21.11.08

లెంపలేసుకుందాం - కొంప దిద్దుకుందాం ! - 4 (సమాప్తం)



స్వేచ్ఛకి అర్థం సంబంధాలు తెంచుకోవడమా ? ఒకప్పుడు ఆడది మగవాడికి చేసిపెట్టిన అనేక సేవలు ఇప్పుడు విపణిలో ఒక వెలకి లభిస్తాయి. అలానే ఒకప్పుడు ఆడదానికి మగవాడి ద్వారా లభించిన రక్షణ కొంతవఱకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి సమకూడుతుంది. కనుక ఇప్పుడు ఆడదానికి అసలైన భర్త ప్రభుత్వమే. తాళి గట్టినవాడు డిప్యూటీ మాత్రమే. అలానే ఇప్పుడు ప్రైవేటు సంస్థలే మగవాడికి అసలైన భార్యలని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా స్త్రీపురుషులకున్న సహజమైన పరస్పర అనివార్యత (mutual indispensability) ని చెడగొట్టి వారిని వ్యక్తిగతంగా ఒండొరుల దృష్టిలో కొఱగానివారిని చెయ్యడం ప్రగతా, దుర్గతా ? అది బలుపా, వాపా ? యోచించాల్సి ఉంది.

స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వం కొత్తగా చేసిన అమానుష చట్టాలు కొత్తగా తీసుకున్న మతంలా మొదట్లో సరిగానే అమలవుతాయి. అయితే ఇక్కడ ఒక కీలకమేంటంటే - వ్యవస్థలు, వాటికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారనే దానితో నిమిత్తం లేకుండా, అవన్నీ అంతిమంగా పురుషత్వం దాల్చిన విశ్వరూపాలే. ఎందుకంటే ఆడవాళ్ళు పిల్లల్ని కంటే మగవాళ్ళు సంస్థల్నీ, వ్యవస్థల్నీ, సిద్ధాంతాల్నీ కంటారు. ప్రభుత్వం ఇందుకు మినహాయింపు కాదు. ఫలితార్థంగా ఇప్పుడు ఈ చట్టాలు అమల్లోకి రావడానిక్కారణం - మన కుటుంబవ్యవస్థలో మగవాడికి ఇప్పటికీ సర్వోన్నతపాత్ర ఉండడమూ, అతడు తన కుటుంబంలోని స్త్రీసభ్యురాళ్ళని ఇంకా ప్రేమిస్తూండడమూ, వారి రక్షణ కోసం అతడు పూర్వపు మగవారిలానే ఇంకా తాపత్రయపడుతూ ఉండడమూను. ముఖ్యంగా ఆడపిల్లలు గల మగవారు ఈ చట్టాలకీ, వీటికి మూలమైన సమానత్వ, స్వేచ్ఛాప్రచారాలకీ ప్రధాన మద్దతుదారులు.

కానీ ఒకటి-రెండు తరాల తరువాత ఈ పరిస్థితి ఇలానే ఉంటుందని చెప్పలేం. పాపం ! తన స్త్రీబంధువుల కోసం ఈరోజు ఇంతగా తాపత్రయపడుతున్న అతనికి భవిష్యత్తులో ఏ పాత్రా లేకుండా చేస్తాయి ఈ చట్టాలు. వీటి ఫలితంగా తండ్రంటే ఏమిటో ఎఱుగని అభద్ర కుటుంబాలు (insecure families) మిలియన్లాదిగా తయారు కావచ్చు. అప్పుడీ చట్టాల్ని ఎవరిమీద ప్రయోగించాలో, ఎందుకు ప్రయోగించాలో అర్థంకాక అవి కాలదోషం పట్టి ఆచరణాత్మకంగా అంతరించవచ్చు. బహుశా అప్పుడు పిల్లల హక్కులకుండే ప్రాధాన్యం స్త్రీల హక్కులకి లేకపోవచ్చు. అసలు భాగస్వామితో విడిపోయిన ఒక్కొక్కరికీ తమ కన్నబిడ్డలు చూస్తూండగానే వరుసగా ముగ్గురు-నలుగురు మొగుళ్ళూ, నలుగురైదుగురు పెళ్ళాలూ తయారైతే సగం-అన్నలూ (half-brothers), సగం-చెల్లెళ్ళూ (half-sisters) కూడా పుట్టుకొచ్చి, వావి-వరుసలు అర్థం పర్థం లేనట్లుగా మారిపోవచ్చు. ఆ విధంగా అప్పుడు సమాజంలో అందఱూ స్వేచ్ఛాప్రచారాల బాధితులే ఉంటారు. తండ్రి సాన్నిధ్యం లేకపోవడంచేత ఎంతో కోల్పోయినట్లుగా అనుభవాన్ని పొందినవాళ్ళు ప్రభుత్వాల్లోకి ప్రవేశిస్తే ఈ చట్టాల్ని అంతకుముందులా అమలు జరపడానికి ఉత్సాహం చూపకపోవచ్చు. తెల్లసమాజాల్ని మనమూ, మన ఆడవాళ్ళూ ఆదర్శంగా తీసుకోవడం మానేస్తే తప్ప ఈ సంసారాల విధ్వంసాన్ని అరికట్టజాలము. మన సమస్యలు మనలోంచి పుట్టాయి. వాటి పరిష్కారాలు కూడా మనలోంచే పుట్టాలి.

