22.3.08

నటభూషణుడి నిష్క్రమణం



(ఈ పాత టపాని "నా సాహిత్యం" బ్లాగు నుంచి "కలగూరగంప"కి తరలించడం చేత ఈ చద్దివార్త మీకిప్పుడు ఇక్కడ దర్శనమిస్తోందని గమనించ ప్రార్థన. తద్ద్వారా కలిగిన అసౌకర్యానికి మిక్కిలి చింతిస్తున్నాను)

ఎన్.టి.ఆర్. అక్కినేని తరువాత అంతటి స్థాయి గల తెలుగు మహానటుడు శ్రీ శోభన్ బాబు మొన్న బుధవారంనాడు మద్రాసులో హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారని ప్రసారమాధ్యమాల ద్వారా తెలియవచ్చింది. కాని ఆయనకు అంతకుముందు ఏ విధమైన అస్వస్థతా సూచనలూ లేవు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలూ, (మృదుల, నివేదిత, ప్రశాంతి) ఒక కుమారుడూ (కరుణ శేషు) ఉన్నారు. తన నివాసస్థలమైన మెహతానగర్ (చూళైమేడు) కి కూతవేటు దూరంలో ఆయన ఒకప్పుడు ముచ్చటపడి కొనుక్కుని పెంచుకున్న శాంతినికేతన్ తోటలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రశాంతిగారు అమెరికాలో ఉండడంచేత తన తండ్రి అంత్యక్రియలకు సకాలంలో అందుకోలేకపోయారు.

శ్రీ శోభన్‌బాబు కాలధర్మంతో తెలుగు సినిమా పరిశ్రమలో జెంటిల్‌మెన్‌ల యుగం దాదాపుగా అంతరించి పోయినట్లే. (మనకింకా అక్కినేని ఉన్నారనుకోండి). గాడ్‌ఫాదర్లు లేని తారల యుగం, అట్టడుగునుంచి స్వశక్తితో పైకొచ్చిన మహానటుల శకం, నటనావృత్తికి సహజ అందాన్నీ, డైలాగ్ డెలివరీని తప్పనిసరి చేసి మహోన్నత ప్రమాణాల్ని నెలకొల్పిన అందగాళ్ళ యుగం ఇక అంతరించిపోయింది.

శ్రీ శోభన్ (ఉప్పు శోభనాచలపతిరావుగారు) 1937 జనవరి 14న కృష్ణాజిల్లా చిననందిగామలో అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించారు. బాల్యంలో 15 సంవత్సరాల పాటు కుంటముక్కలలో గడిపి మైలవరం లో విద్యాభ్యాసం చేశారు. తరువాత విజయవాడలో డిగ్రీ పూర్తిచేశారు. 21 ఏళ్ళ వయసులోనే ఉంగుటూరు మండలం పోట్టిపాడుకు చెందిన శాంతకుమారిగారిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. అనంతరం న్యాయశాస్త్రం అభ్యసించడం కోసం మద్రాసు వెళ్ళి ఆ చదువు పూర్తిచెయ్యకుండానే సినిమారంగంలో ప్రవేశించారు. ఆయన తొలిసారిగా దైవబలం (1959) అనే సినిమాలో చిన్నవేషం వేశారు. తరువాత భక్తశబరి (1960) లో నటించారు.అనంతరం సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో మద్రాసులో అష్టకష్టాలనుభవించారు.ఆ బాధలుపడలేక ఇక స్వగ్రామానికి వెళ్ళిపోదామనుకుంటున్న దశలో "వీరాభిమన్యు" (1965) లో హీరో (టైటిల్ పాత్ర) గా వెయ్యమని ఆహ్వానం వచ్చింది. వీరాభిమన్యు అఖండవిజయాన్ని సాధించినా ఆయనకు ఆ తరువాత మళ్ళీ హీరోగా చాలారోజులపాటు అవకాశాలు రాక చిన్నచిన్న వేషాలే వెయ్యాల్సొచ్చింది. కాని 1970 నుంచి ఈ పరిస్థితి మారింది. ఆయన తిరుగులేని హీరోగా పరిశ్రమలో స్థిరపడ్డారు. దాదాపు 200 పైచిలుకు తెలుగుసినిమాల్లో హీరోగా నటించారు.ఇతరభాషల జోలికి వెళ్ళలేదు. ఆయన నటించిన సినిమాల్లో బాగాలేనిదంటూ ఏదీ లేదు. కథ బాగాలేకపోతే ఆయన నటించడానికే ఒప్పుకొనేవారు కారు. కాని జనానికి అర్థం కాక ఫ్లాపైనవి మాత్రం ఒకటి-రెండు ఉండొచ్చు. ముఖ్యంగా - సంపూర్ణ రామాయణం, మనుషులు మారాలి, జీవనతరంగాలు , మైనర్ బాబు, శారద, నాయుడు బావ, కృష్ణార్జునులు, కార్తీకదీపం, దీపారాధన , మల్లెపువ్వు, సన్నాయి అప్పన్న మొదలైన చిత్రాలు ఆయన్ని జన-గణ-మనస్సులకు దగ్గర చేసాయి. పుస్తకాల పురుగైన శోభన్ స్వయంగా అనేక కవితలు సైతం రచించారు. చనిపోవడానికి చాలా సంవత్సరాల ముందునుంచీ బౌద్ధపద్ధతిలో ధ్యానమార్గాన్నీ 'యోగా' ని అభ్యసిస్తూ వచ్చారు.

