
శ్రీ బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక కావడం నా దృష్టిలో మఱీ అంత చరిత్రాత్మకమేమీ కాదు. ఎందుకంటే Change, We can అని అరిగిపోయిన రికార్డులు వినిపించడం మినహాయిస్తే, ప్రస్తుత సంక్షోభాలకి పరిష్కారాలేమైనా చెబుతాడని ఆశించిన ప్రపంచ ప్రజలకి ఆయన చాలా నిరాశ కలిగించిన మాట వాస్తవం. అందువల్ల అసలు విషయాలు తెఱ వెనక్కి జారుకుని ఆయనగారి తొక్కకీ, తోలుకీ ప్రచారం లభించడం మొదలైంది. అయినా అమెరికన్లు ఆయన్ని ఎన్నుకున్నారంటే అది వాళ్ళ దేశం, వాళ్ళ ఇష్టం. కానీ గతానుభవాలు చెప్పేది, అమెరికాకి ఎవరు అధ్యక్షత వహించినా, వారు అంతిమంగా ఆ దేశపు ఆర్థిక, విదేశాంగ స్వార్థాల సాంప్రదాయిక చట్రంలో ఇమిడిపోక తప్పదని. ఈ సందర్భంగా కొన్ని స్పందనలకి నా ప్రతిస్పందన వ్యక్తం చెయ్యాలనుకుంటున్నాను.ఒకటి, నాకు తెలిసి, ఏ విధంగా చూసుకున్నా, ఒబామా నల్లవాడు కాడు. నైఘంటికార్థం (lexical sense) లో ఆయన mulatto అనుకుంటా.
రెండోది, సంకరజాతి మనుషులు కూడా అంతిమంగా ఏదో ఒక సాంఘిక మూసలో తమని తాము మల్చుకోక తప్పదు. ఏదో ఒక చట్టబద్ధమైన, రాజకీయంగా సాధువైన గుర్తింపు (legally or politically correct identity) ని కౌగలించుకోకా తప్పదు, మన దేశంలో కులాంతర తల్లిదండ్రుల పిల్లలు కూడా ఏదో ఒక ప్రత్యేక కులానికి చెందినట్లు ఆధికారికంగా నమోదవుతున్నట్లే.
మూడోది, ప్రజాస్వామ్యంలో దేశపాలకులు ఏ వర్గానికి చెందినా ప్రజలకి - అందునా తమ వర్గపు ప్రజలకేమైనా ఒరగబెట్టగలరా ? అని చాలాకాలం నుంచి మల్లగుల్లాలు పడుతున్నాను. ఈ పాలకులు తమ కుర్చీలో ఎక్కువకాలంపాటు కూర్చోలేరు గనుక వీరు తమ వర్గంవారిని నిశ్శేషంగా ఉద్ధరించడం సందేహాస్పదం. రాజఱికంలోనైతే సదరు వర్గాలకి కొంతలో కొంత దీర్ఘకాలిక ఉపయోగం ఉండొచ్చు. పక్షాంతరంలో, లేకపోయినా లేకపోవచ్చు. మచ్చుకు - నిజాములు ఎన్ని జాములు పాలించినా హైదరాబాదీ ముస్లిములు మాత్రం పేదఱికంలోనే అఘోరిస్తున్నారు. చరిత్రలో ఇంకా వెనక్కి వెళితే ఒకప్పుడు దేశమంతటా యాదవ రాజ్యాలు పరిఢవిల్లిన శతాబ్దాలున్నాయి. ఈనాడు చూస్తే యాదవులు అన్నిచోట్లా వెనకబడిన వర్గంగానే గుర్తింపు పొందారు. మఱి యాదవ రాజులు ఏం చేసినట్లు వారికి ? ఒకవేళ వారు ఎంతో కొంత చేసే ఉంటారు గానీ ఆ వివరాలు మనకి తెలియవనుకున్నా, ఆ చేసినదాన్ని నిలబెట్టుకోవడం ఆ వర్గపు సమర్థత మీద ఆధారపడి ఉంటుందని అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు, "మనకే సమర్థత ఉంటే ఒకడొచ్చి మనల్ని ఉద్ధరించేదేంటి ?" అనే తెలివిడి కూడా కలగాలి.
