17.11.08
లెంపలేసుకుందాం - కొంప దిద్దుకుందాం ! - 3
6:00 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: ఇల్లూ వాకిలి
ఒక వ్యక్తి నిన్ను సరిగా మన్నించకపోవడాని (ill-treatment) కి అసలు కారణం - ఆ వ్యక్తి జీవితం నీ మీద ఆధారపడి నడిచేది కాకపోవడం. ఆ వ్యక్తి ప్రేమ నీకు కావాలనుకున్నప్పుడు, నీకు మాత్రమే విధేయం (loyal) గా మిగలాలని నువ్వనుకున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిమీద తన స్వభావానికి సరిపడని భారాలేవీ మోపకూడదు.
చదువా ? సంస్కారమా ? సంసారం చేసుకోవడానికి కావలసింది చదువు కాదు, సంస్కారం. చదువుకూ, సంస్కారానికీ సంబంధం లేదు. ఎందుకంటే మన కాలపు చదువు "పాండవులంటే మంచం కోళ్ళలా ముగ్గు"రన్నట్లు చదివే చదువు. అది అందఱికీ ఒకేలా ఉపయోగపడదు. ఆడదానికి కూరలు తఱుక్కోవడానికి ఉపయోగపడే వస్తువు మగవాడికి మారణాయుధంగా ఉపయోగపడొచ్చు. అలాగే మగవాడికి జీవనోపాధి నిచ్చే పరిజ్ఞానం ఆడదాని చేతిలో మారణాయుధం కావచ్చు. ఆ విధంగా ఈ కాలంలో కొన్ని లక్షణాలు కొందఱి చేతుల్లో మారణాయుధాలు. ఆ ఆయుధాల్ని ఎవరు ఎప్పుడు ఎలా ఎవరి మీద వాడతారో చెప్పడం కష్టం. మనుషుల్లో 'ఆయుధ కండూతి' అనేదొకటుంది. దీనికి ఆడా, మగా తేడా లేదు. ఒకడి చేతిలో కలం ఉంటే పనీపాటా ఉన్నా లేకపోయినా అది పట్టుకుని ఏదో ఒకటి బరుకుతూనే ఉంటాడు. ఒకడి చేతిలో ఏదైనా అధికారం ఉంటే ఉపయోగం ఉన్నా, లేకపోయినా దాన్ని వాడుతూనే ఉంటాడు. అలానే ఒక వ్యక్తికి మారణాయుధాలతో సమానమైన పరిజ్ఞానం ఉండీ కూడా దాన్ని ప్రయోగించకూడదని కోరుకోవడం దురాశే. సంకల్పమూ, అవసరమూ, శక్తీ, పరిజ్ఞానమూ, ప్రోత్సాహమూ, అనుకూల పరిస్థితులూ - ఈ ఆఱూ కూడివస్తే ఎవరైనా దేనికైనా సాహసిస్తారు. పరిజ్ఞానం ఉన్నంతకాలమూ దాన్ని ప్రయోగిస్తూనే ఉంటారు. నాకు తెలిసి ప్రపంచంలో బహుతెలివైనవాళ్ళు మంచిగా ఉండడం అరుదు. మంచివాళ్ళు తెలివిగా ప్రవర్తించడం కూడా అరుదే. జీవితభాగస్వాముల నుంచి కోరుకోవలసింది ఈ రెండింటిలో దేన్ని ? అది ఖచ్చితంగా తేల్చుకుంటేనే గాని "వారి ద్వారా మనశ్శాంతి పొందడమెలా ?' అనేది అర్థంకాదు.
మంచి కుటుంబం గుఱించి నీకున్న ఊహల్లో అవతలి వ్యక్తిని కూడా సంపూర్ణ భాగస్వామిని చెయ్యి : ప్రపంచంలో చాలా విషయాలు ఆశంసల (expectations) మీద నడుస్తాయి. అన్ని విషయాలూ కాయితాల మీద రాయబడవు. అన్ని విషయాలూ పైకి చెప్పబడవు. "నువ్వు ఇంటి దగ్గఱ కూడా అప్పుడప్పుడు ఆఫీసుపని చెయ్యాల్సి ఉంటుం"దని నీకు జీతమిచ్చే యజమాని నిన్ను నియమించిన రోజున ప్రత్యేకించి నోరుతెఱిచి చెప్పడు. నువ్వు చేస్తావంతే ! అలా ఆశించే హక్కే లేనప్పుడు అన్ని హక్కుల్నీ పోగొట్టుకున్నట్లే. అయితే ఇందులో రెండు సూక్ష్మ కీలకాలున్నాయి. మొదటిది - ఒక విషయాన్ని అవతలివాళ్ళ నుంచి ఆశించగలగాలంటే నీకేం కావాలో ముందే నీకు స్పష్టంగా తెలిసుండాలి. అంతే తప్ప ప్రభుత్వమో, పత్రికలో, ఒక మహిళాసంఘమో నీ బదులు తామే నిర్ణయించి పెట్టకూడదు. నీకేం కావాలో నీకు స్పష్టంగా తెలిసి, నువ్వు ఆ లక్షణాల్ని రాజీ లేకుండా ఆశిస్తున్నప్పుడు, నువ్వు అలా ఆశిస్తున్నావని అవతలివారికి అర్థమైనప్పుడు నీ ఆశంసల్లో ఇమడాలనుకొనేవారు తప్పకుండా ఉంటారు. తద్ద్వారా నీకే కాక నీ తోటివాళ్ళక్కూడా మేలు జరగడమూ, కుటుంబాలూ, సంసారాలూ బాగుపడ్డమూ పెద్ద కష్టం కాదు.
