30.11.08

పెద్దల మాట పెరుగన్నం మూట



ఎంతటి ఘోర అపరాధం చేసినప్పటికిన్నీ స్త్రీలని థర్డ్ డిగ్రీ పద్ధతుల్లో హింసించడం పనికిరాదు. చంపడమైతే పూర్తిగా నిషిద్ధం. తప్పు చేస్తే సందర్భోచితంగా కొంచెం దండించడమూ, పనిగట్టుకుని క్రూరంగా హింసించడమూ - ఈ రెండూ ఒకటి కావు. పురుషుల్లో ఉన్నట్లే స్త్రీలలో కూడా సంస్కారరీత్యా ఉత్తమ, మధ్యమ, అధమ శ్రేణులు ఉన్న మాట నిజమే. కొన్నిసార్లు పురుషులు కూడా చెయ్యడానికి ఇష్టపడని నేరాలకి కొందఱు స్త్రీలు అలవోకగా పాల్పడతారనేదీ నిజమే. అయినా వారు భౌతికంగా హింసించబడ్డానికి తగిన జాతి కాదు. పురుషులతో పోలిస్తే భౌతికంగా వారి శరీరాల్లో అన్నీ తక్కువే. అందుచేత వారి శక్తికి మించిన శిక్షల్ని వారికి విధించకూడదు. ఇలా అన్నాం కదా అని ఆడవాళ్ళని హింసించడానికి ఆడవాళ్ళనే నియమించడాన్ని ఈరోజుల్లో గమనించవచ్చు. కాని ఇక్కడ ధర్మసూత్రమేంటంటే, మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళని హింసించకూడదు. అలానే, స్త్రీలు పురుషుల్ని హింసించడం కూడా నిషిద్ధమే. పురుష హింస పరమాత్మని హింసించడంతో సమానం కనుక వారు మరుజన్మలో తమ భర్తల చేతుల్లో దారుణ హింసకి - కొండొకచో హత్యకి సైతం గురవుతారు. కాబట్టి స్త్రీపురుషులు ఒండొరుల పట్ల పాటించాల్సిన లోక మర్యాదల్ని, లింగ మర్యాదల్నీ (gender protocols) తు.చ. తప్పకుండా పాటించడమే వారికి కాలక్రమంలో మంచిది. శత్రురాజ్యాల స్త్రీల పట్ల దయగా వ్యవహరించవలసిందంటూ రాయచూరు యుద్ధానికి ముందు శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యాలకిచ్చిన ఉపన్యాసాన్ని ఇక్కడ స్మరించాలి.

స్త్రీహింస, స్త్రీహత్య మహాపాపాలు. వాటికి క్షమాపణ గాని ప్రాయశ్చిత్తం గాని ధర్మశాస్త్రాల్లో చెప్పబడలేదు. వాటికి పాల్పడే వారికి తక్షణ నరకమూ, పిశాచ, బ్రహ్మరాక్షస జన్మలే తప్ప పుట్టగతులుండవు. స్త్రీలు దేవుడి ఎస్టేట్ లు. వాళ్ళు ఆయన వర్క్ షాపులు. తాను పండించదల్చుకున్నవీ, నిర్మించదల్చుకున్నవీ ఆయన అక్కడే చేస్తూంటాడు. కనుక స్త్రీతత్త్వం మీద దాడులు చేసేవారిని ప్రకృతి క్షమించడం జఱగదు. ఆ కారణం చేత వారు మళ్ళీ జన్మించడానికి స్త్రీగర్భాలు దొఱక్కుండా చెయ్యడం ఆవిడ లీల. దీనికే సాంప్రదాయిక పరిభాషలో పుట్టగతులు లేకపోవడం అని పేరు.

లోకవ్యవహారంలో చూస్తే, ఎక్కువ శాతం స్త్రీలు పురుషుల మీద ఆధారపడే జాతి (dependent sex). వారి బాధ్యత పురుషులకు తప్పించుకోరానిది. అందుచేత తమ చెప్పుచేతల్లో, అదుపాజ్ఞలలో ఉండే స్త్రీజాతి పట్ల పురుషులు దయగా, నాగరికంగా వ్యవహరించడం, వారిని తమ నమ్మిన బంట్లుగా, విధేయురాళ్ళుగా చేసుకోవడం తమకే శ్రేయస్కరం. స్త్రీల పట్ల దయ చూపించడం మహాపురుష లక్షణం. వారిలో అభద్రతా భావాన్ని కలిగిస్తే అది "స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః" అన్నట్లు పరిణమించి అనేక వికృత సంఘటనలకి దారితీస్తుంది. చర్యకి ప్రతిచర్య ప్రకృతి సూత్రం కనుక స్త్రీల పట్ల కటువైన ధోరణి అవలంబిస్తే క్రమంగా వారిలోని సౌకుమార్యం దెబ్బదింటుంది. అందుచేత స్త్రీల మీద ఎక్కువ భారాలు మోపకుండా, వారిని మఱీ ఎక్కువగా బయటి ప్రపంచపు మొఱటుదనానికి గుఱి చెయ్యకుండా సంరక్షించుకోవలసిందని పూర్వీకులు సూచించారు. పూర్వకాలపు మగవాళ్ళు కూడా ఆ అనుదేశానుసారం నడుచుకుంటూ, తమ బయటి జీవితపు కశ్మలాల్ని గుమ్మం దగ్గరే వదిలేసి లోపలికి వచ్చేవారు. ఆ వాసనలు ఇంట్లోని ఆడవాళ్ళకి సోకకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు.

మఱి ఒక స్త్రీ అదుపాజ్ఞలలో ఉన్న ప్రభుత్వం ఆ స్త్రీ ఆదేశాల మీద ఇంకొక స్త్రీని ఉగ్రవాద ఆరోపణల మీద నిర్బంధించి, బట్టలూడదీసి, తలకిందులుగా వ్రేలాడదీసి చావగొట్టించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ? ఇది ఈ దేశపు తరతరాల సంప్రదాయానికి అనుగుణంగా లేదే ! అయినా మన పిచ్చి గాని ఇటాలియన్ స్త్రీలకి హిందూస్త్రీల మర్యాద నిలపడం అంత ముఖ్యమైన విషయమా ? అయితే ఈ దురంతానికి వ్యతిరేకంగా దేశం మొత్తం మీద ఒక్క ఫెమినిస్టు కూడా నోరెత్తకపోవడానికీ, "ఇది అన్యాయం, అక్రమం" అని ఎలుగెత్తడానికీ ముందుకు రావడం లేదేం ? ఆ రాజ్యహింసా బాధితురాలు అందఱిలాంటి స్త్రీ కాదా ? లేదా వీళ్ళు స్త్రీలు కారా ? లేదా ఆమెకి అండగా నిలబడితే సదరు ఇటాలియన్ స్త్రీ తమని కూడా బట్టలూడదీసి తలకిందులుగా వేళ్ళాడదీసి చావగొట్టిస్తుందని భయమా ? మఱి ప్రతివిషయానికీ మగజాతి మీద ఒంటికాలిపై లేచే ఈ ఫెమినిస్టులు ఇప్పుడు భయపడుతున్నది ఎవరికి ? మగవాడికా ? ఆడదానికా ? ధన-రాజకీయ- అధికారానికా ? మగతనానికా ?

ఏదేమైనా, సమానత్వం పేరుతోనో, నేర విచారణల పేరుతోనో పురుషుల్ని పురుషులు హింసించినట్లుగానే అనుమానిత స్త్రీలని కూడా అదే స్థాయిలో హింసించడాన్ని అందఱమూ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించక తప్పదు.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్