ఈ తరానికి శోభన్ బాబు అంటే ఎవరో తెలియదు-పాత తెలుగుసినిమాలు రాష్టంలో విడుదల కావడమే మానేసినందువల్లా, శోభన్ బాబు స్వయంగా సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వల్లా ! నా తరంవాళ్ళంతా శోభన్‌బాబుగారి అభిమానులే. అయితే ఆయన ఒక వేదాంతధోరణి గల మనిషి కావడంతో అభిమాన సంఘాల్ని పెద్దగా ప్రోత్సహించేవారు కారు. "సినిమా, వినోదం వఱకే పరిమితం, దాన్ని చూసి పిచ్చిపిచ్చి అభిమానాలు పెంచుకోవ"ద్దని ప్రేక్షకుల్ని హెచ్చరించేవారు. " మీరే మా దేవుడండీ"అని ఎవరైనా అంటే "నేనెలా మీకు దేవుణ్ణవుతాను ? మీ అమ్మానాన్నానే మీ దేవుళ్ళు. మీ గురువే మీ దేవుడు"అని మొహమాటం లేకుండా చెప్పేవారు. సినిమాల పట్ల వేలంవెఱ్ఱిని ప్రోత్సహించినట్లవుతుందనే ఉద్దేశంతో సన్మానాలు చేయించుకోవడానిక్కూడా అంగీకరించేవారు కారు. కీర్తికాంక్షకూ ప్రచారానికీ దూరంగా ఉండేవారు. అందుకే ఎన్ని దానాలు చేసినా అవన్నీ గుప్తంగా ఉంచారు తప్ప పైకి వెల్లడించలేదు. సినిమారంగంలో లోపించిన వ్యక్తిగత జీవిత క్రమశిక్షణ, దానివల్ల పాడైపోతున్న ఆర్టిస్టుల జీవితాల గుఱించి ఆయన తఱచుగా ఆవేదన చెందేవారు. సినిమావాళ్ళక్కూడా ఒక కుటుంబజీవితం ఉందనీ ఉండాలనీ వాదించేవాడాయన. సినిమావాళ్ళకు వారానికి ఆఱురోజుల పనిదినాలూ, పగటి షూటింగులూ ఏర్పడ్డానికి శోభన్ కృషే కారణం.


తండ్రి, మఱియు చెల్లెళ్ళతో శోభన్ (ఛాయాచిత్రం : 'ఈనాడు' నుంచి స్వీకృతం)

కొత్తరక్తం పరిశ్రమలోకి వస్తోందనే సత్యాన్ని గ్రహించిన శోభన్ 60వ ఏట తాను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన చేసిన చిట్టచివరి చిత్రం "అడవిదొర ". తరువాత సినిమారంగానికి స్వస్తిపలికి అంతకుముందునుంచి తాను చేస్తూ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పూర్తి సమయం వెచ్చించసాగారు. అందులో ఆయన పట్టిందల్లా బంగారమైంది. స్పష్టంగా తెలియదు కాని ఆయన చనిపోయేనాటికి ఆయన కంపెనీ వ్యాపారం కొన్నివందలకోట్లలో ఉందట. ఇంత ఉన్నా ఆయన గర్వం లేని మనిషనీ అందరికీ ఇదివరకటిలాగానే అందుబాటులో ఉండేవాడనీ ఆయన్ని కలిసినవాళ్ళంతా చెబుతారు. కాని మాటల విషయంలోను, మూటల విషయంలోను అతిఖచ్చితమైన మనిషి. తాను ఇతరులకు ఇవ్వాల్సి ఉన్నా ఇతరులు తనకు ఇవ్వాల్సి ఉన్నా రూలు ప్రకారమే వెళ్ళేవారు.

నటన పక్కన పెట్టినా వ్యక్తిగత జీవనశైలి రీత్యా కూడా అఖిలాంధ్ర జనావళికీ ఆదర్శప్రాయుడైన మహామనీషి శోభన్. ఆ అందం, ఆ సంస్కారం, ఆ కఠోరసాధనా, ఆ జీవితవిలువల జ్ఞానం, ఆ ప్రజాభిమానం...పుడితే శోభన్‌లాగా పుట్టాలి ! బతికితే శోభన్‌లాగా బతకాలి.
!!

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్