Wednesday, May 07, 2008

మహిళా రిజర్వేషన్ - మరో కోణం

మహిళల రాజకీయ ప్రాతినిధ్య ప్రత్యేకింపుల ప్రతిపాదనాపత్రం (Reservations Bill) నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. దీని గుఱించి వార్తాపత్రికలందించిన కథనం మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంది. అపరిణతం(immature)గా కూడా ఉంది. సాక్షిపత్రికైతే "మగ గండాలు గడిచిన మహిళాబిల్లు" అని పతాకశీర్షిక(banner head) పెట్టింది. ఏంటో పాపం ! ఆడవాళ్ళు చట్టసభల్లో ప్రవేశిస్తే మగవాళ్ళ అధిపత్యానికి గండిపడుతుందని యావన్ మగజాతీ యమా ఆందోళన చెందుతున్నట్లూ, "భగవంతుడా ! ఈ బిల్లు పాసవ్వకుండా చెయ్యి' అని రోజూ శతకోటిమంది దేవుళ్ళకు మొక్కుకుంటున్నట్లూ బిల్డప్పు. అలాంటి మగవాళ్ళున్న దేశాలు ఆసియా ఖండానికి పడమట కొన్ని ఉన్నాయి. భారతీయ పురుషులకు ఆ క్లబ్బులో సభ్యత్వం లేదు. అలాంటి సామాజిక వాతావరణమే గనక నిజంగా ఇక్కడ ఉండి ఉంటే ఇలాంటి బిల్లుల్ని మన పేరోలగంలో ప్రవేశపెట్టడానికి ఎవరూ సాహసించేవారు కారు. కాని వాస్తవిక దృక్పథంతో ఆ విశాల హృదయాన్ని ఈ దేశపు మగవాళ్ళకు ఆపాదించడానికి, నెనర్లు (thanks) చెప్పడానికీ ఫెమినిస్టులు గానీ వాళ్ళచేత ప్రభావితమౌతున్న ప్రసారమాధ్యమాలు గానీ సిద్ధంగా లేరు. దీనికంతటికీ కారణం మీడియా. మగవాళ్ళకు అది చేస్తున్న అపకారం సాటిలేనిది. It's extremely hurtful. అందుకని నాకనిపిస్తుంది - ముందో వెనకో మన పురుష మీడియాని మనమే రూపొందించుకోవాల్సిన తరుణం సమీపిస్తోందని !


భారత పేరోలగం (Indian Parliament) లో ఆడవాళ్ళు 180 మంది ఉన్నా 360 మంది ఉన్నా పరిస్థితిలో పెద్ద మార్పుంటుందని నేననుకోను. ఇక్కడ పార్టీయే దేవుడు. అంతిమంగా పేరోలగంలో ఆడ-మగ ఫీలింగులు పనిచెయ్యవు-పార్టీ అజెండా తప్ప ! అసలు విషయం అది కాదు. పత్రికలు చిత్రిస్తున్నట్లుగా ఇది ఆడ-మగ మధ్య రాజకీయ యుద్ధం కాదు. రాజకీయపార్టీల అభ్యంతరాలకు అసలు కారణం - 33 శాతం స్థానాలంటే లోక్ సభలో ఇప్పుడున్న180 మంది సభ్యుల్ని ఆ స్థానాల్లో మళ్ళీ పోటీచెయ్యకుండా అనర్హుల్ని చెయ్యడం. వాళ్ళని బలవంతంగా రాజకీయాల్లోంచి విరమింపజెయ్యడం. ఏ నాయకుడికి మాత్రం అలాంటిది ఇష్టం ఉంటుంది ? ఎందుకంటే రాజకీయనాయకుడనేవాడు పెంగ్విన్ పక్షుల్లాగా, ధ్రువపు టెలుగుబంటు (Polar Bear) లాగా ఒక ప్రత్యేక భూభాగానికి నిబద్ధుడైన జంతువు. ఆ భూభాగం (habitat) దాటితే వాడు రాజకీయంగా చస్తాడు. ఈరోజు మగవాళ్ళని ఆడిపోసుకుంటున్నారు గాని రేపు స్త్రీలకు కేటాయించిన స్థానాల్ని ఏ కారణం చేతనైనా General Category లోకి మారుస్తామంటే మహిళా ఎంపీలు సరిగ్గా ఇదే రకమైన గగ్గోలు లేవదీస్తారు.

ఇలా స్త్రీలకు సంబంధించిన ప్రతివిషయంలోను మగవాణ్ణి విలన్ గా, శత్రువుగా, ప్రత్యర్థిగా పోటీదారుగా ఎందుకు చిత్రిస్తారో నాకు అంతుపట్టని సంగతి. ముఖ్యంగా మగవాడికి అలాంటి రికార్డు ఏదీ లేకపోయినా ! వాస్తవానికి ఇప్పుడు ఆడవాళ్ళు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలూ, ప్రివిలీజెస్ వాళ్ళకోసం మగవాళ్ళే పోరాడి సాధించిపెట్టినవి. ఫెమినిస్టులూ, ఎఱ్ఱజెండాలూ ప్రచారం చేస్తున్నట్లు ఆడవాళ్ళు రక్తమో, మఱొకటో చిందించి సాధించుకున్నవి కానేకావు. ఇప్పటికీ ఆడవాళ్ళని చదువుకొమ్మనీ, ఉద్యోగాలు చెయ్యమనీ ప్రోత్సహిస్తున్నది మగవాళ్ళే. అది తండ్రి కావచ్చు ,భర్త కావచ్చు, చదువు చెప్పిన మాష్టారు కావచ్చు.

