Friday, May 16, 2008

ఆ దెబ్బ దేవేంద్రలోకం

నేనొకసారి ఒక మహాపరాధం చేశాను. మా నాన్నగారు నన్ను చావగొట్టే ఉద్దేశంతో నా వెంటపడ్డారు. నేను తప్పించుకుని పారిపోయాను. ఆయన నామీద కేకలేస్తూ కొంతదూరం వఱకు నన్ను తరిమారు. ఆ తరువాత వయోభారంచేత నాతో సమానంగా పరిగెత్తలేక ఒకచోట నీరసంగా కూలబడ్డారు. చాలాసేపటి తరువాత నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చాను. ఆయన కంటపడకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. (నేనాయన కంటపడలేదని నేననుకున్నాను). తరువాత ఆయన ఎదుటపడ్డప్పుడు నాకు తన్నులు తప్పవనుకున్నాను. కాని ఆయన ఆ విషయమే ఎత్తలేదు. కాని ఆయన నన్ను క్షమించలేదని నాకు తెలుసు. కాని నేను చాలా ఆనందించాను. తరువాత కొద్ది సంవత్సరాలకు ఆయన చనిపోయారు.

వెనక్కి తిరిగి చూసుకుంటే నాన్నగారిని అంత కష్టపెట్టి ఉండాల్సింది కాదని అనిపిస్తుంది. నేను ఆయనకు లొంగిపోయుంటే బావుండేది. నన్నాయన చావగొట్టి ఉంటే బావుండేది. తన్నులు తప్పాయని ఆనందించడం ఒక పిల్లచేష్ట. నా అపరాధం శిక్షించబడకుండా అలాగే మిగిలిపోయింది. దానిగుఱించి నన్ను దండించడానికి ఎవరికైతే సర్వాధికారా లున్నాయో ఆయన్ని నేనా పని చెయ్యనివ్వకపోవడం వల్ల, ఆ పనిని అలాగే ఉంచి ఆయన చనిపోవడం వల్ల, ఆ పని చెయ్యడానికి ఇంకెవరికీ అధికారం లేకపోవడం వల్ల అది ఇంకొక న్యాయస్థానంలోకి వెళుతుంది. అక్కడ కేవలం కొద్దిపాటి చావగొట్టుడుతోనే విషయం సరిపెట్టబడదు.

"ఆయన నన్ను కొట్టి ఉంటే బావుండేది" అని ఎవరో ఒక భార్య
"అన్నయ్య నన్ను తన్ని ఉంటే బావుండేది." అని ఎవరో ఒక తమ్ముడు
"అమ్మ నా చెంప పగలగొట్టి ఉంటే బావుండేది" అని ఎవరో ఒక కూతురు
ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు.

కుటుంబసభ్యులు చేసే తప్పులకు కుటుంబాధిపతి/కుటుంబాధికారిణి వారిని ఎప్పటికప్పుడు తగువిధంగా శిక్షించాలి. నిర్మొహమాటంగా నిర్మమంగా నిరహంకారంగా శిక్షించాలి. తెలిసీ శిక్షించకపోతే ఆ పాపాల్లో సగం అతనికి/ఆమెకు చుట్టుకుంటాయి. తరువాత ఆ కుటుంబసభ్యులు కూడా - అతడు విధించే శిక్షలకన్నా భయంకరమైనవాటిని భగవంతుడి చేతిలో అనుభవించాల్సి వస్తుంది. భగవత్ స్వరూపుడైన కుటుంబాధిపతి వేసే శిక్షలు గోటితో పోయేవి. మన పాపాల్ని అవి అనేక జన్మలకు వాయిదా వెయ్యకుండా ఇప్పటికిప్పుడే సూక్ష్మంలో పోగొట్టేస్తాయి. కాని భగవంతుడే స్వయంగా శిక్షించాల్సి వస్తే ఆయన గోళ్ళు వాడడు. ఖచ్చితంగా గొడ్డళ్ళే వాడతాడు. ఆ అనుభవం మానవులకు బహుబాధాకరంగా దుర్భరంగా ఉంటుంది. కనుక కుటుంబాధిపతి చేతిలో శిక్ష అనుభవించడం వీలుపడకపోతే తత్సమానులైన పెద్దల సమక్షంలో తప్పు ఒప్పుకుని వారు విధించగల ప్రాయశ్చిత్తానికి పాత్రులు కావాలని శాస్త్రం.

