15.12.08
మీడియా చేయించిన హత్యలు
12:22 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: వర్తమానం
ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన "విద్యార్థినులపై యాసిడ్ దాడి" అనే వార్తని నా భార్య నా దృష్టికి తెచ్చినప్పుడు నేనది ఆమూలాగ్రం చదివి ఆమెతో "ఇది ఇంత భారీ స్థాయిలో ప్రచురించదగ్గ వార్త కాదు. ఎనిమిదిన్నఱ కోట్లమంది మధ్య రోజూ జరుగుతున్న చెదురుమదురు సంఘటనల్లో ఇదొకటి. ఈ పిల్లలెవరో అనామకులు. కానీ ఇలా ప్రాధాన్యం లేని వార్తలకి ప్రాధాన్యం ఇస్తే అది చాలా భయంకరమైన పర్యవసానాలకి దారితీస్తుంది." అన్నాను. నేననుకున్నదే నిజం కావడం చాలా బాధగా ఉంది.
నా కంటే చిన్నవారు - వాళ్ళెవరైనా గానీ, ఎంత అపరాధులైనా గానీ, నాకు సంబంధం లేనివాళ్ళయినా సరే - వారి మరణాన్ని నేను చూడకూడదని, వినకూడదని నేననుకుంటాను. కాని ఇద్దఱి భవిష్యత్తు నాశనమైంది. మూడు లేత ప్రాణాలు గాలిలో కలిశాయి. వారి వారి తల్లిదండ్రులు జీవచ్ఛవాలయ్యారు. ప్రభుత్వం పరువు పోయింది. అంతిమంగా లాభపడింది మాత్రం మీడియా, మన ఫెమినిస్టు మీడియా. వాళ్ళ మాట చెల్లింది. వాళ్ళ కళ్ళు చల్లబడ్డాయి.
బాధితులు లేక బాధకులు ఆడవాళ్ళా ? మగవాళ్ళా ? అనేది నేను చూడను. ఎందుకంటే నా న్యాయబుద్ధి (sense of justice) మీడియా కంటే మిక్కిలి భిన్నమైనటువంటిది. నాక్కనిపించేది ఒక మానవ జీవిత విషాదం (human tragedy). దాడికి గుఱైన అమ్మాయిలు అనుభవిస్తున్న చిత్రహింసతో పాటు పోలీసుల చేత హత్య చేయబడ్డ ఎదిగొచ్చిన కొడుకుల్ని తలచుకొని కుమిలిపోతున్న వారి తల్లిదండ్రుల గర్భశోకం కూడా కర్ణకఠోరంగా నా చెవుల్ని తాకుతోంది. చనిపోయే ముందు ఆ అబ్బాయిల కళ్ళల్లో కదలాడిన ఆత్మఘోష కూడా నన్ను స్పృశిస్తోంది.
లౌకిక దృష్టితో చూస్తే ఈ సంఘటనపై మనకి కర్ణాకర్ణిగా లభిస్తున్న సమాచారాన్ని బట్టి ఎవరి పక్షాన నిలబడాలో నాకు అర్థం కాలేదు. నాకు విషయాల లోతు కావాలి, నినాదాలు కాదు. నాకు వారివారి యొక్క వ్యక్తిగతమైన సూక్ష్మ వివరాలు (fine details) కావాలి, పైపై ఉద్ఘాటనలు కాదు. కనుక ఆ అబ్బాయిలు తమ నోటితో తాము న్యాయస్థానంలో ఱేపేం చెప్పబోతున్నారో, జరిగిన సంఘటనకి వారి నుంచి లభించే పాఠాంతరమేమిటో నని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాను. కానీ ఇంతలోనే వారిని చంపేశారని తెలిశాక నాకొక్క క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. మనం జీవిస్తున్నది ప్రజాస్వామ్యంలోనేనా ? అని దిగ్భ్రాంతి కలిగింది. అలా చంపేశాక మనకీ, అతనికీ తేడా ఏంటో కూడా నాకర్థం కాలేదు. అతనిలాంటి ఒక అనధికార ప్రైవేటు వ్యక్తి యౌవనపు ఉడుకురక్తంతో కక్షగా చేసినదానికి, నెత్తిమీదికి ఇన్నేళ్ళొచ్చి చట్టం, ధర్మం అన్నీ తెలిసి చేసిన అధికార తుపాకుల దుర్వినియోగానికీ మధ్య విభజనరేఖ చెఱిగిపోయిన దశలో - నేరస్థుడి మీద ఏ మొహం పెట్టుకొని నేరారోపణ చేస్తాం ? చేసిన నేరం ఎలాంటిదైనా ముందు నేరస్థుణ్ణి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడం, అతను తన వాదన వినిపించడం కోసం ఒక న్యాయవాదిని నియమించుకొనే అవకాశం ఇవ్వడం, అతని నేరం నిరూపణయ్యే దాకా అతన్ని నేరస్థుడుగా కాక కేవలం ఆరోపితుడు (accused) గానే భావించడం, అతని మీద ఆ నేరాన్ని ఆరోపించినవారు ఆరోపించడం దగ్గఱ ఆగిపోకుండా ఆ నేరాన్ని నిరూపించే బాధ్యత కూడా స్వీకరించడం, న్యాయవిచారణ పూర్తయ్యే దాకా ఆ కేసు గుఱించి మీడియాతో సహా ఎవరూ మాట్లాడకుండా కట్టడి చెయ్యడం - ఇవన్నీ నాగరిక దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు అవలంబించే అంతర్జాతీయ రీతి-రివాజులు.
