14.11.08

లెంపలేసుకుందాం - కొంప దిద్దుకుందాం ! - 2



లీగల్ మాఫియా కార్యకలాపాలెలా ఉంటాయంటే - ఒకడు యథాప్రకారం రోజూ ఆఫీసు కెళుతూనే ఉంటాడు. భార్యతో అతనికేవో చిన్నచిన్న గొడవలుంటాయి. అవి తనకీ, తన భార్యకీ మాత్రమే తెలుసునని అతను అనుకుంటూ ఉంటాడు. కాని అతనికి తెలియకుండా ఇంటి దగ్గఱ కొన్ని కీలక పరిణామాలు శరవేగంతో జరిగిపోతూంటాయి. ఒక ఏమఱుపాటు క్షణంలో అతని మెడ చుట్టూ ఉరి బిగుసుకుంటుంది. ఆమెకు మంచి ఉద్యోగం ఉన్నప్పుడు గాని, అతనికి బాగా ఆస్తి ఉన్నప్పుడు గాని, ఆమె యొక్క బంధుమిత్రుల వర్గంలో రాజకీయ నాయకులూ, పాత్రికేయులూ, న్యాయవాదులూ, పోలీసుల వంటివారెవరైనా ఉన్నప్పుడు గానీ ఇలా జరిగే అవకాశం ఉందని గమనించబడింది.

పక్షాంతరంలో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే - పైసా కట్నం తీసుకోకపోయినా, దాని గుఱించి ఎప్పుడూ ప్రస్తావించక పోయినా ఏవో ఇతరేతర విభేదాల్ని పురస్కరించుకుని "కట్నం తీసుకున్నాడని, ఇంకా అదనపు కట్నం కావాలంటున్నా" డని తప్పుడు అభియోగాలు మోపి చెఱసాల్లో తోయించిన సందర్భాలున్నాయి. ఆ ఇతరేతర విభేదాలు అతనితో కాకుండా, అతని రక్తసంబంధీకులతో ఉన్నా సరే, ఇలా జరిగే అవకాశం ఉంది. లేదా వేఱుకాపురం పెట్టడానికి భర్త ఇష్టపడకపోయినా, జీతమంతా తెచ్చి చేతిలో పొయ్యకపోయినా కూడా భర్త మీద ఈ చర్య అమలుజరిగే అవకాశం ఉంది. ఇదంతా ఆధునికమే కనుక మనం తప్పుపట్టకూడదు. కానీ ఇలాంటి విషయాల్లో మంచితనంతో పాటు తెలివితేటలూ, నిరంతర మెలకువా ముఖ్యమైనవి.

ఏతావతా భర్త తన భార్య నుంచి పురుషోచిత లక్షణాల్ని ఆశించడం మానేస్తే అతనికీ, అతని భార్యకీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూడతాయి. చాలాసార్లు చూస్తూంటాం - "నా కాబోయే భార్య ఆ కోర్సు చేసి ఉండాలి. ఈ డిగ్రీ చదివుండాలి. ఇందులో కింగ్ కాంగ్ ఆయ్యుండాలి. అందులో డింగ్ డాంగ్ అయ్యుండాలి. నా 'వేవ్ లెంగ్త్' తో దీటవ్వాలి. నాతో పాటు పార్టీలకి, ఫంక్షన్లకీ ఫలానా డ్రెస్సులో రావడానికి మొహమాటపడకూడదు. ఇంగ్లీషు బాగా మాట్లాడాలి. అందఱితోను కలుపుగోలుగా కలిసిపోవాలి" అని కొందఱు యువకులు తహతహలాడ్డం. ఇటువంటి ఆశంసల ద్వారా తాను తన భార్యని ఎన్ని ప్రభావాలకి లోను చేస్తున్నాడో అతనికే తెలియదు. ఈ తహతహకి అర్థమే లేదు. చాలా సందర్భాల్లో దీనికి ప్రేరణ - తమ నేస్తుడికో, సహోద్యోగికో, యజమానికో అలాంటి భార్య ఉండడం. కానీ వాళ్ళ సంసారం ఏ మాత్రం బాగా జరుగుతోందో ఇతగాడికి తెలుసునని చెప్పలేం.