కుటుంబం ఒక గౌరవనీయ వ్యవస్థ/ అన్ని ఇతర వ్యవస్థలకీ మూలమైన వ్యవస్థ : మనిషి పుట్టి పెఱిగే క్రమంలో మూడు రకాల ప్రభావాలకి లోనవుతాడు. సంస్కృతీకరణ, సామాజికీకరణ, రాజకీయకరణ (culturization, socialization and politicization). సంస్కృతీకరణ సరిగా లేకపోతే సామాజికీకరణ, రాజకీయకరణ కాలక్రమంలో విఫలమై పోతాయి. ఉదాహరణకి కుటుంబాలే దెబ్బదిన్నాక కులాలకీ, మతాలకీ, గోత్రాలకీ, ఇంటి పేర్లకీ, వాటి సహాయంతో రచించబడ్డ దేశచరిత్రకీ, దాన్నించి ప్రభవించిన జాతీయవాదానికీ, దాన్ని పట్టుకొని వేళ్ళాడే ప్రభుత్వాలకీ అర్థం లేకుండా పోతుంది. సంస్కృతీకరణకి జీవగఱ్ఱ కుటుంబం. ఆ కుటుంబానికి పునాదులు ఆడవాళ్ళు. ఈ కీలకాన్ని గ్రహించకుండా అభ్యుదయవాదులమనుకునే మగవాళ్ళు కొందఱు తమ పురుషోచితమైన అసున్నితత్వాల్ని స్త్రీల నెత్తిమీద రుద్దుతున్నారనిపిస్తుంది. ఈ సందర్భంగా నేను తెలుసుకున్న అసలు విషయం చెప్పక తప్పదు. తమ కామవాంఛని విశృంఖలంగా తీర్చుకోవడానికి తగినంతమంది ఆడవాళ్ళు దొఱక్కుండా చేసిన కుటుంబ వ్యవస్థ మీదా, దాని నైతిక విలువల మీదా కొంతమంది మగవాళ్ళకి లోలోపల తీవ్రమైన కసి ఉంది. వాళ్ళు ఆ మాట పైకి చెప్పకుండా ఎలాగైనా ఆడవాళ్ళని దానికి వ్యతిరేకంగా ఎగసన దొయ్యాలని నానారకాల చెత్త రాతలతో కిందా మీదా పడుతూంటారు. ఈ రకమైన రాతల్లో స్త్రీల పట్ల విపరీతమైన "సానుబూతులు" ధారాళంగా కురిపిస్తూంటారు. కానీ తెలివైన ఆడవాళ్ళకి మాత్రం ఈ తరహా రాతల్లోని అసలు బండారం స్పష్టంగా తెలుసు.

