తె.రా.స. పార్టీని స్థాపించిన కొత్తల్లో దాని అధ్యక్షుడు ఎవరికీ తెలియని ఒక అపూర్వ చారిత్రిక సత్యాన్ని ఆవిష్కరించి అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని దిగ్భ్రాంతిలో ముంచాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ "అమాయక తెలంగాణాని గడసరి ఆంధ్రా చేతుల్లో పెడుతున్నాను" అన్నాడట. అంతేకాదు, "ఆంధ్రా నుంచి తెలంగాణా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చు"నని కూడా సెలవిచ్చాడట. తద్ద్వారా పెళ్లినాడే నెహ్రూ విడాకుల మంత్రాలు కూడా చదివేశాడని తె.రా.స. భాష్యం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే (క్రీ.శ. ౧౯౫౬) నాటికి ఊహ తెలిసి వయసొచ్చి ఉన్న చాలామంది సీనియర్లు కూడా ఈ ప్రచారానికి "ఎట్టెట్టా ?" అని ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. తొలి తెలంగాణా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన చెన్నారెడ్డికే తెలియని విషయాలు, పెద్ద మనుషుల ఒప్పందం మీద స్వయంగా సంతకం చేసిన ఆ చెన్నారెడ్డే ఏనాడూ ప్రస్తావించని వివరాలు చంద్రశేఖరరావుకి ఎలా తెలుసో అది మనం అడక్కూడదు - అప్పటికి శ్రీమాన్ చం.శే.రా. గారు పాలు తాగుతున్న పసిబిడ్డ మాత్రమేనన్న వాస్తవం మనకి తెలిసినా సరే ! కీ.శే. పండిత నెహ్రూ ఇలాంటి అసందర్భపు మాటలు మాట్లాడే మనిషి కాదనే నమ్మకం ఉన్నవాళ్ళు "ఈ మాటలకు ఆధారాలేం"టని అడిగీ అడిగీ విసిగిపోయారు తప్ప తె.రా.స. అధ్యక్షుడు మటుకు ఈరోజు దాకా తన సొంత చారిత్రిక సత్యాలకి ఆధారాలు చూపించిన పాపాన పోలేదు. నెహ్రూ చిన్నా, చితకా మనిషి కాదని మనందరికీ తెలుసు. ఆయన ఏం మాట్లాడినా అది ప్రసార మాధ్యమాల్లో నమోదై తీరుతుందని కూడా మనకి తెలుసు. మఱి నిజంగా ఇంత వివాదాస్పదమైన ఉద్ఘాటనలు (statements) ఆయన చేసి ఉంటే, అవి ఆనాటి జాతీయ దినపత్రికలన్నింటిలోను ఆగమేఘాల మీద రాకుండా ఉండవే ! చాలా దినపత్రికలు తమ పూర్వసంవత్సరాల సంచికల్ని జాగ్రత్తగా భద్రపరుస్తాయి. అటువంటివాటిల్లో తెలంగాణా గడ్డమీదనే దశాబ్దాలుగా ప్రచురితమౌతున్న Deccan Chronicle కూడా ఉంది. వాళ్ళెవరూ చంద్రశేఖరరావు వాదనకి మద్ధతుగా తమ పాతసంచికల భాండాగారాల్లోంచి ఒక్కటైనా బయటికి తీశారు కాదు.
రాజకీయస్వార్థాల కోసం లేనివివాదాల్ని సృష్టించడమంటే ఇది.