కాని మగవాడి మంచితనానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ప్రచారం ఇవ్వకూడదు. వాణ్ణి ఇప్పటికే అందరి దృష్టిలోను వెధవన్నర వెధవని చేసేశాం. వాడలా ఆచంద్రతారార్కం కొనసాగాల్సిందే. మగవాళ్ళు కూడా ఫెమినిస్టుల పాచిపాటే పాడుతున్న పరిస్థితుల్లో వాడి మూర్తిమత్త్వం (ఇమేజి) ఇప్పట్లో మెఱుగుపడే అవకాశం లేదు. వాడు స్వతహాగా మంచివాడని ఒప్పుకుంటే ఆడవాళ్ళంతా సుఖపడిపోతున్నట్లే అవుతుంది. అప్పుడు ఆడవాళ్ళ సౌలభ్యార్థం చేసే ప్రత్యేక చట్టాల నిలదీతలు (డిమాండ్లు) తుస్సుమంటాయి. అమ్మమ్మ ! అది ఎట్టి పరిస్థితుల్లోను కుదరదు. మగజాతి ఆడజాతిని ఇంకా ఇంకా దారుణంగా అణిచేస్తున్నట్లే మొహం పెట్టాలి. ఒకపక్క "సమానం" అంటూనే మగవాళ్ళక్కూడా చరిత్రలో ఎన్నడూ లేని అనేక హక్కుభుక్తాలు ఆడవాళ్ళు విఱివిగా సంపాదించాలి.

ప్రతి కథలోను ఒక కథానాయకుడు (హీరో), ఒక కథానాయిక (హీరోయిను), ఒక ప్రతినాయకుడు (విలను), ఒక హాస్యగాడు (కమెడియనూ) ఉండితీఱాలి. ఫెమినిస్టుల కథలో ఎల్లప్పుడూ ఆడదే ఏకకాలంలో కథానాయకుడు, కథానాయిక కూడా ! అలాగే ఆమె పాలిట మగవాడే ఎల్లప్పుడూ ఏకకాలంలో ప్రతినాయకుడు, హాస్యగాడు అవుతాడు. ఒక చెడ్డమగవాడు యావన్ మగజాతికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే ఒక మగవాణ్ణి చూసి అసలు మగజాతంటే ఏంటో ఇట్టే గ్రహించిపారెయ్యొచ్చు. కాని చెడ్డదని బయటపడ్డ ఒక ఆడది అందరు ఆడవాళ్ళకీ ప్రతినిధి కాజాలదు. ఆమె స్త్రీజాతికే కళంకం. ఎందుకంటే మిగతా ఆడవాళ్ళంతా చాలా మంచివాళ్ళు. వాళ్ళందరిలో ఒక తల్లినీ, చెల్లినీ మనం చూసుకోవాలి. వాళ్ళలో చెడ్డవాళ్ళు అరుదుగా ఉంటారు. ఒకవేళ ఏ స్త్రీ అయినా చెడ్డదైతే అందుకు మగవాడిదే బాధ్యత.

ఎందుకు చెబుతున్నానంటే - స్త్రీలకి రాజకీయ రిజర్వేషనే కాదు, ఎవరికి ఎలాంటి రిజర్వేషనివ్వాలన్నా నేను నిర్ ద్వంద్వంగా రాజీలేకుండా వ్యతిరేకిస్తాను. ఇలాంటి రిజర్వేషన్లన్నింటి వెనకా ఉండేది ఇలాంటి ఒక సుదీర్ఘకాలపు బాధితత్వ ప్రచారం (chronic victimization propaganda) . ఫలానా వర్గంవాళ్ళు చాలాకాలంపాటు బాధలు పడ్డారు. దానికి ఇతరులే కారణం. ఎందుకంటే ఇతరులు వాళ్ళని అణిచేశారు. ఆ వర్గంవాళ్ళకి మాత్రం తమపట్ల తమకు ఏ బాధ్యతా లేదు. కాబట్టి మనమందరం కలిసి ఇప్పుడు వాళ్ళ నడ్డిపట్టుకుని అర్జెంటుగా ఎత్తాలి. ఎందుకంటే వాళ్ళు బహుశా ఎప్పుడో ఎక్కి ఉండాల్సిన స్వప్నసింహాసనాల్ని మనమే అక్రమంగా ఎక్కేశాం గనుక మనం వాళ్ళకు జన్మజన్మలకూ ఋణపడిపోయాం. రిజర్వేషన్ల ద్వారా మనమిప్పుడా ఋణం తీర్చుకోవాలి.