ఈ విధంగా చాలామంది హాయిగా మర్చిపోయే విషయం కుటుంబ ప్రాధాన్యం. ఇది ఎంత సూక్ష్మరూపంలో ఉన్నప్పటికిన్నీ అన్ని వ్యవస్థలకి మల్లే దీనిక్కూడా ఒక నాయకత్వమూ, ఒక అనుచరగణమూ, పాలితులూ, పాలకులూ, పోలీసులూ ఉన్నారు - వాళ్ళు అలా కనిపించక పోయినా ! దీనికీ ఒక ఆర్థిక యంత్రాంగం ఉంది. తనకంటూ ఒక న్యాయవిచారణ వ్యవస్థ (Justice regime) ఉంది. దీనికొక కేంద్రకార్యాలయం ఉంది. శాఖా కార్యాలయాలున్నాయి. మిత్రులూ, శత్రువులూ ఉన్నారు. దీర్ఘకాల వ్యూహాలున్నాయి. ఇందులో ప్రతివ్యక్తికీ కేటాయించబడ్డ ఒక ప్రత్యేక స్థానమూ, దానికి సంబంధించిన హక్కులూ, బాధ్యతలూ ఉన్నాయి. సభ్యులు ఒకరిపట్ల ఒకరు తప్పనిసరిగా చూపించాల్సిన రివాజులూ, మర్యాదలూ, సముచితమైన పిలుపులూ ఉన్నాయి. ఇక్కడ పైకి మాట్లాడదగినవీ, మాట్లాడకూడనివీ అయిన విషయాలున్నాయి. ఎవరు ఏ వేళలో ఏం చెయ్యాలో రాయబడని శాసనాలున్నాయి. కుటుంబ సంప్రదాయాల రూపంలో దీనికొక రాజ్యాంగం ఉంది. ప్రభుత్వ చట్టాల కంటే కూడా శక్తిమంతమైన చట్టాలున్నాయి. ప్రభుత్వాల కంటే ఇది సర్వసత్తాకమైనది. ప్రభుత్వాల కంటే గొప్పది, వాటికి మూలమైనటువంటిది కూడా ! వాస్తవానికి ఇతర వ్యవస్థలన్నీ దీనికి చౌకబారు అనుకరణలు (cheap imitations) గా ఏర్పడ్డవే. కుటుంబమే అసలు, మిగతావన్నీ నకిలీ. కుటుంబం ప్రపంచంలో ఏ మూలనైనా మనుగడ సాగించగలదు. ప్రభుత్వాలన్నీ కూలిపోయినా ఇది కొనసాగుతుంది. అభ్యుదయం పేరుతోనో, మఱో పేరుతోనో ఇతర చౌకబారు (బయటి) వ్యవస్థల సహాయంతో దీని మూలసూత్రాల్ని భగ్నం చెయ్యడానికి పూనుకోవడం మొదటికే మోసం తెస్తుంది. సమర్థమైన ప్రత్యామ్నాయాలు చూపించలేనప్పుడు దీని మూలాలపై తిరగబడ్డం యుక్తియుక్తం అనిపించుకోదు.

సాంప్రదాయిక కుటుంబ వ్యవస్థలో సమానత్వానికి స్థానం లేదని జరుగుతున్న ప్రచారం సరికాదు. అసలు సంపూర్ణ సమానత్వానికి ఏ వ్యవస్థలోను స్థానం ఉండదు. అదీ గాక ప్రతి వ్యవస్థలోను సమానత్వ సూత్రం ఒకేలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబానికి తనదంటూ ఒక Line of command ఉంది. పదవుల్లోను, హోదాల్లోను ఒక సోపానక్రమం (hierarchy) ఉంది. ఆడా, మగా వ్యత్యాసం లేకుండా అది కేవలం సీనియారిటీ మీద ఆధారపడినటువంటిది. ఆ సీనియారిటీ వయసుని బట్టి, వావి (kinship) ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇందులోని పదవులూ, గౌరవాలూ శాశ్వతమైనవి. చనిపోయిన సీనియర్ మోస్ట్ నుంచి బతికున్న సీనియర్ మోస్ట్ కి అధికారమూ, గౌరవమూ సంక్రమిస్తాయి. అన్ని ఇతర వ్యవస్థల్లో మాదిరే ఇందులో కూడా ఎట్టి పరిస్థితుల్లోను సబార్డినేట్లు సీనియర్లని ఎదిరించడానికి వీల్లేదు. నాకిందులో తప్పు పట్టాల్సిందేమీ కనిపించదు. అలానే సీనియర్లని ఎదిరించమని బోధించడం అన్ని ఇతర వ్యవస్థల్లోను వ్యవస్థని కుట్రపూరితంగా కూలద్రోయడం (sabotage) గాను, తత్కారణంచేత ఒక శిక్షార్హమైన ద్రోహం (treason) గాను, నేరంగాను పరిగణించ బడుతున్నప్పుడు కుటుంబ వ్యవస్థలో మాత్రం దాన్ని అభ్యుదయంగా ఎందుకు పరిగణించాలో నేను అర్థం చేసుకోజాలను.