ఎవరి శక్తిసామర్థ్యాల్ని అనుసరించి వారు తమ జీవితాదర్శాల్ని ఏర్పరచుకుంటారు. ఒక గణనీయ సంఖ్యకి చెందిన ఆడవాళ్ళు ప్రేమ, భావోద్వేగం, సెంటిమెంట్ల ప్రాతిపదికన పనిచేస్తారు. చేసిన పనివల్ల అనుకున్న ప్రయోజనం సిద్ధించిన తృప్తి కన్నా "బాగా చేశావు" అనే మెప్పుకోసమే ఎదురుచూస్తారు. కష్టపడ్డానికి మగప్రపంచంలో చాలా విలువుంది. ఆడప్రపంచంలో దానికి అంత విలువ లేదు. మగ ఆదర్శాలు ఆడవాళ్ళకు ఆదర్శం కావు. మన దేశంలో ఒక ఆడది అహోరాత్రాలూ కష్టపడి పనిచేస్తోందంటే మిగతా ఆడవాళ్ళ దృష్టిలో (కొండొకచో మగవాళ్ళ దృష్టిలో కూడా) ఆమెకు సంబంధించిన మగవాళ్ళంతా వట్టి పనికిమాలినవాళ్ళ కింద జమ. "లేకపోతే ఆమెకంత కష్టపడే గతి ఎందుకు పట్టింది ?" ఈ ఆలోచనాకోణం వాళ్ళ వఱకు పరిమితం కాకుండా ఆమె దాకా చేరి Self-pity కి, Self-conscious కీ దారితీసినప్పుడు భర్తే శత్రువులా కనిపిస్తాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో అనూహ్యం.

భార్యాభర్తలు వేఱువేఱు చోట్ల పెఱగడం వల్ల వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి పెళ్ళిచేసుకున్నాక ఒకరికొకరు అర్థం కావడానికే ఏళ్లూ, పూళ్ళూ పట్టుతోంది. అంతకాలం పాటు తీఱిగ్గా కూర్చుని అర్థం చేసుకునే ఓపికా, సమయమూ ఈ తరానికి లేకపోవడం ఒక సమస్య. అందరూ పొలోమని సైన్సే చదవడం వల్ల కూడా మానవసంబంధాల పట్ల అవగాహన లోపించడం మఱొక సమస్య. ఆడవాళ్ళు తీసుకోనీ, మగవాళ్ళు తీసుకోనీ, హిందూమతంలో విడాకులకి విలువ లేదు. మన సంప్రదాయంలో భార్యాత్వం గానీ, భర్తృత్వం గానీ ఎట్టి పరిస్థితుల్లోను రద్దుకావు. మొదటి భార్యని పరిత్యజించి రెండో పెళ్ళి చేసుకున్నా సరే, మొదటి భార్యని జీవితాంతం ఇంట్లో పెట్టుకొని పోషించాల్సిందేనని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. జీవిత భాగస్వామికి విడాకులిచ్చి చేసుకునే రెండో పెళ్ళిళ్ళని సైతం బహుభార్యాత్వంతోను, బహుభర్తృత్వంతోను సమానంగా హిందూమతం చూస్తుంది. కారణం - భార్యాభర్తల సంబంధాన్ని ఇద్దఱు బయటివాళ్ళ సంబంధంగా గానీ, మనుషులు తమ ఇష్టానిష్టాలతో, ప్రమేయంతో ఏర్పఱచుకొన్న సంబంధంగా గానీ కాకుండా, భగవంతుని ప్రత్యక్ష జోక్యంతో ఏర్పడిన, రద్దు చెయ్యడానికి వీల్లేని, రక్తసంబంధంతో సమానమైన శాశ్వత సంబంధంగానే అది పరిగణిస్తుంది. ఇది Naturalized citizenship లాంటిది. తమ ప్రమేయంతో ఏర్పడనటువంటి, తమకి విచక్షణాధికారం లేనటువంటి, తమ ఎంపికకి లోబడనటువంటి తల్లీ, తండ్రీ మొదలైన సంబంధాల్ని ఎలానైతే మనుషులు చచ్చినట్లు గౌరవిస్తారో, అలానే తమ ఇష్టానిష్టాలతో, తమ కర్మఫలానుసారం ఏర్పడ్డ భార్యాభర్తల సంబంధాన్ని కూడా గౌరవించమని నొక్కి వక్కాణించడమే మన మతగురువులు అవలంబించిన ఈ రాజీలేని వైఖరి వెనుక ఉన్న అంతరార్థం. అందువల్ల చిన్నప్పట్నుంచి తెలిసిన అమ్మాయిని చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారమౌతాయి. లేదా చేతనైతే - కేవలం తమ అబ్బాయికిచ్చి పెళ్ళిచేసే ఉద్దేశంతో తల్లిదండ్రులే ఒక పిల్లని ఇంటికి తీసుకొచ్చి పెంచినా మంచిదే.