ముఖ్యంగా నాకర్థం కానిది - మనకి మగపిల్లలున్నంత మాత్రాన ఆ చనిపోయిన అబ్బాయిల ఘాతుకాన్ని సమర్థించాలా ? లేదా, మనకి ఆడపిల్లలున్నంత మాత్రాన ప్రభుత్వమూ, పోలీసులూ చేసిన ఈ వెధవ పనిని వెనకేసుకు రావాలా ? వాళ్ళతో మనమెందుకు తాదాత్మ్యం చెందాలి ? వాళ్ళ స్వార్థాల్లో మన స్వార్థాన్నెందుకు దర్శించుకోవాలి ? ఆ నేరస్థుడెవరో వ్యక్తిగతంగా మనకి తెలియదు. నేనెప్పుడూ అతన్ని చూడలేదు. ఆరోపితుడికి తన వాదనేంటో చెప్పుకునే అవకాశం కూడా లేకుండా అతన్ని చంపేసినప్పుడు, అతని నేరం నిరూపణ కానప్పుడు, మీడియా వార్తలు తప్ప అతని గుఱించి తెలుసుకునేందుకు సముచితమైన వేదిక ఏదీ మనకి లేకుండా పోయినప్పుడు అతని చావుకి మనం సంబరాలు చేసుకోవడంలో అర్థం లేదు. అతను మనకేమవుతాడు ? అలానే అతని చేతిలో దాడికి గుఱైన పిల్ల మనకేమవుతుంది ? వాళ్ళని చంపేయమని ఆదేశాలిచ్చిన ప్రభుత్వానికి గాని, ఆ ఆదేశాల్ని అమలు జరిపిన పోలీసులగ్గానీ వాళ్ళేమవుతారు ? మనకేమీ కానివాళ్ళ గుఱించి మనం ఆవేశపడ్డంలో అర్థం ఏమిటి ? వాళ్ళ మధ్య గొడవలేంటో మనకి తెలియదు. మనకి సంబంధం లేదు. తటస్థులుగా మనక్కావాల్సింది ఒకటే - అది న్యాయపరమైన రీతి-రివాజులు ఖచ్చితంగా అమలు కావడం. అది తప్ప అన్నీ మాట్లాడుతున్నారు !
ఐదువేల సంవత్సరాల మహాచరిత్రా, బృహత్‌సంస్కృతీ అంటూ మనం ఎన్ని డంబాలు పలికినా ఆచరణాత్మకంగా మనం మిగతా ప్రపంచమంత బుద్ధిజీవులం కాము. మనం ఏ బాధ్యతా అనుభూతి చెందని వట్టి Emotional stupids మాత్రమే. ఆ ముగ్గుఱబ్బాయిల్ని పోలీసులు హత్య చేశాక కొంతమంది చేసిన హర్షధ్వానాలే ఇందుకు నిదర్శనం. వాళ్ళకి దీని భవిష్యత్‌పరిణామాలు తెలియవు. ఱేపు పోలీసులు/ రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాలకి మన చావు ఉపకరిస్తుందనుకుంటే నిన్నూ, నన్నూ, లేకపోతే మన పిల్లల్నీ ఏదో ఒక ఆరోపణ మీద తీసుకెళ్ళి ఏ నిర్జన ప్రదేశంలోనో కాల్చి చంపేసి "చచ్చినవాళ్ళ దగ్గఱ ఆయుధాలు దొఱికాయి, ఉగ్రవాద సాహిత్యం లభించింది, లేకపోతే గంజాయి గట్రా పట్టుబడ్డాయి. మమ్మల్నే చంపబోయారు" అని మీడియాతో కథలు చెబుతారు. "కా"దని మొత్తుకోవడానికి ఆ చచ్చినవాడు బతికి రాలేడు గదా ! లేకపోతే, ఆ చచ్చినవాడు బ్రాహ్మడైతే "వాడు దళితద్వేషి" అనీ, దళితుడైతే "బ్రాహ్మణద్వేషి" అనీ మీడియాకి ఉప్పందించి - ఆ విధంగా కులపరమైన, పార్టీపరమైన వర్గీకరణల స్థాయికి దిగజారి వాడి మీద ఎవరికీ మానవ సహజమైన సానుభూతి లేకుండా చెయ్యడానికి ఇతోధికంగా ప్రయత్నిస్తారు.