ఇలా ఎదుటివాళ్ళ మానవహక్కుల్ని వ్యవస్థాపరంగా శాశ్వతంగా సమాధి చేసేవీ, మిగతా యావత్ జనాభాని చట్టపరంగా డీరికగ్నైజ్ చేసేవీ రిజర్వేషన్లు. ఇతర్లని వ్యక్తిగత ప్రతిభా పాటవ ప్రదర్శనలో బహిరంగంగా ఎదుర్కోలేక తమ మందబలాన్ని, ఓట్లనీ అడ్డంపెట్టుకుని ప్రభుత్వం యొక్క మెడలు వంచి సాధించుకునే అక్రమమైన, నీచమైన దొడ్డిదారి రిజర్వేషన్లు. పసిపిల్లల్ని ఎత్తుకుని అడుక్కునే బిచ్చగాళ్ళలాగా, శవంమీది డబ్బులేరుకునేవాళ్ళలాగా తమలో ఉన్న కొద్దిమంది అభాగ్యుల్ని చూపించి తాము శాశ్వతంగా పీఠాలెక్కడానికి పన్నిన కపటవ్యూహం రిజర్వేషన్లు. సగటు-సరాసరి మేధావులకు తప్ప అవి ఎవరికీ ఉపశమనం కాదు, ఎవరికీ ఉపకరించవు. ఒకసారి వాటిని ప్రవేశపెట్టాక ఇహ వాటిని ఈ యుగాంతానికైనా రద్దుచెయ్యడం ఎవరివల్లా కాదు. అవి మొదట్లో ఈ వర్గానికి ఇంత శాతం అంటూ మొదలవుతాయి. తరువాత్తరువాత కాలక్రమంలో హెచ్చుశాతం వోట్లున్న వర్గాల వాటాలే నిజమౌతాయి. మిగతావాళ్ళ వాటాలు మాత్రం వట్టిమాటలుగా మిగిలిపోయి రాజ్యాంగంలో విశ్రాంతి తీసుకుంటాయి. అగ్రకులాలతో సహా ప్రతివాణ్ణీ ఏదో ఒక రిజర్వేషన్ కేటగరీలోకి తెచ్చి ఈ అన్యాయానికి, ఈ అక్రమానికి ఈ సమానత్వవిరుద్ధానికీ, ఈ ప్రజాస్వామ్యద్రోహానికీ సువిశాల ప్రజానీకం యొక్క ఆమోదముద్ర సంపాదిద్దామనే ప్రతీప ధోరణి గత కొద్దికాలంగా బయల్దేరింది. ఈ జబ్బు మొదట తమిళనాడులో ఆరంభమై ఇప్పుడు యావద్దేశానికీ అంటుకుని నరనరాలా వ్యాపించి ప్రాణాంతకంగా ప్రకోపించింది..

మహిళా రిజర్వేషన్ బిల్లుని సైతం ఈ కోణంలోంచే చూడాల్సి ఉంది. ఇందులో ఇంకొన్ని కోణాలు కూడా ఉన్నాయి. చాలాకాలం నుంచి నా మనసుని తొలుస్తున్న ప్రశ్న - మన కులంవాడో మన మతంవాడో కాకపోయినంతమాత్రాన మన పరిపాలకుడు మనకు మేలుచెయ్యడా ? చెయ్యడని మనం అనొచ్చునా ? "మన"వాడైనంతమాత్రాన ప్రతిపాలకుడూ మనకు మేలుచేశాడా ? ఎవరున్నారనేదానికన్నా ముందు మనకు మేలు జరగడం ప్రధానం కాదా ? అలాగే ఆడవాళ్ళైతేనే ఆడవాళ్ళకు మేలుచేస్తారా ? మగవాళ్ళు మేలుచెయ్యరా ? గతంలో చెయ్యలేదా ? ఆడవాళ్ళని ఆడవాళ్ళే అర్థం చేసుకుంటారన్నప్పుడు, ఏ విషయంలో ? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆడ విషయాల్లోనే అయితే అందుకు గైనకాలజిస్టులు సరిపోతారు. కాని ఆడవాళ్ళని ఆడవాళ్ళే అర్థం చేసుకుంటారంటే మఱి వాళ్ళకు ఓట్లేసే విధంగా రాజ్యాంగబద్ధంగా మెడలు వంచబడ్డ సదరు ఆడనియోజకవర్గపు మగవోటర్లని ఎవరు అర్థం చేసుకోవాలి ?