ప్రపంచంలో పాడిపంటలతో సహా ప్రతిదానికీ ఒక అదునూ, పదునూ ఉన్నాయి. సరిగ్గా ఆ సమయానికల్లా అది జరిగిపోవాలంతే ! ఏ మాత్రం ఒడుపు తప్పినా జరగేదేదీ జరగాల్సినట్లుగా జరగదు. పెళ్ళయినా అంతే ! జీవశాస్త్రపరంగా అమ్మాయిలకు పెళ్ళికి మిక్కిలి తగిన ప్రాయం ఒకటుంది. అప్పుడు వాళ్ళు కొత్త సాన్నిహిత్యాన్ని తమ జీవితంలోకి సాదరంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని ఊహలుంటాయి. కొన్ని ఆదర్శాలుంటాయి. ఆ వేడి చల్లాఱకముందే వాళ్ళకు పెళ్ళయిపోవడం చాలా మంచిది. ఆ సమయంలో అలాంటి అమ్మాయిని చేసుకోవడం మగవాడిక్కూడా చాలా మంచిది. కాని ఆ బంగారు కాలాన్ని చేజేతులా దగ్ధంచేసి చదువూ, కెరియర్, స్థిరపడ్డం అంటూ ముసలిమాటలు వల్లిస్తూ బాగా గిడసబాఱి ముదిరిపోయాక, మనసు నానా ఆకర్షణలతో చెదిఱిపోయాక, open mind సంపూర్ణంగా చచ్చాక అర్ధవృద్ధాప్యంలో పెళ్ళిళ్ళకు దిగుతున్నారీ రోజుల్లో యువతీ యువకులు.

ప్రభుత్వం నిర్దేశించిన వయసు కంటే ముందే ఎదుగుతున్నాయి శరీరవాంఛలు. వివాహ వయోపరిమితిని పెంచుకుంటూ పోవడం ద్వారా వైవాహిక సమస్యల్ని పెంచుతున్నామనే ప్రాథమిక ఇంగితం కొఱవడుతోంది. అసలు మన వ్యక్తిగత స్థితిగతుల్ని బట్టి మనం ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలో అది మన సౌకర్యం, మన ఇష్టం. ప్రభుత్వమూ, ఆ పేరుతో ఆ దొంగల ముఠాని నడిపే రాజకీయ నాయకులూ అంత లోతైన వ్యక్తిగత విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటారో, అందుకు మనం ఎలా అనుమతిస్తున్నామో నేనర్థం చేసుకోలేను. తన శరీరవాంఛల మూలంగా ఒకడికి పదహారేళ్ళకే పెళ్లాం కావాలనిపిస్తే మనం పనిగట్టుకొని వెళ్ళి బలవంతంగా వాడి మొలకి వివాహ వయస్ చట్టాలనబడే ఇనప కచ్చడాలెందుకు బిగించాలో నాకు తెలియదు.

పెళ్ళిళ్ళు ఆలస్యమైపోవడం వల్ల ఎవరి పుట్టిళ్ళకు వాళ్ళు ఏళ్ళ తరబడి మానసికంగా అంటుకుపోయిన స్థితిలో ఆ తరువాత ఎంతకాలం కలిసున్నా ఒకరికొకరు పరాయిగానే బతుకుతారు. వాళ్ళ మధ్య మూడో వ్యక్తులు (third parties) ప్రముఖపాత్ర పోషించడం మొదలుపెడతారు. (ఆ మూడో వ్యక్తుల్లో ప్రభుత్వాన్నీ, న్యాయస్థానాల్నీ కూడా చేర్చవచ్చు) ఆ జంటలు హక్కులు మాట్లాడతారు. భాగస్వామి గుఱించి వేఱేవాళ్ల దగ్గర చాడీలు చెబుతారు. కేసులు కూడా పెట్టుకుంటారు. విడాకులు తీసుకుంటారు. రహస్యంగా వేఱేవాళ్ళతో పోతారు. ఆ విధంగా అనేక అంకఛండాలాలూ, నానా దరిద్రాలూను ! ఇదొక పార్శ్వం.


(మఱికొంత వచ్చే టపాలో....)

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్