రెండో సూక్ష్మకీలకం - అసలు ఆ విధంగా ఆశించే అర్హత నీకుందా ? అనేది. అంటే నీకు ఆ అర్హత ఉందనేది నీ కాబోయే భాగస్వామి అభిప్రాయమేనా ? ఎందుకంటే ఒక ఆడదాని హృదయానికి ఒక మగవాణ్ణి దగ్గఱ చేసే అంశం, అతను ఆమెకిచ్చే సమానత్వం కాదు, ఆమె తనంతట తాను అతనికిచ్చే గౌరవం. నా పరిశీలనలో - స్త్రీపురుష సంబంధంలో సమానత్వానికి సెక్స్ అప్పీల్ శూన్యం. కారణం - ఆడదాని పట్ల మగవాడికుండే ప్రేమా, మగవాడి పట్ల ఆడదానికుండే ప్రేమా ఒకటి కావు. ఆడదాని పట్ల మగవాడి ప్రేమ వాత్సల్యపూర్వకమైనది. ఒక పసిబిడ్డ పట్ల పెద్దలకి కలిగే ముద్దుతో దాన్ని పోల్చవచ్చు. అతనిమీద పోరాడ్డం కంటే అతనిలో తన పట్ల ఆ సహజ వాత్సల్యాన్ని మేల్కొలిపేలా ప్రవర్తించడమే ఆడదానికి సులభమైన విషయం. తద్విరుద్ధంగా మగవాడి పట్ల ఆడదానికుండే ప్రేమ గౌరవభావ పురస్కృతమైనది. ఒక మహాపురుషుడి పట్ల అతని అనుచరులకు ఉండే భక్తితాత్పర్యాలతో అది సాటివస్తుంది. ఆమెని వాచ్యంగా అదుపు చెయ్యడం కంటే తనపట్ల ఆమెలో ఆ సహజ గౌరవాన్ని మేల్కొల్పడమే మగవాడికి అత్యంత సులభమైన విషయం. ఏతావతా, సమానత్వం రాజకీయ పరిపాలనాసూత్రమే తప్ప దానికి అన్ని మానవ సంబంధాల్నీ శాసించేటంత సీన్ లేదని చెప్పక తప్పదు. అందుచేత ఎంతగా గౌరవించబడే పరిస్థితి ఉంటే అంతగా ఆశంసలు పెట్టుకొనే అర్హత కూడా సిద్ధిస్తుంది. అందుచేత నిన్ను నువ్వే ప్రయత్నపూర్వకంగా పెద్దగీతగా మార్చుకోవాలి. అది నీ మీదనే ఆధారపడి ఉంది. ఆ పని పెళ్ళికి ముందే చెయ్యాలి. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోను సాధ్యపడదు.
వ్యక్తిగత హీరోయిజమ్ ఈ నాగరికతలో అన్నివేళలా సాధ్యపడదు : ఈ సంసారాల విధ్వంసం - మన (మగవాళ్ళ) తప్పిదాల మూలంగా, మన పాశ్చాత్య వ్యామోహం మూలంగా, మన ప్రత్యక్ష ప్రమేయంతో, మన ఆధ్వర్యవంలో జరుగుతోందని గుర్తెఱగడం అత్యావశ్యకం. ఎన్ని అమానుష చట్టాలు తమకి అనుకూలంగా ఉన్నా, ఆడవాళ్ళు ఇందులో పాత్రధారులు మాత్రమే. అసలైన సూత్రధారులు మగవాళ్ళే. నీకు నీ కాపరాన్నే కాదు, నీ అల్లుడి కాపరాన్ని నిలబెట్టే బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే నువ్వు కూడా ఒకప్పుడు ఒక అల్లుడివే కనుక. నీ మామగారు నిన్నెలా చూశారో, నువ్వూ అలానే చూడాలి నీ అల్లుణ్ణి. నీ కూతురినే కాదు, నీ కొడుకులాంటివాడైన నీ అల్లుణ్ణి కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అతని సున్నితత్వాల్ని, ఇష్టానిష్టాల్ని గంభీరంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అది నీ కనీస కర్తవ్యం. ఆ విధంగా నీకు నీ గౌరవాన్నే కాదు, నీ అల్లుడి గౌరవాన్ని, బావగారి గౌరవాన్నీ కూడా నిలబెట్టే బాధ్యత ఉంది. మీరంతా కలిసి పరస్పరం గౌరవించుకోవడం ద్వారా మీ ఆడవాళ్ళ ముందు హీరోలు కాగలరు. అంతే తప్ప, మీలో ఒకణ్ణొకడు జోకర్ గా మార్చుకుని మీరు ఆడవాళ్ళ ముందు ఎప్పటికీ హీరోలు కాలేరు.
(ముగింపు వచ్చే టపాలో....)