ఏ వ్యవస్థలోనైనా అభిమానానికీ, అధికారానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. ఎంతగా ప్రేమిస్తే, లేదా ఎంతగా ప్రేమించబడితే అంతగా అధికారం సిద్ధిస్తుంది. కుటుంబంలోనైనా అంతే ! ఒక చిన్న తేడా మాత్రం ఉంది. అభిమాన, అధికారాలకి మూడు రకాల గతులుంటాయి - జలగతి (నీరు), ధూమగతి (పొగ), వాయుగతి (గాలి) అని ! జలగతి అంటే పైనుంచి క్రిందికి ప్రవహించడం. కుటుంబాభిమానాలూ, అధికారాలూ ఈ కోవకి చెందినవి. అందుచేత కుటుంబ పెద్దలు సరైన దారిలో ఉంటేనే పిన్నలు కూడా సరైన దారిలో ఉంటారు. కింది నుంచి పైకి ప్రవహించడం ధూమగతి. ప్రజాస్వామిక అధికారం ఈ కోవకి చెందినది. సర్వేసర్వత్రా ప్రవహించడం వాయుగతి. వాయువు ఎంత బాగా వీస్తే అగ్ని అంత బాగా ప్రజ్వరిల్లుతుందని వేఱే చెప్పనక్కఱలేదు. ఇది అరాచక స్థితి (anarchy). దారిన పోయే ప్రతి దానయ్యనీ/ దానమ్మనీ చూసి మనసు పారేసుకోవడం కుటుంబపరంగా అరాచక స్థితి (domestic chaos). ఈ అరాచకాన్ని ఆహ్వానించక పోవడమే శ్రేయస్కరం.

ఏ వ్యవస్థయినా ప్రాథమికంగా మగవాడికి జవాబ్దారీగా ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యవస్థ నడవాలన్నా చెప్పేవాడు, వినేవాళ్ళూ అవసరం. కనుక అతన్ని బట్టే అతని కుటుంబసభ్యుల ప్రవర్తన ఉంటుంది.

మంత్రి లేని రాజు - తలలేని మొండెం :- అయితే ప్రకృతిమాత తనకి ప్రసాదించిన సహజ నాయకత్వ హోదాని మగవాడు అడుగడుగునా దుర్వినియోగం చెయ్యడం సరికాదు. కుటుంబ వ్యవస్థలో ఇప్పుడు మనం చూస్తున్న దిగజారుడు మూలాలు మన పూర్వతరాలకి చెందిన మగవాళ్ళ నీచ దుష్ప్రవర్తనలో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో పరమపదించారు. ఇప్పుడు లేరు. కానీ స్త్రీలతో ఈనాడు మనకున్న అనేక తలనొప్పుల్ని మిగిల్చి పోయింది వాళ్ళే. ఈనాడు మన పరిస్థితి ఏంటంటే - ఈ దిగజారుణ్ణి కొనసాగించకపోతే బతకడమే దుర్ఘటం కావడం, సారాకొట్లు ఎత్తేస్తే ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోతున్నట్లుగానే ! ఏవైతే కుటుంబపెద్ద మాట్లాడకూడదని ప్రాచీనులు ఖరాఖండిగా హెచ్చరించారో పూర్వపు మగవాళ్ళు అవే మాట్లాడారు. ఏవైతే చెయ్యకూడదని హెచ్చరించారో అవే చేశారు. తాము సంపాదనాపరులమనే గర్వంతో నిండింట్లో లక్ష్మీస్వరూపురాలైన గృహిణినీ, ఆమె కుమార్తెల్నీ అశ్లీలంగా దూషించడానికి వెనుకాడలేదు. అందుచేత మన తెలుగుభాషలో తిట్లన్నీ ఆడవాళ్ళనే ఉద్దేశించి ఉంటాయి. ఎంతగా అంటే, మగవాళ్ళని తిట్టడానిక్కూడా మహతీవాచకాల్నే వాడే పరిస్థితి ఉంది. ఈ అశ్లీల దూషణలు దారిద్ర్య హేతువులు. నా పరిశీలనలో - ఎన్ని సమకూడినా స్త్రీలు ఎంతో కొంత ఆత్మన్యూనతాభావం (inferiority complex) తో బాధపడుతూనే ఉంటారు. అటువంటప్పుడు "నువ్వు స్త్రీవి కనుక, నువ్వింతే, నువ్వంతే" అని వారికి గుర్తుచేసి బాధించడం సరైన చర్య కాదు. కానీ మన పూర్వతరాల పురుషులు ఈ పని తఱచుగా చేస్తూండేవారు. స్త్రీలలో ఆ భావం కలక్కుండా వ్యవహరించడంలోనే మగవాడి చాతుర్యం వెల్లడి కావాలి.