ఇప్పుడు చేస్తున్నది కూడా అందుకు భిన్నమని తోచదు. ఈ దృష్టాంతంలో పోలీసుల పాత్ర కంటే కూడా మీడియా పాత్ర చాలా ఎక్కువ. చాలాకాలం నుంచి మన ఫెమినిస్టు మీడియా ఒక తప్పుడు పాత్రికేయ విధానానికి మనసా, వాచా, కర్మణా కట్టుబడి ఉంది. అదేమిటంటే - ఒక స్త్రీకి ఎక్కడో ఏదో జరిగితే అది అందఱు స్త్రీలకీ జరుగుతున్నట్లు, అది మనమంతా వృత్తులూ, ఉద్యోగాలూ మానుకొని మఱీ ఆలోచించాల్సినంత గజిబిజి సామాజిక సమస్య అయినట్లు, ఆ విధంగా స్త్రీలు మాత్రమే అన్ని కష్టాలకీ లోనవుతున్నట్లూ ప్రచారం చెయ్యడం. వాళ్ళు ఇలాంటి ప్రచారాలతో గత కొన్ని దశాబ్దాలుగా ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ మధ్య చాలా గొప్ప అగాధాన్ని సృష్టించడంలో సఫలీకృతులయ్యారు. ఇప్పుడు వారి కొంగ్రొత్త డిమాండ్ ఏంటంటే - ప్రేమోన్మాదుల దాడుల్ని నిరోధిస్తూ "అత్యంత కఠినమైన" చట్టం తేవాలని ! ఇప్పటికే అనేక కఠిన చట్టాలున్నాయి. ఆ చట్టాలు కాపరాల్ని కూలదోస్తున్నాయి. ఇప్పుడు ఇంకో చట్టం వస్తే తనమాట విని తనని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడని మగపిల్లల మీద ఆడపిల్లలు ఆ చట్టాన్ని ప్రయోగిస్తారు. మగపిల్లల ఆస్తి కొట్టేయాలని కాచుక్కూచున్న దుష్టశక్తులు కూడా తోడవుతాయి. దీనికి ఇంకో పక్కపర్యవసానం ఏంటంటే మనం తఱచుగా నగరోద్యానాల్లో చూస్తున్న ప్రేమపక్షులన్నీ భవిష్యత్తులో అదృశ్యమైపోతాయి. అలాగే సహవిద్యాలయాలూను (co-education colleges). ఇదేం ఆధునికతో నాకు తెలీదు.
దీన్ని అమ్మాయిలకీ, అబ్బాయిలకీ మధ్య ఘర్షణగా మీడియా చిత్రిస్తోంది. ఇది ఒకానొక పాతకాలపు దృక్పథానికి రూపాంతరమే తప్ప తదన్యం కాదు. ఆడదాని పేరు వినపడ్డ ప్రతి సందర్భంలోను దాన్ని ప్రేమవ్యవహారంగానో, కామవ్యవహారంగానో చిత్రించడం నాకు తెలిసి చాలా చాలా పాత ధోరణి. ఆడదాన్ని కేవలం శృంగార వస్తువుగా చూసిన కాలం నాటి ముతక ధోరణి. అదే ధోరణిని ఈ మీడియా ఇంకో రూపంలో వేఱే రకాల మాటలతో కొనసాగిస్తోంది. మనం మీడియాని గుడ్డిగా అనుసరిస్తే - వాళ్ళు మనల్ని ఎటు తీసుకెళ్ళదల్చుకున్నారో అటు గుడ్డిగా వెళ్ళిపోతాం. వాళ్ళు మనల్ని స్త్రీపురుష ఘర్షణ వైపు తీసుకెళ్ళ దల్చుకున్నారు. వాళ్ళూ, రాజకీయ నాయకులూ కలిసి ఆడవాళ్ళని ఒక నియోజక వర్గం (constituency) గా, వోట్‌బ్యాంకుగా మార్చిపారేశారు. వాళ్ళే ఒకప్పుడు తమ రాతలతో ఎస్సీ, ఎస్టీల్ని, అటుపిమ్మట ముస్లిముల్ని వోట్‌బ్యాంకులుగా మార్చారు. అయితే సమాజంలో ఎవరిని వోట్‌బ్యాంకులుగా మార్చినా దాని ఫలితాలు దారుణంగా ఉంటాయని ఇప్పటి దాకా మన అనుభవం నిరూపిస్తోంది. అయినా మనుషులకి ఇంకా బుద్ధి రాకపోవడం విచారకరం.