మన అనుభవంలో, మనకు తెలిసి మన మహిళా ప్రతినిధులందరూ ఎప్పుడూ ఆడవాళ్ళ గుఱించే మాట్లాడతారు. తమని ఆడా, మగా అందరూ కలిసి ఎన్నుకున్నారనే ఇంగితజ్ఞానం వాళ్ళకున్నట్లు కనిపించదు. లేదా మగవాళ్ళకి ఏ సమస్యలూ లేవనుకుంటారో ఏమిటో ! రేణుకా చౌదరి ఎప్పుడూ ఆడవాళ్ళ గుఱించే మొత్తుకుంటూ ఉంటుంది. ఆమె తనకింద పనిచేసే మగ ఉద్యోగుల మీద భౌతికంగా దాడిచేసి చితక్కొట్టడంలో అనిర్వచనీయమైన ఆత్మానందాన్ని పొందుతుంది. ఆ క్రమంలో ఆమె గతంలో ఢిల్లీలో ఒక పోలీసుని స్వయంగా స్వహస్తాలతో చితక్కొట్టి అభియోగాన్ని (court case) కూడా ఎదుర్కుంది. అలాగే మన అధ్యక్షురాలు ప్రతిభాపాటిల్ ఎప్పుడూ ఆడవాళ్ళ సంక్షేమం గుఱించే మాట్లాడుతుంది. నేదురుమల్లి రాజ్యలక్ష్మి ప్రభుత్వ వేడుకల్లో ఒక్కొక్కప్పుడు ఫెమినిస్టులాగా మగవాళ్ళమీద రెచ్చిపోతూంటుంది. ఈ ప్రభుత్వానికి మగవాళ్ళు అక్కఱలేదా ? మగవాళ్ళు పన్నులు కట్టడంలేదా ? ఇందులో ఉన్న తప్పు వాళ్ళంతట వాళ్ళకు గోచరించడం లేదా ? ఏ రిజర్వేషనూ లేనప్పుడే మగవాళ్ళ పట్ల మహిళా ప్రతినిధుల ప్రవర్తన ఇలా అఘోరించిందే, మఱి మహిళా రిజర్వేషన్ ద్వారా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వెళ్ళినవాళ్ళు తమ పూర్తికాలాన్ని (ఆడా, మగా తేడా చూపించకుండా) యావత్ ప్రజానీక శ్రేయస్సు కోసం వెచ్చిస్తారంటే నమ్మేదెలా ? వాళ్ళు తమ "ఆడగుర్తింపు"ని అనుక్షణమూ నొక్కివక్కాణించి చెప్పుకోవడానికే పుణ్యకాలాన్ని వెచ్చిస్తారనీ తాము ఏ సేవా చెయ్యకపోయినా, తాము ఆడవాళ్ళం కనుక తమని ఎవరూ ఏమీ అనకూడదనే విధంగా తలబిరుసు ప్రదర్శిస్తారనీ నాకొక అనుమానం.

రాజకీయాలూ, రాజ్యాధికారమూ అనేవి సహజనాయకత్వ లక్షణాలకు సంబంధించినవి. అవి తప్పనిసరిగా పుట్టుకతో రావాల్సిందే. శిక్షణిచ్చి గాని ఇంజెక్షనిచ్చి గాని రిజర్వేషనిచ్చి గాని మీరు ఎవ్వరినీ నాయకుడుగా/నాయకురాలుగా రూపొందించజాలరు. కొందరు నాయకులు కాగలగడానికీ, కొందరు కాలేకపోవడానికీ ఎవడో పనిగట్టుకుని అణగదొక్కడం కారణం కానేకాదు. నిజంగా పరిజ్ఞానమూ, వాగ్ధాటి, ధైర్యమూ, సంఘటక శక్తి (organizing ability) కలిగినవారిని - వారు ఆడైనా, మగైనా నాయకత్వం వహించకుండా ఆపగలిగినవాడెవడూ లేడు - అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ! ఇతర బ్లాగుల కన్నా మీ బ్లాగునే అందరూ ఎక్కువగా చదవడానికి మీ బ్లాగులో స్వయంసిద్ధమైన పస ఉండడమా కారణం ? లేక మీరు ఇతరుల బ్లాగుల్ని అణగదొక్కడమా ? మఱి అదే వర్తిస్తుంది రాజకీయానిక్కూడా ! అందులోను ప్రజాకర్షణతో ముడిపడ్డ ప్రజాస్వామ్యంలో !

అందుచేత నేనెప్పుడూ చెప్పేదొకటే - Give nature a chance. Give spontaneity a chance. రిజర్వేషన్లనేవి ఈ సహజమైన నాయకత్వ ప్రతిభ వికసించే ప్రక్రియకు మానవకల్పిత అవరోధం. మన దేశంలో ఒక్కొక్క శాసనసభా నియోజకవర్గంలోను రెండున్నర లక్షలమంది నివసిస్తారు. లోక్ సభా నియోజకవర్గాల్లో నైతే 15 లక్షలకు తగ్గరు. ఆడ నియోజకవర్గాల్లో నాయకత్వ లక్షణాలున్న మగవాళ్ళు ఏం చెయ్యాలి ? వాళ్ళ నియోజకవర్గాన్ని స్త్రీలకు కేటాయించినట్లు ప్రకటించడమంటే వాళ్ళని కేవలం వోటర్లుగా మిగిలిపొమ్మని శాసించడమే కదా ! అప్పుడిది ప్రజాస్వామ్యమెలా అవుతుంది ? కేవలం మహిళా రిజర్వేషన్ పేరుతో కోట్లాదిమంది పురుషుల రాజకీయ హక్కుల్ని, నాయకత్వ హక్కుల్ని మూకుమ్మడిగా హరించడం కాదా ఇది ? ఇది ఆ నియోజక వర్గాలకు మాత్రం అంతిమంగా మేలు చేస్తుందా ?

12 వ్యాఖ్యలు:

sathibabu akella said...