మనం ఏదైనా వస్తువు కొంటే దానికొక హామీపత్రమూ (warranty card), సేవా (servicing) సదుపాయాలూ గట్రా సహాయక యంత్రాంగం (supportive mechanism) కొంత ఉంటుంది. అలానే సమాజంలో ప్రతి వ్యవస్థకీ అలాంటి సహాయక యంత్రాంగం తప్పనిసరి. వివాహానిక్కూడా ప్రాచీనకాలం నుంచి అలాంటి యంత్రాంగం ఉంది. కానీ గత కొద్ది దశాబ్దాలుగా ఈ సహాయక యంత్రాంగం మెల్లమెల్లగా దెబ్బదినిపోతోంది. కారణం - ఎవరికి వారేర్పఱచుకొనే నూతన వ్యవస్థలకి సాంప్రదాయిక యంత్రాంగాల మద్దతు ఉండదు. కనుక ఇప్పుడు మన ముందు దొరతనంవారు ఏర్పఱచిన Emergency Exits మాత్రమే మిగిలాయి. కానీ వీటిని సింహద్వారాలుగా భావించే మూర్ఖత్వం బాగా ప్రచారంలోకి వచ్చింది.

(Grow together) పెళ్ళయ్యాక కలిసి ఎదగాలి, ఒక అన్నలా, ఒక చెల్లిలా : ఒకరినొకరు అవగాహన చేసుకొని ఆ తరువాత కలిసుంటామని చెప్పడం వినడానికి తార్కికమే తప్ప వాస్తవికం కాదు. అలా చెయ్యాలంటే ప్రతివారూ అఱవయ్యో ఏట పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. అసలైన ఆచరణాత్మక వాస్తవమేంటంటే - సుదీర్ఘకాలం కలిసుంటే తప్ప పరస్పర అవగాహన రాదు. పొంతనలు (compatibilities) వాటంతట అవి ఎప్పుడూ కుదరవు, ప్రయత్నపూర్వకంగా కుదిరించుకోవాలంతే ! మొదట్లో వచ్చే గొడవలు భార్యాభర్తలు ఒకరికొకరు సరిపోరని తెలియజెయ్యవు. అవి ఎక్కడ సర్దుబాట్లు అవసరమో తెలియజేస్తూ మెఱిసే రెడ్ లైట్స్ మాత్రమే ! దాంపత్యజీవితం అనేది ఫ్యాక్టరీలో తయారై వారంటీ కార్డుతో సహా ప్యాకేజింగ్ అయి పెళ్ళికానుకగా మనింటికి రాదు. దాన్ని మనమే అనురూపించుకుంటూ, (customizing) మెఱుగుపఱచుకుంటూ తయారుచేసుకోవాలి. ఎదుటివారి లోపాల్ని క్షమించినప్పుడు వారికి నిర్భయంగా ఎదిగే అవకాశం ఇచ్చినట్లవుతుంది. అహంకారాన్ని ప్రదర్శించే మగవారు అలా జీవితాంతమూ అహంకారాన్ని ప్రదర్శించరు. పెళ్ళయిన కొత్తల్లో కోపమొచ్చి భార్యని కొట్టిన మగవారు జీవితాంతమూ కొడుతూనే ఉండరు. అలానే తలొంచుకుని సిగ్గుపడే యువతులు అలా జీవితాంతమూ సిగ్గుపడుతూ కూర్చోరు. పెళ్ళయ్యాక భార్యే భర్తకి తల్లి, చెల్లి, ఆలి కూడా ! అలానే భర్తే భార్యకి తండ్రీ, అన్న, గురువు. ఆ సంగతి గట్టిగా గుర్తుపెట్టుకొని పక్కచూపులు చూడ్డం మానెయ్యాలి. "ఇది కేవలం సంప్రదాయ ధోరణి" అని ఎవరైనా ఆరోపిస్తే, వారికి నా సమాధానం ఒకటే. "సాంప్రదాయిక వివాహాల విజయానికి ఏ సూత్రాలు వర్తిస్తాయో అభ్యుదయ వివాహాల విజయానికీ అచ్చంగా అవే సూత్రాలు వర్తిస్తాయి. అక్రమ సంబంధాలు నిలబడాలన్నా అవే సూత్రాలు వర్తిస్తాయని చెబితే నన్నెవరూ తిట్టొద్దు."