వాళ్ళ నోటి వెంట "ఆడవాళ్ళకి రక్షణ లే"దని వింటున్నాం. ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉందో నేను తెలుసుకో గోరుతున్నాను. ఏడాదికి మూడొందల రోజులు బైకు మీద ఆఫీసుకెళ్ళేవాడు ఏదో ఒక రోడ్డు ప్రమాదానికి బలయ్యే అవకాశం ఆఱొందల సార్లుంటుంది. అంటే మనుషులు ఎంతగా బయటి జీవితానికి గుఱవుతారో అంతగా వారు నేరాలకీ, ఘోరాలకీ బలయ్యే రిస్కు స్థాయి పెఱుగుతుంది. ఇందులో ఆడా, మగా తేడా లేదు. "మగవాళ్ళు బలి కావచ్చు, ఫర్వాలేదు, ఆడవాళ్ళు మాత్రం బలి కాకూడ"దని వాదించడం ఒక మూర్ఖత్వం. వాస్తవంలో దేశంలో దాడులకీ, హత్యలకీ, ఆత్మహత్యలకీ, ప్రమాదాలకీ బలవుతున్నది ఎక్కువగా మగవాళ్ళే. తేడా ఎక్కడొస్తుందంటే, మగవాళ్ళు ఆడవాళ్ళని తమ క్షేమానికి బాధ్యులుగా చెయ్యరు. అదొక అంతర్‌లింగ సమస్యగా చిత్రించుకోరు. వారు తమ విషయంలో Case to case approach ని అనుసరిస్తారు. అదే సమతూకం (balance) ఆడవాళ్ళ దగ్గఱికొచ్చేసరికి పూర్తిగా లోపించి, ఆడదాని కష్టాలన్నీ ఆడదానికి మగవాడు చేస్తున్న అన్యాయంగా ఎందుకు ప్రచారంలోకి వస్తున్నాయో ఇందుకు బాధ్యులెవరో ప్రశ్నించాల్సిన అవసరముంది.
ఇలాంటి సందర్భాల్లో మీడియా పోషించ బూనుకొనే బహుపాత్రాభినయం నాకు పరమ అసహ్యంగా తోస్తుంది. వాళ్ళు - తామే నేరారోపణ చేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. తామే న్యాయం జరగాలంటూ ప్రజల్లో కలిసిపోయి ఉద్యమించే ఆందోళన కారులు. తామే అపరాధ పరిశోధన చేసే సి.ఐ.డి.లు. తామే ధర్మాధర్మాలు మాట్లాడే న్యాయవాదులు. తామే జరిగింది కళ్ళారా చూసినట్లు చెప్పే ప్రత్యక్ష సాక్షులు. తామే తీర్పులిచ్చి శిక్షలు విధించే న్యాయమూర్తులు కూడాను ! ఔరా హతవిధీ ! ఘోరకలీ ! ఎన్‌కౌంటర్‌ల పేరిట ఈ హత్యలు చెయ్యడానికి ప్రభుత్వాన్ని ప్రేరేపించినది మీడియా. వాళ్ళు ఒక చిన్న సంఘటనకి మూడో ప్రపంచయుద్ధమంత కవరేజ్ ఇచ్చి మాస్ హిస్టీరియా సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆవేశకావేశాలు పెంచారు. ఎన్నికల సమయంలో ఏదో ఒక విడ్డూరం చేసి పరువు కాపాడుకోవాలనే ఆత్రంలోకి ప్రభుత్వాన్ని దించారు. అలా ఆ అబ్బాయిల్ని చేతులారా హత్య చేయించారు. ఇలా ఒక వార్తాపత్రికో, ఛానలో చేతిలో పెట్టుకొని మన మానవ హక్కుల్నీ, అంతరాత్మల్ని శాసిస్తున్న ఈ ఫెమినిస్టు మీడియాని నేనెన్నటికీ క్షమించలేను.--------------------------------------------------------------------------------