మీ లాగే నేను కూడా రిజర్వేషన్ని వ్యతిరేకిస్తాను. కాని ఒక్క విషయం లో రిజర్వేషన్ ఉండాలన్న భావం అప్పుడప్పుడు కల్గుతుంటుంది. ఆర్ధిక స్థితి గతులు బాగా లేని వాళ్ళందరకి రిజర్వేషన్ కల్పించాలి. అంతే గాని కులాల మతాల పేరిట అందరి మధ్య విబేధాలు సృష్టించకూడదు. కొందరు రిజర్వేషన్ పేరుతో డబ్బున్న, చదువురాని వెధవలు కాలేజి లో చేరటం చూసాను. ఆ వెధవలు అక్కడ వెలగ బెట్టేదేమి ఉండదు. ఆ తర్వాత కూడా రిజర్వేషన్ పేరుతో ఎక్కడో అక్కడ ఉద్యోగం సంపాదించేస్తారు. ఇటువంటి వాళ్ళు ప్రతిచోటా ఉండబట్టే ఈనాడు వ్యవస్థ ఇలా ఏడ్చింది. మనం ఎంత మొత్తుకున్నా మనం చేయగల్గేది ఏమి ఉండదు. ఈ విషవృక్షం వేళ్ళు సమాజం లో బాగా నాటుకుపోయాయి. మనం ఏమైనా అన్నా కూడా అది ఏకులాన్నో తక్కువ చేసి మాట్లాడుతున్నమంటారు.
మంచి ఆర్టికల్ వ్రాసినందుకు ధన్యవాదాలు.
-సత్తిబాబు.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

సత్తిబాబు గారు,ఇక్కడ అంశం మహిళారిజర్వేషన్లమీద.మీరు మొత్తంగా రిజర్వేషన్లమీద పడ్డారు.భారతదేశంలో ఉన్న కొన్ని వేల కులాల్లో కొన్ని వందలు మాత్రమే ఈనాడు రిజర్వేషన్ల పరిధికి దూరంగా ఉన్నాయి.మరి కొన్ని మమ్ముల్నీ చేర్చండి అంటూ ముందుకొస్తున్నాయి.ఉత్తరప్రదేశంలో జరుగుతున్న తంతు,తతంగం తమరి దృష్టికి రాలేదా?
ఇవ్వాళ కులం రిజర్వేషన్ల మీద ఉద్యోగాలు చేస్తున్నవారంతా నిజం గా ఆయాకులాలకు చెందిన వారని మీరు భావిస్తున్నారా?ఎన్ని ప్రభుత్వ,ప్రభుత్వరంగ సంస్థలలో ఎన్ని వందలవేల ఉద్యోగస్తులు ఇలా దొంగకులనిర్ధారణ పత్రాలతో దూరి పోయారో తెలిస్తె మీరు అలా అనిఉండరు బహుశా!
ఆర్ధిక స్తితిగతులమీద,నిజంగా అవసరతలో ఉన్నవారికి సహాయం చెయ్యటం అభిలషణీయం.కానీ అంబానీలకు "economically backward" అని ధృవపత్రాలు ఇవ్వగల రెవెన్యూ విభాగం మనది.అలా ఒక కొత్త తరగతిని సృష్టించటానికి తప్ప ఆ వాదానికి ప్రస్తుతపరిస్థితులలో ప్రాముఖ్యం లేదు.మీకు వీలయినప్పుడు మండల్ కమీషన్ నివేదిక సూచనలు ఒకసారి చదవండి.ఈ రాష్ట్రంలోని అగ్రకులాలు,ఇక్కడ రిజర్వేషన్ వద్దంటున్న వారు(కులాలు) పక్క రాష్ట్రం లో ఎలా ఆ సౌకర్యం పొందుతున్నారో గమనించవచ్చు.

Kathi Mahesh Kumar said...

"Give nature a chance. Give spontaneity a chance"...ఏ ప్రపంచం లో ఉన్నారండి మీరు? ప్రకృతి ఆడా మగల్ని ఒక్కలా సృష్టించలేదు.ఉన్న అసమానతని ఆసరాగా చేసుకుని మగాడు ఎప్పుడో ప్రపంచాన్ని డామినేట్ చేసేశాడు.ఇక రిజర్వేషన్లు లేకుండా రాజకీయాలలోకి వచ్చే చాలా మహిళలు, కేవలం పితృస్వామిక భావజాలానికి ప్రతీకగా, తండ్రులచేతనో భర్తల చేతనో ఉపయోగపడటానికేతప్ప, "మహిళలు" గా విధానపరమైన మార్పు తేవడం లేదు.

ఇక స్పాంటెనిటీ కి చాన్స్ కావాలా? రాజకీయం, కవితా లేఖనంకాదని గమనించగలరు.

Chaks said...