భగవంతుడి శిక్షలు ఎక్కువ బాధాకరంగా ఉండడానికి కారణం ఆయన క్రూరుడు కావడం కాదు. అందుకు విరుద్ధంగా ఆయన మనందరికంటే నిస్స౧దేహంగా పరమ దయామయుడు. అసలు కారణం - పాపమైనా పుణ్యమైనా అనుభవించకుండా పేరబెట్టేకొద్దీ, ఆ అనుభవాన్ని వాయిదా వేసేకొద్దీ అది "ఇంతింతై వటుడింతై" అన్నట్లుగా పెరిగి పోతూంటుంది. అంటే పాపం చెయ్యడానికీ, దాని ఫలితాన్ని అనుభవించడానికీ మధ్య ఎక్కువ ఎడం (gap) ఉండకూడదు. కుటుంబాధిపతి తక్షణం వేసే శిక్ష అలాంటి ఎడమేదీ ఏర్పడకుండా మనల్ని కాపాడుతుంది. ఉదాహరణకు - మీరొక దీపం పక్కన చెయ్యి పెట్టినప్పుడు మీ చేతికీ దాని నీడకీ నడుమ ఎడం పెరిగిపోయేకొద్దీ మీ చేతి నీడ పరిమాణం కూడా వందలాదిరెట్లుగా పెరిగిపోతుంది.

5 వ్యాఖ్యలు:

సుజాతా శ్రీనివాస్ said...

నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న విషయం మీద మీరు టపా రాశారు. ఏ తప్పుకి పరిహారం ఏమిటొ మనకి ఎల్లా తెలుస్తుంది? ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన గురు చరిత్రలో కొన్ని తప్పులకు, పాపాలకు పరిహారాలు, (లక్షల కొద్దీ గాయత్రి వగైరా) చెప్పారు. పాపాలు- పరిహారాలకు సంబంధించి ఏదైనా గ్రంథం ఉన్నదా? తెలియక ఎన్నో తప్పులు(జీవ హింస పాపం అయితే దోమైనా, చీమైనా మన చేతిలో చస్తే అది జీవహిం స కిందకే వస్తుంది కదా!)చేస్తూ ఉంటాం. మరి వాటికి అప్పటికప్పుడు మనమే శిక్ష ఎలా విధించుకోగలుగుతాం చెప్పండి!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఈ టపా ఒక పెద్ద పుస్తకంలో భాగం. ఇది ఒకానొక పార్శ్వాన్ని స్పర్శిస్తున్నది. ఇంకా చాలా పార్శ్వాలున్నాయి. ఒక్కొక్కటిగా అప్పుడప్పుడు రాస్తూనే ఉంటాను. చూడండి.

బండి సున్నా said...

నాకు తెల్సినంతలో పాపానికి విరుగుడు అనేది లేదు. పుణ్యం, పాపం అనేవి రెండు సమాంతర పట్టాలు. పాపం చేసి ఏదో కొంచెం కానీ ఎక్కువకానీ జపం చేసేస్తే చేసిన పాపం పోతుందనుకోటం శుద్ధ భ్రమ. దేనికవే చిట్టాలో ఎక్కించబడతై. వాటిని ఎప్పటికైనా అనుభవించడం తప్పనిసరి. అయితే పుణ్యం చేయడం వల్ల మనస్సు శుభ్రంగా తయారై ఎక్కువ పాపాలు చేయకుండ మనల్ని మనం నిరోధించుకోగలుగుతాం. ఈ విధంగా చేస్తే పోయేసరికి ఒక పట్టా ఎక్కువగాను, ఒకటి తక్కువగాను అవుతాయి. అంతే కానీ పుణ్యం చేస్తే, అంతకుముందు చేసిన పాపం పోతుందనుకోవటం, చేసిన పాపం చెప్తే పోతుందనుకోవడం, అనేవి ఆత్మ వంచనలోకే వస్తై. మనస్సు అనేది చాలా విచిత్రమైంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, వెంటనే ఇలాంటి పాత చింతకాయి పచ్చడి ఫార్ములాలని బుర్రలోంచి తీసుకొచ్చి, ఇదిగో ఇక్కడ ఇలా రాసి ఉంది, పర్లేదు నువ్వు పాపం చేసినా ఏమవదు అని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

అసంశయో మహాభాహో మనో దుర్నిగ్రహం చలం....
అనేది గీతా చార్యుడు చెప్పాడు కదా?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

బండిసున్నాగారితో 80 శాతం ఏకీభవిస్తున్నాను.

సుజాతా శ్రీనివాస్ said...

బండి సున్నా గారు,
బాగా విశ్లేషించారు!