇతరజాతుల కోసం మనల్ని మనమే బలిచేసుకుంటాం. తమిళులు తాత్కాలికంగా శ్రీలంకలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు తమ ఆత్మత్యాగాల ద్వారా ఒక భవిష్యత్ తమిళ్ నేషన్ ఆవిర్భావానికి పునాదులు వేసివెళ్ళారు. ఎందుకంటే ప్రపంచంలోని నేషన్స్ అన్నీ త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డాయి. త్యాగచరిత్రల స్ఫూర్తితో అవి ఏర్పడ్డాయి. మనం తెలుగు కోసం ఏ త్యాగాలూ చెయ్యలేదు. మనం మన తెలుగుజాతి కోసం ఎప్పుడూ పోరాడలేదు. మనం ఎప్పుడూ మన వ్యక్తిగత ఉద్యోగాల కోసమే పోరాడుతూ వచ్చాం. మహా అయితే మనం కులాల కోసం పోరాడతాం. మనలో మనం కొట్టుకు చావడానికి చాలా ప్రాధాన్యమిస్తాం. అందుచేత తమిళ్ నేషన్ అనేది ఉంది. కానీ తెలుగు నేషన్ అనేది ఏదీ లేదు. నేషన్ లేదు కనుక నేషనల్ లాంగ్వేజి కూడా లేదు.. ఇతరుల నేషనల్ లాంగ్వేజిలు తెలుగువాళ్ళ నేషనల్ లాంగ్వేజిలుగా ప్రచారమవుతున్నాయి. మనమింతే ! మన ఖర్మ ఇంతే ! మనం ఇందుకే తగినవాళ్ళం.