సుమారు రెండు దశాబ్దాల క్రితం 'కాపునాడు' అనే సంస్థ శ్రీకృష్ణదేవరాయలు తమ కులస్తుడని ప్రకటించినప్పుడు ఇంతకంటే ఎక్కువ దిగ్భ్రాంతి కలిగింది. భారతదేశ చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలకున్న ప్రాధాన్యం సంగతి వేఱే విడమర్చ నక్కఱలేదు. తెలుగుభాషలో ఆయన మీద వచ్చినన్ని పుస్తకాలు గానీ, సినిమాలు గానీ వేఱే ఏ ఇతర చక్రవర్తి మీదా వచ్చి ఉండలేదు. కారణం - మనకి ఆయన గుఱించి చాలా విపులమైన వివరాలు తెలియడం, ఆయన రాసిన పుస్తకాలు కూడా విఱివిగా లభ్యమౌతూండడం. ఆయన తన గుఱించి తాను స్వయంగా కంఠోక్తిగా చెప్పుకున్నది మాత్రం క్షత్రియుణ్ణని ! నాకర్థం కానిదేంటంటే - మన ఊహాపోహలకే తప్ప ఒక వ్యక్తి తన గుఱించి తాను చెప్పుకునే వివరాలకి ఏమీ విలువ లేదా ? అని ! నీ తండ్రి పేరు అప్పారావయితే, అదే మాట నువ్వు నెత్తీ, నోరూ కొట్టుకొని చెబుతూంటే, వినకుండా "కాదు, నీ తండ్రి పాపారా"వని వాదించేవాణ్ణి నువ్వు మీదపడి కొట్టవా ? శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి రాక ముందు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినది ఆయన అన్నగారైన నరసింహరాయలు. ఆయన క్షత్రియుడు కనుకా, వారి తండ్రి కూడా క్షత్రియుడే కనుకా ఇందులో అనుమానించాల్సిందేమీ మనకి కనిపించదు. శ్రీకృష్ణదేవరాయలకి తమ కావ్యాలు అంకితమిచ్చిన కవులున్నారు. వారు తమ కావ్యావతారికల్లో ఆయన్ని క్షత్రియుడనే పేర్కొన్నారు. చూడబోతే ఆయన కర్ణాటక పశ్చిమ తీరానికి చెందిన తుళుభాషేయుడు. తెలుగు ఆయనకి నేర్చుకున్న భాషే తప్ప మాతృభాష కాదు. ఆయన కాపు కాదనడానికి ఇంత బలమైన చారిత్రికాధారాలుండగా - ఎంత కులాభిమానమున్నా ఇంత బహిరంగంగా ఇలాంటి పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికి మనసెలా ఒప్పుతుందో నాకు తెలియదు.
కులస్వార్థాలకోసం లేని-వివాదాల్ని సృష్టించడమంటే ఇది.
ఈమధ్య ఇంకో వివాదం వింటున్నాను. కామసూత్రాలు వ్రాసిన వాత్స్యాయనుడు పురుషుడా ? స్త్రీనా ? అని చర్చ. ఈ వివాదాన్ని మొదటిసారిగా లేవనెత్తినది ఈనాడు దినపత్రిక. అందులో ఒక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన వ్యాసంలో సదరు వ్యాసకర్త (వ్యాసకర్త్రి ?) ఈ అనుమానాన్ని వ్యక్తం చెయ్యడం జరిగింది. ఈ అనుమానానికి కారణమట, రతిలో స్త్రీ ఎలా తృప్తి చెందుతుందో, ఆమె స్వభావమేంటో వాత్స్యాయనుడు చక్కగా వివరించడమేనట. ఇక్కడ పట్టుబడిపోయారు. ఈ వ్యాసం రాసింది ఎవరా ? అని చూస్తే పేరు కనిపించలేదు. మన దేశ వాతావరణాన్ని బట్టి ఇలా సెక్సు వ్యాసాలు అనామకంగా రాసేవారు సాధారణంగా స్త్రీలే అయ్యుంటారని ఊహించవచ్చు. స్త్రీల శృంగార స్వభావం తెలియడానికి మనిషి స్త్రీజన్మెత్త నక్కఱలేదు, స్త్రీల లో-దుస్తులు డిజైన్ చేసేవారు స్త్రీలు కానట్లే !
