7.12.08
పనిలేనివారు కావలెను !
6:00 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: సాంఘికం
ఈ కాలంలో ఇంటికి ఇద్దఱు-ముగ్గుఱు చొప్పున ఉద్యోగాలు చెయ్యగలగడానికి గల అసలు కారణం అనేక దేశాల ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెఱిగి చదువుకున్నవాళ్ళకి ఉద్యోగావకాశాలేర్పడ్డం. వాళ్ళకి ఉద్యోగావకాశాలుంటే చదువు లేనివాళ్ళక్కూడా ఏదో ఒక పని దొఱుకుతుంది. ఈ ఆనందనౌక ఇలానే ఇంకా ఎంతకాలం పాటు పయనిస్తుందో మనకి తెలియదు.
అయితే ఈ ఆనందం వెనుక ఎవరూ గమనించని - ఎక్కడా ఉద్ద్యోతితం (highlighted) కానటువంటి ఒక విషాదకోణం కూడా ఉంది. ఇలా ఇద్దఱూ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలవి సాధారణంగా కేంద్రక కుటుంబాలు (nuclear families). వాటిల్లో భార్యాభర్తలూ, వారి ఇద్దఱు పిల్లలూ తప్ప ఇంకెవరూ ఉండరు. ఎవరికి బాగాలేకపోయినా చూసుకోవడానికెవ్వరూ ఉండరు. ఆ భార్యాభర్తలకేమో సెలవు దొఱకదు. కొన్నిసార్లు స్వయంగా ఆ భార్యో, ఆ భర్తో మూలపడితే ఆ జీవితం ప్రత్యక్ష నరకం. ముఖ్యంగా మన దేశంలో ఆడవాళ్ళ చేత అందఱూ చేయించుకుంటారు గానీ వాళ్ళు మూలపడితే వాళ్ళకి చేసేవాళ్ళెవరూ ఉండరు. కేంద్రక కుటుంబాల్లో అయితే మఱీను. "ఎవరూ ఎప్పటికీ మూలపడరు" అని ఈరోజుల్లో అంత నమ్మకంగా చెప్పలేం, రెండు కారణాల దృష్ట్యా ! ఒకటి, మనం మన చుట్టూ గమనిస్తే ఇంటికో దీర్ఘకాలిక రోగి కనిపిస్తారు. రెండోది - ఈ రాష్ట్రంలో మీరు ఎవరిని కదిలించినా "మావాళ్ళకి/ మాకు తెలిసినవాళ్ళకి రోడ్డు ప్రమాదం జరిగిం"దని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. మా చిన్నప్పుడు ఆడవాళ్ళు రోడ్డు ప్రమాదాల్లో ఇఱుక్కోవడం గుఱించి ఎప్పుడూ వినలేదు. కానీ ఇప్పుడు వాహనాల కింద పచ్చడైన ఆడవాళ్ళ శవాల్ని తఱచుగా చూస్తూంటే/ వింటూంటే "ఇంతలోనే ఎంత దూరం వచ్చేశామో" అనిపిస్తుంది. అలాగే కొన్ని జబ్బులు మగవాళ్ళకే పరిమితమనుకునేవాళ్ళం. అవి ఇప్పుడు ఆడవాళ్ళక్కూడా వస్తూంటే మగ జీవన విధానాన్ని ఎవరు అవలంబించినా ఫలితం ఒకటేనేమో ననిపిస్తోంది.
