శిష్యుడు : స్వామీ ! వైరాగ్యం లేనిదే మోక్షం సిద్ధించదని విన్నాను. కానీ నాకు అంత వైరాగ్యం కలగట్లేదు. ఏం చెయ్యాలి ?
గురువు : నాయనా ! వైరాగ్యం సంగతెలా ఉన్నా వైరస్సులతో కూడుకున్న కంప్యూటర్లే మోక్షానికి ప్రధానమైన ఆటంకం. ఎందుకంటే వాటితో కుస్తీపట్టడంలోనే నీ ఆయుష్కాలమంతా వృథా అవుతుంది. అలాంటి కంప్యూటర్ల మూలాన నీకు ప్రపంచం మీద వైరాగ్యం కలిగినా ఆ తర్వాత తపస్సు చెయ్యడానికి మాత్రం సమయం చాలదు.
శిష్యుడు : స్వామీ ! తమరు పూర్వాశ్రమంలో అష్టావధానాల్లో పాల్గొనేవారా ?
గురువు : ఎందుకు నాయనా ! అలా అడుగుతున్నావు ?
శిష్యుడు : ఆఁ ! ఏమీ లేదు. అష్టావధానాల్లో అప్రస్తుత ప్రసంగమనే అంశం ఒకటుంటుంది. అది మీరే నిర్వహించేవారా ? అని !
గురువు : లేదు నాయనా ! పూర్వాశ్రమంలో అష్టాచెమ్మా సినిమా చూశాను తప్ప అష్టావధానాలెప్పుడూ చెయ్యలేదు.
శిష్యుడు : మఱి అష్టాంగ యోగాన్ని ఎలా అభ్యసించారు ? అది చెప్పి నన్నుద్ధరించండి.
గురువు : (ఆవులిస్తూ) పిచ్చివాడా ! అష్టాంగ యోగం గుఱించా నువ్వింత దూరం హిమాలయాల దాకా వచ్చావు ? ఇక్కడేముంది ? నా బొంద. తింటే నిద్రా, తినకపోతే నీరసమూను. అంతే ! అసలు యోగాభ్యాసానికి అనువైన ప్రదేశం హైదరాబాదు నగరమే. నేనక్కడే నేర్చుకున్నాను.
శిష్యుడు : అలాగా స్వామీ ! నాకింతవఱకూ ఆ సంగతి తెలీనే తెలీదు. ఎవరూ చెప్పారు కారు. అయినా హైదరాబాదులో మాత్రం మీకంటే గొప్ప గురువులున్నారంటారా ? నమ్మలేకపోతున్నాను.
గురువు : హిహ్హిహ్హీ ! వెఱ్ఱి నా శిష్యా! హైదరాబాదులో గురువులుండడమేంటోయ్ ? హైదరాబాదే ఒక గురువైతేను.
శిష్యుడు : అదెలా స్వామీ ? నా మీద కృప చేసి వివరించ ప్రార్థన.
గురువు : చూడు శిష్యా ! యోగంలో పరిపూర్ణులం అవాలంటే శమమూ, దమమూ, ఇంద్రియ నిగ్రహమూ, క్షాంతి, తితిక్ష, బ్రహ్మచర్యమూ, ప్రాణాయామమూ, ఈశ్వర ప్రణిధానమూ మొదలైన గుణసంపత్తి కావాలి. వాటితో పాటు మానావమానాలకి అతీతంగా ఉండడమూ, శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వాల్ని ఓర్చుకోవడమూ, అహంకార మమకారాల్ని వదిలిపెట్టడం కూడా అవసరమే. వేఱే చోట్లనయితే ఈ గుణాల్ని ప్రత్యేకంగా కష్టించి కృషి చేసి అభ్యసించాల్సి ఉంటుంది. కాని హైదరాబాదులో కొంతకాలం పాటు ఉన్నావంటే చాలు, అవన్నీ నీకు సహజంగా, స్వాభావికంగా అబ్బుతాయి నాయనా !
శిష్యుడు :: అదెలా స్వామీ ! అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా అంత మహత్తరమైనదా ఆ పవిత్ర హైదరాబాదు గడ్డ ?
గురువు : గడ్డంటే గడ్డా ? మహాగడ్డ బిడ్డా ! ఎలాగంటే, చెబుతాను విను.
ట్రాఫిక్కుతో సహా ఏ విషయంలోను ఏ నియమ నిబంధనలూ పాటించని హైదరాబాదు జనంతో కలిసిమెలిసి జీవించడం ప్రారంభించాక నీకు పాపుల్ని క్షమించే విశాల హృదయం ఏర్పడుతుంది. అదే క్షాంతి. ఎంత డబ్బిచ్చినా పాచికూడు మాత్రమే పెట్టే హైదరాబాదు హోటళ్ళలో నాలుగైదు సార్లు తిన్నాక, నీకు బయటి తిళ్ళు తినాలనే కోరిక శాశ్వతంగా అంతరించి ఎంత ఆకలేస్తున్నా సరే ఇంటికెళ్ళేదాకా కడుపు మాడ్చుకోవడానికే సిద్ధపడతావు చూడు, అప్పుడు నీకు ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో అనుభవంలోకి వస్తుంది. ఎప్పటికీ సరాళం (clear) కాని రద్దీ కూడళ్ళలో నీ బండిలోని ఇంధనమంతా తగలేస్తూ నువ్వు గంటల తరబడి ఆగిపోతూంటే మోక్షం కోసమూ, భగవద్ దర్శనం కోసమూ ఎంత ఓర్పుగా తొందఱపడకుండా ఎదురుచూడాలో నువ్వు తర్ఫీదవుతావు. అదే తితిక్ష. అ రోడ్ల మీద గాలి పేరిట చెలామణి అయ్యే కాలకూట విషాన్ని పీల్చలేక నువ్వు ముక్కు మూసుకొని బతకడం అలవాటు చేసుకుంటావు. అలా నీకు సహజ ప్రాణాయామం పట్టుబడుతుంది. అక్కడ ఒళ్ళంతా ప్రదర్శిస్తూ కళాశాలల్లోను, రెస్టారెంట్లలోను, పబ్బుల్లోను తిరిగే యువతీజనం అనాటమీని పదేపదే ఎక్స్-రే కళ్ళతో చూసీ చూసీ పాతబడిపోయి ఆఖరికి నీలో పురుషోచితమైన అన్ని స్పందనలూ చచ్చి నువ్వు యౌవన వయసు చెల్లిపోకముందే మానసిక నపుంసకుడుగా మారాక నీకు సహజ బ్రహ్మచర్యం ప్రాప్తిస్తుంది.