నాకు గుంటూరులో ఒక బాల్యమిత్రుడుండేవాడు. అక్కడ ఎలెక్ట్రీషియన్ గా పనిచేసేవాడు. నిరంతర కామవాంఛా పీడితుడు. అతనికి అనేకమంది సంసార స్త్రీలతో సంబంధాలుండేవి. తన అనుభవాల రీత్యా నాకు చాలా విషయాలు చెబుతూండేవాడు. అతను స్వతహాగా రచయిత కాడు గానీ అయ్యుంటే మాత్రం అతను చెప్పే విషయాలు హాట్‌కేకుల్లా అమ్ముడు పోతాయనుకునేవాణ్ణి. వాత్స్యాయనుడు కూడా అలాంటి వేయిగుళ్ళ పూజారి కావచ్చు.
ఇంకొకటి. ఇలా ఆలోచించేవారికి ప్రాచీనకాలంలో పుస్తకాలు ఎలా వ్యాప్తి చెందేవో తెలియదనిపిస్తుంది. ఈ కాలంలో మాదిరి మాఱుపేర్లతో అనామకంగా రాతలు రాసి ప్రసిద్ధికెక్కడం ఆ రోజుల్లో సాధ్యపడేది కాదు. ఒక స్త్రీ మగపేరు పెట్టుకునో, లేదా ఒక మగవాడు ఆడపేరు పెట్టుకునో ఆ రోజుల్లో తమ రాతల్ని చెలామణీలోకి తేగలిగేవారు కారు. ఒక ముఖ్యకారణం - ముద్రణ, తన్మూలకంగా జరిగే పుస్తకప్రతుల భారీ ఉత్పత్తి, వాటి శీఘ్ర రవాణా అప్పుడు తెలియకపోవడం. ఏదైనా చేత్తో రాసుకోవలసిందే. కొన్ని పుస్తకాలైతే అలా రాసుకోవడానికి ఏళ్ళూ పూళ్ళూ పట్టేది. అందుచేత ఏది పడితే అది కాకుండా పండితులు యోగ్యమైన పుస్తకాలని నిర్ణయించినవి మాత్రమే రాసుకొనేవారు. సాహిత్యపు యోగ్యతల్ని చర్చించడానికి ప్రతి పెద్ద పట్టణంలోను పండిత సభలుండేవి. వాటి గుఱించి మనం నన్నయగారి భారతావతారికలోను, కాళిదాసు చరిత్రలోను, శ్రీపాద శ్రీవల్లభస్వామి చరిత్రలోను చదవొచ్చు. రచయితలు ఆ పండిత సభలకు తమ రచనలతో సహా వ్యక్తిగతంగా హాజరై వాటిని తమ నోటితో వినిపించి అక్కడివారి సందేహాలకి సంతృప్తికరంగా సమాధానాలు చెప్పిన తరువాతనే పండిత సభలు ఆ పుస్తకానికి ఆమోదముద్ర వేసేవి. ఇతర ప్రాంతాల్లోని పండిత సభలక్కూడా దాన్ని సిఫార్సు చేసేవి. పక్షాంతరంలో కొన్నిసార్లు రాజుగారి ఆమోదం పొందిన పుస్తకాల్ని పెద్దగా చర్చించకుండానే పండిత సభలు ఆమోదించేవి. అలా అది వ్యాప్తి చెందేది. మన కాలం దాకా బతికి బట్టగట్టి వచ్చిన అన్ని పుస్తకాలూ అలా పండిత సభల ఆమోదం పొందినవే. అందుచేత వాత్స్యాయనుడు కూడా అలా స్వయంగా తన పుస్తకంతో పండిత సభలకి హాజరై ఉండొచ్చు.