పోనీ, ఒకవేళ ఒక పాలకుడు అలా తన వర్గానికి ఏమైనా ఒరగబెట్టుకుంటే (అతనిది నిమ్నవర్గమైనా సరే) మనం సహించగలమా ? ఇతర వర్గాలకి అన్యాయం చేసి తన వర్గంవాళ్ళకి మేలు చేస్తున్నాడని మనం ఇల్లెక్కి అఱవమా ? ఒక నిమ్నవర్గ వ్యక్తి పాలకుడు కావడం బహుశా అతని వ్యక్తిగత వ్యాసంగిక విజయం (personal career advancement). అది అతని వర్గీయులందఱి యొక్క రాజ్యాధికార వాంఛకీ తద్ద్వారా తక్కిన సమాజం నుంచి శాశ్వతంగా ఆమోదముద్ర వేయించిందని నమ్మకంగా చెప్పలేం. "ఒకసారి అవకాశమిస్తే పీడా పోతుం"దని ఆలోచించేవారే ఎక్కువ. కనుక ఇటువంటి వైయక్తిక ఊర్ధ్వగమనాల వల్ల సమాజంలో జాతిపరమైన, వర్గపరమైన ముందస్తు అభిప్రాయాలు (prejudices) అంతరిస్తాయని ఖాయంగా నిర్ధారించగలమా ? అనిపిస్తుంది. అందుచేత ఒబామా-I తరువాత ఒబామా-II ఎప్పుడొస్తాడో తెలియదు.
నాలుగోది, ప్రతి సమాజంలోను అగ్రవర్గాలు అల్పసంఖ్యాకులుగాను, నిమ్నవర్గాలు అధికసంఖ్యాకులుగాను ఉంటారు. అందుచేత ఒక నిమ్నవర్గీయుడు ఒక ఉన్నతపీఠాన్ని అధిష్ఠిస్తే, అన్ని నిమ్నవర్గాలూ సమానంగా ఆనందించడం జరగదు. (అగ్రవర్గాలైనా అంతేలెండి ! రెడ్లు ముఖ్యమంత్రులైతే కమ్మవారికి సంతోషం లేదు. అలానే కమ్మవారు ముఖ్యమంత్రులైనా కూడా కాపులకి సంతోషం లేదు కదా !) కాబట్టి "ఆ నిమ్నంలో కూడా మా ప్రత్యేక వర్గీయుడు అధిష్ఠిస్తేనా ?" అనే భావం ఉంటుంది. అందుచేత భవిష్యద్ ఒబామా-II హిస్పానిక్ అయితే బావుంటుందని ఆలోచించేవాళ్ళు ఉండొచ్చు. ఆ తరువాత ఒబామా-III ఏష్యన్ అయితే బావుంటుందని ఆలోచించేవారూ ఉండొచ్చు. ఇదొక అంతులేని కథ.