నేను రచయితతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఒకప్పుడు రాజకీయాల్లోకి చదువుకున్నవారు రావాలన్నారు, యువరక్తం రావాలన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలామంది చదువుకున్నవాళ్ళే, యువకులే అయితే మన సమస్యలు ఇంకా పెరిగినై గానీ తగ్గలేదు, పైగా వీళ్ళే ఇక్కువగా దోచుకుంటున్నారు. ఇప్పుడు మహిళలు రావాలంటున్నారు. వస్తారుకూడా అనుమానమేలేదు. దేశాన్ని దోచుకోవడంలో వాళ్ళకీ సమాన వాటా దొరుకుతుంది అంతేకానీ సామాన్యుడికి (సామాన్య మహిళలక్కూడా) ఒరిగేదేదీ లేదు.
ఒకప్పుడు మన దేశం లో మాతృన్వామ్యం ఉండేది. ఇప్పటికీ కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉంది. నెమ్మదిగా దేశం పితృస్వామ్యానికి మళ్ళింది. ఈమధ్య కోర్టుల, చట్టాల తీరుతెన్నులు చూస్తుంటే మళ్ళీ మాతృస్వామ్య దిశగా వెళుతున్నామా అనిపిస్తుంది. అయితే మాతృస్వామ్యం లేదా పితృస్వామ్యం అంతే గానీ వేరే చాయిస్ లేదుకదా?
రచయిత చెప్పింది కరెక్టే, ఇప్పటి సమాజంలో ఆడ గొంతుకే విలువ, మగవాడి గోడు వినేవాడేడి? ఆడదాన్ని రక్శించడం కోసం చట్టాలు చేస్తే వాటిని ఈ మహిళామణులు భర్తలను కాల్చుకు తినడానికి, అమాయకులులను వేధించడానికి, బెదిరించి పనులు చేయించుకోవడానికే వాడుకుంటున్నారు.
మహేష్ గారు: ఇప్పుడు మనకు కావల్సింది సమానత్వమేగానీ, ఒకప్పుడు మహిళలు అణగదొక్కబడ్డారని ఇప్పుడు వారిని మగవాళ్ళను తొక్కమని కాదు. సమానత్వంకోసమని తెచ్చిన కులాల రిజర్వేషన్లు ఇప్పుడు ఎలా చిచ్చుపెడుతున్నాయో చూశారుగా. మహిళ రిజర్వేషన్ వలన లింగాల మధ్య గొడవలు పెరుతాయేగానీ తగ్గవు. పైగా ఈమధ్య ప్రవేశపెటట్టిన కొన్ని చట్టాల దన్నుతో మహిళా మణులు భవిష్యత్తులో రెచ్చిపోయి మగవాళ్ళను తొక్కడం ఖాయం.
గమనిక: నేను చాలామందిలాగే ఆడా మగా సమానత్వం కావాలనుకునే వాడిని. దానికోసం అనాలోచితంగా మనంచేసే లేదా కోరుకునే వాటివల్ల అది వికటించగూడదని నా అబిప్రాయం. మహిళా స్వేచ్చ కావాలనే వాళ్ళందరూ ఇది గమనించాలని మనవి.

Phani said...

మీ బ్లాగు చాలా బాగుంది -- ఫణి

sujatha said...

రచయిత ఉదహరించిన మహిళామణులు ..దౌర్జన్యానికి వెనుదీయని రేణుకా చౌదరి, 'నాకూ మా ఆయన కీ కూడా పదవులు కావాలి(ఒకరం దోస్తే మా కుటుంబానికి చాలదు) అని అలిగే నేదురుమిల్లి రాజ్యలక్ష్మి, ఉదహరించని మరికొందరు, పరిటాల సునీత, మేరీ రవీంద్రనాథ్,రోజా, కోట్ల భాస్కర రెడ్డి కోడలు, సబితా ఇంద్రా రెడ్డి, ఉమా మాధవ రెడ్డి 'లంచం ఇస్తే తప్ప మీ గోడు వినం ' అని తెగేసి చెప్పే సాక్షాత్తూ మహిళా కమిషన్ సభ్యులు..విజయశాంతి, మరొకాయన కూతురు, మరొకాయన భార్య....ఎవరు వీళ్లంతా? ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారు వీళ్ళు? పేద మహిళలకా? లేక మధ్య తరగతి మహిళలకా? సమాజంలో ఎవరి శాతం ఎక్కువ? అటువంటి మహిళలకు వీళ్లలో ఎవరైనా కనీసం ఒక్కరైనా తమ చట్టపరమైన అధికారంతో గానీ, మరో రకంగా గానీ ఉపయోగపడ్డారా?

వీళ్ళు ఎవరి కుటుంబానికి వారే ప్రతినిధులు. కేవలం రాజకీయాన్ని ఒక అధికాదాయం గల ఒక వ్రుత్తిగా మాత్రమే భావించి బతుకుతున్న వాళ్ళు. రేపు పొరపాటున మగాళ్ళ కలలు కల్లలై, విధి వక్రించి , పొరపాటున,(అసలు ఆ బిల్లు ఆమోదించబడనే బడదు. అది తథ్యం) బిల్లు చట్ట రూపం ధరిస్తే 33 శాతం సీట్లలో కూచో బొయే వాళ్ళు కూడా ఇటువంటి మహిళలే! ఎన్నికల్లో కోట్ల కొద్దీ రూపాయలు వెదజల్లే 'డబ్బు బలుపు ' ఎవరికుంటుందో వాళ్ళే ఈ 180 సీట్లూ పంచుకుంటారు.

కాబట్టి, మహిళల రిజర్వేషన్ల వల్ల, మహిళలకొరిగేది శూన్యం. దేశ సంపదను దోచుకునే మగ రాజకీయ నాయకులతో పాటు వీళ్ళూ వాటా పంచుకుంటారంతే!

@ మహేష్ గారు,
ఒకవేళ రాజకీయ వ్యూహాల్లో భాగంగా కొంతమంది వెనకబడ్డ కులాల స్త్రీలు చట్ట సభలకు ఎన్నికైనా రిజర్వేషన్ లేకుండా (మీరు చెప్పినట్టు) వచ్చిన మహిళల కంటే వీళ్ళ పరిస్థితి ఏం భిన్నంగా ఉండబోదు. సర్పంచ్ లుగా ఎన్నికైన మహిళల భర్తలు భార్యల పేరిట అన్ని వ్యవహారాలూ ఎలా చక్కబెట్టేస్తున్నారో మనం చూడట్లేదా? అయితే ధన బలం గల వాళ్ళు, లేదంటే భర్తల చేతిలో రిమోట్లు పెట్టి డమ్మీలుగా సభలోకొచ్చేవాళ్ళు..ఇదే జరగబోయేది.