హైదరాబాదులో ప్రస్తుతం భగవంతుడి పాలన నడుస్తోందని గోలగోలగా చెప్పుకుంటున్నారు. అందుచేత అక్కడెవరూ భగవంతుణ్ణి స్మరించకుండా బయటికెళ్ళరు. ఎందుకంటే బయటికెళ్ళినవాడు తిరిగొస్తాడనే నమ్మకం లేదు. ఒక మానవుణ్ణి ఇంకో మానవుడు కాపాడగలడని ఏ మతమూ చెప్పట్లేదు నాయనా ! కాబట్టి అందఱినీ కాపాడేవాడు ఆ భగవంతుడేనని హైదరాబాదీల నమ్మకం. ఏ దేశంలోనైనా రాజధానికి కట్టుదిట్టమైన రక్షణా, మిగతా ప్రాంతాలకి మాత్రం కొంచెం సడలింపూ ఉంటాయి. కాని హైదరాబాదు విశిష్టత ఏమిటనగా, అది రాజధాని అయినప్పటికీ దానికి ఏ రక్షణా లేదు. మిగతా జిల్లాల్లో ఎక్కడైనా బతగ్గలం, దొంగతనాలూ దోపిడీలూ, ఉగ్రవాద చర్యలూ లేకుండా ! కానీ హైదరాబాదులో మాత్రం అలా కుదరదు నాయనా ! ఎందుకంటే అది మానవుడి రక్షణలోకి వస్తే మనకి ఈశ్వర ప్రణిధానం, అనగా నిరంతర భగవన్నామ స్మరణ లేకుండా పోతుంది. అలా హైదరాబాదు మనకి నేర్పే యోగలక్షణాలో ఒకటి లోపిస్తుంది.
హైదరాబాదులో ఎవడికీ ఎదుటివారిని గౌరవంగా సంబోధించడం గానీ, మనిషిగా విలువిచ్చి మాట్లాడ్డం గానీ, చేసిన మేలు గుర్తుపెట్టుకోవడం గానీ తెలియదు గనుక అనేక అవమానాలకి నీ మనసు రోసి చివఱికి "ఛీ ! ఈ వెధవ బతుక్కి ఏదైనా ఒకటే !" అనే స్థితికొచ్చి మానావమానాలకి అతీతుడుగా మారతావు.
హైదరాబాదులో నువ్వు ఏ.సి. అని బోర్డు కట్టి ఉన్న సినిమాహాళ్ళకు వెళ్ళినప్పుడు వాడు మొదట్లో ఏ.సి. వేసి ఆ తరువాత నువ్వు సినిమా చూస్తూ ఏమఱుపాటుగా ఉన్న సమయంలో ఆ ఏ.సి ఆపేస్తాడు. అప్పుడు నీకు ఉక్కపొయ్యడం మొదలుపెడుతుంది. "ఇందాక నిజంగానే ఏ.సి. వేశాడు గదా ! బహుశా ఈ ఉక్కపోత నా మనోభ్రాంతి" అని నీకు నువ్వే సర్ది చెప్పుకొని అజ్ఞానాన్ని తుడుచుకొన్నట్లుగా నీ యొక్క తాజా చెమటని తుడుచుకుంటావు. మఱి అదే నాయనా ! శీతోష్ణాది ద్వంద్వాల్ని జయించడమంటే !
వస్తువుని పదిమందితో కలిసి పంచుకోవడంలో ఉన్న ఆనందం ఎలాంటిదో హైదరాబాదులో అనుభవంలోకి వచ్చినట్లుగా ఇంకెక్కడా రాదు శిష్యా ! అక్కడ నువ్వు కష్టపడి కొనుక్కున్న స్థలానికి ఇంకో పదిమంది కూడా యజమానులేనని తెలిసిన రోజు ఈ ప్రపంచంలో నీ పేరు తప్ప ఇంకేదీ నీది కాదనే లోతైన తాత్త్విక సత్యాన్నిగ్రహించి అహంకార మమకారాల్ని అలవోకగా పరిత్యజిస్తావు నాయనా !
కాబట్టి నీకు మోక్షం కావాలంటే వెంటనే హైదరాబాదు వెళ్ళు. అది "ఖర్మభూమి", తప్పో-భూమి.......పోతుగడ్డ. విజయీభవ, దిగ్విజయీభవ !!
10.12.08
హైదరాబాదు : ఒక ఆధ్యాత్మిక పాఠశాల
6:00 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: కాల్పనికాలు