వ్యక్తివాదం కనీసం ఒక్క మంచివ్యక్తినైనా నిర్మించజాలదు : "నా బతుకు నాది, నా సుఖం నాది, నా ఇష్టం నాది" అని వాదించేవారికి పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, ఆదర్శాలూ అనవసరం. మన (మగవాళ్ళ) లో కొందఱు ఒకప్పుడు ఈ వాదం (నేను మగవాణ్ణి, నా యిష్టం, తిరుగుతాను, ఏమైనా చేస్తాను) తో ఆడవాళ్ళ నోరుమూసి విచ్చలవిడి తిరుగుళ్ళు తిరిగేవారు. కానీ నేనంటాను, ఆడైనా, మగైనా తమ భాగస్వామితో సహా యావత్తు కుటుంబాన్ని ఒక సర్వసమగ్ర సమైక్య యూనిట్ గా అంగీకరించేవారే అందులోకి అడుగు పెడితే బావుంటుంది. అప్పుడు ప్రతియిల్లూ లక్ష్మీనివాసమే అవుతుంది. మనిషికో ఇల్లు, మనిషికో కారు, మనిషికో ల్యాప్ టాపు, మనిషికో ఫోను, మనిషికో బ్యాంకు ఖాతా - ఇదంతా సరైన జీవనవిధానం కాదు. ఎవరూ తమకి తామే ఒక లోకం కాదని సవిస్తరంగా తెలియజెప్పడానికే విద్యావిధానం ఉన్నది. కుటుంబం ఉన్నదీ అందుకోసమే. ఆ కుటుంబమే మన నిజమైన బడి. అటువంటి అతిసూక్ష్మ కుటుంబం నుంచి అత్యున్నత జాతీయవాదం దాకా ఈ నాగరిక ప్రపంచంలో ప్రతిదీ వ్యక్తిత్యాగాల పునాదులపై దృఢంగా నిర్మించబడింది. కుటుంబం కోసం ఆ మాత్రం స్వార్థత్యాగం చెయ్యలేనివాళ్ళ అభ్యుదయవాదాన్నీ, దాని అసలు రంగునీ నేను శంకిస్తాను. కనీసం పెళ్ళయి, పిల్లలు పుట్టాకయినా తలని మొల శాసించడం మానెయ్యాలని నేను కోరుకుంటాను.

పడగొట్టడం సులభం - నిర్మించడం కష్టం : "నా ఒక్కడితో ఏమౌతుంది ? " అనకూడదు. పూర్వతరాల్లో కొద్దిమంది మగవాళ్ళు తమ బుద్ధిజాడ్యంతో మనకోసం సృష్టించిపోయిన ఈ సంసార సమస్యల్ని, ఈ అమానుష చట్టాల్ని మరమ్మత్తు చెయ్యాలంటే ఈ తరంలో చాలామంది మగవాళ్ళు చాలా పెద్దయెత్తున చాలా చురుగ్గా తమ బుద్ధిబలాన్ని ఉపయోగించాల్సి ఉంది. అలా చేసే ముందు ఒక మూలసూత్రాన్ని గమనంలో ఉంచుకోవాలి. సంప్రదాయేతర సూత్రాల ఆధారంగా మానవసంబంధాల యొక్క సాంప్రదాయిక స్వరూపాన్ని యథాపూర్వంగా నిలబెట్టడం సాధ్యం కాదు. అంతే కాదు, మానవ సంబంధాలు పక్కపక్కనే పార్క్ చేసిన బైకుల్లాంటివి. ఏ కారణం చేతనైనా ఒక బైకు పడిపోతే వరుసపెట్టి అన్నీ పడిపోతాయి. అలానే సమాజంలో విస్తృత ప్రాతిపదికన ఒకానొక కౌటుంబిక సంబంధం చెడిపోయాక క్రమంగా తక్కిన సంబంధాల సాంప్రదాయిక తత్త్వం కూడా నింపాదిగా ధ్వంసమౌతూ పోతుంది. ఆ ప్రక్రియ ఒకసారి మొదలైతే అది అనివర్తనీయం (irreversible).