నేను కూడా వాత్స్యాయన కామసూత్రాలు చదివాను. వ్యక్తిగతంగా నాకేమనిపించిందంటే - మన దేశానికి చెందిన అన్ని ప్రాచీన పుస్తకాల్లానే అది కూడా పురుషుల చేత పురుషుల కొఱకు రచించబడిందని ! స్త్రీలకి నచ్చని విషయాలు చాలా ఉన్నాయి. "పరభార్యల్ని వశం చేసుకొని అనుభవించడం ఎలా ?" అనే అంశం మీద ఒక ప్రత్యేక అధ్యాయాన్నే కేటాయించాడు. విదర్భాది రాజకుటుంబాల స్త్రీలు కామవశాన తమ కన్నకొడుకులతో కూడా కలుస్తారంటాడు (స్వైరేవ పుత్రైర్ విదర్భాణాం...) మగవారు తమ పురుషాంగాల్ని కావలసిన పరిమాణానికి పెంచుకోవడం ఎలా ? అనేదాని మీద ఇంకో అధ్యాయం ఉంది. కాని స్త్రీలు తమ సౌందర్యాన్ని పెంపొందించుకొనే పద్ధతుల గుఱించి అదే స్థాయిలో వివరణల్లేవు.
కామసూత్రాల్ని రాసింది స్త్రీ అయినా, పురుషుడైనా మనకి ఒరిగేది ఏముంది ? అని ఆలోచిస్తే, ఇది మఱో ఫెమినిస్టు పిల్లిమొగ్గలా కనిపిస్తోంది. పురుషులంతా యమా సెక్సుస్వేచ్ఛని అనుభవించేస్తున్నారనే భ్రమలో ఉన్నారు వారు. ఆ ప్రాతిపదిక మీద మిగతా ఆడవాళ్ళని రెచ్చగొట్టాలని వాళ్ళు చాలాకాలం నుంచి ప్రణాళికలు రచిస్తున్నారు. "పదండి ! వెరైటీగా తిరిగేద్దాం !" అంటే మన సాంప్రదాయిక స్త్రీలు వినకపోవచ్చు. స్త్రీలు కూడా వెరైటీ తిరుగుళ్ళు తిరగడం మన సంప్రదాయంలో ఉందని నిరూపిస్తే వాళ్ళలో కాస్త కదలిక రావచ్చు. కనుక వారికొక దేశీయమైన ప్రాఙ్నమూనా (native archetype) కావాలి. అలాంటి స్త్రీలు మన ప్రాచీన సాహిత్యంలో ఆట్టే లభించడంలేదు. కాబట్టి ఒక మగ సెక్సు రచయితనే ఆడదని ప్రచారం చేస్తే పోలే ? ఎవడు చూసొచ్చాడు గనుక ?
నాకిప్పుడు అనుమానంగా ఉంది - ఱేపు ఒక వందేళ్ళ తరువాత లలితాబాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆడదే తప్ప మగవాడు కాదంటారేమోనని ! కాదని చెప్పడానికి నేనప్పటికి బతికి రాలేను గదా ! అలాగే ఆ మధ్య ఒకసారి The Hindu అనే హిందూవ్యతిరేక దినపత్రికలో భగవాన్ శ్రీ వివేకానందస్వాములవారి మీద ఆయన శిష్యురాళ్ళకున్న భక్తిశ్రద్ధల్ని వక్రీకరిస్తూ రాసిన రాత చదివాను. చాలా బాధ కలిగింది. వివిధ స్వార్థాల కోసం మనుషులు ఇలా ఏ వివాదమూ లేని విషయాల్ని పనిగట్టుకొని వివాదాస్పదం చేస్తూంటే వినడానికి చాలా అసహ్యంగా ఉంది. పుకార్ల మీదపడి బతుకుదామనుకునేవారు వీరు. వీరికి మన మేధాశక్తి మీద చాలా చిన్నచూపు. మనకేమీ తెలియదనీ, తాము ఏది చెబితే అదల్లా మనం నమ్మేస్తామనీ, సొంతబుద్ధితో ఆలోచించలేమనీ వీళ్ళు అనుకుంటున్నారు.
అది నిజమేనా ?