ఏతావతా, అణగాఱిన వర్గాల సాధికారత (empowerment of the oppressed) మొదలైన మంజుల వాగ్విలాసాల వెనుక ఎవరి వర్గాభిమానాల్ని వారు ఇతోஉధికంగా దృఢపఱచుకోవడం లేదు గదా ? అనిపిస్తుంది. సమకాలీనంగా మనం చూస్తున్న ఘటనావైచిత్రి (paradox) ఎలాంటిదంటే - సామాజిక వర్గవిభజనల్ని యథాపూర్వంగా కొనసాగించడం వెనక ఆధిపత్య వర్గాలకి స్వప్రయోజనాలు (vested interests) ఉన్నాయని అణగాఱిన వర్గాల ప్రతినిధులు చాలా తఱచుగా ఆరోపిస్తూంటారు. పాపం ! వర్గభేదాలన్నీ ఊచమట్టుగా నశించాలని వారు నిండుమనస్సుతో ఆకాంక్షిస్తున్నట్లు ధ్వనిస్తుంది వినేవాడి వీనులకి. కానీ ఎక్కువమంది తమ వంతు వడ్డనల కోసం కాచుక్కూర్చున్నవారే. "అగ్ర" గుర్తింపు కోసం అఱ్ఱులు చాస్తున్నవారే. ఈ క్రమంలో జరుగుతున్న విచిత్రం ఏంటంటే - నిమ్నేతర మేధావులు తాము చాలా గొప్ప అభ్యుదయానికి బాటలు వేస్తున్నామనుకుంటూ అసంకల్పితంగానే నిమ్న వర్గాభిమానాల్ని, వాటికి ప్రతిగా అగ్ర వర్గాభిమానాల్ని మఱింతగా పెంచి పోషించడం. వర్గాలు మాత్రం భద్రంగా అలానే ఉన్నాయి. అవి ఎక్కడికీ పోవు. అయ్యో, అవి పోతే బతికేదెలా ? ఎవరి హ్యూమన్ క్యాపిటల్ వారిక్కావద్దూ !
అయిదోది, ఒబామా-I ఎన్నిక పాలితుల్లో తొలగిపోయిన జాతిభేదాలకి చిహ్నంగా భావించడం "పవిత్రపాపి, clean drainage" లాంటి ఒక విరోధాలంకారం (oxymoron) కాకుండా ఉంటే బావుంటుంది. కానీ అతని 'నల్ల' నేపథ్యానికి ఇంత ప్రచారం లభిస్తోందంటేనే జాతిభేదాలు పాలితుల్లో భద్రంగా ఉన్నాయని కాదూ అర్థం ?
ఆఱోది - అన్ని ఆర్థిక, రాజకీయ, నైతిక, ఆధ్యాత్మిక సిద్ధాంతాలూ, సూత్రాలూ మూలపడి పాలకుడి యొక్క వ్యక్తిగతమైన వర్గగుర్తింపుకి ప్రాధాన్యం ఏర్పడ్డం నా దృష్టిలో బుద్ధిజాడ్యమే తప్ప ప్రగతి కాదు. ఏ దేశానికీ ఏకకాలంలో వందమంది పాలకులు ఉండజాలరు. ఒక్కడే ఉంటాడు. వందలాదిగా సామాజిక వర్గాలున్న దేశాల్లో మన వర్గీయుడే పాలకుడుగా ఉండాలని మంకుపట్టు పట్టడం కుదరదు. ఎవరైనా సరే, ఉన్నవాడితో సర్దుకుపోవాలంతే ! మన వర్గానికి ఎప్పటికీ అవకాశం రాకపోయినా ఫర్వాలేదనుకోవాలి. నాஉన్య: పన్థా అయనాయ విద్యతే. పాలకుడు మంచివాడై ఉండాలని కోరుకోగలం, "మన"వాడై ఉండాలని కోరుకోలేం. ఎందుకంటే ఈ "మన"కున్న నిర్వచనం అనిర్వచనీయం.
ఏడోది ఆరిందా ఆకాంక్షల బెడద :- ప్రజాస్వామిక పరిపాలనా ప్రక్రియని పిల్లలాటగా మార్చవచ్చునా ? అని. పిల్లలు "ఎప్పుడు పెద్దవాళ్ళమైపోతామా ?" అని ఎదురు చూస్తూంటారు. పెద్దయ్యేదాకా ఆగకుండా లక్కపిడతలు పెట్టుకుని అమ్మానాన్నాట ఆడేస్తూ ఉంటారు. అలానే ఎప్పుడూ గౌరవనీయ స్థానానికి నోచుకోని వర్గాలు అన్ని గౌరవనీయ స్థానాల్నీ ఆక్రమించెయ్యాలని తహతహలాడుతూంటాయి. ఆ తహతహని తీర్చడమే ప్రజాస్వామ్యానికి అర్థమూ, పరమార్థమూనా ? ప్రాథమికంగా ప్రజాస్వామ్యమైనా, మఱొకటైనా అన్నీ పరిపాలనా వ్యవస్థలనీ, వాటిక్కావాల్సింది వ్యక్తిగత యోగ్యతా, నాయకత్వ లక్షణాలనీ మనకెప్పుడు అర్థమౌతుంది ?