సమాజంలో మనం చూసే విలువలేవీ అమూర్తం (abstract) కావు. తద్విరుద్ధంగా అన్నీ మౌలికంగా భౌతిక విలువలే. పాతివ్రత్యమూ, ఏకపత్నీవ్రతమూ మొదలైన విలువలు ఋతుపవనాలతో పాటు అలవోకగా గాలిలో తేల్తూ మన దగ్గఱికి రావు. ఆ విలువలకి సజీవ మూర్తీభావాలైన ఆదర్శ స్త్రీలూ/ ఆదర్శ పురుషులూ ఎవరో ఏదో ఒక కాలంలో తప్పకుండా జీవించే ఉంటారు. అవి మానవ సంబంధాల్లోని ఒకప్పటి బానిసత్వాన్ని కాక ఒకప్పటి స్వచ్ఛందతనీ (voluntariness) నీ, ఎంపిక-స్వేచ్ఛ (freedom of choice) నీ సూచిస్తాయి. ఎందుకంటే, ఏ కాలంలోనైనా జనం వంద శాస్త్రాల కంటే, లక్ష సూక్తుల కంటే సజీవ దృష్టాంతాల (living examples) తోనే ఎక్కువ ప్రభావితులౌతారు. ఆ ఆదర్శాల్ని అనుభూతి చెందే స్థాయికి ఇంకా ఎదగనివారికి అవి బానిసత్వంలా కనిపిస్తాయి. అలా అనుభూతి చెందించగల వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న మహామనిషి దొరికితే, వాటి గొప్పతనాన్ని వారు కూడా గ్రహిస్తారు. అందుకే ఇంగ్లీషు ఆడవాళ్ళు తమకి నచ్చిన మగవాణ్ణి వర్ణించడానికి "He makes me feel like a woman" అంటారు.

అదే విధంగా దేవుడంత దయామయులైన రాజులెవరో ఉండేవారు కాబట్టే ఒకప్పుడు రాజు దేవుడని నమ్మేవారు. ఆ తరువాత వచ్చిన రాజులు అలాంటివారు కాకపోవడంతోను, మనకి తెలిసిన చరిత్రలోని పరిపాలకులంతా తమ మనస్తత్త్వాన్ని బట్టి వట్టి దొంగలూ, బందిపోట్లూ కావడం చేతను, ఆ విధంగా మనం సజీవ దృష్టాంతాల నుంచి వంచితులం కావడం చేతను ఇప్పుడది మనకి మూఢనమ్మకంలా కనిపిస్తుంది. అలానే మన పూర్వతరాల్లో 'అన్నయ్య' అనే మాటకున్న పవిత్రత ఆ తరువాత అంతరించింది, వారసుల్లో ఒకడుగా అన్నయ్య హక్కులు కూడా తమ్ముళ్ళతో/ చెల్లెళ్ళతో సమానమని చట్టాలు చేశాక ! మన నాయనమ్మల తరంలో 'భర్త' అనే మాటకున్న పవిత్రత మన తల్లుల తరంలో లేదు. మన తరంలో "గురువు" అనే మాటకున్న పవిత్రత మన కంటే చిన్నవారి తరంలో లేదు (లేకుండా చేశారు). ఆ సంబంధాల రంగూ, రుచీ, వాసనా అంతా హరించుకుపోయి, ఆఖరికి ఆ శుష్కమైన మాటలే మిగిలాయి, వేశ్యలు దారిన పోయే ప్రతివాణ్ణీ "బావయ్యా !" అని పిలిచినట్లు. ఇహ తమవంతు శిరశ్ఛేదం కోసం వరుసగా "క్యూ" లో నిలబడి ఉన్న ముద్దాయిలు : తల్లి, తండ్రి, చెల్లి, అక్క.....

ఆ విధంగా మన తరంలో మనం ఒక సంబంధానికి చీడపట్టడాన్ని మాత్రమే గమనించగలం. మిగతా సంబంధాలు సైతం మరమ్మత్తుల కతీతంగా క్షీణించిపోవడాన్ని మన అర్వాచీనులు చూస్తారు.
(సమాప్తం)

గమనిక :- వ్యాసపు తొలుతటి భాగాల్ని క్రింది లంకెల ద్వారా ప్రాపించవచ్చు:

http://www.tadepally.com/2008/11/1.html
http://www.tadepally.com/2008/11/2.html
http://www.tadepally.com/2008/11/3.html

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్