మహిళా రిజర్వేషన్లు వచ్చినా కుల రిజర్వేషన్లకు ఉన్నట్టే వాటికీ బోలెడన్ని loop holes ఉంటాయి. కేవలం 'బ్రాహ్మడు ' కావడం చేత, economically backword అని పత్రం సంపాదించలేక ఇంటిదగ్గర ట్యూషన్లు చెప్పే విద్యాధికుడొకడు నా కజిను. అల్లాగే, కమ్మ కులంలో పుట్టి, ST కుల ధ్రువీకరణ పత్రం సంపాదించి మెడిసిన్ చదివిన నా స్నేహితురాలి చెల్లెలు (మెరిట్ లేక)ఇప్పుడు హౌస్ సర్జెన్సీ చేస్తోంది. రిజర్వేషన్ల ఫలితాలివి. ఇలాంటివి భిన్న పరిస్థితులు మహిళా రిజర్వేషన్లు వచ్చాక మరిన్ని చూడచ్చు.

Kathi Mahesh Kumar said...

@సుజాత,ఎప్పుడో చస్తామని ఇప్పుడు బ్రతకడం మానేస్తున్నామా? అలాగే కొన్ని loop holes ఉన్నాయని,ఉంటాయేమో అని కొత్తవిధానాలనూ, అందునా "సమానత్వపు ఆశలున్న" వాటిని కాదంటామా? ఇక్కడ సమస్య బహుశా మీ తులమానం, మీ జీవితం కావడమనుకుంటా. నాకు మెడికల్ సీటు రాలేదు కాబట్టి...రిజర్వేషన్ తప్పు ! నాకు తెలిసిన రిజర్వేషన్ విద్యార్థికి ఓనమాలు రాకుండా సీటొచ్చింది! ఇలా కాకుండా,రిజర్వేషన్ల వలన మన సమాజంలో అసమానతలు(ముఖ్యంగా మీరి ఉదహరించిన కులఅసమానతలు) తగ్గాయా?...అది కాకపోయినా,కనీసం దళితుల జీవితాలు కొంత బాగుపడ్డాయా?అని ఆలోచిస్తే, సమాధానం ఔననే వస్తుంది.

@Chaks అయ్యా! మహిళా రిజర్వేషన్ అంటే, మన(మగాళ్ళ )మీదెక్కి తొక్కడానికి లైసెంసు కాదు. ఇన్నాళ్ళుగా మన సమాజం అవకాశహీనతకు గురిచేస్తున్న (చాలా ముఖ్యమైన)వర్గానికి అవకాశం కల్పించడం. వారిలో బహుశా 50% మీరు చెప్పిన రకాలు, సుజాత గారు ఉదహరించిన విధాలు ఉండవచ్చుగాక.సమసమాజం దిశగా జరుగుతున్న ఈ "ప్రయోగం" లో,ప్రయత్నం చాలాముఖ్యం.I feel thats worth taking a risk.

roshini said...

Nice Post !
You should use a Telugu social bookmarking widget like PrachaarThis to let your users easily bookmark your blog posts.

donkarayi said...

Women are a kind of vote bank like those caste or religion based vote banks.Nuturally ,politicians nurse and nurture the women's vote bank fot their political gain in the elections.So,if you want to blame anybody for this, aim the rotten tomato at the politician.

sujatha said...

@ మహేష్ గారు,

రిజర్వేషన్ల వల్ల దళితుల పరిస్థితులు కొంతమంది బాగుపడ్డ మాట నిజమే! దళితుల జీవితాలు బాగుపరచడమంటె రిజర్వేషన్ల పేరిట వాళ్లకు ఉద్యోగాలిస్తే సరిపోతుందా, ఇంకేమైనా చెయ్యాలా ఆలోచించండి? అది కేవలం ప్రభుత్వం, లేదా రాజకీయ పార్టీల స్వార్థం మాత్రమే! రిజర్వేషన్లు దుర్వినియోగం అవుతున్నాయన్న రాజేంద్ర కుమార్ గారి వ్యాఖ్యకు నేను సాక్ష్యం చూపించానంతే! ఇక పోతే, నేను ఎప్పుడు రిజర్వేషన్లకు (ఏ రకమైనవైనా ) వ్యతిరేకినే! అందుకు కారణం నేను అగ్ర కులానికి(ప్రభుత్వ ద్రుష్టిలో) చెందడం కాదు! నేను ఎప్పుడు కనీసం మహిళలకు ఇచ్చే కోటాని కూడా చదువుకు గానీ, ఉద్యోగానికి గానీ ఉపయోగించుకోలేదు. నా భావాలు నేను దళిత కులంలో ఉన్నా కూడా మారవు! ఎందుకంటే, ప్రతిభను నిరూపించుకోవడానికి, 'నేను ఇంకొకరికంటె తక్కువ, నాకు ఎక్కువ అవకాశం ఇవ్వండి ' అని దేబిరంచడం అలవాటు లేకపోవడం వల్ల!

ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ బిల్లును ప్రవేశ పెట్టిందనీ, అది నిజంగా 180 మంది మహిళలని తీసుకుపోయి పార్లమెంట్లో కూచో బెడుతుందనీ, మహిళలకు పురుషులతో సమానత్వం వచ్చేస్తుందనీ మీ భావిస్తున్నారంటే...ఆశ్చర్యమే మరి!

Kathi Mahesh Kumar said...

@సుజాత గారు,
రిజర్వేషన్ కు వ్యతిరేకతకు మీరుచూపిన కారణం ’ప్రతిభ’,ఇది ఉంటే అవకాశాలకోసం (కులం పేరుతో,లింగ బేధం పేరుతో) దేబరిచఖర్లేదనే మీ అభిప్రాయం. ప్రతిభను మీరు, వచ్చిన మార్కుల ప్రాతిపదికన మాత్రమే నిర్వచిస్తే, నా నిర్వచనం వాటిని సంపాదించిన స్థితిగతులను కూడా చేర్చిఉంటుంది. అదీతేడా.విశిదీకరించి చెప్పలంటే, సమాజం కల్పించిన(కులపర,లింగపర) advantage ని పొందిన ఒకరు 100 మార్కులు సంపాదిస్తే,అది లేని వారు సంపాదించే 70 దానికి సమానమే అని. దీనికి సంబంధించిన జన్యుపర,మానసిక కారణాలను సైధాంతికంగా నిరూపించవచ్చు.సింపుల్ గా చెప్పాలంటే, "social stress leading to low performance need to be cross subsidised with reservation" అని.

ఇక మహిళా రిజర్వేషన్ వల్ల అర్జంటుగా, ప్రపంచం మారుతుందని నేను నమ్మకపోయినా, ఇది ప్రపంచం కొంతైనా మారటానికి దోహద పడుతుందని నమ్ముతున్నాను.మనదేశం లో ‘విప్లవం’ ఎలాగూరాదు, కనీసం ‘మార్పు’ ఈ విధంగా వస్తే చాలనే, అల్పసంతోషిని నేను.

sujata said...

Give nature a chance అన్నారు బాల సుబ్రమణ్యం గారు. నాకూ రిజర్వేషన్లు లేకుండా ఉండే సమాజం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది. బ్రిటన్ లో 'Equal opportunities' అని ఒక చట్టం ఉంది. ఒక వ్యక్తి ethnisity, Religion, Sex, Age, Dissability status, crime record.. ఇలాంటి కారణాలు సాకు గా చూపి ఉద్యోగం / ప్రవేశం నిరాకరిస్తే, ప్రభుత్వం చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. ఇక్కడ ఆడవాళ్ళూ, మగవాళ్ళూ, వృద్ధులూ, రిటైర్ అయిన వాళ్లు కూడా, రంగు, రూపు, దేశ, భాషల తో సంబంధం లేకుండా ఒక పోసిషన్ కోసం ఒకేలా పోటీ పడతారు.

మన దేశం లో కూడా వీడు SC, ST.. OBC, financially backward / ఈమె స్త్రీ, దళిత స్త్రీ, బీద స్త్రీ.. అని తేడాలు లేకుండా.. కేవలం మెరిట్ ఆధారంగా.. (సమానత్వం చదువు నుండి మొదలై.. పల్లెల్లో కూడా మంచి చదువు అందరికీ అందుబాటులోకి వచ్చి..) చట్ట సభల కైనా, మెడిసిన్ సీట్ కైనా ఎంపిక జరిగితే.. ఎలా ఉంటుంది ? ఇలాంటి ఆలోచనలు ఎవరికీ రావు. ఇప్పుడు భారత దేశం లో ప్రతీ జాతి(కులం) వారూ.. ప్రతీ స్థాయి వారూ.. ప్రతి ఆడా, ప్రతి మగా.. చిన్నా, పెద్దా అందరూ ఎపుడో ఒకపుడు, ఏదో ఒక విధంగా వివక్ష కు గురుతున్నారు.

మనం కేవలం Nature కే ఛాన్స్ ఇస్తే.. మాత్రం ఒకటే రూల్ చెల్లుతుంది. Might is Right. ఎవరు బలవంతులో వాళ్ళదే విజయం. అప్పుడు బలహీనులు రిజర్వేషన్ అడుగుతారు / తిరగబడతారు / సర్డుకుంటారు లెదా మరణిస్తారు. ఇది నిరంతర పోరాటం. కొన్నాళ్ళకు బలహీనులు బలవంతులుతారు.. బలవంతులు.. బలహీనులౌతారు! ఇది అందరికీ తెలిసిన సత్యం అయినా.. మనం మేము బలహీనులమంటే మేము బలహీనులమని నమ్మి, వాదించుకుంటూ.. మన లో బలాల్ని చంపుకుంటూ.. దేశానికి అన్యాయం చేస్తున్నాం. అందరం కలిసి మన జీవితాలను రూల్ చేసే అవకాసం ఎవరికో ఇస్తున్నాం. ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి పోరాటం వాళ్లు పోరటటం తప్ప.. అందరం కలిసి.. సమానత్వం దిశగా పోరడదామని మనలో ఎవరికైనా అనిపిస్తుందా ?