ఎనిమిదోది - మనలో సాముదాయికంగా లోపించిన అభ్యుదయ భావాల్ని మన నాయకుల నుంచి ఆశించవచ్చునా ? మన నాయకులు సర్వేసర్వత్రా సర్వకాల సర్వావస్థల్లోను మన ఆకారాలకీ, వికారాలకీ అచ్చుగుద్దిన ప్రతిబింబప్రాయులు. లేదా వాళ్ళు తమ రాజకీయ వ్యాసంగంలో భాగంగా తమని తాము అలా రూపుదిద్దుకుంటారు.
తొమ్మిదోది - ఈ స్వవర్గాభిమానంతో సంబంధంలేని సారూప్య అభిమానాల్నీ, లేదా సంబంధం లేని సారూప్య ద్వేషాల్నీ పెంపొందించుకోడాన్ని కూడా గమనించవచ్చు. వీటిని పెంపొందిస్తున్నది కూడా మేధావివర్గమే. వీళ్ళు ఏం మేధావులో నాకైతే అర్థం కాదు. ఎక్కడో ఒబామా అధ్యక్షుడైతే అది ఇక్కడి నిమ్నవర్గాల అభ్యుదయానికి వేగుచుక్క ఎలా అవుతుంది ? ఆ దేశం వేఱు, ఆ పరిస్థితులు వేఱు. ఆ సమస్యలు వేఱు. ఈ దేశం వేఱు, ఈ పరిస్థితులు వేఱు. ఈ సమస్యలు వేఱు. పైగా ఒబామా తన జీవితంలో జాతిభేదాల్ని వ్యక్తిగతంగా రుచిచూసినదేమీ కనిపించదు.
అలానే జాలంలో పెట్టిన ఒక ద్వేషపూరిత పుస్తకంలో బ్రాహ్మణుల్ని యూదులతో పోల్చి రాసిన రాతలు కూడా చదివాను. చరిత్రలో యూదులకీ, బ్రాహ్మణులకీ మధ్య రెండో, మూడో పోలికలు ఉండొచ్చు. అంతమాత్రాన వారూ, వీరూ ఒకే తరహా మనుషులైపోరు. ఆ మాత్రం చిట్టిపొట్టి పోలికలు ఏ రెండు జాతుల మధ్యనైనా ఉంటాయి. అయితే ఏ జనజాతికా జనజాతి విలక్షణమైనది (unique). అలా చూడ్డం నేర్చుకోవాలనుకుంటా మనమంతా.
పదోది - అసలు జాతిభేదాలు పోవాలని మనకెందుకింత పట్టుదల ? జాతిభేదాలు ప్రకృతిసహజమైతే అవి చచ్చినా పోవు. అప్పుడు మనం దాని గుఱించి ఆలోచించే పనిలేదు. ప్రకృతి విరుద్ధమైతే వాటంతట అవే పోతాయి. అప్పుడు కూడా మనం వాటి గుఱించి ఆలోచించే పని లేదు. భవిష్యత్తులో జాతిభేదాలు ఏర్పడకుండా నిరోధించే బిస, మాయ, మంత్రం లాంటివేవైనా మన దగ్గఱ ఉన్నాయా ? మనం ఇప్పుడు అందఱినీ కలిపేసి పిసికి పిండి చేసినా, మళ్ళీ ఒక వెయ్యేళ్ళ తరువాత వాళ్ళు తమ తమ రంగు, రూపం, మతం, భాష, ప్రాంతం, వృత్తి, అలవాట్లూ, ఆచారం మొదలైన ప్రాతిపదికల మీద వేఱువేఱు జాతులుగా ఏర్పడరనే నమ్మకం ఏదైనా ఉందా ?
నాకైతే లేదు.