ఇప్పుడు చిన్నచిన్న విషయాల్లో కూడా ఎవరూ ఎవరికీ సహకరించలేని పరిస్థితి. ఇంట్లో ఏదైనా వస్తువు పాడయితే దాన్ని తీసుకెళ్ళి బాగుచేయించడానికి ఎవరికీ తీఱుబడి లేక దాన్ని అలానే వదిలేసే సందర్భాలెన్నో ! ఇంటికి మరమ్మత్తులొస్తే చేయించకుండా నెలల తరబడి గడిపేసిన కుటుంబాలు నాకు తెలుసు. ఇంటికి పోస్ట్ వచ్చినా, మునిసిపాలిటీ నుంచి డిమాండు నోటీసొచ్చినా, గ్యాస్ సిలిండరొచ్చినా, ఫోను బిల్లొచ్చినా, కరెంటు బిల్లొచ్చినా తీసుకొనేవాళ్ళు కూడా ఉండరు. ఆ బట్వాడా మనిషి దాన్ని ఏ గేటు సందులోనో దూర్చి వాడి మానాన వాడు చక్కా పోతాడు. అది కాసేపు రెపరెపలాడి అటుపిమ్మట వాయుదేవుడితో లేచిపోతుంది. తమకి ఏ బిల్లూ రాలేదేంటి చెప్మా ? అని వీళ్ళు అనుకుంటూండగా ఒక శుభదినాన వాళ్ళ కరెంటు కట్ చేస్తుంది కార్పొరేషను. అలానే కొళాయిల్లో మంచినీళ్ళొస్తే పట్టుకొనే దిక్కులేక ఆఫీసు నుంచి వచ్చి పక్కింటివాళ్ళని అనునిత్యమూ నీళ్ళు అడుక్కుంటాయి కొన్ని ధనిక జంటలు. గైర్హాజరు జంటలకి సరిగా తిండి తినే యోగం కూడా ఉండడంలేదు. ఎవరాఫీసు క్యాంటీన్‌లో వారు తినడం అలవాటయ్యి ఇంటి దగ్గఱ వంట చేసుకోవడానికి బద్ధకించి ఆదివారాల్లో హోటళ్ళ నాశ్రయిస్తున్నారు. నాకు తెలిసిన ఒక కుటుంబంలో నైతే మూడు పూటలకీ కలిపి ఒకేసారి మ్యాగీ నూడుల్స్ ఫ్యామిలీ ప్యాక్ వండుకోవడం గమనించాను. అలా ఈ సంపాదనాపరులైన గైర్హాజరు జంటల (absentee couples) కాపరాలు పైకి వెల్లడి కానటువంటి అనేకమైన మానసిక టెన్షన్లతో కూడుకొని ఉన్నాయేమో ననిపిస్తోంది.
ఈ భవసాగరాలకి తోడు, ఎన్ని రోజులకీ ఇల్లు సర్దక అదో పాతసామాన్ల కొట్టుని తలపిస్తూ ఉంటుంది, ముఖ్యంగా వాళ్ళు ఇంకో ఇంటికి మారినప్పుడు. ఇంతకంటే ముఖ్యమైన విషయం కూడా ఒకటుంది. అది, ఇంట్లో ఎవరైనా లేవలేని ముసలివాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి తీఱాల్సిన అవసరాలు. వాటిని పూర్తిగా గాలికొదిలేస్తున్నాయి గైర్హాజరు జంటలు. అందఱమూ ఏదో ఒకరోజున ఆ చరమసంధ్యని చేరుకోవాల్సిన వాళ్ళమే. అయినా మనకి ఆ విషయం గుర్తురాదు. అందుకని ఇప్పుడు ముసలివాళ్ళని చూసుకోవడం కూడా ఒక వ్యాపారమైపోయింది. హైదరాబాదులో హెరిటేజ్ హాస్పిటల్ వంటి సంస్థలు 'నెలకింత' అని చెల్లిస్తే ప్రతిరోజూ మనింటికి ఒక ఆడమనిషిని పంపిస్తాయి, రోగుల్నీ, ముసలివాళ్ళనీ చూసుకోవడం కోసం.
అందఱూ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఎవరూ సుఖపడ్డంలేదు. అదే ఇందులో ఉన్న వైచిత్రి. ఎప్పుడైనా కాస్త శరీరబలం అవసరమైన పనిలో సహాయం కోసం చుట్టుపక్కల చూస్తే ఒక్క కుఱ్ఱవాడు కూడా అందుబాటులో ఉండడు. అలాగని వాళ్ళకేదో మించిపోయే పనులున్నాయని కాదు. మన సమాజంలో సర్వేసర్వత్రా వ్యాపించిన డబ్బువిలువలు మనుషుల్ని అలా ఇళ్ళలోంచి లేవగొట్టేస్తున్నాయి. మనిషికి ఉద్యోగం లేకపోవడాన్నీ, ఆదాయం లేకపోవడాన్ని మనం చాలా హీనమైన స్థితిగా పరిగణిస్తున్నాం, అందుచేత ఇంట్లో ఉండడానికి ఎవరూ ఇష్టపడ్డంలేదు. పని ఉన్నా లేకపోయినా, ఆదాయం ఉన్నా లేకపోయినా అందఱూ బయటికి వెళ్ళిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఆదాయం మన కళ్ళు కప్పేసింది. మనకి పిచ్చెత్తించింది. ఎవరి కోసమైతే సంపాదిస్తున్నామో వాళ్ళనే పట్టించుకోలేని ఆత్మహత్యా సదృశ స్థితికి చేరుకుంటున్నాం. ఇళ్ళు పూటకూళ్ళుగా, వల్లకాళ్ళుగా మారాయి. మనుషులు మెషీన్లయ్యారు.
నాకనిపిస్తోంది, పనీ, ఆదాయమూ లేని కుటుంబసభ్యులు కూడా చాలా చాలా అవసరమని ! వారు ఉండడం మనకి భారమూ కాదు, అవమానం అంతకంటే కాదు.
